23, నవంబర్ 2022, బుధవారం

*** అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ - పెళ్ళి పెద్దనయ్యాను *** 61

 

*** అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ - పెళ్ళి పెద్దనయ్యాను *** 61నేను ఇంక ఇంటి పట్టునే వర్కు చేసుకుంటున్నాను. నాకు చాలా హాయిగా, ప్రశాంతంగా వుంది. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ చదువులు, వాళ్ళ హడావుడి వాళ్ళకి సరిపోతోంది.

ఇంచుమించు నాలుగైదురోజులకి ఒకసారి మా ఇంటి దగ్గరికి సేల్స్ ఆవిడ పద్మ వస్తూ వుంటుంది. చూడడానికి చాలా సన్నగా వుంటుంది కానీ చకచకా నడుచుకుంటూ తిరిగేస్తుంది. దూరాలు మాత్రం బస్సుల్లో వెడుతుంది. ఆవిడ తీసుకు వచ్చేవాటిల్లో రకరకాలు వుండేవి. వాటిల్లో తినే చెక్కలు, స్వీట్స్ అన్నీ వుండేవి. పిల్లలకోసం ఏదోఒకటి తీసుకునేదాన్ని. అలా వచ్చినప్పుడు నేను ఖాళీగా వుంటే కాసేపు కూచుని కబుర్లు చెపుతూ వుండేది. ఆవిడకి రకరకాల కష్టాలు. ఎవరి కష్టాలు తీర్చలేం కానీ, ఒకోసారి ఇలాంటి వాళ్ళకి కొందరితో చెప్పుకుంటే వూరటగా వుంటుంది. అలాంటి వాళ్ళలో నేనొకదాన్ని అయ్యాను.

సరే మాటల మధ్యన మా అమ్మాయి వుంది. ఉద్యోగం చేస్తోంది. ఏదైనా సంబంధం వుంటే చెప్పమంది. సరే అనేసి వూరుకున్నాను. అలాగే వచ్చినప్పుడల్లా చెప్తోంది. అసలే నాకు టైం వుండదు. సంబంధాలు ఎక్కడ చెప్పాలి అనుకున్నాను.

ఎక్కడవాళ్ళు ఎలా కలుస్తారో తెలియదు.

నేను తెలుగు అకాడమీలో టెంపరరీగా చేసినప్పుడు అక్కడికి ప్రసాద్ అని ఒక అబ్బాయి వచ్చేవాడు. డిగ్రీ తెలుగు మీడియంలో చదివాడు. ఎవరి ద్వారా వచ్చాడో తెలియదు కానీ... మేడమ్ నాకు వర్కు నేర్పిస్తారా... సుధామేడమ్ (తెన్నేటి సుధాదేవిగారు) మిమ్మల్ని కలవమన్నారు అన్నాడు. అలా పరిచయం అయిన ప్రసాద్ నా దగ్గిర వర్కు నేర్చుకున్నాడు. ప్రసాద్ వంట చాలా బాగా చేస్తాడు. ఒకసారి బిర్యాని చేసి అందరికీ తెచ్చి పెట్టాడు.

అప్పుడప్పుడు నన్ను ఇంటికి వచ్చి కలుస్తుండేవాడు. ఏవైనా డౌట్స్ వస్తే తెలుసుకునేవాడు. తనకి అమ్మా, నాన్న లేరు. ఒక అన్నయ్య ఉన్నాడు. వాళ్ళెక్కడో కడపలో వుంటారు. పెద్ద కాంటాక్ట్స్ లేవు. హైదరాబాద్లో వాళ్ళ అక్క వుంటారు. వాళ్ళ దగ్గిర వుంటున్నానని చెప్పాడు. నా దగ్గిర వర్కు నేర్చుకుని ఆంధ్ర సారస్వత పరిషత్ (తెలంగాణ విడిపోకముందు) లో సి నారాయణ రెడ్డిగారి దగ్గిర జాబ్ చేస్తున్నాడు. ఒకసారి వచ్చినప్పుడు నేను జ్యోతి అని ఒక అమ్మాయి వుంది. మా ఇంటికి వచ్చే సేల్స్ ఆవిడ కూతురు అని వివరాలన్నీ చెప్పాను. వాళ్ళ అక్కావాళ్ళకి చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నన్ను రమ్మని తీసుకుని వెళ్ళాడు. మొత్తానికి అన్ని మాటలూ అయ్యాయి. మా ఇంట్లో పెళ్లి చూపులు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకున్నారు.

నేను ప్రసాద్ కి ముందరే చెప్పాను. పెళ్ళి అంటే ఎక్కడెక్కడ వాళ్ళమో కలుస్తాము. కొత్తలో బాగానే వుంటుంది. కానీ మెల్లి మెల్లిగా ఇద్దరి ఆలోచనలు తేడాలు వస్తాయి. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అర్థం అవుతుంది. పెద్దవాళ్ళు కుదర్చినా, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా ఇది మాత్రం తప్పకుండా వుంటుంది. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి – “ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని విడిచిపెట్టను. ఇద్దరం కలిసే వుంటామనిఅన్నాను. ఎందుకంటే ఆ అమ్మయి వాళ్లు కూడా చాలా కష్టపడ్డారు. నువ్వు అంతేఅన్నాను.

అయ్యో అదేం లేదు. అలాగే మేడమ్ అన్నాడు.

తమ్ముడికి పెళ్ళి కుదిరినందుకు వాళ్ళ అక్కావాళ్ళు చాలా సంతోషించారు. నన్ను బాగా పొగిడారు. నేను చెప్పాను. అలా కుదిరింది. వాళ్ళు సుఖంగా వుండడమే మనం కోరుకుందాంఅని చెప్పాను.

మొత్తానికి సింపుల్ గా సనత్ నగర్ లో పెళ్ళయ్యింది. ఇలా నేను వాళ్ళ పెళ్ళి పెద్దనయ్యాను. ఇద్దరివీ వేరే కులాలు. అయినా పెద్దవాళ్ళు ఇష్టపడి చేశారు. ఆ పెళ్ళికి నేను పిల్లలతో వెళ్ళాను. సి. నారాయణరెడ్డిగారు ప్రసాద్ మీద అభిమానంతో పెళ్ళికి వచ్చారు. ఆశ్చర్యంగా ఆయన పెళ్ళి అయేవరకు ఉండి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళారు. మొత్తానికి ప్రసాద్ ఒక ఇంటివాడయ్యాడు. ఇద్దరూ సనత్ నగర్ లో జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకుని వుంటున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు.

ఒక రోజు జ్యోతి వాళ్ళ అమ్మ పద్మ వచ్చి మా వారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. చివరికి అర్థం అయ్యింది ఏమిటంటే విజయవాడ వెళ్ళిపోయాడని, అక్కడ ఇంకో పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. ఇంక జ్యోతి తమ్ముడిని పెట్టుకుని ఉంటోంది. ఒకోసారి ఆడవాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు. రోజులు గడిచిపోతున్నాయి. పద్మగారికి ఏదో అసంతృప్తి మొదలైంది. ఆవిడ వుండేది అతి చిన్న సొంత ఇల్లు. ఆవిడకి వచ్చేది సరిపోతుంది.

ఏదో చిన్న చిన్న విషయాల్లో కూతురికి, అల్లుడికి గొడవలకి కారణమైంది. మెల్లి మెల్లిగా అన్నీ రాజుకుంటున్నాయి. ప్రసాద్ పాపం వచ్చి అన్నీ చెప్తుండేవాడు. నేను ఎక్కువ మాట్లాడకు అని చెప్పేదాన్ని. ఇలా ఇలా వుంటూనే రోజులు గడిచిపోతున్నాయి. జ్యోతి చాలా తెలివైనది. తను చేసే ఉద్యోగంలో మంచి పేరుంది. ధైర్యం చేసి ఆఫీసుకి దగ్గరలో ఒక చిన్న డబల్ బెడ్ రూం ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇనీషియల్ పే మెంట్ కి ఆఫీసు వాళ్ళు 5 లక్షలు వడ్డీ లేకుండా ఇచ్చారు. మిగిలినది ఇద్దరూ కలిసి ఏవో చిట్స్ వేసి అప్పు అనేది ఎక్కువ లేకుండా కొనుక్కున్నారు.

ప్రసాద్ వచ్చి చెపితే చాలా సంతోషమనిపించింది. ఎందుకంటే ఇద్దరివీ ప్రైవేట్ ఉద్యోగాలు. ఎంత గొడవలు అవుతున్నా ఈ విషయంలో ఒక మాట మీద నిలబడ్డారు. సొంతింటి వాడయ్యాడు ప్రసాద్. ప్రసాద్ కూడా ఇంట్లోనే వుంటూ పది మందితో పరిచయాలు పెంచుకుని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్.డి చేసే వాళ్ళ పేపర్లు టైప్ చెయ్యడం, పుస్తకాలు చెయ్యడం చేస్తున్నాడు.

మెల్లి మెల్లిగా తెలుగు యూనివర్సిటీ నుంచి నాటక రంగంలోనూ, తెలుగులోనూ ఎం.ఎ. చేశాడు. తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పిహెచ్.డి. చేసి డాక్టరేట్ సంపాదించుకున్నాడు. నాకు చాలా సంతోషమనిపించింది. జ్యోతి కరోనా టైంలో పిల్లలు ఇంట్లో వుంటే వాళ్ళని చదివించుకోవాలని ఉద్యోగం మానేసింది.

నేను అనుకోకుండా ఒక రోజు వాళ్ళింటి వైపు వెళ్ళి వాళ్ళిల్లు చూసి, పిల్లలతో కొంతసేపు గడిపి వచ్చాను. అపార్ట్ మెంట్ పాతదే అయినా ముచ్చటగా వుంది. జ్యోతి అప్పటికప్పుడు వేసిన వేడివేడి పకోడీ, స్వీట్ పెట్టింది.

అప్పుడప్పుడు సంసారంలో జరిగే చిన్న చిన్న విషయాల గురించి నాకు వచ్చి చెప్తుంటాడు. నేను సంసారంలో ఇలాంటివి తప్పవు ప్రసాద్. ఎలాంటి వాళ్ళకయినా ఏదో ఒక విషయంలో అవుతూనే వుంటాయి.

సద్దుకున్నామా... సద్దుకున్నట్లు. ఒకళ్ళు ఎక్కువ మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు తక్కువ మాట్లాడితే అయిపోతుంది. ఇంక పరిస్థితులు మితిమీరినప్పుడు ఇంక కలిసి వుండలేం అనుకుంటే... బయట విడిగా బతక గలిగే ధైర్యం ఇద్దరికీ ఉండాలి. 70 సంవత్సరాలు వచ్చినా దెబ్బలాడుకునే భార్యాభర్తలు వున్నారు. ఇద్దరూ ఇద్దరు పిల్లలతో ముచ్చటగా వున్నారు. నువ్వు బాగా పైకి వచ్చావుసంతోషంగా వుండండి అని చెప్పాను.

కానీ నా చేతుల మీదుగా పెళ్ళి చేసుకున్న వీళ్లు ఏవో చిన్న చిన్నవి ఉన్నా, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నా బాగా సెటిల్ అయినందుకు సంతోషంగా అనిపించింది. జ్యోతికి మేనేజ్ మెంట్ బాగా తెలుసు. ప్రసాద్ కి ఓపిక ఎక్కువ. తన పని తను చూసుకుంటూ గడిపేస్తాడు.

ఈమధ్య పిహెచ్.డి. చేసి డాక్టరేట్ కూడా సంపాదించుకున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలయ్యాయి. ఓ పెద్దమనిషిగా పేరు తెచ్చుకున్నాడు.

2 కామెంట్‌లు:

 1. వయసుతో బాటు జీవితంలో అనుభవం పెరుగుతుంది కదా. దాని మూలంగా ఇటువంటి పాత్రలు (పెళ్ళి పెద్ద) పోషించడమూ జరుగుతుంది. అది మీరు సమర్థవంతంగా చేసినట్లున్నారు, గుడ్ 👏.

  చిన్నచిన్న గొడవలు లేని సంసారాలు ఎక్కడుంటాయి లెండి. అవి చిలికి చిలికి గాలివానలవక పోతే చాలు. మీరు పెళ్ళి చేసిన జంట బాగున్నారు కదా, గుడ్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కొన్ని సంసారాలకి పిల్లలు వారధి అవుతారు. దాంతో అన్నీ చక్కబడతాయి. ఇక అవీ కాదనుకునేవాళ్ళని ఏమీ చెయ్యలేం. ఒకళ్ళు తగ్గి వుంటే... చాలా వరకు సద్దుకుంటుంది. ఇద్దరూ బాగానే వున్నారు సర్. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళయ్యారు.

   మీకు నమస్కారాలు, ధన్యవాదాలు సర్.

   తొలగించు