21, ఏప్రిల్ 2023, శుక్రవారం

ప్రముఖులతో మా కుటుంబం - 80

 ప్రముఖులతో మా కుటుంబం - 80 


సి. భాస్కర రావుగారు, వెనిగళ్ళ వెంకటరత్నం గారు, కె. సదాశివరావుగారు - నరిసెట్టి ఇన్నయ్యగారికి చిరకాల మిత్రులు.



*** (ఈ ప్రముఖులందరూ మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి వచ్చినప్పటి ఫోటో. ఎడమ నుంచి మొదటివారు భాస్కరరావుగారు, తర్వాత వెంకటరత్నంగారు, పక్కన ఎక్స్ ఎంపి (లేట్) లక్ష్మన్నగారు, చివరగా (లేట్) సదాశివరావుగారు.)***

భాస్కరరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదవీవిరమణ చేసిన తర్వాత సమయాన్ని వివిధ కార్యక్రమాలతో సద్వినియోగం చేసుకుంటున్నారు. నాకు ఇన్నయ్యగారితో పరిచయం అయిన తర్వాత కంప్యూటర్ కి సంబంధించిన ఏ సమస్య అయినా భాస్కరరావుగారిని అడిగితే చాలా ఓపికగా చెప్పేవారు. ఆ విషయంలో ఆయన చాలా విజ్ఞానవంతులు. నాతో అప్పుడప్పుడు కొన్ని వ్యాసాలు టైపు చేయించుకుంటారు.

భాస్కరరావుగారు సంజీవరెడ్డి నగర్ లో వున్నప్పుడు వాళ్ళింటికి తరచు వెడుతుండేదాన్ని. కూకట్ పల్లి బస్ స్టాప్ కి వెనక వున్న నందనవనం అపార్ట్ మెంట్ లో వారి స్వంత ఫ్లాట్ లో వుండేవారు. 2010లో etelugu.org లో ప్రముఖ వ్యక్తిగా వుంటూ... "మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పించడం ఎలా?"


https://deeptidhaara.blogspot.com/2010/12/1_17.html అనే విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎంతో మంది కంప్యూటర్ లో తెలుగు నేర్చుకునేలా చేశారు. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తూ వుండేవి. ఎంతోమంది జర్నలిస్టులకి కూడా ఇది బాగా ఉపయోగపడిందని తెలియజేశారు.

2015 అక్టోబరులో వేదిక సాహిత్యసమావేశం - తెలుగు కథల చర్చా కార్యక్రమం చేశారు. వికీపీడియాకి కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ ఉన్నారు. సంజీవదేవ్ వెబ్ సైట్, నరిసెట్టి ఇన్నయ్యగారి వెబ్ సైట్ ని, సంజీవదేవ్ pageని నిర్వహిస్తున్నారు. ***దీప్తిధార*** వీరి స్వంత బ్లాగ్. 2005 నుంచి నిర్వహిస్తున్నారు. సాహిత్య, సమీక్షలు, శాస్త్రీయ విషయాలు ఇలాంటి ఎన్నోకొత్త విషయాలు తెలుసుకోగలిగిన సమాహారం ఈ బ్లాగ్. చాలా విషయాల పరిశోధనకి ఇది ఉపయోగపడేవిధంగా వుంది.

ప్రతినెల బ్లాగర్ల సమావేశాలు నిర్వహించేవారు.


ఒకసారి
*** ప్రొఫెసర్.జయధీర్ తిరుమలరావు Ph.D. వీరు A.P.Govt Oriental Manuscripts Library & Research Institute లో director గా పనిచేస్తున్నారు.ఇక్కడ ఎన్నో తాళపత్ర గ్రంధాలు, రాగిరేకులపై గల పుస్తకాలను digitalize చేస్తున్నారు. తాటాకులపై గల తిక్కన భారతం లోని భీష్మ పర్వం,పోతన భాగవతము, ఛత్రపతి శివాజి ఫర్మానా వగైరాలు వీరివద్ద ఉన్న కొన్ని ఆకర్షణీయ సంగ్రహాలు. ఇంకా అరబిక్, పారశీక భాషల్లో గల గ్రంధాలు కూడా ఉన్నాయి. ఈ digitization కు ఇరాన్ ప్రభుత్వము వారు సహాయమందిస్తున్నారు. *** https://deeptidhaara.blogspot.com/2007/04/e-april-2007.html
జయధీర్ (భాస్కరరావుగారి పక్కన ఫోటోలో)గారిని గురించి తెలుసుకోవాలంటే పై లింకులో చూడచ్చు.


భాస్కరరావుగారు ***పక్షుల ప్రియులు***. రకరకాల పక్షుల గురించి తెలుసుకోవడానికి అన్వేషణ చేస్తుంటారు. దీనికోసం ఆయన స్నేహితులతో కలసి వివిధ ప్రదేశాల్లో ఉన్న అడవులు, కొండలు, అడవులు ఉన్న ప్రదేశాలలో పర్యటిస్తుంటారు. దీనికి సంబంధించిన రకరకాల పుస్తకాల సేకరణ కూడా చేస్తుంటారు.

వారి శ్రీమతి రమణగారు చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ ఇంటి ముందు ఉన్న ఖాళీస్థలంలో రకరకాల పువ్వుల, కూరగాయల మొక్కలు పెంచేవారు. మొక్కలంటే ఇష్టమైన నాకు అదో కాలక్షేపంగా వుండేది. ఆవిడ మంచి స్నేహశీలి. వాళ్ళు దూరం వెళ్ళిపోయాక చాలాసార్లు రమ్మన్నారు కానీ, నాకు వెళ్ళడానికి కుదరలేదు.

***
***

వెనిగళ్ళ వెంకటరత్నంగారు ఇన్నయ్యగారి పుస్తకాలు కొన్ని చేయించేటప్పుడు నా దగ్గిరకి వచ్చేవారు. ఆయనతో అలా పరిచయం. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. వెంకటరత్నం గారు *** కోరమాండల్ ఫెర్టిలైజర్స్, సికిందరాబాద్ లో అడ్మినిస్ట్రేషన్ లో డెప్యూటీ మేనేజర్*** గా పనిచేసి, పదవీవిరమణ చేశారు.

వీరిని పాత్రికేయులు కూడా. చాలామందికి అలాగే తెలుసు. వీరు చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, ఈనాడు దినపత్రికలకి వ్యాసాలు రాశారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ వ్యాసాలు రాస్తుంటారు. వెంకటరత్నం గారు రచించిన ‘ఆంధ్రాపారిస్’ తెనాలి చరిత్ర ఎంతోమంది మన్ననలు పొందింది. ఎంతోమంది ప్రముఖులని ప్రపంచానికి అందించిన తెనాలిని గురించి తెలుసుకోవాలంటే ఇద చదవాల్సిందే.


*** నార్మన్ ఇ బోర్లాగ్ అధిక దిగుబడి వరివంగడాన్ని సృష్టించి వుండకపోతే ప్రపంచంలో చాలా దేశాలు ఆకలితో అలమటించేవి. ఆయన చేసిన ఈ విశేష కృషికి 1970లో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి మన దేశానికి దాదాపు 20సార్లు వచ్చివుంటారు. 1983 నవంబరులో భారతీయ విద్యాలయం ఆహ్వానం మీద వచ్చిన నార్మన్ ఇ బోర్లాగ్ ను వెనిగళ్ళ వెంకటరత్నం గారు ఇంటర్వ్వూచేశారు. ఇలాంటి ఇంటర్వ్వూ ఇప్పటి వరకూ ఎవరూ చెయ్యలేదని తెలుస్తోంది. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారు బోర్లాగ్ గౌరవార్థం ఒక బంగారు పతకాన్ని, పదివేలరూపాయల నగదును ఢిల్లీలో జరిగే ‘కోరమాండల్ లెక్చర్’ నాడు బహూకరించారు. ***

కొంతమంది రచయితలని కలవడానికి, సమావేశాలకి వెంకటరత్నంగారు మేమూ కలిసి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళినవాళ్ళలో కథా రచయిత, నవలా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు ఒకరు. ఒకరోజు ఉదయం పదిగంటలకి కోడూరు పుల్లారెడ్డిగారు, వెనిగళ్ళ వెంకటరత్నం గారు, మావారు జానకిరాం గారు, నేను కలవడానికివెళ్ళాం.

******
******

****** ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు (Appellate Collector of Customs and Central Excise, Madras – ఆయన రచనలు ఆకులు రాలే కాలం, చేదు కూడా ఒక రుచే, వానజల్లు, ఎదురద్దాలు). 86 సంవత్సరాల జగన్నాథరావుగారు నరిసెట్టి ఇన్నయ్యగారికి చిరకాల మిత్రులు, సన్నిహితులు. జగన్నాథరావుగారి మాటలలో ఆప్యాయత, కొత్తవారిని కలిశాననే ఆనందం చూస్తుంటే చాలా సంతోషమనిపించింది.


ఎడమ నుంచి మొదటి వ్యక్తి ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు, రెండవవారు కోడూరు పుల్లారెడ్డి గారు, మూడు వెనిగళ్ళ వెంకటరత్నం గారు
ఆయన ఒక యువకుడిలాగా ఆయన జీవిత వివరాలు ఉత్సాహంగా మాట్లాడారు. మళ్ళీ ఇంకొకసారి ఒక చక్కని సాహితీ సమావేశం పెట్టుకుందామన్నారు. అందరం కలిసి ఎక్కడైనా హోటల్లో భోజనం చేద్దాం అన్నారు. ఆయనని కలిసి రావడం మాకు ఒక చక్కని జ్ఞాపకం అనుకుంటుండగానే.... 2017 డిసెంబరు 15 తేదీన ఆయన చాలా సునాయాసంగా నిద్రలోనే కనుమూశారు. ******


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి