1, జులై 2022, శుక్రవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 28 *** మా వాళ్ళు చెయ్యలేరు – వేరే ఎక్కడికైనా వెళ్ళండి ***

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 28   *** మా వాళ్ళు చెయ్యలేరు –  వేరే ఎక్కడికైనా వెళ్ళండి ***


విజయపాల్ గారి కజిన్ సుధాకర్ రెడ్డి గారు పార్టనర్ గా ఆఫీసుకి వస్తున్నారు. ఆయన అప్పటి మహరాష్ట్ర గవర్నర్ కి అల్లుడు. చాలా మంచి వ్యక్తి. విజయపాల్ గారికి చాలా చేదోడువాదోడుగా వుండేవారు.

ఒకరోజు నేను ఆఫీసులో సీరియస్ గా వర్కు చేసుకుంటుంటే... ప్యూన్ వచ్చి "సుధాకర్ గారు రమ్మంటున్నారు" అన్నాడు. వాళ్ళరూంకి వెళ్ళేసరికి - అక్కడ ఒక కొత్త వ్యక్తి చాలా టెన్షన్ టెన్షన్ గా కూచుని ఉన్నాడు. విజయపాల్ గారు అతనితో “లాభం లేదండీ మావాళ్ళు చెయ్యరు. ముందే టేబుల్స్ వర్కు అంటే వీళ్ళకి భయం. అందులోనూ ఇదింకా కష్టంగా వుంది” అంటున్నారు. అతనేమో బతిమాలుతున్నాడు.

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే అదొక *** గవర్నమెంట్ ఎగ్జామ్*** కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. చాలా పేజీలు ఉన్నాయి. కాన్ఫిడెన్షియల్. దాన్ని బయట ఎక్కడా పొక్కకూడదు. మా ఆఫీసు ఫుల్ సెక్యూరిటీ అని ఎవరో చెప్పారుట. అది ఎలా ఉందంటే *** ప్రశ్న, తర్వాత a) b) c) d) ఆన్సర్లు, వాటికి కింద 4 బాక్సుల్లో a) b) c) d) లు రావాలి . *** అంటే ఆన్సర్ ఏది అయితే ఆ బాక్సు మీద టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి క్వశ్చన్ పేపర్ అందరూ చూసే వుంటారు. కానీ అప్పట్లో అది కష్టమైనపనే.




విజయపాల్ గారు అయితే చెయ్యలేమనే చెప్తున్నారు. సుధాకర్ గారు వెంటనే “నాగలక్ష్మీ మీరు చెయ్యగలుగుతారు తీసుకోండి” అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తలూపి తీసుకున్నాను. ఆ వచ్చిన వ్యక్తి కొంచెం టెన్షన్ తగ్గించుకుని రేపు ఒక వస్తాను అని వెళ్ళిపోయాడు. ఒక సెక్యూరిటీ గార్డుని కూడా పెట్టారు.

పైన క్వశ్చన్ చెయ్యడం ఈజీ, దానికింద a) b) c) d) లు పెట్టి ఆన్సర్ ఇవ్వడం ఈజీ. కానీ కింద నాలుగు బాక్సులకి ఒక కమాండ్ ఇవ్వాలి. ఒకోదాంట్లో a) b) c) d) లు కరక్ట్ గా కూచోవడానికి కమాండ్ (KC 02 ఇలా నెంబర్లు పెంచుకుంటూ) ఇచ్చుకుంటూ, సరిగ్గా వచ్చిందో లేదో తెలియదు కాబట్టి ప్రింట్ తీసి చూసుకుంటూ - నాలుగు క్వశ్చన్స్ చేసి పెట్టాను. మర్నాడు ఆ గవర్నమెంట్ వ్యక్తి ఆనందం అంతా ఇంతా కాదు.

ఇప్పుడయితే ఇలాంటివి కళ్ళుమూసుకుని పెట్టెయ్యచ్చు.

*** అప్పుడు ఒక పుస్తకం తయారు కావాలంటే ***

లక్ష్మణరావుగారు మేము ప్రింట్ ఇచ్చిన బ్రొమైడ్ పేపర్ ని కట్ పేస్ట్ చేసి ప్రింటింగ్ కి రెడీచేసేవారు. అప్పటి వరకూ ఆయన ఒక్కరే ఆ వర్కుకి వుండేవారు. తర్వాత మన ఎఫ్ బి మిత్రులు శివప్రసాద్ డాకోజు గారు వచ్చారు. మెల్ల మెల్లగా పని పెరుగుతోంది.

మేము పేజీలు పెద్ద పెద్ద చీరల్లా బ్రొమైడ్ పేపర్ మీద ప్రింట్ చేసి, డెవలప్ చేసి, ఆరపెట్టి ఇస్తే వాటిని వీళ్ళు తీసుకుని, *** కింద ఫోటోలో ఇచ్చినట్లు *** ప్రింటింగ్ కి వెళ్ళేముందు ప్లేట్ మేకింగ్ కి ***ఒక షీటులో 8 పేజీలు*** టేపుతో అతికించి రెడీ చేసేవారు. అలాగ 200 పేజీల పుస్తకం అయితే 25 ఇలాంటి షీట్లు తయారు చెయ్యాలి. వాటిల్లో ఏవైనా తప్పులుంటే మళ్ళీ వాటిని ఆ ప్లేస్ లోది కట్ చేసి ఇది అతుకుపెట్టేవారు. దీనికోసం కత్తెర్లు, బ్లేడులు, చాకులు, రబ్బర్లు, టేపు, గమ్ వంటి సరంజామా వుండేది. దీనిని ప్లేట్ మీదకి ట్రాన్స్ ఫర్ చేసి ప్రింట్ చేసేవారు. మేము చేసే బ్రోమైడ్ డెవలప్ మెంట్ అంతా సమానంగా రాకపోతే పుస్తకం ఒకచోట డార్క్ గా, ఒకచోట లైట్ గా వస్తుంది.

*** ఇప్పుడు ఒక పుస్తకం తయారు కావాలంటే ***

ఇప్పుడయితే కంప్యూటర్ లో మొత్తం మేటర్ ని పేజి సెటప్ చేసి రెడీ చేస్తే - కంప్యూటర్ ఐదు నిమిషాల్లో ప్లేట్ మేకింగ్ కి పేపర్లని సెట్ చేసేస్తుంది. *** మన పుస్తకం ప్రింట్ కాకముందే ఒక చిట్టి పుస్తకంలో పేజీలు ఎలా వస్తాయో చూపిస్తుంది. చాలా అద్భుతమైన టెక్నాలజీ. *** దాన్ని వాళ్ళు చాలా ఈజీగా ప్లేట్ మీదకి ట్రాన్స్ ఫర్ చేసి ప్రింటింగ్ కి పంపించేస్తారు. బైండింగ్ దగ్గర లేటవుతుంది కానీ, ప్రింటింగ్ చాలా తొందరగా అయిపోతుంది.

*** విషాద సంఘటనలు ***
నేను ఈ ఆఫీసులో చేరడానికి కారణమైన లక్ష్మణరావుగారి 21 సంవత్సరాల అబ్బాయి అనిల్ – సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే హిందూ పేపర్ వాళ్ళ వేన్ స్కూటర్ ని గుద్ది, అతను కిందపడితే చూసుకోకుండా ఒక కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళి, తర్వాత వాళ్ళే పోలీసు కంప్లైంట్ ఇవ్వండం, వీళ్ళకి మధ్యాహ్నానికి కానీ తెలియకపోవడం. మరచిపోలేని సంఘటన.

మళ్ళీ పది సంవత్సరాలకి ఆయన అదే స్కూటర్ తో అమీర్ పేటలో వాటర్ ట్యాంకర్ గుద్ది చనిపోవడం మనసుని అల్లకల్లోలం చేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి