24, ఏప్రిల్ 2023, సోమవారం

***గాంధీ గారిని కలిసిన ప్రముఖ వ్యక్తి రావూరి అర్జునరావుగారు - 81*** 103 సంవత్సరాల ఆ పెద్దమనిషిని కలవడం ఆనందంగా అనిపించింది

***గాంధీ గారిని కలిసిన ప్రముఖ వ్యక్తి రావూరి అర్జునరావుగారు  - 81***

103 సంవత్సరాల ఆ పెద్దమనిషిని కలవడం ఆనందంగా అనిపించింది



*** గాంధీజీ తో కొంతకాలం గడిపి, గాంధీజీ ఆశయాలే జీవితధ్యేయం అనుకున్న శ్రీ రావూరి అర్జునరావు (103 సంవత్సరాలు), వారి సతీమణి మనోరమగారు (93 సంవత్సరాలు). ఈరోజు వారిని కలవడం ముఖ్యవిశేషం. ***

రావూరి అర్జున రావుగారు నరిసెట్టి ఇన్నయ్యగారి ఆప్తమిత్రులు. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుంటూ వుండేవారు. ఇప్పటికీ ఇన్నయ్యగారిని మర్చిపోలేదు. అన్ని విషయాలు చెప్పారు.

ఒకరోజు ఇన్నయ్యగారు ఫోన్ చేసి అర్జున్ రావుగారు, మనోరమ హైదరాబాదు వచ్చారట వెళ్ళి కలవమని చెప్పారు. అలాగే సాక్షి సిఇఓ గా చేసిన ప్రముఖ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తిగారికి కూడా చెప్పారు. ఈ రోజు రామచంద్రమూర్తిగారు మా ఇంటికి వచ్చారు. మేము అర్జున్ రావుగారి ఆఖరి అబ్బారి పవర్ (రేడియోలజిస్ట్) ఇంటికి వెళ్ళాం. రామచంద్రమూర్తిగారు కెమెరా మెన్ ని తీసుకువచ్చి, ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు.

నరిసెట్టి ఇన్నయ్యగారు, అర్జున్ రావుగారు విజయవాడలో కలిసినప్పుడు

మనోరమ అర్జున్ రావు దంపతులతో వారి కుమారుడు పవర్, నేను, రామచంద్రమూర్తిగారు


సేవాగ్రామ్ లో వారి వివాహం జరిగిన సందర్భం. 
మనోరమ, అర్జున్ రావుగార్ల మధ్య ప్రధానమంత్రి, నెహ్రూ, కుడిచేతి వైపు చివర ప్రభాకర్ జీ

అర్జున్ రావుగారి కొడుకు, కోడలు, మనవరాలితో మేము
ఎడమ నుంచి మొదటగా కూర్చున్నవారు వారి రెండవ కుమారుడు, మనవరాళ్ళు
*****

మనోరమగారు 93 సంవత్సరాల వయసులో కూడా చాలా హుషారుగా వున్నారు. స్పష్టంగా మాట్లాడుతున్నారు. అర్జున్ రావుగారు కరోనా వచ్చి తగ్గడం వల్ల కొంత నీరసపడ్డారు. ఇద్దరూ బాగా మాట్లాడారు.

వీరిద్దరి గురించి తెలుసుకోవాలంటే చాలా చరిత్రే వుంది. ఇక్కడ నేను సంక్షిప్తంగా తెలియచేస్తున్నాను.

అర్జున్ రావుగారు ప్రముఖహేతువాది గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి అల్లుడు. గోరాగారి కుమార్తె మనోరమగారిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గాంధీజీ సమ్మతి మీద జరిగిన తీరు, అర్జున్ రావుగారు గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళిన వైనం మాతో పంచుకున్నారు.

ఎడమవైపు అర్జునరావుగారు, పక్కన గోరాగారు
సదాచారసంపన్నులైన బ్రాహ్మణ కుటుంబంలో నాస్తికుడుగా మారి బయటికి తరిమివేయబడిన నాస్తికుడు గోపరాజు రామచంద్రరావు (ఎమ్మెస్సీ బోటనీ). వీరి సతీమణి సరస్వతి. వీరి 9మంది సంతానంలో కుమార్తె ***మనోరమ***. గోరాగారు గాంధీ గారి ఆశ్రమానికి తరచు వెడుతుండేవారు. గాంధీజీ ఆస్తికులు, గోరా గారు నాస్తికులు అయినప్పటికీ – గాంధీగారు అవి మనకి అడ్డుకాదు. మన కర్తవ్యనిర్వహణ దేశానికి స్వాతంత్ర్యం రావడం అని చెప్పారట. గాంధీజీతో గోరా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు.

ఆంధ్రప్రదేశ్ ముదునూరులో గోరా, సరస్వతీ గోరా నడిపిన వయోజన పాఠశాలలో ***అర్జున్ రావు***గారు కార్యకర్తగా చేరి నిస్వార్థ సేవలో వారి మన్ననలు పొందారు. గోరా గాంధీగారిని కలిసినప్పుడు తన కుమార్తె మనోరమకి అర్జున్ రావుని ఇచ్చి పెళ్ళిచేద్దామనుకుంటున్నానని గాంధీగారికి చెప్పారట.

గాంధీగారు గోరా గారికి - నేను 1945 సంవత్సరం డిసెంబరు చివరలో మద్రాసు వస్తున్నాను. అప్పుడు మనోరమ, అర్జున్ రావులని తీసుకురమ్మని చెప్పారట. గోరాగారు డిసెంబరులో వీరిద్దరినీ తీసుకుని మద్రాసు వెళ్ళారు. అక్కడ గాంధీగారు ప్రముఖ న్యాయవాది బులుసు సాంబమూర్తిగారిని మనోరమకి ఈ వివాహం ఇష్టమా కాదా అడగమన్నారు. మనోరమ అంగీకారం చెప్పారు. గోరా అప్పుడే వివాహం చేద్దామని గాంధీగారితో అంటే -

గాంధీగారు - “***కులాంతర వివాహం అనేది సాంఘిక మార్పుతో కూడినదని***, మనోరమని బొబ్బిలిలో కస్తూరిబా గాంధీ శిక్షణా కార్యక్రమంలో ఉండమనీ - అర్జున్ రావుని తనతోబాటు 1946 ఫిబ్రవరి 5న గాంధీజీ ప్రయాణించే ప్రత్యేక రైలులో వార్దా దగ్గరలో ఉన్న సేవాగ్రాం కి తీసుకుని వెళ్ళారు. ఇద్దరి ఆలోచనలలో ఎటువంటి మార్పూ రాకపోతే రెండు సంవత్సరాల తర్వాత తనే వారి వివాహం చేస్తానని, వారు తన పిల్లల”ని గాంధీగారు చెప్పారట.

ఆశ్రమంలో చేరిన మూడవ రోజున గాంధీజీని కలవమని ప్రభాకర్ జీ (గాంధీగారికి ప్రియమైన వ్యక్తి) ద్వారా పిలుపు వచ్చింది. గాంధీజీని కలిశారు అర్జున్ రావుగారు. వెంటనే కలవనందుకు గాంధీజీ అర్జున్ రావు గారి బుజాన్ని తట్టి నవ్వుతూ - ‘’చోర్ లడకా’’ అని - ఆశ్రమంలో అందరితో కలిసి పనిచెయ్యమని, హిందీ నేర్చుకోమని చెప్పారు. అర్జున్ రావు హిందీ సరిగా రాకపోవడంతో మూడుసార్లు గాంధీగారితో మాట్లాడారట. హిందీ నేర్చుకుని ఆయనకి ఉత్తరాలు రాసేవారట.

సేవాగ్రాంలో రోడ్లు తుడవడం, తిరగలి తిప్పడం, పరిసరాల పరిశుభ్రత, పత్తి వడకడం, 80 సంవత్సరాల వయస్సులో బౌద్ధమతస్తుడైన కోసంబి మరణించేవరకు గాంధీగారి ఆశ్రమంలోనే వుంటానంటే అర్జునరావుగారు ఆయనకి సేవలు చేశారు. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఉదయం 5 గం. లకి జరిగే ప్రార్థనకి వెళ్ళకుండా సాయంత్రం జరిగే ప్రార్థనలో అందరినీ పరిశీలించడానికి వెళ్ళేవారట.

*** గోరాగారు పిల్లలందరినీ తీసుకుని ఒకసారి సేవాగ్రాంకి వెళ్ళారట. మనోరమగారు అది మొదటిసారి గాంధీగారిని చూడడం. మనోరమ బొబ్బిలిలో కస్తూరిబా గాంధీ శిక్షణా కార్యక్రమానికి వెళ్ళిపోయింది.***

1946లో గాంధీగారి దగ్గరికి వెళ్ళిన అర్జునరావు నడత నచ్చిన గాంధీజీ వారి వివాహం తన ఆశ్రమంలోనే చేస్తానన్నారట. ***1948***లో గాంధీగారి చేతుల మీదుగా వీరి వివాహం జరగవలసి వుంది. కానీ ***30 జనవరి 1948***లో గాంధీగారి హత్య జరగడం వలన వీరి వివాహం అనుకున్నట్లు జరగలేదు.

***1948 మార్చి 13వ*** తేదీన ఉదయం 8 గంటలకి మహాత్ముని అభీష్టం నెరవేర్చాలని భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో థక్కర్ బాబా, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య వినోబాభావే, ప్రభాకర్ జీల సమక్షంలో అర్జున్ రావు, మనోరమల వివాహం జరిగింది. గాంధీగారు వీరి వివాహానికి తయారు చేసిన నూలుదండలు మార్చుకున్నారు. వచ్చిన వారందరికీ తెలుగువారైన కమలగారు బెల్లం, వేరుశనగపప్పు కలిపి అందరికీ ఇచ్చారు. ఈ వివాహం గురించి జాతీయ పత్రికలు ప్రముఖంగా ముద్రించాయి. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ***మార్చి 18***వ తేదీన విజయవాడ నాస్తిక కేంద్రానికి వచ్చేశారు.

గాంధీగారి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి అదే మాట మీద వుండి ఈరోజు వరకూ ఆయన ఖద్దరు వస్త్రాలనే ధరిస్తున్నారు. ఎంతమంది అడిగినా రాజకీయాలకి దూరంగా వున్నారు.

మనోరమ గారు గుడివాడలో ఎమ్.ఎల్.ఎ. వేమూరి కూర్మయ్యగారి సహాయంతో ఏర్పాటుచేసిన బాలికల హాస్టల్ కి మేనేజర్ గా వుండి సుమారు 100 మంది బాలికలకి జీవితంలో నేర్చుకోవలసిన అనేకవిషయాలు నేర్పించారు.

వీరిద్దరూ ఇప్పటివరకూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని, ఎందరికో చెయ్యగలిగినంత సేవ చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు. అర్జున్ రావుగారు పుట్టిన వానపాముల అనే వూరులో మార్పు అనే సేవాసంస్థని స్థాపించి, వాళ్ళ పిల్లలందరూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సైన్సు, విద్య, శాస్త్రీయదృష్టి, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వంతో నిరంతరం ముందుకు సాగాలని యువతకి తెలియజేస్తున్నారు.

వీరికి 5గురు పిల్లలు – మిలావ్, చునావ్, సాదిక్, సూయజ్, పవర్ – వీరందరూ తల్లితండ్రుల్సి అపురూపంగా చూసుకుంటున్నారు. వీరి తరం వచ్చేసరికి నాస్తికత్వం, హేతువాదం కొంత సడలిందని వారి చివరి అబ్బాయి పవర్ చెప్పారు.

ఏది ఏమైనా అర్జున్ రావుగారు, మనోరమ గారు పిల్లల ఆలనలో సుఖంగా వున్నారు. వీరి చరిత్ర చెప్పాలంటే ఇప్పటితో అయ్యేది కాదు.

అర్జున రావుగారు వారి 104 సంవత్సరాల వయసులో ప్రపంచానికి దూరమయ్యారు.



మనోరమ, అర్జునరావుగారు, నేను, మావారు





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి