8, ఏప్రిల్ 2023, శనివారం

*** అనుకోని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతే... ఊహకి కూడా అందని beginning అనే మాట ఎందుకొచ్చిందో చెప్పాల్సిందే ***

 

*** అనుకోని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతే...

ఊహకి కూడా అందని  beginning అనే మాట ఎందుకొచ్చిందో చెప్పాల్సిందే  ***


ఒకరోజు మరో సాహితీ మిత్రులు, నరిసెట్టి ఇన్నయ్యగారి కుటుంబ మిత్రులు  వెంకటరత్నంగారునేను సంజీవరెడ్డి నగర్ వస్తున్నాను. అక్కడ నా ఫ్రెండ్ వున్నారు. ఆయన పుస్తకాలు వున్నాయి. డిటిపి చేసి పెట్టాలి. మిమ్మల్ని పరిచయం చేస్తాను అన్నారు.

 

వెంకటరత్నంగారు వచ్చారు. ఆయన కారులో ధరమ్ కరమ్ రోడ్డులో ఉన్న వైశాలీ అపార్ట్ మెంట్స్ కి తీసుకెళ్ళారు.

 


వెెంకటరత్నం గారు, సదాశివరావుగారు

ఐదో ఫ్లోర్ కి వెళ్ళాం. తెల్లటి జుట్టుతో మీడియం హైట్ తో వున్న ఒక వ్యక్తి తలుపు తీశారు. ఆయన్ని చూస్తే వయసు ఇంత అని అంచనా వెయ్యలేం. ఆయన వెనకే తెల్లటి కుక్కపిల్ల వచ్చింది. అది నా చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. ఏం భయం లేదు. రామ్మాఅన్నారు.

 

కూచున్నాక నాకు, వెంకటరత్నంగారికి టీ తెచ్చి ఇచ్చారు. అప్పుడు నెమ్మదిగా వెంకటరత్నంగారు ఈయన పేరు సదాశివరావు. డిజిపి గా చేసి రిటైర్ అయ్యారు అని, సదాశివరావుగారూ అమ్మాయికి వర్కు చెప్పండిఅన్నారు.

 

సదాశివరావుగారు సరే నేను మేటర్ రెడీ అయ్యాక చెప్తాను. పరిచయం చేశావుగాఅన్నారు.

 

ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరూ బల్కంపేటలో మా ఇంటికి వచ్చారు. ఏదో అర్జంటు లెటర్ చేయించుకోవాలన్నారు. వెంకటరత్నంగారు ఇలాంటి లెటర్లు సదాశివరావుగారికి ఎలా చెయ్యాలో ఎక్కువ తెలియవు అంటూ పక్కన కూచుని చేయించుకుంటున్నారు. సదాశివరావు గారు మాత్రం మా ఇంట్లో కనిపించిన ఒక పుస్తకం చదువుకుంటూ కూచున్నారు. చెయ్యడం అయిపోయాక నేను ఇద్దరికీ అల్లం వేసిన టీ ఇచ్చాను. చాలా బావుందని థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారు.

 

ఒక వారం రోజుల తర్వాత పొద్దున్న 6 గంటలకి సదాశివరావు గారు వచ్చి మేము చెయ్యాల్సిన పేపర్లు ఒక నాలుగు ఇచ్చి, “వాకింగ్ చేస్తూ వచ్చానుఅని లోపలికి వచ్చి చెయ్యాల్సిన పనిని గురించి చెప్పారు. నేనూ వెంకటరత్నం వచ్చినప్పుడు ఇచ్చావు కదా... అలాంటి అల్లం టీ ఇయ్యి అన్నారు”. నేను ఇచ్చిన అల్లం టీ తాగి, “చాలా బావుందిఅని వెళ్ళిపోయారు.

సదాశివరావుగారితో అలా పరిచయం కొనసాగింది.

సదాశివరావుగారి పుస్తకాలు, వ్యాసాలు దాదాపు 7 సంవత్సరాలు చేశాం. దాదాపు 2000 పేజీలపైనే చేసుంటాం.

ఆయన 28.11.2020న ఫోన్ వాట్సాప్ కాల్ లో కొత్త వర్కు గురించి మాట్లాడి – “ఏంటమ్మా... రమ్మంటే రావు. వచ్చి డబ్బులు తీసికెళ్ళమని చెప్పాను కదా... ఇంకో వారం ఆగావంటే నీ డబ్బులు నీకు రావు. కరోనా తర్వాత కొత్త వర్కు మొదలు పెట్టాలి నువ్వు, సగం రాశానుఅన్నారు. మళ్ళీ వాట్సాప్ మెసేజ్ లో - *** “This is the beginning. Come to flat 408 ”*** అని పెట్టారు. beginning అనేది త్వరలోనే end అవుతుందని తెలియలేదు.  





Flat 408 అనేది ఆయన పుస్తకాలు చదువుకోవడానికి, పెయింటింగ్స్ వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది. బీరువాల నిండా పుస్తకాలే. వాళ్ళబ్బాయి కూడా ఇక్కడే వుండడంతో అతను ఒకరూంలో తన పని చేసుకుంటాడు. ఆయన ఫ్రెండ్స్ ని కూడా అక్కడే కలుస్తుంటారు. ఆయనకి తోడు కుక్కపిల్ల.


నేను రెండు నెలలుగా వస్తానని చెప్తున్నాను కానీ, కరోనా మూలంగా పెద్ద వాళ్ళ దగ్గిరకి ఎందుకని వెళ్ళలేదు. ఇంక ఆయన ఫోన్ చేసిన రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. సోఫాలో పడుకుని హాయిగా పుస్తకం చదువుకుంటున్నారు. కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చింది. నన్ను చూసి ఓ మాస్కు పెట్టుకుని వచ్చావా.... బాగానే ఫాలో అవుతున్నావుగా అన్నారు.


జేబులోంచి మడత పెట్టిన ఓ చెక్కు తీసి ఊ... ఏదీ లెక్క తెచ్చావా... ఎంతిమ్మంటావు... అంటూ నాకిప్పుడేం చెప్పద్దు. అంటూ రు.15,000/- చెక్కు రాసి ఇచ్చారు. ఆయన ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు. ‘’గీతాని రమ్మంటే రాలేదు. మాట్టాడదామనుకున్నాను. ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదవడానికి తెప్పించుకున్నాను. చాలా పని వుంది నువ్వు చెయ్యాల్సింది. నా పుస్తకాలన్నీ నువ్వే చెయ్యాలి. కానీ గుర్తు పెట్టుకో... నాకు మాత్రం ఎవరో ఒకళ్ళతో టైంకి పంపించుఅన్నారు. చెక్కు క్లియర్ అయిందా అని ఫోన్ చేస్తూనే వున్నారు. ఆయన నా పేరు డి. నాగలక్ష్మి అనికాకుండా... దామరాజు నాగలక్ష్మి అని రాశారు. రెగ్యులర్ గా వేసే బ్యాంక్ లో అది క్లియర్ అవలేదు. ఆంధ్రాబ్యాంక్ లో దామరాజు నాగలక్ష్మి అని ఉంది. క్లియర్ అయ్యింది. అది కూడా అవకపోతే చూద్దాం అనుకున్నాను. మళ్ళీ వెడదాం అనుకున్నాను.


(తరువాయి భాగం సోమవారం)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి