21, ఫిబ్రవరి 2023, మంగళవారం

*** ఆటోలు - హైదరాబాదు *** -72

  *** ఆటోలు - హైదరాబాదు *** -72



*** ఒక ఆటో వాలా ఇచ్చిన బిరుదు***

మా అత్తగారు మా దగ్గిరకి వచ్చినప్పుడు ఆవిడని తీసుకుని అప్పుడప్పుడు హైదరాబాదులో ఎక్కడికో అక్కడికి తీసుకెడుతుంటాను. అలా ఒకరోజు వెళ్ళాం. ఇద్దరం తిరిగి ఇంటికి వస్తున్నాం. అప్పుడు మేము బల్కంపేటలో ఉండేవాళ్ళం. ఇంకో రెండు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటికి వెళ్ళేందుకు పక్క పక్క రోడ్లు రెండున్నాయి. ఒకటి స్ట్రెయిట్ రోడ్డు. ఇంకొకటి కొంచెం తిరిగి వెళ్ళాలి. ఈ స్ట్రెయిట్ రోడ్డులో నుంచి తీసుకెళ్ళమని చెప్పాను.

పొద్దున్న మేము వెళ్ళేసరికి బాగానే వుంది కానీ... సాయంత్రం వచ్చేసరికి ఆ రోడ్డులో ఏదో తవ్వుతున్నారు. ఇంటికి వెళ్ళే దారిలేదు. నేను ఆటో అతనితో “వెనక్కి తిప్పి పక్క రోడ్డులోంచి తీసుకెళ్లు”అన్నాను. “నేను తీసికెళ్ళను ఇక్కడే దిగిపొండి...” అన్నాడు. కనీసం నడిచి వెళ్ళే దారి కూడా లేదు. నాకు చాలా కోపం వచ్చింది.

“ఎందుకు తీసికెళ్ళవు?” అన్నాను.

“నువ్వు ముందు ఇటే తీసికెళ్ళమన్నావు దిగండి ఇక్కడే” అని గొడవ పెట్టుకున్నాడు. పెద్దావిడ ఉన్నారనికి ఆలోచనలేదు. అస్సలు వినట్లేదు.

ఇంక నాకు చిరాకొచ్చి “మేము ఎప్పటి నుంచో ఇక్కడ వుంటున్నాం. అందరూ తెలిసిన వాళ్ళే... చెప్పానంటే నువ్వు, నీ ఆటో ఇంటికి వెళ్ళరు” అన్నాను.

వెంటనే ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన ఇంకో రోడ్డులోంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. డబ్బులు ఇస్తుంటే....

“గూండారాణి! గూండాలని బాగానే మెయింటెయిన్ చేస్తున్నావు” అంటూ వెళ్ళిపోయాడు. వాడన్నమాటలకి నేను షాకయ్యి చూస్తూవుంటే.... మా అత్తగారు ఇంటిముందున్న అరుగు మీద కూచుని పొట్ట పట్టుకుని నవ్వుతున్నారు. ఆవిడని చూసి నాకూ నవ్వాగలేదు.

తర్వాత ఆవిడ “నువ్వు వాడిని భయపెట్టడానికి చెప్పావనుకున్నాను. నిజంగానే నీకు ఇక్కడ అందరూ తెలుసా....” అన్నారు. “అవునండీ... ఎప్పటి నుంచో వుంటున్నాం కదా... ఇక్కడ అందరూ ఏ సాయానికైనా పరుగెత్తుకుని వస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..” అని ఆవిడని తీసుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను.

***
***

మరోసారి సంజీవరెడ్డి నగర్ నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆర్ బి ఐ క్వార్టర్స్ పక్కన నా శిష్యురాలు లక్ష్మి ఏదో ఫంక్షన్ కి పిలిస్తే వెళ్ళాల్సి వచ్చింది. ఆటో అతనికి ఆర్ బి ఐ క్వార్టర్స్ గుర్తు చెప్పాను. అక్కడి వరకూ వెళ్ళాక ఆటో ఆపేసి ఇదే క్వార్టర్స్ దిగిపొమ్మన్నాడు.

నేను “కొంచెం ముందుకి తీసుకెళ్ళు నేను దగ్గర అని చెప్పాను. క్వార్టర్స్ అని చెప్పలేదు” అన్నాను. అతను చెప్తుంటే వినట్లేదు. లక్ష్మి ఒక టైము చెప్పింది. ఆ టైములోపల వెళ్ళాలి. దగ్గరలోనే వున్నాం కదా... అనుకుంటే ఇదో నస అనుకుంటూ.... మళ్ళీ అడిగాను. ససేమిరా ఒప్పుకోవట్లేదు. నడవడానికి ఇబ్బంది లేదు కానీ... అపార్ట్ మెంట్ లోపలకి వెళ్ళాలి.

నేను అతనితో “శ్రీనగర్ కాలనీ ఏరియా కార్పొరేటర్ విజయలక్ష్మిగారు మాకు బాగా తెలుసు. నేను ఆవిడకి ఫోన్ చేస్తాను” అన్నాను. (మేము ఆవిడకి లెటర్లు చేసి పెడుతూ వుంటాం. నేను చాలాసార్లు వాళ్ళింటికి కూడా వెళ్ళాను.) నేను ఆవిడ పేరు చెప్పగానే.... “అమ్మా.... ఆ మేడమ్ తాలూకా అని ముందరే చెప్పచ్చుగా.... ఆ అమ్మ చాలా మంచిది” అని నేను తీసుకెళ్ళాల్సిన చోట దింపాడు.

నేను డబ్బులు ఇస్తూ.... “కరక్ట్ గా అడ్రస్ చెప్పలేక ఒకోసారి పక్కనున్న ఏదైనా పేరున్న ఆఫీసో.. స్కూలో ఏదో చెప్తాం. అలాంటప్పుడు మేం చెప్పిన చోటికి తీసుకెళ్ళాలి. ఇలా నస పెట్టకూడదు. ఇంకో ఐదురూపాయలు అడగాలి. నాకు కాదు ఇంకెవరికైనా ఇలాగే కావచ్చు” అన్నాను.

డబ్బులు తీసుకుని ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

ఇప్పుడయితే ఆటోనో క్యాబో బుక్ చేసుకుంటే సరిపోతుంది. అవీ కొన్నిసార్లు ఇబ్బంది అవుతున్నాయి.

2 కామెంట్‌లు: