14, మార్చి 2023, మంగళవారం

*** ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు *** - 76

 *** ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు *** - 76

***ఒకోసారి కొందరి పరిచయం వింతగా వుంటుంది***

ఒకరోజు పొద్దున్న 9.30 గంటలకి ఫోన్ వచ్చింది. “అమ్మా! నా పేరు శ్రీధర్. మేము ఆర్య సమాజ్ లో సంధ్యావందనం లక్ష్మీదేవిగారి ‘వైదిక నిత్యకర్మ విధి’ పుస్తకంలో మీ పేరు ఫోన్ నెంబరు చూసి ఫోన్ చేస్తున్నాను. మా పుస్తకాలు కొన్ని ఉన్నాయి. 11 గంటలకి వద్దామనుకుంటున్నాం. రావచ్చా...!” అన్నారు. రమ్మని చెప్పాను.

సరిగ్గా 11 గంటలకి గుమ్మం ముందు ఇద్దరు యువస్వామీజీలు ప్రత్యక్షం అయ్యారు. నేను ఊహించలేదు. మళ్ళీ పేరు చెప్పి, పరిచయం చేసుకున్నారు. పెద్దాయన పేరు శ్రీధర్. వయసు 40 సంవత్సరాల లోపే వుంటుంది. చిన్నాయనకి 30 సంవత్సరాలు వుంటుంది. చిన్న స్వామీజీ గురువుగారితో చాలా వినయంగా వున్నాడు. ఇద్దరూ ఎమ్.ఎ. చదివారు. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలలో మంచి పట్టు వుంది. వాళ్ళు ఎంచుకున్న బాట ఇది.


ఉద్యోగాలు చెయ్యడం ఇష్టం లేక ఇలా మారామని వాళ్ళే చెప్పారు. వీళ్ళు డబల్ బెడ్ రూం ఇల్లు తీసుకుని అందులో కొంతమంది పేద విద్యార్థులకి ఆశ్రయం ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళకి మేమే వంట చేసి పెడుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచీ వాళ్ళకి అన్నీ మేమే అందిస్తాం. కొంతమంది అందులో దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అందుకే ఎవరికి అవసరమో వాళ్ళనే వుంచుకుంటున్నాం అని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది రాజకీయవేత్తలు మేము మీకు స్థలం ఇస్తాం. ఆశ్రమం కట్టిస్తాం. మీరు వచ్చెయ్యండి అన్నారట. కానీ వీళ్ళకి అది ఇష్టం లేక రామని చెప్పామన్నారు. మా ఇంట్లో ఉడకపెట్టినది ఏదీ తినేవారు కాదు. పళ్ళు ఇస్తే తీసుకునేవారు.

ఈ స్వామీజీలు మా దగ్గిర మృత్యుంజయ సర్వస్వం, దయానంద సూక్తులు పుస్తకాలు చేయించుకున్నారు. ఇంకా రెండు పుస్తకాలు ప్రింటింగ్ కి ఇవ్వవలసినవి ఉన్నాయి. వీళ్లకి స్పాన్సర్ చేసేవాళ్ళూ చాలామందే వున్నారు. యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. గుడులలో సత్సంగాలు చేస్తుంటారు. మాకు పుస్తకాలకి డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టలేదు.
వీళ్ళ జీవితానుభవాలు మాతో చెప్తుండేవారు. ఎందులో వుండే కష్టాలు అందులో వుంటాయన్నారు. చిన్న స్వామీజీ వాళ్ళింట్లో పెళ్ళి చేస్తాం వచ్చెయ్యమంటున్నారని, పెద్ద స్వామీజీ వాళ్ళక్క ఇవన్నీ వదిలేసి హాయిగా ఇంటి పట్టున వుండమని చెప్పారట. అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడేవారు. వాళ్ళు చర్చించని విషయం లేదు. స్వామీజీలుగా వాళ్ళ అనుభవాలన్నీ మాతో పంచుకునేవారు.

2016లో వచ్చారు. మిగిలిన పుస్తకాలు చేయించుకోవడానికి మళ్ళీ వస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. మళ్ళీ ఫోన్ లేదు. మనుషులు లేరు. మేమూ ఫోన్ చెయ్యలేదు.

ఏది ఏమైన ప్రపంచంలో ఎవరి ఆరాటం వాళ్ళది. ఎవరు ఏ రంగం ఎంచుకున్నా... మనం ఏమీ అనలేం. ఏది ఏమైనా తెలుసుకునేవి చాలా వుంటాయి.

ఈమధ్య ఒకసారి ఫోన్ చేశారు కానీ, నేను నెంబర్ సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. మళ్ళీ వాళ్ళే వస్తారులే అనిపించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి