21, నవంబర్ 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 30 - మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు  30

మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు

మరియమ్మగారూ వాళ్ళు గులాబీ మొక్కలని పెంచేవారు. అవి చాలా పెద్ద పెద్ద పువ్వులు పూసేవి. అప్పుడప్పుడు ఆ పువ్వులు మాకు ఇస్తుండేవారు. అమ్మకి ఆ పువ్వులు పెట్టుకోవాలని వుండేది. నేనూ అమ్మా పెంచని మొక్కలేదు.  నాన్నగారు పోయిన కొత్త. ఆ బాధ ఒకవైపు. పెద్దక్క అమ్మతో అమ్మా... నీకు పెట్టుకోవాలని వుంటే పెట్టుకో... ఎవరిగురించో నీకెందుకు. ఇవన్నీ చిన్నప్పటి నుంచీ వచ్చినవి, చేసుకున్న వాళ్ళతో వచ్చినవి కాదు కదా... అంది. కానీ అమ్మ ఆ కోరికని తనలోనే అణిచేసుకుంది.   పల్లెటూరులో పుట్టింది. అందరి పెరళ్ళలో పువ్వుల మొక్కలు, తోటలు, పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగిన అమ్మ 34 సంవత్సరాలకే అన్నీ వదిలేసుకోవడం చాలా బాధ అనిపించింది.

మరియమ్మగారూ వాళ్ళు కోళ్ళని పెంచేవారు. నాలుగు కోళ్ళుండేవి. అవి లేత గులాబీ రంగులో అక్కడక్కడ గుడ్లు పెట్టేవి. మేము చూసి చెప్పేవాళ్ళం. ఆ కోళ్ళలో చుక్కల చుక్కల కోడి సన్నగా తిప్పుకుంటూ తిరిగేది. దానికి అక్కావాళ్ళు సైరాబాన్ అని పేరు పెట్టారు. చూడడానికి వింతగా వుండేది. అది మామూలు కోడే. నిప్పుకోడి కాదు. చిన్నగా ముద్దుగా వుండేది.  ఒకరోజు పొద్దున్న లేచేసరికి దాని దర్శనమవలేదు. మొత్తం పెరడంతా వెతికాం. ఒక మూల దాని ఈకలు కనిపించాయి. అవి క్రిస్ మస్ రోజులు. వాళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పాటలు పాడుతుండేవారు. అలా కలిసినప్పుడు మిఠాయిలు, పళ్ళు, వాళ్ళకి నచ్చినవి పంచిపెట్టుకునేవారు. ఈ కోడి కూడా అలాకలిసిపోయింది.

ఒకసారి మరియమ్మగారు, డా. లివింగ్ స్టన్ గారూ బాగా కొట్టుకున్నారు. మాకు చాలా భయం వేసింది. ఆవిడ సామాను సద్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆయన కూతురు, కొడుకులిద్దరూ వున్నారు. మళ్ళీ వారం రోజులకి పోయి ఆయనే ఆవిడని బతిమాలి తీసుకుని వచ్చాడు. వాళ్ళమ్మాయి మేరీ చాలా అందంగా వుండేది. తను మెడిసిన్ చెయ్యాలనుకుంది. ఒకసారి వాళ్ళ నాన్నతో నాన్నా నీకు ప్రాక్టీస్ నడుస్తోంది కానీ, మేము మెడిసిన్ చదివేనాటికి సంచులు బుజాన వేసుకుని తిరాగాలేమో... అనేది.  ఇది జరిగి దాదాపు 45 సంవత్సరాలు కావస్తోంది.

***

మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఇంకో ఘోరమైన సంఘటన – నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసినప్పటి నుంచీ రామకృష్ణ అని ప్యూన్ వుండేవాడు. అక్క చేస్తున్నప్పుడు కూడా అతను ఉన్నాడు. అతని కొడుకు మా 6వ చెల్లెలు గాయత్రిని స్కూలుకి తీసుకుని వెళ్ళేవాడు. గాయత్రికన్నా 1 సంవత్సరం పెద్దవాడు. అయితే రెండు రోజులుగా అతను రావడం మానేశాడు. ఎందుకో అర్థం కాలేదు.  

అక్క ఇంటికి వచ్చి రామకృష్ణ కొడుకు కనిపించట్లేదు. కొడుకోసం అంజనాలు వేయించి అడుగుతున్నాడు. వాళ్ళు తూర్పువైపు వున్నాడని చెప్పారుట అంది. మాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత రెండు రోజులకి తెలిసినది ఏమిటంటే... రామకృష్ణ ఆస్తికోసం వాళ్ళ బంధువులు పిల్లాడికి కాళ్ళూ చేతులూ కట్టేసి, అప్పట్లోకోరమాండల్ ఎక్స్ ప్రెస్ అని వచ్చేది దానికింద పడేశారుట. పైగా ఆ ఛిద్రమైన శరీరాన్ని రైల్వేట్రాక్ పక్కన పూడ్చిపెట్టారు. అదెలాగో బయటపడింది. మేము చాలా రోజులు మామూలుగా అవలేకపోయాం. ఇంత ఘోరంగా ఎలావుంటారా... అనిపించింది. మేము ఆ ఇంట్లో ఎక్కువరోజులు వుండలేదు.

*** 

అమ్మ డెలివరీకి ఎలూరు వెళ్ళింది కదా.... మేము పాపని చూసి వచ్చాం కదా... మేమున్న ఇల్లు అక్కడ ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు ఒకరోజు వచ్చి ఈ ఇల్లు మాకు కావాలి. మేమే వద్దామనుకుంటున్నాం అని చెప్పారు. ఇంక చేసేది ఏమీ లేదు.  మాకు ప్రతీ విషయానికి దిగులు పడే అలవాటు లేదు.

అనుకోకుండా మా నాన్నగారు వున్నప్పటి ఇల్లు దగ్గరే వేరే ఇల్లు దొరికింది. ఆ ఇల్లు గల ఆయన పేరు కలియుగార్జున్. ఆయనే ఆ పేరు పెట్టుకున్నాడు. బుధవారం బుధవారం మైక్ పెట్టి, భజనలు చేసేవారు. భజన అయ్యాక ప్రసాదం పంచిపెట్టేవారు. ఒక సంగీతం మేష్టారు హార్మొనీ వాయించేవారు. ఒక మద్దెల అతను మద్దెల వాయించేవాడు. గట్టిగా పాడేవారు. కృష్ణ భజనలు చేసేవారు. ఇక తప్పదు ఆ ఇల్లు అయితే అందరికీ అనుకూలంగా వుంటుంది.    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి