29, జులై 2022, శుక్రవారం

ఎదురీతలో నేను - 37 *** హోరెత్తించిన వినాయక చవితి *** *** ఐరన్ లెగ్ శాస్త్రి ***

 ఎదురీతలో నేను - 37 *** హోరెత్తించిన వినాయక చవితి *** *** ఐరన్ లెగ్ శాస్త్రి ***

***అమ్మ పెళ్ళి సంబంధాల గురించి తెలిసిన వాళ్ళకి చెప్పి కనుక్కుంటూనే వుంది.***


*** హోరెత్తించిన వినాయక చవితి ***



1986లో అమ్మ వచ్చిన తర్వాత - సెప్టెంబరు 7వ తేదీ, ఆదివారం ***వినాయక చవితి*** వచ్చింది. అమ్మ పిల్లలు ఇన్నాళ్ళు తను లేకుండా చేసుకున్నారని. ఒకటే హడావుడి చేసింది. తను కూడా మాతో సరదాగా కూరగాయల మార్కెట్ వచ్చి, తనకి కావలసినవన్నీ తీసుకుంది. సరుకులన్నీ తెప్పించింది. మాకు కూడా సంతోషంగానే అనిపించింది. మా ఇల్లు రోడ్డు మీదే వుండేది కదా... రోడ్డుకి అవతల వైపున ***వినాయకుడి మండపం*** పెట్టారు. అమ్మ చూడడం అదే మొదలు కాబట్టి 9 రోజులు కాలక్షేపం బాగా వుంటుంది బాల్కనీలో కూచుని చూడచ్చని అనుకుంది.

మొదటి రోజు ఇంట్లో పూజ హడావుడి సరిపోయింది. అంతా బాగా జరిగింది. అమ్మ ఉండ్రాళ్ళు రకరకాల పిండివంటలు చేసింది. మంచి భోజనం ఆనందంగా తిన్నాం. ఇంక వినాయక మంటపం వాళ్ళు మైకులు పెట్టి మంత్రాలతో పూజ మొదలు పెట్టారు. సౌండ్ ఎక్కువగానే వుంది. సరేలే ఒకరోజే వుంటుందనుకున్నాం.

ఇక మర్నాడు పొద్దున్నే పెద్ద సౌండ్ తో రకరకాల పాటలు వేస్తున్నారు. చెవులు చిల్లులు పడిపోయేలా. ఆ సౌండ్ మాకు కడుపులో పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి వాయిస్తున్నట్టుంది. కాళ్ళలోంచి వణుకు. ఇల్లంతా అదరుతోంది. భరించడం చాలా కష్టమైపోయింది. మైక్ మా ఇంటివైపుకి ఒకటి వుంది. అమ్మ కూడా బాగా ఇబ్బంది పడింది. మధ్యాహ్నం వరకూ అదే తంతు. సాయంత్రం మళ్ళీ 5 గంటలకి మొదలయ్యింది. ఇంట్లో ఒకళ్ళమాటలు ఒకళ్ళకి వినిపించట్లేదు.

ఆ మంటపం దగ్గర గొడవలవ్వకుండా చూడ్డానికి వచ్చిన పోలీసు మా ఇంటి కింద అరుగుమీద కూచున్నారు. నేను వెళ్ళి సౌండ్ “తగ్గించమని చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళు వున్నారు”, - అని చెప్పాను. “ఏం చెప్పమంటావమ్మా...! మాకు కష్టంగానే వుంది. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తున్నారు”, అన్నారు. నేను చాలా బతిమాలాను. లాభం లేకపోయింది. నాకయితే ఆయన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదో అర్థం కాలేదు. అసలు చుట్టుపక్కల జనాలు ఎలా భరిస్తున్నారో అర్థం కాలేదు. దాన్ని భక్తి అంటారా...? వినాయకుడు విగ్రహం కాబట్టి సరిపోయింది. అనుకున్నాను. మొత్తానికి ఒక వారం రోజులు అలా భరించాల్సి వచ్చింది. కానీ క్రమక్రమంగా హైదరాబాద్ లో బుడ్డి బుడ్డిగాళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టడం మొదలు పెట్టారు. ఎన్ని పెట్టారో లెక్కలేదు.

రెండోరోజు ఆఫీసు నుంచి వచ్చేసరికి అమ్మ బాల్కనీలో, అక్క పాప సౌమ్యని పెట్టుకుని కూచుని వుంది. అమ్మ దగ్గిరకి వెళ్ళి నుంచున్నాను. ఇంతలోనే అమ్మ ఉన్నట్టుండి – “శాస్త్రీ, శాస్త్రీ ఇక్కడ”, అని అరవడం మొదలు పెట్టింది. శాస్త్రి అనే పేరుగల అతను పైకి చూశాడు. అతని మొహంలో చెప్పలేని ఆనందం.
“అక్కయ్య గారో... ఇక్కడ వున్నారేంటండోయ్? బావున్నారా... ఇక్కడ వినాయకుడి పూజ చేయించడానికి వచ్చా... అయిపోయాక వస్తా...” అన్నాడు. నాకు అతనెవరో అర్థం కాలేదు.

పూజ అయిపోయాక పైకి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ముందు రూంలో కూచోపెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. అతను - సినిమాల్లో వేస్తున్నాననీ, సినిమావాళ్ళందరి ఇళ్ళలో పౌరోహిత్యం చేస్తున్నాననీ, డబ్బులు బాగా వస్తున్నాయనీ, షేర్లు కొంటున్నాననీ చెప్పాడు. ఇంతకీ అతను ఎవరంటే - సినిమాల్లో వేస్తున్న –

*** ఐరన్ లెగ్ శాస్త్రి ***

ఇతను మా తాడేపల్లిగూడెంలో ఒక పురోహితుడి కొడుకు. కాలవ ఒడ్డున కూచుని కార్తీకమాసంలో అందరి దగ్గరా దక్షిణ తీసుకునేవాడుట. అమ్మకి అలా పరిచయం.

అదలా వుంచి ఇతను *** షేర్లు *** గురించి మా అమ్మకి ఏం చెప్పాడో తెలియదు కానీ, అమ్మ మమ్మల్ని కూడా షేర్లు కొనమని కూచుంది. మాకూ అప్పటికి సరిగ్గా తెలియదు కానీ, మేము తెలుసుకుని అమ్మకి చెప్పి, శాంతపరిచేసరికి మా పనయ్యింది.

మా పక్క రోడ్డులోనే వుండేవాడు. ఇంచుమించు మా అమ్మని కలిసి పలకరిస్తూనే వుండేవాడు. అమ్మ మా అమ్మాయికి పెళ్ళి సంబంధాలుంటే చెప్పమందిట. ఒకరోజు వాళ్ళ నాన్నగారిని తీసుకుని వచ్చాడు. ఆయన “అమ్మా! మీరు మీ అమ్మాయికి సంబంధం గురించి చెప్పారుట. వీడు నన్ను రమ్మంటే వచ్చాను. అమ్మ ఆయనేదో సంబంధం చెప్తారనుకుని వింటోంది.

ఆయన మళ్ళీ – “మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు, వీడికీ వాళ్ళకి ఎలా సరిపోతుంది” అన్నాడు. ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది. అమ్మ “నేను ఏవైనా సంబంధాలు చెప్పమన్నాను. మీ అబ్బాయి గురించి కాదు” అంది. ఆయన మాటలకి మాకు ఏమనాలో అర్థం కాలేదు. అసలు అలా ఎలా అనుకున్నాడో... ఆ హడావుడి మనిషి అమ్మ చెప్తే ఏం విన్నాడో తెలియదు. మా చెల్లెలు ఒకరోజు అతను కనిపిస్తే... ఇంకెప్పుడూ మా ఇంటికి రాకు అని చెప్పిందిట. ఇంక మళ్ళీ అతను మా ఇంటివైపు రాలేదు.

కానీ ఇవివి సత్యనారాయణ గారి ద్వారా సినిమాల్లోకి వచ్చి, దాదాపు 100 సినిమాలపైనే నటించి, హాస్యనటుడిగా చాలా పేరు తెచ్చుకున్నాడు. చివర్లో డబ్బులకి చాలా ఇబ్బందులు పడి తాడేపల్లి గూడెం వెడితే.... సినిమాల్లో చూసి ఎంజాయ్ చేశారు కానీ... మళ్ళీ ఎవరూ పౌరోహిత్యానికి రానివ్వలేదు. ***ఐరన్ లేగ్*** పేరు అతనికి శాపమైంది. ఎంతైనా మా వూరి వాడు కదా బాధగానే అనిపించింది. చివరి రోజుల్లో దారుణమైన జీవితం గడిపాడు.

*** హైదరాబాద్ లో వినాయక విగ్రహాల స్థాపన - నిమజ్జనం ***

వినాయక నిమజ్జనోత్సవాలనేవి చెన్నారెడ్డి గారి హయాం వచ్చాయని విన్నాను. అది ఎంత వరకు కరక్టో నాకు తెలియదు. 1985-86లో నిమజ్జనం అంటే అంత హడావుడి ఏమీ వుండేది కాదు. 1986లో చక్రధరరెడ్డి అనే కాలేజీ విద్యార్థి రకరకాల వినాయకుడి విగ్రహాలు చెయ్యడం మొదలు పెట్టాడుట. అప్పటి నుంచీ వినాయకుడికి వెయ్యని వేషం లేదు. జనాలకీ అదో కొత్తవిషయం దొరికింది.

నేను మెహదీపట్నంలో ఉన్నప్పుడు ఒకసారి 6 నెం. బస్సు సెక్రటేరియట్ వరకూ రాగానే ఆపేసి “ఇక్కడి నుంచీ వెళ్లిపొండి” అన్నారు. బస్సులన్నీ డిపోకి వెళ్ళిపోతున్నాయి, ఇంక మళ్ళీ బస్సులు రేపే అన్నారు. నేను, హిమాయత్ నగర్ వేరే ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయి ఇద్దరం మెహదీపట్నం నుంచి వచ్చాం. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆఫీసులో వాళ్ళకి అర్థం అవుతుందిలే అని ఇద్దరం మళ్ళీ సెక్రటేరియట్ నుంచి మెహదీపట్నం దాదాపు 7.5 కిలోమీటర్లు కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోయాం.
.
*** ఖైరతాబాద్ వినాయకుడు***
ఇంతకీ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే 1954లో సింగరి శంకరయ్య అనే ఆయన ఒక అడుగు విగ్రహంతో మొదలు పెట్టి, నెలరోజులు ఉత్సవాలు చేసేవారుట. 2013 వరకూ సంవత్సరానికి ఒక అడుగు పెంచుకుంటూ వచ్చారుట. అప్పటికి 59 సంవత్సరాలు పూర్తయి, 59 అడుగుల విగ్రహం అయిన సందర్భంగా 4,200 కిలోల లడ్డూని వినాయకుడి చేతిలో పెట్టారుట. 1960లో ఏనుగు మీద ఊరేగిస్తూ... సాగర్ కి నిమజ్జనానికి తీసుకెళ్ళారుట. 1983కి ముందు ఒకసారి విగ్రహం నిమజ్జనానికి తగిన క్రేన్ రాలేదని నెలరోజులు టాంక్ బండ్ మీదే వుంచేశారుట. క్రమంగా విగ్రహం అడుగులు తగ్గించుకుంటూ వచ్చారు. 2021 నాటికి 36-40 అడుగుల విగ్రహం తయారు చేస్తున్నారు.

2 కామెంట్‌లు:

  1. పాపం, “ఐరన్ లెగ్” శాస్త్రి” గారిది విషాదాంతం . చాలా సినిమాల్లో చేసినా కూడా చివరచివర్లో అతనిది వేషంలోనే కాదు, మామూలుగా కూడా ఐరన్ లెగ్గే, అతన్ని సినిమాలో పెట్టుకుంటే సినిమాకి ఐరన్ లెగ్గే అని అపఖ్యాతి తెచ్చిపెట్టారు సినిమా రంగంలో కొందరు అని, క్రమేపీ వేషాలు రావడం మానేసాయనీ అంటారు. అది చాలక బాడ్ లక్ / నాశనం అనే అర్థంలో “ఐరన్ లెగ్” అనే మాటని కూడా తెలుగు వ్యావహారికంలో ప్రవేశపెట్టారు.

    మరొక ఉదాహరణ మాడా వెంకటేశ్వరరావు గారు. ఓ సినిమాలో కొజ్జా వేషం వేయించి, ఆ తరువాత తరువాత అటువంటి వేషాలకే ఎక్కువగా పరిమితం చేశారంటారు. పైగా “మాడా” అనే మాటకి కొజ్జా అనే అర్థాన్ని కూడా జనాల్లో బాగా వ్యాపించింది.

    తమ సినిమా అవసరాలకు అటువంటి వేషాలు వేయించి, డైలాగులు చెప్పించి, ఆ తరువాత ఆ మనిషిని బజార్న పడెయ్యడం ఆ రంగానికి అలవాటేమో? వేషాల కోసం, బతుకుతెరువు కోసం చిన్నకారు నటీనటులు అశక్తులై ఒప్పుకోవడం.

    వినాయక నిమజ్జనం, విగ్రహాల ఎత్తు, రకరకాల రూపురేఖలు వేలంవెర్రిగా తయారయ్యాయి. పైగా హైదరాబాదు నుండి ఇతర ఊళ్ళకు కూడా వ్యాపించింది ఈ వేలంవెర్రి. దాన్ని గురించి ఆలోచించడం కూడా అనవసరం.

    మీ పెళ్ళి కుదిరిన క్రమం విశేషాల గురించి వెయింటింగ్ ఇక్కడ 🙂.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పినవన్నీ కరెక్టే సర్. పెళ్ళి విశేషాలు ముందు వివరిస్తాను. మీకు ధన్యవాదాలు, నమస్కారాలు

    రిప్లయితొలగించండి