15, అక్టోబర్ 2020, గురువారం

అమ్మకు ప్రేమతో.... 2 వ ఉత్తరం




 అమ్మా!

ఎలా వున్నావు? నా పుట్టినరోజు రోజునే నీకు లెటర్ రాద్దామనుకున్నాను. ఆఫీసులో పార్టీ పెట్టి చాలా హడావుడి చేశారు. అయినా నీకు ఉత్తరం రాయాలన్న సంగతి మర్చిపోలేదు.

నీతో మరికొన్ని జ్ఞాపకాలు పంచుకుని ఆనందించాలని అనుకుంటున్నాను.

నేను పుట్టిన తర్వాత మొదట అమ్మాయి పుట్టినందుకు నువ్వు చాలా సంతోషించానని చెప్పావు. హాస్పటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్ని, చిన్ని పాదాలు చూసి ముద్దొచ్చి అక్కడ నీ బుగ్గలని ఆనించి నా పాదాలతో తన్నించుకున్నానని చెప్పావు. ఆ స్పర్శ చాలా ఆనందంగా అనిపించిందన్నావు. "నాకు మాటలు వస్తే అలా చేసేదాన్నా? అయ్యో అమ్మని అలా ఎలా తన్నాను?" అన్నాను.

నువ్వేమన్నావో తెలుసా! నీకు గుర్తుందా అసలు. "పిల్లలు కడుపులో వున్నపుడు పొందిన ఆనందం ఒక ఎత్తయితే, వాళ్లు బయటికి వచ్చాక వాళ్ళు చేసే ప్రతి పనీ తల్లికి ఆనందంగానే వుంటుంది. నువ్వు అంత బాధపడక్కరలేదు" అన్నావు. అమ్మమనసు ఎంత గొప్పదో కదా! నాతో చాలా ఆటలు ఆడేదానివి కదమ్మా!

నేను పుట్టినప్పుడు బామ్మ వచ్చిందని చెప్పావు. నాకు నాలుగో నెల వచ్చాక బామ్మ అనుకోకుండా మద్రాసు వెళ్ళిపోయింది - నువ్వేమో ఉద్యోగానికి వెళ్ళాలి. ఏం చెయ్యాలో అర్థం కాలేదన్నావు. కానీ నువ్వు టెన్షన్ పడకుండా మనింటికి దగ్గరలోనే వున్న కేర్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి వచ్చానన్నావు. నా జీవితంలో అదొక మర్చిపోలేని విషయమమ్మా! వాళ్ళు ఎలా కేర్ సెంటర్ మొదలు పెట్టారో నువ్వు చెప్పింది నేను చెప్తా చూడు -

అది మొదలు పెట్టింది భార్యా భర్తలు. ఆయన రిటైర్డ్ ఇంజనీరు. ఆయన పేరు కోటేశ్వరరావు, ఆవిడ పేరు సీత - ఇంట్లోనే వుంటారు. నన్ను చూసి రేపటి నుంచి తీసుకురండి అన్నారు. నేనే మొదటి పిల్లని వాళ్ళ కేర్ సెంటర్ లో. ఆయన్ని నేను తాత అని పిలిచేదాన్ని. కాని మొదటి మూడు రోజులూ సీత ఆంటీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించానని చెప్పావు. నిన్ను వదిలేసరికి నాకు బాగా ఏడుపు వచ్చినట్టుంది. నువ్వేమో ఉద్యోగానికి వెళ్ళాలి. నువ్వూ చాలా బాధపడ్డానని చెప్పావు. నాలుగో రోజు నుంచి నేను బాగా అలవాటు పడిపోయాను కదా!

అమ్మా రాస్తుంటే ఇలా రాయాలనే అనిపిస్తోంది. ఈ జ్ఞాపకాలు ఎంత అందమైనవో కదా! కనీసం వారానికోసారైనా తప్పకుండా రాస్తానమ్మా!

ఉంటాను మరి....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి