18, జులై 2022, సోమవారం

ఎదురీతలో నేను - 34 *** డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్*** ***బైలాజికల్ ఇ లిమిటెడ్ *** *** ఆఫీసులో ఓవర్ టైం ***

ఎదురీతలో నేను  - 34  *** డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్***    ***బైలాజికల్ ఇ లిమిటెడ్ ***    *** ఆఫీసులో ఓవర్ టైం ***

DRR, Rajendranagar నుంచి ***కలంబూరు మురళీధరన్*** అని ఒక ***తమిళ్ సైంటిస్ట్, డైరెక్టర్ – Crop Protection *** వచ్చేవారు . మురళీధరన్ చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గర కూచుని వర్కు చేయించుకుంటుంటే - నేను ముందు చెప్పిన మా కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ లో కూడా మేటర్ పర్ ఫెక్ట్ గా వచ్చేది. తప్పులు చాలా తక్కువ వుండేవి. ఆయన అతి తొందరలోనే కంప్యూటర్ గురించి తెలుసుకుని మాకు, ఆయనకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. ఆయన వాళ్ళ ఆఫీసు గురించి ఏది ఎలా డెవలప్ చేస్తారో చక్కగా వివరించేవారు. చాలా ఓపిక ఎక్కువ. ఇంగ్లీష్, తెలుగు రెండు పుస్తకాలు వుండేవి.
మేము లంచ్ చెయ్యడానికి వెడితే ఆయన కంప్యూటర్ దగ్గర కూచుని కరక్షన్స్ చేసేసుకునేవారు. ఆయన తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడేవారు. మాకు భాష రావాలని అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. మాకు అనుభవం నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి. మురళీధరన్ ఫోన్ నెంబర్ దొరికింది. కానీ ఆయన్ని కలవలేకపోయాము.





ప్రస్తుతమున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ( DRR) అనే పేరుతో ఉండేది. వివిధ రకాల వరిని సాగుచెయ్యడం, దేశంలో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం; రైతులు పండించే పంట కి చీడ, పీడల విషయంలో సలహాలు ఇవ్వడం, ఇంకా ఎన్నో పరిశోధనలు అక్కడ చేస్తారు. ఆఫీసు వెనక ఉన్న ఎకరాల భూమిలో వీరి పరిశోధనలు జరుగుతాయి.

***బైలాజికల్ ఇ లిమిటెడ్ ***


ప్రింటింగ్ సెక్షన్ ఇన్ ఛార్జిగా బైలాజికల్ ఇ లిమిటెడ్ కి వెళ్ళాను. వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళు మందు సీసాల మీద లేబుల్స్ ప్రింట్ చేసి ఇచ్చారు. అవి ప్రింట్ చేసినప్పుడు ఒక్కోసారి ఒక బాక్స్ లో వచ్చినవి ఏమాత్రం లైట్ గా వచ్చినా వాళ్లు అవన్నీ రిజెక్ట్ చేసారు. దాంట్లో ఒకటి చూసి మిగిలినవన్నీ పక్కన పెట్టేశారు. అలా వాళ్ళు రిజెక్ట్ చేసినవి తీసుకెళ్ళమని ఆఫీసుకి ఫోన్ చేశారు. విజయపాల్ గారు రాముల్ని తీసుకుని కారులో వెళ్ళమని పంపించారు. మీరు అవి చూసి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పారు.

నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. లేబుల్స్ ఉన్న బాక్సులు నాకు చూపించారు. దాదాపు 200 బాక్స్ లు వున్నాయి. నేను ఒక్కో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏవి బాగా వచ్చాయో చూపించి, రానివి పక్కకి పెట్టేశాను. ఆ బాక్సుల్లో ఒక పది మాత్రమే బాగా రానివి ఉన్నాయి. వాళ్ళు బాగా వచ్చినవి తీసుకుని వాటికి రావలసిన అమౌంట్ చెక్ ఏర్పాటు చేసి ఇచ్చేశారు. విజయపాల్ గారు చాలా సంతోషించారు.

*** ఆఫీసులో ఓవర్ టైం ***

ఆఫీసులో ఇటువంటి వర్కులతో మేము ఓవర్ టైం కూడా చెయ్యాల్సి వచ్చేది. ఆదివారాలు కూడా పని చేసేవాళ్ళం. మాకు శాలరీ కన్నా ఓవర్ టైం చాలా ఎక్కువగా వచ్చేది. అది ఆఫీసులో వాళ్ళకి కొంచెం బాధగానే వుండేది. మీరు ఊరికే వస్తున్నారా... పని చేస్తున్నారా లేదా అనేవారు. వాళ్ళు ఏం అన్నా మేము పట్టించుకునేవాళ్ళం కాదు. విజయపాల్ గారికి మా వర్కు కనిపించేది. ఎ.సి. వాళ్ళ ఇంటివైపుకి ఫిట్ చేసి వుండేది. సౌండ్ వచ్చిందంటే మేము వచ్చాం పని చేస్తున్నాం అని వాళ్ళింట్లోవాళ్ళకి అర్థం అయ్యేది. రాములికి చెప్పి మాకు కావలసిన ఏర్పాట్లు చూసేవారు. ఒక రోజు శాలరీకి డబల్ ఇచ్చేవారు.
ఒకసారి ఒక కంప్యూటర్ పాడయితే నేను మా చెల్లెలు - ఉ. 7 నుంచి మ. 1 గం. వరకు ఒకళ్ళు. 1గం. నుంచి 7 గం. వరకు ఒకళ్ళు పనిచేసేవాళ్ళం. పొద్దున్నే 6 గంటలకి బయల్దేరినప్పుడు రోడ్లన్నీ ప్రశాంతంగా వుండేవి. అప్పట్లో ***ట్రంకాల్స్*** వుండేవి కాబట్టి ***టెలిఫోన్ ఆపరేటర్స్*** కొంతమంది ఆ టైముకి మాతోబాటు వచ్చేవారు. ఈ ట్రంకాల్స్ అనేవి ఇప్పటి వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. మమ్మల్ని అడిగేవారు ఎక్కడ చేస్తున్నారని. మా వర్కు విని ఆశ్చర్యపోయేవారు. అప్పట్లో కంప్యూటర్స్ కొత్త కాబట్టి అందరికీ ఆశ్చర్యంగానే

ఉదయం వెళ్ళిన వాళ్ళం డైరెక్ట్ గాయత్రీ భవన్ (ఇప్పటి హిమాయత్ నగర్ మినర్వా ప్లేస్ లో వుండేది) కి వెళ్ళి ఇడ్లీ కానీ, ఉప్నా కానీ వేడి వేడిగా తినేసి, కాఫీతాగి వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున్నే వెళ్ళడం వల్ల హోటల్ వాళ్ళకి బాగా గుర్తుండి పోయాం. రెెగ్యులర్ కస్టమర్స్ మి కాబట్టి చాలా మర్యాదగా, నవ్వుతూ ఆహ్వానించేవారు. మధ్యలో రాములు లమ్సా టీ పెద్ద కప్పు నిండా ఇచ్చేవాడు. ఆ టీ చాలా పల్చగా వుండేది కానీ రుచి అమోఘం. మాకు ఎప్పటికప్పుడు అండదండలుగా వున్న రాములుని అయితే మర్చిపోలేం.

3 కామెంట్‌లు:

  1. IIRR కు వెళ్ళి చూశారా ఆ రోజుల్లో ?
    ఆ దగ్గరలోనే జొన్నలు, ఇంకా అటువంటి ఇతర ధాన్యాల (sorghum) మీద రిసెర్చ్ గురించి Sorghum Research Centre కూడా ఉంది రాజేంద్రనగర్ లో (Regional Research Station అనేవారు. దాన్ని ఇప్పుడు IIMR - Indian Institute of Millets Research) అంటున్నారు). దాంట్లో మా పెత్తల్లి గారి అల్లుడు సైంటిస్ట్ గా పని చేసేవారు లెండి.

    బయొలాజికల్ ఇ. అని ఇప్పుడంటున్న సంస్థ పేరు మొదట్లో Biological Evans అనే ఉండేది. తరవాత తరవాత రోజుల్లో Evans ని E. అని కుదించారు.

    మొత్తానికి ఆనాటి మీ ఉద్యోగంలో పెద్ద పెద్ద సంస్థలు, ప్రముఖ సంస్థలతో పరిచయాలు జరిగినట్లున్నాయే? మంచిదే లెండి, అటువంటి పరిణామాలు మీ ఆత్మవిశ్వాసం పెరగడానికి కూడా తోడ్పడతాయి.

    రిప్లయితొలగించండి
  2. IIRR గురించి మీరు చెప్పిన వివరాలు బావున్నాయి. కాకపోతే మాకు వెళ్ళే అవకాశం రాలేదు. ఆయన వర్కు మాత్రం విజయవంతంగా పూర్తిచేశాం. ఆయన వచ్చిన కొద్ది నెలలలో నా పెళ్ళి అవడం. మధ్యలో ఆయన పని విషయంలో gap వచ్చింది. నా పెళ్ళికి వచ్చారు. మేమూ ఆయన్ని కలిశాం. ఆఫీసుకి మాత్రం వెళ్ళలేకపోయాం.

    B.E. గురించి మీరు చెప్పిన విషయం తెలియదు.

    నాకు పెద్ద సంస్థలు, ప్రముఖులతో పరిచయాలు విషయంలో ఇంకా ఇది మొదలే సర్. నా వర్కు వల్ల ఎంతోమంది ప్రముఖులని కలిశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా పిల్లలకి చిన్నప్పటి నుంచీ జీవితం గురించి చెప్పే అవకాశం కూడా వచ్చింది.

    మీకు ధన్యవాదాలు సర్

    రిప్లయితొలగించండి
  3. మధ్య మధ్యలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తి కూడా వచ్చింది. నిజంగానే ఆత్మవిశ్వాసం పెరిగింది.

    రిప్లయితొలగించండి