11, జనవరి 2023, బుధవారం

అనుకోకుండా మరో ప్రముఖవ్యక్తితో పరిచయం - 66

అనుకోకుండా మరో ప్రముఖవ్యక్తితో పరిచయం - 66


2015 డిసెంబరు నెల చివరి వారంలో... పొద్దున్నే 6 గంటలకి ఫోను – ఆ టైములో అసలు ఫోన్ ఎవరు చేస్తారూ...? ఎందుకు చేస్తారూ....? అనుకుంటూ landline దగ్గిరకి వెళ్ళి ఫోన్ ఎత్తాను. అవతలి నుంచి కొంత పెద్దవాళ్ళు, మగవాళ్ల గొంతు - “నాగలక్ష్మి గారూ... నా పేరు సంధ్యావందనం శ్రీనివాసరావు. సంధ్యావందనం లక్ష్మీదేవి గారి భర్తని. లక్ష్మీదేవిగారు మీతో మాట్లాడాలంటున్నారు. మా ఫోన్ నెంబరు, ఇంటి అడ్రసు ఇస్తాను. రాగలరా... లక్ష్మీదేవికి ఒంట్లో బావుండట్లేదు. మీరు వస్తే బావుంటుంది. మేము కార్ఖానాలో ఉంటాం” అని అడ్రస్ ఇచ్చారు.

“సంధ్యావందనం లక్ష్మీదేవిగారి పేరు బాగా విన్నాను సర్. రేపు మా వారిని తీసుకుని మీ ఇంటికి వస్తాను సర్” అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మర్నాడు పొద్దున్న వాళ్ళింటికి బయల్దేరాం. అప్పట్లో ఊబర్ లు, ఓలాలు లేవు. వెతుక్కుంటూ వెళ్ళాలంటే కష్టం. నేను, మా వారు కలిసి తెలిసిన ఆటోలో వెళ్ళాం. లక్ష్మీదేవిగారి మొహం కొంచెం నీరసంగా వున్నా... మొహంలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఆయన మా ఇద్దరికీ జామకాయ జ్యూస్ ఇచ్చారు.


లక్ష్మీదేవిగారు వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి చెప్పి, వైదిక నిత్యకర్మవిధి పుస్తకం ఇంతకు ముందు ఒక చోట డిటిపి చేయించాం. చాలా తప్పులు వున్నాయి. నాకు పుస్తకం మీద ఎంత ఆశ వున్నా... ఆ తప్పులకి నీరసం వచ్చింది. అవన్నీ కరక్ట్ చేసి మళ్ళీ పుస్తకం ప్రింట్ చేయిద్దామనుకుంటున్నాం. సోమరాజు సుశీలగారు మీరు పేరు చెప్పారు. మీరు ఈ మేటర్ ఎలా ఎప్పటిదప్పుడు మీరు వచ్చిన ఆటో అబ్బాయికి ఇచ్చి పంపిస్తారా...? అన్నారు. మేము టైపు చేసేసి చెప్తాము అన్నాను. టైప్ చెయ్యడం మొదలు పెట్టాం. అంతా సంస్కృత శ్లోకాలు వాటికి అర్థాలు. టైపు చెయ్యడం అయిపోయాక చెప్పాం.

లక్ష్మీదేవిగారు “అమ్మా... మీరు పంపించద్దు. నేను వరసగా ఒక వారం రోజులు వచ్చి ఆ పుస్తకం పూర్తి చేసుకుంటాను. మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకునేందుకు అవకాశం కల్పించండి. నాకు ఇప్పుడు పుస్తకం మళ్ళీ మొదలు పెట్టాక ఓపిక వచ్చింది” అన్నారు.

ఒక వారం రోజులు వచ్చి పుస్తకం పూర్తిచేసుకున్నారు. ఇద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కావలసి భోజనం తెచ్చుకుని వచ్చేవారు. నేను కూడా మా ఇంట్లో చేసినవి ఇచ్చేదాన్ని. మొత్తానికి పుస్తకం వాళ్ళకి నచ్చినట్లు వచ్చింది. అంత ఒంట్లో బావుండకపోయినా మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చాలా ఓపికగా పని పూర్తి చేసుకున్నారు.




ఇక పుస్తకాలు ఆపేద్దామనుకున్నాను కానీ, ఇంకో రెండు పుస్తకాలు రాసి నీ చేత చేయించుకోవాలనిపిస్తోంది అన్నారు. తప్పకుండా మళ్ళీ వస్తానని వెళ్ళిపోయారు. ఆవిడ అనారోగ్యం వల్ల పిల్లలు అమెరికా తీసుకెళ్ళారు.

పుస్తకం పేరు “వైదిక నిత్యకర్మ విధి”. పుస్తకం ఆవిష్కరణకి తప్పకుండా రమ్మని చెప్పారు. ఆవిష్కరణకి వెళ్ళాం. వేదిక మీద ప్రముఖులైన – ఆవుల మంజులతగారు (మాజీ తెలుగు అకాడమీ డైరెక్టర్, అప్పటి తెలుగుయూనివర్సిటీ వి.సి.), గొట్టిపాటి సత్యవాణిగారు (శ్రీధర్మపురి దేవాలయాల నిర్వాహకురాలు, ధార్మికోపన్యాసకురాలు), సోమరాజు సుశీలగారు (ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, రచయిత), సంధ్యావందనం లక్ష్మీదేవిగారు ఉన్నారు.





భూమి గుండ్రంగా వుందన్నట్టుగా నాకు వర్కుల ద్వారా పరిచయం అయిన వాళ్ళందరూ ఒకే చోట కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నట్టు చెప్పలేదు. అక్కడకి వెళ్ళాక స్టేజి మీదకి పిలిచి సన్మానం చేశారు. అదొక మంచి జ్ఞాపకం. తర్వాత సత్యవాణిగారు చెప్పారు – “నేను, సుశీల గారు అక్కడ కూచున్నంతసేపూ నీ గురించే మాట్లాడుకున్నాం. సుశీల గారి వర్కులు కూడా చేస్తున్నావుట కదమ్మా....” అన్నారు. అదొక ఆనందకరమైన విషయం.

నేను 2019 సెప్టెంబరు 5వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళడానికి హడావుడి పడుతుంటే... ఆగస్టు 25వ తేదీన సంధ్యావందనం శ్రీనివాసుగారు మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకుని వచ్చారు. మీరెళ్ళేలోపున అయిపోతుంది చేసిపెట్టండి అన్నారు. నేను మేటర్ టైపింగ్ చేసి పెడతాను. నాకు వర్కు చేసిపెట్టే శ్రీనివాస్ కి మిగిలిన పని అప్పచెప్తానని, టైపింగ్ వరకూ చేసి ఇచ్చేశాను. పని మొత్తం శ్రీనివాస్ కి అప్పచెప్పి వెళ్ళిపోయాను. ఆయన శ్రీనివాస్ చేత మిగిలిన పని పూర్తి చేయించుకుని పుస్తకం ప్రింట్ చేసుకున్నారు.

4 కామెంట్‌లు:

  1. పబ్లిషర్ కు సన్మానం చెయ్యడం వాళ్ళ సంస్కారం. మొత్తానికి మీ వృత్తి మీకు చాలా తృప్తి కలిగించుండాలి. అంతకు మించేం కావాలి.

    పైన మీరు పెట్టిన ఆ పుస్తకం పేజ్ లో “టైప్ సెట్టింగ్ :” అని మీ పేరు ఉంది.
    డిటిపి అంటే టైపింగ్, పేజ్ సెటప్ వగైరాలు చేసి ముద్రణకు అనుకూలంగా తయారు చెయ్యడంతో అయిపోతుందా లేక ముద్రణ, బైండింగ్ కూడా చేసిస్తారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముద్రణకు సిధ్ధం చేయటం వరకే DTP పని అండీ.

      తొలగించండి
    2. నేను చేస్తున్న ఈ డెస్క్ టాప్ పబ్లిషింగ్ నాకు చాలా ఆనందాన్నిస్తుంది సర్. ఎందుకంటే ఎవరి పుస్తకమైనా చాలా అంకితభావంతో చేస్తాం. మేము టైపు చేసేటప్పుడే తప్పులు సరిచేసుకుంటూ... అవసరమైన చోట రచయిత లేదా రచయిత్రిని సంప్రదించడం చేస్తాము. అనుభవం చాలా వుండడంతో ఏ పుస్తకం ఎలా వుంటే బావుంటుందో ముందే నిర్ణయించుకుంటాం. రచయిత కొత్తగా ఏమైనా మార్పులు చేస్తే తప్ప ఎక్కువ తప్పులు వుండవు.

      పైగా మా దగ్గిర వర్కు అంటే వాళ్ళు, మేము ఒక కుటుంబం అన్నట్లు చేస్తాము. అందరికీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది.

      ఒక పుస్తకం ముద్రణకి రెడీ అవ్వాలంటే రచయిత (రాయడంలో పడిన కష్టం వేరే), ప్రింటర్ కంటే డిటిపి ఆపరేటర్ ఎక్కువ శ్రద్ధతో చెయ్యాల్సి వుంటుంది.

      తర్వాత డిటిపి చేసేవాళ్ళకి భాష మీద పట్టులేకపోతే రచయిత నానా ఇబ్బందులు పడాల్సి వుంటుంది.

      వీటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకుని ఒక పుస్తకాన్ని తయారు చేస్తాము.

      కేవలం 2022లో మా చేతుల మీదుగా బయటికి వచ్చిన పుస్తకాలు 32. 20 మంది రచయితలు, రచయిత్రులవి.

      నాకు వాళ్ళు చేసిన సన్మానం ఆనందాన్ని కలిగించినా... పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవడం, వాళ్ళందరూ నన్ను మా నాగలక్ష్మి అని పిలవడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది.

      నాతో పుస్తకాలు చేయించుకున్న రచయితలు, రచయిత్రుల గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నాను. అంటే ఒక్కొక్కళ్ళ మానసికస్థితి, వాళ్ళపద్ధతులు అందరికీ తెలియచెయ్యాలనిపించింది.

      అయితే నేను ఇదే మేటర్ ని హైదరాబాదులో నా జీవనయానం నేను ఫేస్ బుక్ లో రాసినప్పుడు చాలామంది పుస్తకంగా తీసుకురమ్మని అడిగారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నాను. దాదాపు చాలా పెద్ద పుస్తకమే అవుతుంది.

      తొలగించండి