10, ఏప్రిల్ 2023, సోమవారం

***(మొన్నటి భాగం తరువాయి) ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారులు సదాశివరావుగారితో... ***

***(మొన్నటి భాగం తరువాయి)

 ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారులు సదాశివరావుగారితో... ***


Flat 408 అనేది ఆయన పుస్తకాలు చదువుకోవడానికి, పెయింటింగ్స్ వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది. బీరువాల నిండా పుస్తకాలే. వాళ్ళబ్బాయి కూడా ఇక్కడే వుండడంతో అతను ఒకరూంలో తన పని చేసుకుంటాడు. ఆయన ఫ్రెండ్స్ ని కూడా అక్కడే కలుస్తుంటారు. ఆయనకి తోడు కుక్కపిల్ల.


నేను రెండు నెలలుగా వస్తానని చెప్తున్నాను కానీ, కరోనా మూలంగా పెద్ద వాళ్ళ దగ్గిరకి ఎందుకని వెళ్ళలేదు. ఇంక ఆయన ఫోన్ చేసిన రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. సోఫాలో పడుకుని హాయిగా పుస్తకం చదువుకుంటున్నారు. కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చింది. నన్ను చూసి నవ్వుతూ ఓ మాస్కు పెట్టుకుని వచ్చావా.... బాగానే ఫాలో అవుతున్నావుగా అన్నారు. అప్పటికింకా కరోనా పూర్తిగా తగ్గలేదు. 


జేబులోంచి మడత పెట్టిన ఓ చెక్కు తీసి ఊ... ఏదీ లెక్క తెచ్చావా... ఎంతిమ్మంటావు... అంటూ నాకిప్పుడేం చెప్పద్దు. అంటూ రు.15,000/- చెక్కు రాసి ఇచ్చారు. ఆయన ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు. ‘’గీతాని రమ్మంటే రాలేదు. మాట్టాడదామనుకున్నాను. ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదవడానికి తెప్పించుకున్నాను. చాలా పని వుంది నువ్వు చెయ్యాల్సింది. నా పుస్తకాలన్నీ నువ్వే చెయ్యాలి. కానీ గుర్తు పెట్టుకో... నాకు మాత్రం ఎవరో ఒకళ్ళతో టైంకి పంపించుఅన్నారు. చెక్కు క్లియర్ అయిందా అని ఫోన్ చేస్తూనే వున్నారు. ఆయన నా పేరు డి. నాగలక్ష్మి అనికాకుండా... దామరాజు నాగలక్ష్మి అని రాశారు. రెగ్యులర్ గా వేసే బ్యాంక్ లో అది క్లియర్ అవలేదు. ఆంధ్రాబ్యాంక్ లో దామరాజు నాగలక్ష్మి అని ఉంది. క్లియర్ అయ్యింది. అది కూడా అవకపోతే చూద్దాం అనుకున్నాను. మళ్ళీ వెడదాం అనుకున్నాను.

 

 

తర్వాత డిసెంబరు 7వ తేదీన రాత్రి 9 గంటలకి వెంకటరత్నంగారు ఫోన్ చేసి – “నాగలక్ష్మీ సదాశివరావరావుగారు పోయారుటఅన్నారు.


నేను షాక్. వారం కిందట కలిసిన వ్యక్తి మరి లేడంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక కొత్త వ్యక్తి తనని కలవడానికి వస్తున్నాడని తెలిసి రోడ్డుమీదకి వెళ్ళి తీసుకువద్దామనుకుని, అతనితో కలిసి కొంతదూరం వచ్చి పేవ్ మెంట్ మీద అతని ఒళ్ళోనే కళ్ళుమూసారని తెలిసి చాలా బాధ కలిగింది. మర్నాడు ప్రపంచంతో సంబంధం లేదనట్టు గాజు పెట్టెలో కళ్ళుమూసుకుని పడుకున్న ఆయన్ని చూడడానికి వెళ్ళాను. కానీ 5 నిమిషాలకన్నా వుండలేక తిరిగి వచ్చేశాను.


***

***


ఒక్కసారి అర్థంకాని ఆయన చేతిరాతతో మేము చేసి పెట్టిన పుస్తకాలు వాటి వెనక జరిగిన విషయాలూ కళ్ళముందు ఒక రీలులా తిరిగాయి.


మొదట్లో కొన్ని వ్యాసాలు ఇచ్చారు. అసలు ఆ రాత చూస్తే భయం వేసింది. కాకపోతే ఒకేలా వుండేది.


ఆయన నోబెల్ బహుమతి విజేతల గురించి అనువాదం చేసి ఇచ్చేవారు. మధ్యలో ఇంగ్లీషు మాటలు కాపిటల్ లెటర్స్ లో రాసేవారు. కొన్ని కొటేషన్స్ కూడా వుండేవి. ఆయన చేతి రాత చాలా అస్సలు అర్థమయ్యేది కాదు. అది చాలా ఇబ్బందిగా వుండేది.


తెలుగు అక్షరాలు పక్షులు ఎగురుతున్నట్లు వుండేవి. ఆయనతో అలాగే అంటే హ్హ హ్హ హ్హా అని నవ్వి చెయ్యి నెప్పమ్మా... అనేవారు.అక్షరం తలకట్టులా వుండేది.అయితే ఒక చిన్న సున్నా తలకట్టు వుండేవి. ఇంకా ఇలాంటివి చాలా వుండేవి. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుని రాసేవాళ్ళం.


ఆయన ఇచ్చిన మేటర్ ని నేను, మా చెల్లెలు గీతా వెల్లంకి చేసేవాళ్ళం. అయితే గీతా ఆయన రాసిన ఇంగ్లీష్ కొటేషన్స్ నెట్ లో కొట్టి చూస్తే మొత్తం వచ్చేది. దాన్ని చూసి చేసేవాళ్ళం. అలా తప్పులు లేకుండా చెయ్యగలిగేవాళ్ళం. నోబెల్ బహుమతి గ్రహీతల వికీపీడియాలు చూసి ఆయన రాసిన వాటిని కొన్నిటిని అర్థం చేసుకునేవాళ్ళం. అయితే ఆయన అమెజాన్ నుంచి పెద్ద పుస్తకాలు తెప్పించుకుని వాటి నుంచీ మేటర్ తయారు చేసి ఇచ్చేవారు. ఇవి కాకుండా ఆయన సైన్స్ ఫిక్షన్ రచనలు కలిపి చాలా మేటర్ - ఎన్ని పేజీలు టైప్ చేశామేమో.... తెలియదు. లక్షరూపాయల పైనే ఆయన పని చేశాం. డబ్బుల విషయంలో లెక్క చెప్పమని ఇచ్చేసేవారు.


ఒకసారి ప్రింట్స్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. వాచ్ మెన్ ఎవరు కావాలమ్మా!అన్నాడు. సదాశివరావుగారని చెప్పి, “పేపర్లు ఆయనకి ఇచ్చేస్తావా?” అన్నాను.బాబోయ్ ఆయన దగ్గిరకా మేం పోము. నువ్వే పో అమ్మా... పోఅన్నాడు. నేనే వెళ్ళి పేపర్లు ఇచ్చేశాను.


మేము శ్రీనగర్ కాలనీ వచ్చేశాక. ఆయన పుస్తకాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రింట్స్ పంపించమని అప్పటికప్పుడు ఫోన్ చేసేవారు. కానీ నేను ఏదైనా అర్జంట్ పనిలో వుంటే వెళ్ళడానికి కుదిరేది కాదు. దానికి ఆయనకి చాలా కోపం వచ్చేది. అప్పట్లో స్విగ్గీలో పేపర్లు పంపే పద్ధతి వుండేది కాదు. మీరే ఎవరినైనా ఏర్పాటు చెయ్యండి అంటే ఎవరూ లేరు అనేవారు. కొన్నిసార్లు ఆయన రైటింగ్ అర్థం కాక తప్పులు వచ్చేవి. అవి మేము అండర్ లైన్ చేసేవాళ్ళం. వాటిని మళ్ళీ రాసి ఇచ్చేవారు.


 పేపర్లు ఆయన ఇంటికి పంపే విషయంలో మాత్రం మా అబ్బాయికి ఇచ్చి పంపమనేవారు. పిల్లలు వాళ్ళపనుల మీద వెళ్ళినప్పుడు ఇచ్చేవారు. చాలా చిరాకు పడిపోతూ నేను ఇంకెవరిచేతైనా చేయించుకుంటాను. మా ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుంటాను. ఒకబ్బాయి వచ్చి చేస్తాడుఅనేవారు. ఆ వాదన తెగేది కాదు. నేను సరే సర్ చేయించుకోండిఅనేదాన్ని. ఆయన చివరికి నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నేనంటే భయంలేదుఅనేవారు.


నెలలో కనీసం నాలుగైదుసార్లన్నా పొద్దున్న 6.30కి ఫోన్ చేసేవారు. అప్పుడప్పుడు ఫోన్ తియ్యడం లేటయితే ఏమ్మా ఇంకా లేవలేదా...? ఇవాళ చాలా పేపర్లు రాశాను. తీసుకెళ్ళు. అలాగే ఇప్పటి వరకూ చేసినవాటికి లెక్క చెప్పు. రాత్రంతా... నేను పుస్తకం చదవడం రాయడం, పుస్తకం చదవడం రాయడం తెలుసా... ఇవాళ వాకింగ్ కి వెళ్ళినప్పుడు మా టింకూ (కుక్కపిల్ల) ని చూసి పిల్లలు భయపడ్డారు అంటూ... పుస్తకాలలోంచి బయట ప్రపంచంలో విషయాలు చాలా మాట్లాడేవారు. ఆయన మాట్లాడేవాటిల్లో రకరకాల ఇంగ్లీషు పుస్తకాలు, తెలుగు రచనలు, పాటల గురించి, తన ఫ్రెండ్స్ గురించి వుంటూ వుండేవి.


గన్అని ఆయన అమెరికా ఫ్రెండ్ గురించి నాకు, చెల్లెలు గీతాకి చెప్పి, ఆయన, ఈయన కలిసి ఒక పుస్తకం రాస్తున్నామని చెప్పారు. ఆయన రాసిన లెటర్లు చూపించేవారు. శనివారం శలవు కాబట్టి గీతాని రమ్మని తను కొన్న పుస్తకాలు చూపించేవారు.


ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన లేకపోతే ఆవిడ కాసేపు కబుర్లు చెప్పి, వెనకవైపు పెద్ద పెద్ద సిమెంటు తొట్లలో పెంచిన పాలకూర, సిమెంటు తొట్లలోనే పెరిగిన నిమ్మ చెట్లకి కాసిన అతి పెద్ద నిమ్మకాయలు ఇచ్చేవారు. చెట్టు నిండా పసుపు రంగులో బలే వుండేవి.


వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ మూడు డబల్ బెడ్ రూములు కలిపినంత వుంటుంది. వెనకవైపు మొక్కలు కూడా చాలా వుండేవి. ఒకవైపు మూల - ***ఒక అందమైన అద్దాల గది వుంది. అక్కడ రచయితలని, సాహితీవేత్తలని పిలిచి సమావేశాలు జరుపుకునేవారు*** - అని ఆవిడ చెప్పారు. ఆవిడతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వుండేది. ఆయన ఒకోసారి ఆవిడకి పేపర్లు ఇచ్చేసి వెళ్ళినప్పుడే ఆవిడ మాట్లాడేవారు.


ఆయన దగ్గిర హిందీ, తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు ఎప్పెటెప్పటివో సినిమాల సిడిలు - పాటల సిడిలు ఇంటినిండా రాక్స్ లో వుంటాయి. ఆయన ఎవరైనా తనకి సంబంధించిన వాళ్ళు వస్తే కూచోపెట్టుకోవడానికి ఒక డ్రాయింగ్ రూం వుంది. బహుశ అక్కడికి పనివాళ్ళని ఎవరినీ రానిచ్చేవారు కాదనుకుంట కొంచెం దుమ్ము దుమ్ముగా వుండేది. అక్కడ సోఫాలో కూచుని ఆయన నాతో మాట్లాడుతుంటే వాళ్ళ కుక్కపిల్ల మధ్యలో నేల మీద కూచుని నావంక ఆయన వంకా చూస్తుండేది. దానికి ఏం అర్థమయ్యేదో తెలియదు. ఆయన పక్కకి వెళ్ళగానే నా దగ్గరికి వచ్చి ఒకసారి కాళ్ళతో నన్ను ఆనుకుని నిలబడి, మళ్ళీ ఆయన రాగానే కదలకుండా కూచునేది. దాని చేష్టలు తమాషాగా వుండేవి.


ఆయన రాసిన పుస్తకాలు పాలపిట్ట వెంకట్ గారు ప్రింట్ చేశారు. ఆయన నోట్లోంచి ఎప్పుడూ వెంకట్ అని వినిపిస్తూనే వుండేది.


సదాశివరావుగారు రచనలే కాకుండా.... మంచి మంచి పాటలు వింటూవుండేవారు. పెయింటింగ్స్ అంటే ఇష్టం. *** లిథోగ్రఫీ *** నేర్చుకున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప చిత్రకారుల దగ్గిర వాళ్ళ పెయింటింగ్స్ కొని ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సహాయపడ్డారు. ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఆయన నేర్చుకోని విషయంలేదు.


***

***


*** లిథోగ్రఫీ అనేది ఒక ప్రింటింగ్ విధానం - మొదట, లితోగ్రాఫిక్ రాయిపై (సాధారణంగా సున్నపురాయి) ఒక చిత్రం గీస్తారు లేదా చెక్కుతారు.






లితోగ్రఫీ

ఈ రాయిని నైట్రిక్ ఆమ్లం. అరబిక్ గమ్ అనే పలుచని పొరతో కప్పబడి ఉంటుంది. దీనిమీద డ్రా అయిన భాగాలు మాత్రమే కనిపిస్తాయి. గీసిన భాగాలకి సిరా పూస్తారు. ప్రతి రంగుకీ వేరే రాయి వాడతారు. దీనిమీద పేపరు పెట్టి ఒత్తిడి చెయ్యడం ద్వారా పేపరు మీద బొమ్మ వస్తుంది.


ఇంచుమించు ఇది ఇప్పటి స్క్రీన్ ప్రింటింగ్ లాగే వుంటుంది. ఇప్పుడు వచ్చిన ఆఫ్ సెట్ ప్రింటింగ్ వలన ఇది మరుగున పడిపోయింది.***

***

***


ఇన్ని తెలిసిన సదాశివరావుగారు ఒక్కసారి మాయమవడం చాలా ఆశ్చర్యాన్ని బాధని కలిగించింది. అప్పుడు నేను రాసిన కవిత


*** ఇంతేనేమో... ***

అంతా నిశ్శబ్దం

ఇల్లంతా నిశ్శబ్దం

సగం రాసిన కాయితాలు

ఇక నింపేదెవరో తెలియక రెపరెపలాడాయి

అరుపుల్లాంటి మాటలు అక్కడ లేవు

అడుగుల చప్పుడుకు గడగడలాడే సేవకులు

ధైర్యంగా నిలబడ్డారు

లాఠీలాంటి చేతి వూతపు కర్ర

విశ్రాంతిగా మూలకూచుంది

తొలి పొద్దునుంచీ మలిపొద్దు దాకా

అంటి పెట్టుకుని తిరిగే కుక్కపిల్లకి

తన మిత్రుడిని మృత్యువు కౌగిలిలోకి తీసుకుని

కదలనీయట్లేదని తెలియక

ఇల్లంతా కుయ్ కుయ్ మంటూ

కలయతిరుగుతోంది

ఏదో చెయ్యాలని, ఇంకా ఏవో సాధించాలనే

తాపత్రయాలు ఎటుపోయాయో ఆ మనిషికి

తనకేమీ పట్టనట్లున్న ఆ నిస్తేజపు శరీరం

కొద్ది గంటలలో బూడిద కాబోతోందని మాత్రం

అందరికీ తెలుసు

అశ్రునివాళిని అందించారు

రేపు మళ్ళీ వస్తుంది

కాలచక్రం తిరిగిపోతుంది

ఆనవాళ్ళు చెరిగిపోతాయి

(ఇవాళ సదాశివరావుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ శ్రీమతిని, అబ్బాయిని పలకరించి ఆ శరీరాన్ని చూడలేక 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేశాను)







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి