జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ
వూళ్ళు – 17 - గోదావరి, సముద్రాల కలయిక అంతర్వేది – ఒక అద్భుతమైన ప్రయాణం
ఆత్రేయపురం నుంచి
అంతర్వేదికి బయల్దేరాం. మేము అక్కడికి చేరేసరికి ఇంచుమించు నరసింహస్వామి గుడి
మూసేసే టైమయిపోయింది. హడావుడిగా దర్శనం చేసుకున్నాం. బయటికి వచ్చేసరికి ఇక్కడ
భోజనం చేసి వెళ్ళాలి అని టోకెన్లు ఇచ్చారు. చాలా బావుంటుందని కూడా చెప్పారు. సరే
అని చూద్దుము కదా అనుకుంటే ఎప్పుడూ ఈపాటికి పెట్టేస్తారు. కానీ ఇంకా గంట
లేటవుతుంది అన్నారు.
సరే భోజనం కోసం కూచుంటే
కష్టమని, బయట ఒక పూటకూళ్ళ ఇల్లులాంటి
హోటల్ కి వెళ్ళాం. అక్కడ భోజనం ఫర్వాలేదు, అంత గొప్పగా లేదు. అక్కడ నుంచి గోదావరి
ఒడ్డుకు వెళ్ళాము. అక్కడ ఒక పడవ వాడు అమ్మా ఇక్కడ సముద్రం, నది కలుస్తాయి. ఇంకా
లోపలికి వెడితే ఒక దీవిలాగా వుంటుంది. చుట్టూ సముద్రం చాలా బావుంటుంది.
తీసుకువెడతాను అన్నాడు. సరే అంటే సరే అనుకున్నాం.
మా వారికి నీళ్ళమీద ప్రయాణం
భయం. నేను రానుగాక రాను అన్నారు. కానీ అప్పట్లో ఫోన్లు ఇప్పుడున్నంత లేవు. మేము
తిరిగి వచ్చేవరకు ఆయన ఒక్కరినీ వదిలి వెళ్ళడానికి భయం వేసింది. మొత్తానికి మాతో
వచ్చిన కారు డ్రైవరు, పిల్లలు నచ్చచెపితే మొత్తానికి పడవ ఎక్కారు. ఎర్రటి గోదావరి
నీళ్ళు, నల్లటి సముద్రం నీళ్ళు కలుస్తూ ఒకచోట పెద్ద చారలా కనిపిస్తోంది. విచిత్రంగా అనిపించింది. రెండు నీళ్ళు ఢీ
కొంటున్నాయి కానీ, కలవట్లేదు.
అక్కడ నుంచి పడవ లోపలికి
వెడుతోంది. పడవలో పడవవాడు ఒక పది బీరుబాటిల్స్ పెట్టుకుని తెస్తున్నాడు. ఎవరికి
అంటే అక్కడ ఎవరో ఆర్డరు ఇచ్చాడని చెప్పాడు. ఓహో ఇలాంటివి కూడా వుంటాయా
అనుకున్నాము. మొత్తానికి ఆ చిన్న దీవికి చేరాం. చుట్టూరా నీళ్ళు మధ్యలో ఇసుకనేల.
చాలా బావుంది. సముద్రం ఎక్కువ లోతు లేదు. మా
అబ్బాయి, వాడి ఫ్రెండ్ శ్యాం నీళ్ళలో పడి బాగా ఆడారు.
అక్కడక్కడ చిన్న చిన్న
బొరియల్లోంచి పీతల్లాంటి చిన్న చిన్న పురుగులు బయటికి లోపలికి తిరుగుతున్నాయి. ఇంక అక్కడ మాకు ఎటువంటి ఇబ్బందీ అవలేదు. ఇంక
చీకటి పడుతోందనగానే పడవవాడు వచ్చేశాడు. పడవలో తిరుగు ప్రయాణం అయ్యాం. నీళ్ళలో
ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి