11, సెప్టెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 28 - కుటుంబ పెద్ద అయిన పెద్దక్క అన్నపూర్ణ

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 28 - 20 సంవత్సరాలకే కుటుంబ పెద్ద అయిన పెద్దక్క అన్నపూర్ణ


ఎడమ నుంచి 1 ఆరో అమ్మాయి గాయత్రి, 2 మూడో అమ్మాయి ఉమాదేవి, 3 పెద్దక్క అన్నపూర్ణ, అక్క ముందర నుంచున్నది గీతాభవాని 7వ అమ్మాయి

కుడి నుండి 1 ఐదో అమ్మాయి ప్రభావతి, 2 నేను - నాగలక్ష్మి, 3 రెండో అమ్మాయి రమాసుందరి
మధ్యలో అమ్మ

నాన్నగారు పోయేసరికి 7వ చెల్లెలు అమ్మ కడుపులో వుంది. అమ్మకి 7వ నెల. అప్పటి వరకూ అమ్మ ఏది అడిగినా నోట్లోంచి మాట రావడం తరువాయి తీసుకుని వచ్చేవారు. మా ఎవ్వరికీ ఏదీ కొనుక్కోవడం అలవాటు లేదు. అప్పుడప్పుడు నాన్నగారితో నేను కానీ, రెండో అక్క కానీ బజారుకి వెళ్ళేవాళ్ళం. బ్యాంక్ వాళ్ళు ఏడాదికి కావలసినవన్నీ ఏర్పాటు చేశారు.


నేను, మూడో అక్క ఉమాదేవి ప్రతి ఆదివారం సంతకి వెళ్ళి కూరలు తెచ్చేవాళ్ళం. ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ మేమిద్దరమే తెచ్చేవాళ్ళం. పొట్టు పొయ్యి కోసం పొట్టు బస్తా, కుంపటి కోసం బొగ్గుల సంగతి కూడా మేమే చూసేవాళ్ళం. రిక్షాలో పొట్టు బస్తా వేసి దాని మీద కూచుని వచ్చేవాళ్ళం. నామోషీ అంటే తెలియదు.


అక్కకి వచ్చి డబ్బుల లెక్కలన్నీ ఉమాక్కే చూసేది. పెద్దక్కకి ఇంట్లో పని ఎక్కువ అలవాటు వుండేది కాదు. బ్యాంకికి వెళ్ళడం రావడం, ఓవర్ టైము వుంటే చెయ్యడం చేసేది. వంటపని అమ్మ చూసుకునేది. రెండో అక్క ఇంటి పనుల్లో సాయం చేసేది. మిగతా వాళ్ళు చిన్న పిల్లలు. నాన్న ఉన్నప్పటి ఇల్లు మారిపోయి అక్కావాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి మారాం. ఊరికి కొంచెం దూరం. రెంటు లేకుండా మూడు నెలలకి ఇచ్చారు. తర్వాత అమ్మ వచ్చాక మళ్ళీ పాత ఇంటికి దగ్గరలో మారాం.


అమ్మని బామ్మ 9వ నెల రాగానే డెలివరీకి తీసుకుని వెళ్ళింది. అమ్మకి అమ్మమ్మే కాబట్టి, మా అమ్మమ్మ కూడా వెళ్ళింది. ఏలూరులో మా మేనత్త టీచర్ గా చేసేది. ఆవిడ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేది. డెలివరీ అయ్యిందని అక్కకి బ్యాంక్ కి ఫోన్ చేసి చెప్పారు. అమ్మకి మళ్ళీ పాప పుట్టింది. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ అయ్యింది.


ఇంటికి తీసుకు వచ్చాక నేను, రెండో అక్క రమాసుందరి, మూడో అక్క ఉమాదేవి, పక్కింటి వాళ్ళ అమ్మాయి మేరీ కలిసి ఏలూరు చూడ్డానికి వెళ్ళాం. చిట్టి పాప ముద్దుగా వుంది. అమ్మ మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మాయి పుట్టినందుకు కాదు. నాన్నలేకపోవడం. మా బామ్మ నోటితో ఏమాట అంటే అదే అయిపోయేది. అమ్మని నీకు మగ పిల్లలు పుట్టరు. పుట్టినా బతకరు అని చెప్పిందిట. అలాగే మొట్ట మొదట ఒక అబ్బాయి, ఆరో అమ్మాయి గాయత్రి తరవాత ఒక అబ్బాయి పుడుతూనే పోయారు. ఈ అబ్బాయిన నేను చూశాను. దబ్బపండు ఛాయ, చక్కటి పొడుగు, అందమైన ఉంగరాల జుట్టు. నేను, పెద్దక్క అమ్మకి డెలివరీ అయిన టైములో అక్కడే వున్నాం. ఏమైతేనేం పుట్టిన బిడ్డ దక్కలేదు. నాన్న పడిన బాధ వర్ణనాతీతం. ఇక అమ్మ సంగతి చెప్పక్కరలేదు.


మేము పాపని చూసి రాత్రి బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాం. గంటన్నర ప్రయాణం. తాడేపల్లి గూడెం ఇంకొద్ది సేపట్లో చేరతామనగా అంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో బస్సు ఆగిపోయింది. ఇక అక్కడ నుండీ నడుచుకుంటూ మొత్తం 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లిపోయాం.
1 కామెంట్‌:

  1. పూజ్యం శర్మ గారి ఇంట్లోనించి వచ్చె వేద పాఠాలు ఉపాధ్యాయుల చెణుల గారి ఫిడేలు ma vurii gadavari andalu na gnapakalu gurtuku techina meeblog

    రిప్లయితొలగించు