9, జులై 2022, శనివారం

ఎదురీతలో నేను - 32 *** ఎప్పుడూ కర్ఫ్యూ.... కర్ఫ్యూ.... ***

 ఎదురీతలో నేను - 32 *** ఎప్పుడూ కర్ఫ్యూ.... కర్ఫ్యూ.... ***


మాకు ఆఫీస్ లో వర్కు ఎక్కువయినప్పుడు లేటయితే రాములు కారులో ఇంటి దగ్గర దింపడం మామూలుగా జరుగుతుండేది. మేముండే మెహదీపట్నం, గుడిమల్కాపూర్ ఓల్డ్ సిటీలోకే వస్తుంది. అప్పట్లో ఎప్పుడు ఏ నిమిషంలో కర్ఫ్యూ పెడతారో తెలిసేది కాదు. *** ఎక్కడో గొడవలయ్యాయిట మెహదీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కర్ఫ్యూ అనేవారు. పొద్దున్నే పాలకి ఒకాయన వెడితే పొడిచేశారుట *** అనేవారు. ఆ టైములో ఎందుకు గొడవలయ్యేవో.... ఎవరిని ఎవరు ఏంచేసేవారో తెలియదు. బస్సులు అంతంత మాత్రంగానే వుండేవి. చాలా ఇబ్బందిగా వుండేది.





మేము ఒకరోజు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లో కూచున్నాం. రాములు కారు తీసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నారు. సరే ఇద్దరం ఆఫీసుకి వెళ్ళిపోయాం. ఇలా రెండుమూడు రోజులు రాములు తీసుకురావడం, దింపడం చేశాడు. మేమే వస్తామని చెప్పడానికి ఒకోరోజు వెళ్ళే బస్సులు వుండేవి కానీ ఇంటికి రావడానికి వుండేవి కాదు. రోడ్లమీద పోలీసులు తప్ప ఎవరూ వుండేవారు కాదు. హిమాయత్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాలన్నింటిలో కర్ఫ్యూ వుండేది కాదు. రోజూ ఇలా ఎందుకొచ్చిన రిస్క్ అని కొన్ని రోజులు మేము చిక్కడపల్లిలో ఉన్న మా బాబాయి కొడుకు ఇంటికి వెళ్ళిపోయాం. తను మేము ఎప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.

అక్కడ నుంచి మాకు ఆఫీసు చాలా దగ్గర కాబట్టి ఇబ్బంది లేకపోయింది. కానీ నాకు ఎక్కువ ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం వుండేది కాదు. అందుకని రెండురోజులు ఆఫీసులోనే వుండిపోయేవాళ్ళం. ఒక బట్టల బ్యాగ్ ఆఫీసులో రెడీగా పెట్టుకునేవాళ్ళం. మాకు ఆఫీసుకన్నా సెక్యూరిటీ ఎక్కడా ఉండేదికాదు. టైముకి భోజనం, టిఫిను, టీ అందించే రాములు కన్నా గొప్ప వ్యక్తి ఉండడు.

***

ఒకసారి ఇలాగే కర్ఫ్యూ టైంలో సంజీవరెడ్డినగర్ లో ఉన్న అక్కావాళ్ళింటికి వెళ్ళిపోయాం. అక్క తాడేపల్లిగూడెం వెళ్ళింది. బావగారు ఆఫీసుకి వెళ్ళారు. పెద్దావిడ వాళ్ళత్తగారు ఉన్నారు. ఆవిడకి ఇప్పుడే వస్తాం అని చెప్పి మా చెల్లెలు, నేను సత్యం థియేటర్ లో మార్నింగ్ షోకి వెళ్ళిపోయాం. సినిమా అయిపోగానే ఇంటికి వెళ్ళి భోజనం చేశాం.

అప్పట్లో ఇప్పటిలాగా ఎక్కడపడితే అక్కడ టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు లేవు. ఆవిడతో ఏం మాట్లాడతాం. మళ్ళీ “బయటికి వెళ్తున్నాం” అని చెప్పి సత్యం థియేటర్ వెనకే వున్న శీష్ మహల్ కి మ్యాట్నీకి వెళ్ళిపోయాం. అసలు సినిమాలంటే పెద్ద ఇష్టం లేదు. కానీ ఏం చెయ్యాలో తోచని పరిస్థితి.

ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట కారు దగ్గిర నిలబడి ఉన్నాడు. “ఈ టైములో వచ్చావేంటి?” అని ఆశ్చర్యంగా అడిగాం. “మామ్మగారు మీరు సినిమాకి వెళ్ళారని చెప్పారు. అందుకే ఇక్కడ మీరు వస్తారని నిలబడ్డాను” అన్నాడు.

మేమిద్దరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం. “సార్ మిమ్మల్ని రేపు మానకుండా రమ్మన్నారు. ఏదో అర్జంటు వర్కు వచ్చిందిట. నన్ను ఎన్నిగంటలకి రమ్మంటారు” అన్నాడు. తొమ్మిది గంటలకి రమ్మని చెప్పి లోపలికి వెళ్ళాం. అక్క అత్తగారు మమ్మల్ని చూసి – “ఇదిగో అమ్మాయ్, మీరు సినిమాకి వెళ్ళారని నాకు తెలుసు. మీరు వెళ్ళిన టైములని బట్టి అనుకున్నా. సినిమా థియేటర్లు తప్ప బయట ఏమీ లేవని పక్కింటి అబ్బాయి చెప్పాడు, అహ్హ అహ్హ హ్హా.... అని నవ్వారు.

*** అంతేమరి ఒక షాపింగా ఏమన్నానా.... ? అప్పుడు అమీర్ పేటలో అక్కడక్కడ చిన్న చిన్న షాపులు వుండేవి. మైత్రీవనం, ఆదిత్య ఎన్క్లేవ్ అవన్నీ ఉన్నచోట ఖాళీస్థలాలు వుండేవి. సత్యం థియేటర్ సారధీ స్టూడియోస్ దగ్గర నిలబడితే కనిపించేది. సంజీవరెడ్డి నగర్ నుంచి అమీర్ పేట వెళ్ళే దారిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక కార్నర్ లో ఇరానీ హోటల్ వుండేవి అంతే. మధ్య మధ్యలో చిన్న చిన్న షాపులు. ఇప్పటిలాగా బయట షాపింగ్ అవీ ఏమీ లేవు. మెయిన్ రోడ్లమీద వేరే వూళ్ళకి వెళ్ళడానికి ట్రావెల్స్ కానీ ఏమీలేవు. ఒక్క గోల్డ్ స్పాట్ కంపెనీ మాత్రమే వుండేది. బస్సెక్కి ఊరు వెళ్ళాలంటే గౌలిగూడ బస్ స్టాండ్ కి వెళ్ళాల్సిందే. లేకపోతే రైల్వే స్టేషన్ కి ***

ఇద్దరం ఇంకేం మాట్లాడకుండా నవ్వి - ఆవిడని కూచోపెట్టి సినిమాకథ చెప్పేశాం. ఆవిడ కూడా ఆనందంగా విని, మా ఇద్దరికీ మంచి కాఫీ ఇచ్చారు.
ఇక మర్నాడు మళ్ళీ రాములు కారులో ఆఫీసుకి. కానీ ఎన్.టి.రామారావుగారు వచ్చిన తర్వాత క్రమం క్రమంగా గొడవలన్నీ తగ్గి కర్ఫ్యూ అనేదే లేకుండా పోయింది.

2 కామెంట్‌లు:

  1. 1978 రమీజా బీ కేసు తరువాత కర్ఫ్యూలు ఎక్కువయ్యాయి. నేను ఆ రోజుల్లో విద్యానగర్ లో ఉండేవాడిని. ఆ కేసప్పుడు మా రూము దగ్గరలోని అడిక్ మెట్ పోలీసు స్టేషన్ చుట్టుపక్కల జనాలకు పోలీసులకు రోడ్డు మీద గొడవలవుతుండేవి. కర్ఫ్యూ ఒక గంట సడలించినప్పుడు రామయ్య గారి మెస్ కు త్వరగా వెళ్ళి కాఫీ తాగి, టిఫిన్ పొట్లం కట్టించుకుని త్వరగా తిరిగి రూముకు చేరుకునేవాళ్ళం. మీరన్నట్లు NTR గారి పాలనలో కర్ఫ్యూల బెడద పోయింది.

    రిప్లయితొలగించండి
  2. మేము 1980 తర్వాత వచ్చాం కాబట్టి ఆ సంగతులు తెలియవు. ఒకోసారి రోడ్డుమీద గొడవలు ఎందుకయ్యేవో తెలిసేది కాదు. కానీ మేమూ కర్ఫ్యూ టైంలో ఇబ్బందులు పడ్డాం. అవన్నీ పోయాక హాయిగా అనిపించింది.

    రిప్లయితొలగించండి