1, మే 2023, సోమవారం

86 సంవత్సరాల చురుకైన మనిషి, మహాజ్ఞాని, సోషలిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు రావెల సోమయ్యగారు - 82

*** 86 సంవత్సరాల చురుకైన మనిషి, మహాజ్ఞాని, సోషలిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు రావెల సోమయ్యగారు - 82***



పుస్తకాలు చదవడమంటే ఇష్టం.
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
ఎన్నో విషయాలు అనర్గళంగా మాట్లాడగలరు.

***

చంద్రమౌళిగారు “నాగలక్ష్మిగారూ... సోమయ్యగారికి ఈ వ్యాసం మెయిల్ చెయ్యండి. ఆయనకి నేను పంపే వ్యాసాలు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు ఎవరో ఒకరికి ఇచ్చి పంపిస్తుంటాను” అని చెప్తుండేవారు. వారిద్దరూ మంచి మిత్రులని తెలుసు. అలా అప్పుడప్పుడూ సోమయ్యగారి పేరు వింటూండేవాళ్ళం. ఆయన ఫోన్ నెంబరు, ఇ-మెయిల్ అడ్రస్ ఫస్ట్ చంద్రమౌళిగారే ఇచ్చారు.

ఇన్నయ్యగారికి చిరకాల మిత్రులవడంతో సోమయ్యగారితో మరికొంత పరిచయం పెరిగింది.

***

సోమయ్యగారు ఫోను చేసినప్పుడు చాలా ఆప్యాయంగా “అమ్మాయ్...” అంటూ మాట్లాడతారు. ఫోనులో అప్పుడప్పుడు చిన్నప్పటి విషయాలు, ఆయన చేసి కార్యక్రమాలు చెప్తుంటారు.

ఈ మధ్య నేను రాస్తున్న ‘హైదరాబాదులో నా జీవనయానం’ చదివి నాకు ఫోన్ చేసి దాని గురించి చర్చిస్తూ... నవ్వుతూ “ఎలా గుర్తుపెట్టుకుని రాస్తున్నావమ్మాయ్. ఇంకా ఎన్నున్నాయి ” అని అడుగుతుంటారు. ఆయన అభిప్రాయం వింటుంటే చాలా ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆయనతో మాట్లాడడం చాలా బాగా అనిపిస్తుంది.

***

బహుశ 2015 జూలై నెలలో ఒకరోజు ఫోన్ చేసి – “అమ్మాయ్ ఇన్నయ్యగారు కోమలగారి ఆటోబయోగ్రఫీ మీ దగ్గర తీసుకోమన్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా... ఎండలు బాగా వుంటున్నాయి. నేనూ తిరగలేకపోతున్నాను” అన్నారు. “మేము వచ్చి ఇస్తాం సర్” అంటే... నేనే కారులో వస్తానని, అడ్రస్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. కాఫీ తాగి, పుస్తకం తీసుకుని వెళ్ళిపోయారు. అలా సోమయ్యగారితో వ్యక్తిగతపరిచయం అయ్యింది.

సోమయ్యగారి యువమిత్రుడు గౌరవ్ కృష్ణ , సోమయ్యగారు మొదటిసారి ‘చంపారన్ సత్యాగ్రహం (గాంధీజీ చేసిన సత్యాగ్రహం)’ పుస్తకం చేయించుకోవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ పుస్తకం అప్పటికే చేసింది కాబట్టి, తప్పొప్పులు చూసి, మళ్ళీ కొత్తగా చేర్చిన వ్యాసాలతో చేసి ఇచ్చాను. అప్పటి నుంచి సోమయ్యగారు ఏవో ఒక వ్యాసాలు చేయిస్తూ వుంటారు. రామమనోహర్ లోహియా వ్యాసాలు కూడా చేశాం. లోహియా విజ్ఞాన సమితి, లోహియా సమతా ట్రస్ట్‌ సంస్థలకు ప్రతినిధిగా వుంటున్నారు. సోమయ్యగారి అబ్బాయి మనోహర్ లోహియా వెబ్ సైట్ పెట్టి దానిద్వారా ఎంతో సమాచారాన్ని అందిస్తున్నారు.

1955లో లోహియా గుంటూరు వచ్చినప్పుడు కలిశానని సోమయ్యగారు చెప్పారు. ఎమ్.ఎన్.రాయ్ ని గురించి ఎన్నో విషయాలు చెప్పారు.

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ..... స్నేహితులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ... వారికి తెలిసిన సమాచారాన్ని ఫేస్ బుక్, వాట్సాప్ లద్వారా అందిస్తుంటారు. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈమధ్య ‘విశ్వమానవరాగం లోహియా మానసగానం’ – రావెల సాంబశివరావుగారు అనువదించిన లోహియా పుస్తకం మా చేత చేయించారు. ఏ పుస్తకం చేసినా కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. లోహియా గురించి చాలా తెలుసుకున్నాము. ఈ పుస్తకం చేసినప్పుడు కొన్ని చోట్ల “ఇలా వుంటే బావుంటుందేమో సర్ అంటే... నేను చెప్పిన దాన్ని విని బావుంటే అలాగే పెట్టమ్మా...” స్వేచ్ఛనిచ్చారు సాంబశివరావుగారు. ఆయనతో చాలాసార్లు ఫోన్ లోనే మాట్లాడాను.

అరుణగారితో కూడా చాలా సంవత్సరాల నుంచీ పరిచయం వుంది. అయితే సోమయ్యగారి శ్రీమతి అని మాత్రం తెలియదు. అరుణగారు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ తెలుగు అకాడమీలో చేసినప్పటి నుంచీ తెలుసు. ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసేపు పాత విషయాలు మాట్లాడుకున్నాం.
సోమయ్యగారి నుంచీ తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.

2 కామెంట్‌లు:

  1. మీరు చేస్తున్న పని పలువురు ప్రముఖులతో పరిచయాలకు అవకాశం కలిగించినట్లుంది. వెరీ గుడ్.

    రావెల సాంబశివరావు గారు రావెల సోమయ్య గారి బంధువా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సర్. రావెల సోమయ్యగారి సహోదరులు రావెల సాంబశివరావుగారు. సొంత అన్నదమ్ములు.

      తొలగించండి