7, జులై 2022, గురువారం

ఎదురీతలో నేను - 31 ఉత్తరానికి ఎదురుచూపులు - ఆనందంగా ఆఫీసులో....

ఎదురీతలో నేను - 31 ఉత్తరానికి ఎదురుచూపులు - ఆనందంగా ఆఫీసులో....

నాకు 1000 రూపాయలు శాలరీ. అందులో అమ్మా వాళ్ళకి 500 రూపాయలు పంపించేదాన్ని. అందరూ అంత పంపించేస్తే ఇక్కడ నువ్వు ఎలా గడుపుతావు అనేవారు. కానీ నేను అతి పీనాసితనానికీ పోలేదు. అలా అని డబ్బులు విపరీతంగా కూడా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడూ చాలా సంతోషంగానే ఉంటూ, నాకు కావలసినవి నేను ఎప్పుడూ తగ్గించుకోలేదు. అప్పులు చెయ్యలేదు. మా చెల్లెలు వచ్చాక ఇద్దరం సంతోషంగానే గడిపాం.


*** ఉత్తరానికి ఎదురుచూపులు ***


ఆరోజు ఆఫీసులో పైకీ కిందకీ తిరుగుతున్నాను. అందరూ “ఏమైంది?” అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా టెలిఫోన్ ఆపరేటర్ వుండేచోటికి వెళ్ళి నుంచున్నాను. 11 గంటలయింది. పోస్ట్ మేన్ గబగబా వచ్చి నా చేతిలో ఉత్తరం పెట్టాడు. అమ్మ ఉత్తరం చూసి ఎంత ఆనందంగా అనిపించిందో...

నా మొహంలో సంతోషం చూసి అమ్మయ్య ఉత్తరం వచ్చిందా... నీ టెన్షన్ చూసి ముందు మాకు అర్థం కాలేదు. “చదువుకుని మాకు స్వీట్ తెప్పించు” అన్నారు. వాళ్ళ మాట పట్టించుకోకుండా పైన మా రూంకి వెళ్ళిపోయాను.

అమ్మ ఐదోతరగతి చదువుకుంది. కానీ చాలా పుస్తకాలు చదివేది. చదవడం రానివాళ్ళకి చదివి వినిపించేది. ఇక ఉత్తరాలు అయితే ప్రతి చిన్న విషయం రాసేది.

*** “నాగమ్మా... ఎలా వున్నావు? సంక్రాంతికి వస్తున్నారా... ?” అక్కల పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం. రత్న ఆడుకుంటూ కింద పడిపోయింది. దెబ్బ తగిలింది. ఛాయ వచ్చి దాన్ని పడేశానని నన్ను ఒక్క దెబ్బ వేసింది. ఎదురింటి వాళ్ళు ఎందుకో కనిపించట్లేదు. ఇవాళ అరటిపళ్ళవాడు ఇంటికి వెళ్ళిపోతున్నానని మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముసలమ్మ వచ్చి గిన్నెలు తోమి వెళ్ళిపోతూ రేపు రానని చెప్పింది. ఇవాళ పొద్దున్న కాఫీ కలుపుతుంటే నువ్వు గుర్తు వచ్చావు... ప్రభావతి వచ్చింది కదా...! ఇద్దరూ సరిగ్గా తింటున్నారుకదా...! పెద్దక్క పిల్లలు ఛాయ, రత్న బాగా అల్లరి చేస్తున్నారు. నాకు వాళ్ళతో అస్సలు ఖాళీ వుండట్లేదు. మొన్న రత్నిని తిట్టానని ఛాయ కొబ్బరి పుల్లతో నన్ను కొట్టింది. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. - అమ్మ ***

ఇలా ఒకదానికి ఒకదానికి పొంతన లేక పోయినా... ఆ ఉత్తరం ఒక డైరీ రాసినట్లు రాసేది. (మర్చిపోయాను మా అమ్మ డైరీ తప్పకుండా రాస్తుండేది.) రాత మరీ అందంగా లేకపోయినా ఒకే పద్ధతిలో వుండేది. చదువుతుంటే అమ్మతో మాట్లాడుతున్నట్లు ఉండేది. మళ్ళీ మేము మా విశేషాలతో ఉత్తరం రాసేవాళ్ళం. ఆరోజులే వేరు. అక్కలు కూడా ఉత్తరాలు రాస్తుండేవారు. వాళ్ళు రాసిన ఉత్తరాలు వేరేగా వుండేవి.

మేము ఉత్తరం కోసం పడుతున్న హడావుడి చూసి ప్రతిసారీ ఆఫీసు వాళ్ళు పోస్ట్ మాన్ దగ్గర తీసేసుకుని “మీకు ఉత్తరం వచ్చింది మాకు స్వీట్ తెప్పిస్తే ఇస్తాం” అనేవారు. మా కన్నా వాళ్ళ ఎదురుచూపులు ఎక్కువ వుండేవి. ఒక పావుకిలో తెప్పించినా అందరూ పంచుకుని తినేవాళ్ళు. మాది ఉత్తరం ఆనందం. వాళ్ళది స్వీట్ ఆనందం.

ఇక మా హడావుడి విజయపాల్ రెడ్డి గారికి అర్థం అయి – “నాగలక్ష్మీ! మీరు ఆఫీసు నుంచి మీ అమ్మావాళ్ళతో ఎస్టీడీ కాల్ చేసి మాట్లాడుకోండి”, అని ఎస్టీడీ కోడ్ నెంబర్ ఇచ్చారు. అప్పుడు మా అమ్మా వాళ్ళింట్లో ఫోన్ లేదు. ఎదురుకుండా ఎవరో వ్యాపారస్తుల ఇల్లు వుండేది. మేము అక్కడికి చేసి అమ్మావాళ్ళు వచ్చాక వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మా మూలంగా చాలా బిల్లు అయ్యేది. ఆయన ఎప్పుడూ దాన్ని గురించి మా దగ్గిర మాట్లాడలేదు. మమ్మల్ని అడగలేదు.

*** ఆఫీసులో కూడా కాలేజీ లైఫ్ ***

ఆఫీసులో అకౌంట్స్ లో నీరజ, వెంకటరమణ (అమ్మాయి) – ఆర్టిస్టుగా రమ, టెలిఫోన్ ఆపరేటర్ గా లీల. ఇక నేను, మా చెల్లెలు ప్రభావతి. లంచ్ టైంలో సందడే సందడి. అదయ్యాక “నాగలక్ష్మీ సాయంత్రం మూడు గంటలకి టీ అబ్బాయిని రావద్దని చెప్పాను దగ్గరలోనే ఉన్న గాయత్రీ భవన్ కి వెళ్ళి మంచి కాఫీ తాగొద్దాం” అంది నీరజ. అందరం కలిసి అలా ఒక పావుగంట తిరిగొచ్చాం. ఎప్పుడూ మా మధ్యన నవ్వుల జల్లులు వుండేవి.

“రేపు ఎవరం లంచ్ తెచ్చుకోవద్దు. లీల కొత్తగా చేరింది కదా తాజ్ మహల్ హోటల్ లో పార్టీ ఇస్తోంది” రమణ చెప్పింది. పాపం ఆ అమ్మాయి “ఎన్ని రూపాయలవి తింటారు” అంది. “తిన్నాక చెప్తాం” అన్నాం. మర్నాడు అందరం కలిసి తాజ్ మహల్ కి వెళ్ళి టిఫిన్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళే ఇచ్చేశాం. లీల స్వీట్ తెప్పించింది. ఎప్పుడైనా సరదాగా లంచ్ టైంలో గాయత్రీ భవన్ కానీ, తాజ్ మహల్ కానీ దర్శించేవాళ్ళం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి