16, జూన్ 2022, గురువారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 23 *** ఆనందంగా కొత్త ఆఫీసుకి ***

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 23   *** ఆనందంగా కొత్త ఆఫీసుకి ***


ఉద్యోగం వచ్చిందని ఇంటికి వచ్చే సంతోషంలో బస్ ఏ దారిలో వెడుతోందో.... దారిలో ఏమేమి ఉన్నాయో... చూసే అవకాశం లేకపోయింది. కాకపోతే సెక్రటేరియట్, లిబర్టీ థియేటర్ బాగా గుర్తున్నాయి.

పొద్దున్న 10 గం.లకి ఆఫీసులో ఉండమన్నారు కదాని పనులన్నీ పూర్తి చేసుకుని బస్ స్టాప్ కి బయల్దేరాను. మా ఇంటి నుంచి రోడ్డు మీదకి వచ్చి స్ట్రెయిట్ ఒక కిలోమీటరు దూరం నడిస్తే మెహదీపట్నం బస్ డిపో వస్తుంది. డిపో నుంచి సిటీలో చాలా చోట్లకి బస్ లు వుండేవి. నాకు హిమాయత్ నగర్ కి ఒకటే బస్ నెం. 6 (ఆర్ టిసి క్రాస్ రోడ్స్ వరకు). నాకు అది కొంత హాయిగా వుంది. డిపోలో ఎక్కితే మళ్ళీ హిమాయత్ నగర్ లో దిగడమే. కాకపోతే నాకు పూర్తిగా కొత్త రూటు. అదేనాకు భవిష్యత్తుకి బాట వేసింది.


డిపోలో కాబట్టి సీటు దొరుకింది. చాలా రిలాక్స్డ్ గా కూచున్నాను. కొత్త ఉద్యోగం, అక్కడ పని గురించి ఆలోచించుకుంటూ కూచున్నాను. నాకిప్పుడు ఆరోడ్లన్నీ కొత్తగా, అందంగా కనిపిస్తున్నాయి. బస్ డిపో నుంచి బయల్దేరింది. పక్కనే వున్న అంబా థియేటర్ దాటుతుంటే డ్రైవర్ కి, కండక్టర్ కి అలవాటయిన వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళకోసం ఆపుకుంటూ వచ్చిన బస్ మెల్లగా చౌరస్తా దాటి బస్ స్టాప్ చేరింది. ఇంక జనాలు బిలబిలలాడుతూ ఎక్కారు. బస్ స్టాప్ వెనకంతా ఖాళీస్థలం వుండేది. జనాలు ఉన్నా రష్ అనిపించలేదు. ఉద్యోగానందంలో రష్ అనేది నా మనసుకి పట్టలేదు.


మెహదీపట్నం నుంచి సరోజినీ హాస్పిటల్ వైపు టర్నింగ్ లో మిలటరీ ఆఫీసు వుంది. నాకు ఆ ఆఫీసు వైపు చూడ్డం అంటే చాలా ఇష్టం. మిలటరీ వాళ్ళు అక్కడ మార్చింగ్, ఇతర పనులు చేస్తూ కనిపిస్తుంటారు. (***మా పిల్లలకి మిలటరీ డ్రెస్ వేయించి ఫోటో తీయించాలని చాలాసార్లు అనుకున్నాను కుదరలేదు***) వాళ్ళని చూస్తూ వున్నాను. దేశానికి రక్షకభటులు కదా అనుకున్నాను. కండక్టర్ ‘సరోజినీ’ అని అరిచాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఏంటా అని చూస్తే సరోజినీ హాస్పిటల్ బస్ స్టాప్. ఓహో... అని నాలో నేనే నవ్వుకుంటూ మళ్ళీ నా ఆలోచనల్లో మునిగిపోయాను.

బస్ మెల్లగా మహావీర్ హాస్పిటల్, లకడీ కా పూల్ ద్వారకా హోటల్ దాటింది. అక్కడ చెప్పుకోదగ్గ బస్ స్టాప్ టెలిఫోన్ భవన్. చాలామంది అక్కడ దిగిపోయారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఆఫీస్ కి వెళ్ళాలంటే ఎన్ని వున్నాయో గుర్తు లేదు. టైము 9.30 అయ్యింది. సరే చూద్దాంలే అనుకున్నాను.


పాత సెక్రటేరియట్ ముందు నుంచి బస్సు వెడుతోంది. అప్పుడు సెక్రటేరియట్ కి వెళ్ళడానికి నీలంరంగు గేటు రోడ్డు మీదకి ఉండేది. ఆఫీసుకి వెళ్ళేవాళ్ళ కోసం డ్రైవర్ కొంచెం ఇవతలగా బస్ ఆపాడు. చాలామంది దిగిపోయారు. దాని ఎదురుగా ఒక పాత బిల్డింగ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వుండేది. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ అప్పుడు లేదు. బ్యాంక్ కి వెళ్ళేవాళ్ళు కూడా సెక్రటేరియట్ దగ్గర దిగి వెళ్ళిపోయేవాళ్ళు.
బస్ కొంచెం ముందుకి బస్ స్టాప్ లో ఆగింది. ***అప్పటికి ఇంకా ఖైరతాబాద్ బ్రిడ్జ్ కానీ నెక్లెస్ రోడ్డు కానీ రాలేదు. బస్ స్టాప్ వెనకంతా ఖాళీగా వుండేది. సెక్రటేరియట్ ముందర రోడ్డు మీద వున్న ఫ్లై ఓవర్ కూడా లేదు.***

కానీ సెక్రటేరియట్ నుంచి బస్ లిబర్టీ బస్ స్టాప్ కి టర్న్ అయేటప్పుడు నేను పక్కనే వున్న చెట్లు, కొద్ది దూరంలో వున్న హుస్సేన్ సాగర్ లో నీళ్ళు చూస్తున్నాను. నాకు ఒక ఆశ్చర్యకర దృశ్యం కళ్ళపడింది.

ఆ టర్నింగ్ లో ఒక బ్లాక్ కలర్ గేటు వుంది. దాని నుంచీ కొంచెం డౌన్ లోకి ఒక దారి వుండి ఒక తెల్లటి బిల్డింగ్ ముందు ఆగింది. ఆ బిల్డింగ్ వెనక హుస్సేన్ సాగర్ నీళ్ళు వున్నాయి. బలేవుంది బిల్డింగ్ చుట్టూనీళ్ళు అనుకున్నాను. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే *** దాదాపు 200 కథలు, 25 నవలలు, నాటక రచయిత, సినిమా రచయిత 'ఎన్.ఆర్. నంది’*** పేరు కనిపించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన పుస్తకాలు అన్నీ చదవలేదు కానీ ***దృష్టి*** పుస్తకం చాలా నచ్చింది. ఆయన్ని ఒకసారి చూస్తే బావుండును అనుకున్నాను. రోజూ ఇటే వెళ్తాను కదా వెళ్దామని అనుకున్నాను.



ఇంతలోనే బస్ లిబర్టీ బస్ స్టాప్ వైపు టర్న్ అయిపోయింది. అక్కడ లిబర్టీ థియేటర్ వుండడం వల్ల ఆ బస్ స్టాప్ కి ‘లిబర్టీ’ అని పేరు వచ్చింది. అందరూ ఎక్కాక బస్ హిమాయత్ నగర్ వెళ్ళే టర్నింగ్ లో లిబర్టీ థియేటర్ దాటి టిటిడి కల్యాణమంటపం మీదుగా బయల్దేరి, హిమాయత్ నగర్ వైపు పరుగులు పెట్టింది. మధ్యలో ఇంక ఏ బస్ స్టాపు లేదు. రోడ్లన్నీ ఖాళీగా వున్నాయి. అటూ ఇటూ చిన్న చిన్న షాపులు. హిమాయత్ నగర్ లో నేను దిగాల్సిన బస్ స్టాప్ ***లిడ్ క్యాప్** (చెప్పుల షాపు). దానికి అక్కడ చాలా పేరు వుండేది. ఇది కాకుండా ఆ బస్ స్టాప్ ని ***ఉర్దూహాల్*** అని కూడా అంటారు. బస్ అక్కడ ఆగగానే గబగబా దిగి ఆఫీసువైపు గబగబా నడక సాగించాను.




***అసూయల మధ్య కొత్తవర్కుకి శ్రీకారం***

ఆఫీసుకి వెళ్ళగానే నన్ను డైరెక్టుగా పైన వున్న ఎ.సి. రూంకి పంపించారు. ఆ రూములో పెద్ద కంప్యూటర్ ఒకటి, చిన్న కంప్యూటర్ ఒకటి వున్నాయి. పెద్దది ఒక పక్కకి తిరిగి వుంది. రెండోది ఇంకో పక్కకి తిరిగి వుంది. నన్ను పెద్ద కంప్యూటర్ దగ్గర కూచున్న లక్ష్మికి పరిచయం చేశారు. ఒకసారి నా వంక చూసి వర్కు చేసుకుంటూ కూచుంది. నవ్వులేదు. ఎందుకు వచ్చిందిరా బాబూ... అన్నట్టు చూసింది. పైగా నేను వాళ్ళకన్నా చిన్నదాన్ని. అందుకేనేమో... నన్ను చిన్న కంప్యూటర్ దగ్గర కూచోపెట్టారు. అంతా అయోమయంగా వుంది. ఏది ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలియదు. నాకు ఆఫ్ చెయ్యడం, ఆన్ చెయ్యడం నేర్పారు. నేను కీ బోర్డు అన్నీ చూస్తూ కూచున్నాను. ఆకుపచ్చటి అక్షరాలు మెరుస్తున్నాయి.

లక్ష్మి, రవీంద్రనాథ్ భార్యాభర్తలు. ఇద్దరూ వర్కు గురించి గుడు గుడుమని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన కొన్ని చిన్న చిన్నవి బుక్ లో నోట్ చేసుకున్నాను. లంచ్ టైమ్ లో ఇద్దరూ బాక్సు పట్టుకుని వెళ్ళిపోయారు. నాకు కూడా ఆకలేస్తోంది. ఎక్కడ తినాలో తెలియదు. బాక్సు తీసుకుని నేను కూడా పక్కనే వున్న రూంకి వెళ్ళాను. వాళ్ళిద్దరూ తింటున్నారు. నేనూ ఒక పక్కన కూచుని నా బాక్స్ ఖాళీ చేశాను.

కనీసం నా వంక చూసి నవ్వు కూడా నవ్వలేదు. సరేలే కొత్త ఆఫీసు కదా... అనుకున్నాను. రూంలోకి వెళ్ళాక మళ్ళీ మామూలే... మౌనం నాట్యం చేసింది.

సాయంత్రం బ్యాగ్ సద్దుకుని లక్ష్మి వెళ్ళిపోయింది. ఎవరో వచ్చి మీరూ వెళ్ళిపొండి అన్నారు. నేనూ ఇంటికి బయల్దేరాను.

మొదటి రోజు ఇలా...



3 కామెంట్‌లు:

  1. అయితే అలా మొదలయిందన్నమాట.
    // “***అసూయల మధ్య కొత్తవర్కుకి శ్రీకారం*** “ // …. కరక్ట్ గా చెప్పారు. అసూయ అని మొహం మీదే తెలుస్తోందిగా. ఇంత కాలం తాము ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆ పనికి మీరు కూడా రావడం ఇష్టం లేనట్లుంది. ఆ మగమనిషి కూడా అలాగే ప్రవర్తించాడా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి ప్రెగ్నెంట్ ఎలాగా ఒక మూడు నెలలలో లీవు పెట్టెయ్యాలి. లేకపోతే మానెయ్యాలి. తను వెళ్ళిపోయినా వాళ్ళాయన రవీంద్రనాథ్ ఆ సెక్షన్ కి ఇన్ ఛార్జ్ అవుతాడనుకుంది. కానీ వాళ్ళనుకున్నట్టు అవలేదు. అతను మాత్రం తెనాలి యాసలో "యా నువ్వెందుకొచ్చావమ్మా ఇప్పుడు" అన్నాడు చాలా బాధపడుతున్నట్టుగా... నాకు వాళ్ళ బాధ అర్థమయ్యింది. కానీ కొన్నాళ్ళకి నేనే మహారాణిని అయ్యాను ఆ సెక్షన్ కి.

      తొలగించండి
  2. సొంతూరు కాకపోయినా హైదరాబాదుతో నా అనుబంధం 1988 నుండి 2004 వరకూ ( ఇప్పటికీ ఉందనుకోండి) . మీ పోస్టుల్లో మీరు రాసిన ఆ రోడ్ల పేర్లూ, ఆ బస్సు నంబర్లూ, మీ అనుభవాలూ చదువుతుంటే నా గతం కూడా అలా కళ్ల ముందు కదలాడుతోంది. ఆ రోజుల్లో బస్సుల్లో కిటికీ పక్క చోటు దొరికిందంటే చాలు బయటికి చూస్తూ నన్ను నేను మర్చిపోయేవాడిని . అవే రోడ్లూ, అవే భవనాలూ అయినా ప్రతిరోజూ వింతే .

    మీకు గుర్తుందో లేదో గాని ఆ నల్ల గేటు మీద ఎన్.ఆర్ నంది గారి పేరుతోపాటు "జల దృశ్యం(?) " అనే అక్షరాలూ కూడా చూసినట్టు గుర్తు నాకు.

    రిప్లయితొలగించండి