6, డిసెంబర్ 2020, ఆదివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు -12

 అమ్మా,

ఎలా వున్నావు. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇడ్లీ వేశాను. చిన్నుగాడు వాడి ఆఫీసు అయిపోయి నా దగ్గిరకి వచ్చాడు. చాలా ఇష్టంగా తిన్నాడు.

అలా తినేటప్పుడు చిన్నప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. మేము నాగేంద్ర అంకుల్ వాళ్ళింట్లో వున్నప్పుడు నువ్వు ఇంట్లో కంప్యూటర్ వర్క్ లో వుండేదానివి. మేమిద్దరం, ఆ బిల్డింగ్ లో వున్న పిల్లలందరితో కలిసి ఆడుతూ వుండేవాళ్ళం కదా. నువ్వు ఇడ్లీ వేసినప్పుడల్లా వీడు ఆడుకుంటున్నవాడల్లా కిందకి వచ్చి రెండు ఇడ్లీ జేబులో పెట్టుకుని పైకి వచ్చి ఎవరికీ కనిపించకుండా తినేసేవాడు కదా. చిన్నుగాడిని నేను అలా ఎలా తినేవాడివిరా అంటే పకపకా నవ్వాడు. వాడికెప్పుడూ అలా చిరుతిండి కావాలి. ఇప్పటికీ అంతే అమ్మా వస్తే డబ్బాలు వెతుక్కుంటాడు.

నాకు ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ఒకసారి వాడికి బాగా ఇడ్లీ తినాలనిపించింది. నిన్ను అప్పటికప్పుడు ఇడ్లీ వెయ్యమని పేచీ పెట్టాడు. పైగా దాంట్లోకి సెనగప్పు, కొబ్బరి పచ్చడి అడిగాడు. నువ్వేమో ఇప్పుడెలాగ రా అంటే వాడు అసలు వినిపించుకోలేదు. సరే నువ్వు పోయి ఆడుకో అని - నువ్వు మినప్పప్పు నానపెట్టి పైన ఎవరింట్లోనో రోలుంటే అందులో అయితే బాగా వస్తుందని రుబ్బుకొచ్చి ఇడ్లీ వేసి పెట్టావు. గట్టిగా వున్నా సరే ఆనందంగా తిన్నాడు. ఇవాల్టికి ఈ ఇడ్లీల కథ ఇలా చెప్పుకుని నవ్వుకున్నాం.
రేపు ఫోన్ చేస్తానమ్మా, మాట్లాడుకుందాం....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి