14, జులై 2022, గురువారం

ఎదురీతలో నేను - 33 ***సాధారణ జీవనం మొదలయ్యింది***

ఎదురీతలో నేను  - 33   ***సాధారణ జీవనం మొదలయ్యింది***

కర్ఫ్యూలు పోయాయి. మామూలు జీవన పరిస్థితులకి అలవాటు పడ్డారు జనం. మేము ఆఫీసుకి వెళ్ళిరావడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అమ్మయ్య ఎవరిళ్ళకీ వెళ్ళక్కరలేదు. మా ఇంట్లో మేము ఉండచ్చు అనుకున్నాం.

ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఇంటికి కావలసినవన్నీ తెచ్చుకుని వచ్చేవాళ్ళం. సాయంత్రం 6 గంటల నించీ రాత్రి 9 పంపులో వాడుకునే నీళ్ళు వచ్చేవి. మా కాంపౌండ్ లోనే కానీ కొంచెం దూరం వెళ్ళి పట్టుకోవాలి. ఒక స్టౌ మీద అన్నం, మరో స్టౌ మీద టొమాటో చారు పెట్టేసి, చారువాసన ఆస్వాదిస్తూ... ఆకలిని ఆపుకుంటూ... కుతకుతా ఉడుకుతూ పలకరిస్తున్న అన్నాన్ని చూస్తూ - నీళ్ళు పోయే లోపునే పట్టుకుని మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం.

ఫ్రెష్ అయిపోయి ఆ వేడి వేడి అన్నంలో అమ్మ పంపించిన ఆవకాయ వేసుకుని, చారు పోసుకుని, మజ్జిగ పోసుకుని తింటుంటే ఎంత హాయిగా వుండేదో.... (పొద్దున్న బాక్స్ లోకి కూరలు అవీ చేసుకునే వాళ్ళం.) తినడం అయ్యాక వేరే ఎంటర్ టైన్ మెంట్ లేదు కాబట్టి పుస్తకాలు చదువుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంటికి దగ్గరలో లైబ్రరీ వుండేది. శని ఆదివారాలలో అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. మేమిద్దరం కూడా బయట వాళ్ళతో కబుర్లు చెప్పడం తక్కువ.


*** ప్రారంభమైన టీవీ యుగం ***



ఇండియాలో టి.వీ. 1980లో వచ్చింది. కానీ మేము హైదరాబాద్ లో చూసేసరికి 1985 చివర. అప్పటికే చాలామంది దగ్గర వుండి వుండచ్చు.

అబ్బ! బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు ఎంత సందడో! మెహదీపట్నంలో మా ఇల్లుగలవాళ్ళు టీ.వీ. కొన్నారు. అందరం ఒకే కుటుంబంలా వుండేవాళ్లం అని చెప్పాను కదా… అందరికీ పేరు పేరునా టీవీ వచ్చింది అని చెప్పారు. అందరూ వినేసి ఊరుకున్నారు. కానీ వాళ్ళు “శనివారం తెలుగు సినిమా వస్తుంది. అందరూ రండి చూద్దురు” అన్నారు.

పిలిచిందే తరువాయి అందరూ శనివారం ఎప్పుడు వస్తుందా... టీవీ ఎప్పుడు చూస్తామా... అని ఎదురు చూశారు. శనివారం నాడు ఇల్లుగలావిడ శాస్త్రోక్తంగా పూజచేసి, కొబ్బరికాయ కొట్టి అందరికీ కొబ్బరి ముక్కలు, స్వీట్లు పంచిపెట్టారు. ఇంక అందరూ వెళ్ళి వాళ్ళ హాలులో కూచున్నాం.

అప్పటి వరకూ టీవీ మొహం తెలియదు ఎవరికీ. రిమోట్లు లేవు కాబట్టి పక్కనున్నఆన్ ఆఫ్ - సౌండ్ పెంచడానికి వాల్యూమ్స్ తిప్పడం చాలా ఆశ్చర్యకరంగా వుండేది. కొత్తది చూస్తూన్నాం అనే ఆనందం.

అందరూ సినిమా మొదలయ్యే వరకూ ఆత్రుతగా చూస్తూ కూచున్నారు. ఇంట్లో సినిమా చూడ్డం అంటే అందరికీ వింతేమరి. పాత సినిమా వేశారు. ఏదో ఒకటి చూడ్డమే కావాలి. సినిమా మధ్యలో అడ్వర్ టైజ్ మెంట్లు లేవు. కథ ఎక్కడా ఆగకుండా నడుస్తోంది. మొత్తం సినిమా అయ్యే వరకూ ఎవరూ కదలలేదు.

మర్నాడు హిందీ సినిమా వేశారు. ఆరోజు కూడా రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు. వారానికి ఒకసారి మాత్రం వాళ్ళింట్లో సినిమా చూడ్డం అలవాటయింది. శనివారం అదో కాలక్షేపంగా మారింది.

ఇంక మా గేటు బయట పాలుపోసేవాళ్ళు వుండేవారు. వాళ్ళ ఇంటి ముందంతా ఖాళీస్థలం వుంది. వాళ్ళు కూడా టీవీ కొన్నారు. వాళ్ళది ఇంకోరకమైన సమాజ సేవ. టీవీ ఇంటి బయట పెట్టి అందరినీ చూడ్డానికి రమ్మని అక్కడొక డబ్బా పెట్టి అందులో 25 పైసలు వెయ్యమనేవారు. అలా చూడ్డానికి ఇష్టమయిన వాళ్ళు 25 పైసలు ఇచ్చి శని, ఆదివారాలలో సినిమా చూసేవారు. ఓపెన్ థియేటర్ అన్నమాట. దాదాపు 50 మంది దాకా చూసేవారు. ఒకసారి దూరంగా నుంచుని అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశాను.

ఒకమ్మాయి అయితే ప్రతి దానికీ తనకి తనే విరగబడి నవ్వేసుకుంటోంది. పక్కవాళ్ళకి ఇదేం పట్టట్లేదు. కథలో లీనమయిపోయారు. ఇంకొకళ్ళు సినిమాహాల్లో తిన్నట్లు ఏవో తెచ్చుకుని తినేస్తూ చూసేస్తున్నారు. ఇంకొక ఆమె అయితే 25 పైసలు ఇచ్చాం కదాని ఇంట్లోంచి చాప తెచ్చుకుని హాయికా పడుకుని చూస్తోంది. ఇంకొక ఆవిడ పిల్లాడు ఏడుస్తుంటే... ఒక్కటివేసి ఒళ్ళో పడుకోపెట్టుకుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ... సినిమా చూసేస్తోంది. ఎవరేం చేస్తే మాకేం మాకైతే పైసలు ఇస్తున్నారు కదాని పాలవాళ్ళు ఊరుకున్నారు.

నాకు తెలిసిన ఇంకో టీవీ ప్రహసనం –

శ్వేత, రమణి అని ఇద్దరు అమ్మాయిలు వుండేవారు. రమణి బంధువుల ఇంటికి ప్రతి శనివారం టీవీలో సినిమా చూడ్డానికి వెళ్ళేవారు. వాళ్ళు నాలుగైదుసార్లు మొహమాటానికి ఊరుకునేవారు. ఒకసారి వాళ్ళు అక్కా మేము ఈ శని, ఆదివారాలు ఉండట్లేదు. మేము తర్వాత చెప్పాక వద్దురుగాని అన్నారు. వీళ్ళకి ఏమైనా సరే వచ్చేవారం సినిమా చూడాలి అనుకున్నారు.

శనివారం రానే వచ్చింది. సాయంత్రం శ్వేత రమణితో మనం అలా నడుచుకుంటూ వెడదాం ఎవరింట్లో అయినా టీవీ యాంటెనా కనిపిస్తే వాళ్ళింటికి వెడదాం. వాళ్ళు ఏం కావాలి అని అడుగుతారు కదా... ఇక్కడ మావాళ్ళు వుండాలి టీవీ చూడ్డానికి వచ్చాం. ఇల్లు వెతుకుతున్నాం అందాం. అప్పుడు వాళ్ళు ఫర్వాలేదు మా ఇంట్లో చూడండి అంటే చూసి వచ్చేద్దాం అని ప్లాన్ వేశారు. వీళ్ళ ప్లాన్ కాస్తా గోవిందా అయింది. ఎవరూ చూడమనలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఈ విషయం చెప్తే అంత కష్టపడి చూడకపోతే ఏమవుతుంది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఆహా బ్లాక్ అండ్ వైట్ టీవీ మహత్మ్యం ఎంత గొప్పగా వుందో అనిపించింది.

2 కామెంట్‌లు:

  1. మీ పోస్టులు మమ్మల్ని కూడా ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకు వెడుతున్నాయి. ఆ లెండింగ్ లైబ్రరీలు జనాలకు చాలా సేవ చేశాయి అని చెప్పుకోవాలి. నేను కూడా వాటి వినియోగదారుడినే. సౌకర్యాలు పెద్దగా లేకపోయినా అప్పటి జీవనవిధానమే బాగుండేదనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును సర్. పుస్తకాలు చదువుకోవడం. నలుగురితో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం ఇలా వుండేది. అలా నడుచుకుంటూ లైబ్ర్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవడంలో వున్న ఆనందం ఇప్పుడు అస్సలు లేదు. ఆ జీవనవిధానమే వేరు.

      తొలగించండి