25, జులై 2022, సోమవారం

ఎదురీతలో నేను - 36 *** అమ్మరాక ఆనందం *** *** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***

ఎదురీతలో నేను - 36

*** అమ్మరాక ఆనందం *** *** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***



అమ్మ మా దగ్గిరకి వచ్చిన దగ్గర నుంచీ తనే వంట చేసేది. పొద్దున్న అమ్మచేతి వంట వేడివేడిగా తినేసి, కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అమ్మ తను లేటుగా తింటుంది కాబట్టి కాఫీ తాగేది. తనతోబాటు మళ్ళీ మాకూ ఇచ్చేది. సాయంత్రం నాకు, చెల్లెళ్లు ముగ్గురికీ, పిన్ని పిల్లకీ ఒక కంచంలో కలిపి పెట్టేది. పెద్దక్క కూతురు సౌమ్య మాతోనే వుండడంతో, దగ్గరలో ఉన్న స్కూల్లో వేసి, రిక్షా మాట్లాడాం. అమ్మకి సౌమ్యతో కొంత కాలక్షేపం. మధ్యాహ్నమప్పుడు పుస్తకాలు చదువుకుంటూ వుండేది.

ఇంటి అద్దె (1986లో) 650 రూపాయలు. అది మాకు ఎక్కువే కానీ, పిన్ని పిల్లలు, మేము అందరం కలిసి సంపాదించేది బాగానే సరిపోయేది. నెల తిరిగేసరికి అందరూ నాకు శాలరీ తెచ్చి ఇచ్చేవారు. అందరివీ కలిసి ఇంటి లెక్కలు రాయడం, ఖర్చు పెట్టడం అన్నీ చూసుకునేదాన్ని. ఎక్కడా లోటు బడ్జెట్ వుండేది కాదు. అందరం కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. అమ్మని గుడులకి, పార్కులకి, తనకి తెలిసిన బంధువుల ఇళ్ళకీ తీసుకుని వెళ్ళేవాళ్ళం. చాలా వరకు అమ్మకి ఏం ఇష్టమో అవన్నీ తీర్చేవాళ్ళం.

అమ్మని ఆఫీసుకి కూడా తీసుకెళ్లి చూపించాం. అలాంటివి ఎప్పుడూ చూడలేదు కదా... అమ్మకి ఆశ్చర్యం. చాలా సంతోషించింది. అయితే నాకు ***సరుకుల డబ్బాల మీదకి పేర్లు*** చేసి పెట్టండి అని చెప్పింది. మేము ప్రింట్స్ తీసి ఇచ్చాక వాటిని జాగర్తగా డబ్బాల మీద అతికించుకుని అమ్మ ఎంత సంతోషపడిందో. ఎందుకంటే అప్పటివరకూ చేతిరాతతో పేర్లు వుండేవి. అమ్మ తనకి వచ్చిన పాటలు, పద్యాలు కొన్ని నోటు పుస్తకాలలో రాసుకుంది. వాటన్నిటినీ టైపు చేసి పుస్తకంగా చేసి ఇమ్మంది. సరే అని ఆఫీసులో పెట్టుకుని రోజుకి కొంత కొంత టైపు చేసేవాళ్ళం. విజయపాల్ గారికి చెప్పకుండా ఏదీ చేసేవాళ్ళం కాదు.

*** ఆఫీసు దగ్గరవడంతో పని ఎక్కువ చెయ్యడానికి వెసులుబాటు ***

ఆఫీసు ఇంటికి దగ్గరవడంతో మాకు తిండి విషయంలో ఎటువంటి ఇబ్బందీ అవలేదు. మేము పొద్దున్న ఒక ఇద్దరం, మధ్యాహ్నం ఒక ఇద్దరం షిఫ్ట్ లలో వెళ్ళేవాళ్ళం. గీతా పదవతరగతి పాస్ అయింది. తను కాలేజీలో చేరడానికి ఇంకా టైముంది. కాబట్టి అప్పుడప్పుడూ తను ఊరికే మాతోబాటు ఆఫీసుకి వస్తూ వుండేది.

అమ్మ చెల్లెళ్ళిద్దరినీ తీసుకుని విజయవాడ వెళ్ళింది. పిన్నిపిల్లలు ఏలూరు వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఆఫీసుకి వెళ్ళాను. “అర్జంటు వర్కు వుంది కొంచెం లేట్ అవర్స్ వుండి చేస్తారా?”, అన్నారు విజయపాల్ గారు. ఇంట్లో చెల్లెలు ఒక్కతే వుందని చెప్పాను. “సరే, ఆమెనీ తీసుకువద్దాం పదండి”, అని, వాళ్ళావిడ కృష్ణని కూడా తీసుకుని మా ఇంటికి వచ్చారు.

వాళ్ళకి మర్యాద చెయ్యడం సొంపు – నేను టీ కలుపుతాను తాగమని, బాగా ఇవ్వాలని, చాలా స్ట్రాంగ్ గా కలిపి ఇచ్చాను. అదెంతబావుందో తెలియదు కానీ, అతి చిక్కగా మాత్రం వచ్చింది. నేనూ తాగాను నాకయితే అస్సలు నచ్చలేదు. పాపం ఏమీ అనకుండా తాగేశారు. వాళ్ళతోబాటు చెల్లెలిని తీసుకుని వెళ్ళాం. ఇద్దరం కలిసి వర్కు చేసిపెట్టాం. మా విషయంలో అంత జాగ్రత్తగా వుండేవారు. ఆఫీసులో ఏదో ఒక వర్కు ఆగకుండా వుంటూనే వుంది.

*** నా పెళ్ళికి అమ్మ ఆరాటం ***

అమ్మ నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడయితే ఫోన్లమీద సంప్రదింపులు. అప్పుడు తెలిసిన కుటుంబం అయితే చాలు అనుకునేవారు. ప్రశాంతంగా పెళ్ళిళ్ళు జరిగేవి. ఒక కళ్ళు కనిపించని ఆయన గవ్వలు వేసి చెప్తారు జాతకం అంటే ముందర ఆయన్ని చూడాలని వెళ్ళి, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కనుక్కుంది. ఇంకొకసారి బంధువుల ఇంటికి వెళ్ళి జాతకాలు చెప్తారని తెలిసి, ఊరికే నా నక్షత్రం ఇచ్చి పెళ్ళి గురించి అడిగింది. నాకు అసలు పెళ్ళే అవదని చెప్పారు. రిజర్వు బ్యాంక్ లో ఆఫీసర్ దిలీప్ కుమార్ గారు మా కుటుంబ మిత్రులు. ఆయన జాతకం చెప్పేవారు. నీ జాతకంలో పెళ్లి లేదు, ఒకవేళ అయినా 1992లో అవుతుందని చెప్పారు.

ఇవన్నీ విన్న అమ్మకి నామీద చాలా కోపం వచ్చింది. “నువ్వు కాళహస్తి విద్యాప్రకాశానంద స్వామి ఉపన్యాసాలు విని, సన్యాసం తీసుకుంటానన్నావు. ఆశ్రమానికి వెళ్ళిపోతానన్నావు. అందుకే నీ పెళ్ళి గురించి అందరూ ఇలా చెప్తున్నారు ”, అంటూ ఒకటే గోల పెట్టింది.

నేను “అవన్నీ నమ్మకమ్మా... నాకు పెళ్ళవుతుందిలే. వాళ్ళందరూ ఏవో చెప్తుంటారు. నువ్వేం బెంగపడకు, నువ్వు సంబంధాలు చూడు, ఎందుకు పెళ్ళవదో నేనూ చూస్తాను”, అని నవ్వేశాను. అమ్మకి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఏదో తన హడావుడి తను పడింది.

2 కామెంట్‌లు:

  1. చాల రోజులు తరువాత , శ్రీ విద్య ప్రకాశనంద స్వామి గారి పేరు చదివాను . మా అమ్మ కి , ఆ స్వామి పట్ల చాలా భక్తి . అయన దగ్గరే మంత్రోపదేశం తీసుకుంది . ఆయన రచించిన గీత మకరందం పుస్తకం మా ఇంట్లో ఎప్పటి నుండో ఉంది . ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, ఆయన పడుకున్నారు ( అనారోగ్యం ??), మా అమ్మ ఒకసారి దండం పెట్టుకుని వచ్చేస్తా అని చాలా బ్రతిమాలింది , సరే అని వెళ్లనిచ్చారు . సైలెంట్ గా వెళ్లి కాళ్ళకి దండం పెట్టుకుని వచ్చేసింది. ఆశ్రమం లో భోజనం చేసి తిరుగు ప్రయాణం అయిపోయాం .
    ఆయన మా ఊరు లో ఉపన్యాసానికి వచ్చినప్పుడు, చాలా చిన్న వయసు లో ఆయన్ని చూడటం ఒక అనుభవం . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బావుందండీ మీరు చెప్పిన విషయం. మీ అమ్మగారి విషయం చాలా బాగా చెప్పారు. అలా సంతోషించడం కూడా బావుంది. మీకు ధన్యవాదాలు

      మేము చదువుకునే రోజుల్లో మా స్కూలులో చేస్తున్న తెలుగు టీచరుగారు భగవద్గీత నేర్పేవారు. మొత్తం 18 అధ్యాయాలు నేర్పించారు. విశ్వహిందూ పరిషత్ వాళ్ళ పోటీలకి వెళ్ళి ప్రైజులు తెచ్చుకున్నాం. అలాగా విద్యాప్రకాశానందగిరి స్వామి పెట్టిన పోటీలలో కూడా ప్రైజులు వచ్చాయి. మా అక్కచెల్లెళ్ళం అందరం నేర్చుకున్నాం. ఇలా వెళ్ళినప్పుడు నాకు ఆయన చెప్పే ఉపన్యాసాలు పిట్టకథలతో చాలా నచ్చేవి. ఎందుకో నేను అప్పటి నుంచీ చదువు అవగానే ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకున్నాను. గట్టిగా నిర్ణయించుకున్నాను. నా పెళ్ళి విషయం వచ్చేసరికి మా అమ్మ దానివల్లే నాకు పెళ్ళవట్లేదు అనుకుంది.

      తొలగించండి