8, ఏప్రిల్ 2023, శనివారం

*** అనుకోని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతే... ఊహకి కూడా అందని beginning అనే మాట ఎందుకొచ్చిందో చెప్పాల్సిందే ***

 

*** అనుకోని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతే...

ఊహకి కూడా అందని  beginning అనే మాట ఎందుకొచ్చిందో చెప్పాల్సిందే  ***


ఒకరోజు మరో సాహితీ మిత్రులు, నరిసెట్టి ఇన్నయ్యగారి కుటుంబ మిత్రులు  వెంకటరత్నంగారు “నేను సంజీవరెడ్డి నగర్ వస్తున్నాను. అక్కడ నా ఫ్రెండ్ వున్నారు. ఆయన పుస్తకాలు వున్నాయి. డిటిపి చేసి పెట్టాలి. మిమ్మల్ని పరిచయం చేస్తాను ” అన్నారు.

 

వెంకటరత్నంగారు వచ్చారు. ఆయన కారులో ధరమ్ కరమ్ రోడ్డులో ఉన్న వైశాలీ అపార్ట్ మెంట్స్ కి తీసుకెళ్ళారు.

 


వెెంకటరత్నం గారు, సదాశివరావుగారు

ఐదో ఫ్లోర్ కి వెళ్ళాం. తెల్లటి జుట్టుతో మీడియం హైట్ తో వున్న ఒక వ్యక్తి తలుపు తీశారు. ఆయన్ని చూస్తే వయసు ఇంత అని అంచనా వెయ్యలేం. ఆయన వెనకే తెల్లటి కుక్కపిల్ల వచ్చింది. అది నా చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. “ఏం భయం లేదు. రామ్మా” అన్నారు.

 

కూచున్నాక నాకు, వెంకటరత్నంగారికి టీ తెచ్చి ఇచ్చారు. అప్పుడు నెమ్మదిగా వెంకటరత్నంగారు “ఈయన పేరు సదాశివరావు. డిజిపి గా చేసి రిటైర్ అయ్యారు అని, సదాశివరావుగారూ అమ్మాయికి వర్కు చెప్పండి” అన్నారు.

 

“సదాశివరావుగారు సరే నేను మేటర్ రెడీ అయ్యాక చెప్తాను. పరిచయం చేశావుగా” అన్నారు.

 

ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరూ బల్కంపేటలో మా ఇంటికి వచ్చారు. ఏదో అర్జంటు లెటర్ చేయించుకోవాలన్నారు. వెంకటరత్నంగారు ఇలాంటి లెటర్లు సదాశివరావుగారికి ఎలా చెయ్యాలో ఎక్కువ తెలియవు అంటూ పక్కన కూచుని చేయించుకుంటున్నారు. సదాశివరావు గారు మాత్రం మా ఇంట్లో కనిపించిన ఒక పుస్తకం చదువుకుంటూ కూచున్నారు. చెయ్యడం అయిపోయాక నేను ఇద్దరికీ అల్లం వేసిన టీ ఇచ్చాను. చాలా బావుందని థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారు.

 

ఒక వారం రోజుల తర్వాత పొద్దున్న 6 గంటలకి సదాశివరావు గారు వచ్చి మేము చెయ్యాల్సిన పేపర్లు ఒక నాలుగు ఇచ్చి, “వాకింగ్ చేస్తూ వచ్చాను” అని లోపలికి వచ్చి చెయ్యాల్సిన పనిని గురించి చెప్పారు. “నేనూ వెంకటరత్నం వచ్చినప్పుడు ఇచ్చావు కదా... అలాంటి అల్లం టీ ఇయ్యి అన్నారు”. నేను ఇచ్చిన అల్లం టీ తాగి, “చాలా బావుంది” అని వెళ్ళిపోయారు.

సదాశివరావుగారితో అలా పరిచయం కొనసాగింది.

సదాశివరావుగారి పుస్తకాలు, వ్యాసాలు దాదాపు 7 సంవత్సరాలు చేశాం. దాదాపు 2000 పేజీలపైనే చేసుంటాం.

ఆయన 28.11.2020న ఫోన్ వాట్సాప్ కాల్ లో కొత్త వర్కు గురించి మాట్లాడి – “ఏంటమ్మా... రమ్మంటే రావు. వచ్చి డబ్బులు తీసికెళ్ళమని చెప్పాను కదా... ఇంకో వారం ఆగావంటే నీ డబ్బులు నీకు రావు. కరోనా తర్వాత కొత్త వర్కు మొదలు పెట్టాలి నువ్వు, సగం రాశాను” అన్నారు. మళ్ళీ వాట్సాప్ మెసేజ్ లో - *** “This is the beginning. Come to flat 408 ”*** అని పెట్టారు. ఆ beginning అనేది త్వరలోనే end అవుతుందని తెలియలేదు.  





Flat 408 అనేది ఆయన పుస్తకాలు చదువుకోవడానికి, పెయింటింగ్స్ వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది. బీరువాల నిండా పుస్తకాలే. వాళ్ళబ్బాయి కూడా ఇక్కడే వుండడంతో అతను ఒకరూంలో తన పని చేసుకుంటాడు. ఆయన ఫ్రెండ్స్ ని కూడా అక్కడే కలుస్తుంటారు. ఆయనకి తోడు కుక్కపిల్ల.


నేను రెండు నెలలుగా వస్తానని చెప్తున్నాను కానీ, కరోనా మూలంగా పెద్ద వాళ్ళ దగ్గిరకి ఎందుకని వెళ్ళలేదు. ఇంక ఆయన ఫోన్ చేసిన రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. సోఫాలో పడుకుని హాయిగా పుస్తకం చదువుకుంటున్నారు. కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చింది. నన్ను చూసి ఓ మాస్కు పెట్టుకుని వచ్చావా.... బాగానే ఫాలో అవుతున్నావుగా అన్నారు.


జేబులోంచి మడత పెట్టిన ఓ చెక్కు తీసి – ఊ... ఏదీ లెక్క తెచ్చావా... ఎంతిమ్మంటావు... అంటూ నాకిప్పుడేం చెప్పద్దు. అంటూ రు.15,000/- చెక్కు రాసి ఇచ్చారు. ఆయన ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు. ‘’గీతాని రమ్మంటే రాలేదు. మాట్టాడదామనుకున్నాను. ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదవడానికి తెప్పించుకున్నాను. చాలా పని వుంది నువ్వు చెయ్యాల్సింది. నా పుస్తకాలన్నీ నువ్వే చెయ్యాలి. కానీ గుర్తు పెట్టుకో... నాకు మాత్రం ఎవరో ఒకళ్ళతో టైంకి పంపించు” అన్నారు. చెక్కు క్లియర్ అయిందా అని ఫోన్ చేస్తూనే వున్నారు. ఆయన నా పేరు డి. నాగలక్ష్మి అనికాకుండా... దామరాజు నాగలక్ష్మి అని రాశారు. రెగ్యులర్ గా వేసే బ్యాంక్ లో అది క్లియర్ అవలేదు. ఆంధ్రాబ్యాంక్ లో దామరాజు నాగలక్ష్మి అని ఉంది. క్లియర్ అయ్యింది. అది కూడా అవకపోతే చూద్దాం అనుకున్నాను. మళ్ళీ వెడదాం అనుకున్నాను.


(తరువాయి భాగం సోమవారం)





29, మార్చి 2023, బుధవారం

*** కొన్ని పాత విషయాలే బావుంటాయి *** -78

 

*** కొన్ని పాత విషయాలే బావుంటాయి *** -78

 

ఒకరోజు సత్యవాణిగారు “అమ్మా నాగలక్ష్మీ! బంజారాహిల్స్ లో వెంకట శివయ్యగారు, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసరుగారు వుంటారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయనకి హిందీ, తెలుగు కలిపి కొన్ని పేజీలు చేసి పెట్టాలిట. ఫోన్ నెంబర్ ఇస్తాను. వెళ్ళిరా తల్లీ! వారం రోజుల నుంచీ చెప్తున్నారు” అన్నారు.

 

సత్యవాణిగారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాను.

 

*** వెంకట శివయ్య, ఐఎఎస్ అనగానే పాత రోజులు గుర్తుకువచ్చాయి. 1975 నుంచి 80 మధ్యలో అనుకుంట తాడేపల్లి గూడెం టౌనుహాలులో సాహితీసమాఖ్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగులకి మా అమ్మ(44సం. చదివింది 5వతరగతి)తో సహా అందరం వెళ్ళేవాళ్ళం. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది కాబట్టి ఇలాంటి మీటింగులంటే చాలా ఇష్టంగా వచ్చేది. రంగినీని సత్యనారాయణరాజుగారు, మారేమండ సీతారామయ్యగారు వంటి ప్రముఖులంతా ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వుండేవారు. ఇంకా చాలామంది వుండేవారు పేర్లు గుర్తులేవు.

 

ఒకసారి మీటింగుకి వెంకట శివయ్య, కలక్టరుగారు వచ్చారు. ఆయన సాహిత్యాభిమాని. ఆరోజు ఆయన మాట్లాడవలసిన విషయం - రామరాజభూషణుడు (భట్టుమూర్తి) రచించిన గిరికా, వసురాజుల ప్రణయకావ్యం (ద్వ్యర్థి కావ్యం). నేను చదివింది స్పెషల్ తెలుగు. ఆయన ఏం మాట్లాడతారో అని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను.

 


***

***

 

*** రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానానికి ఆభరణంలా ఉండటం వలన ఆయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ***

 

***

***

 

వసుచరిత్ర గురించి వెంకటశివయ్యగారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ప్రతి పద్యంలోనూ సంగీత, సాహిత్యపరమైన అర్థాలు గోచరిస్తాయి. ఆయన మాట్లాడిన పద్యాలలో రెండు నాకు బాగా గుర్తుండిపోయాయి.

 

***

***

 

మ|| పదమెత్తం గలహంసలీల – యథరస్పందంబు సేయన్ శుభా

స్పదమౌ .................. వీక్షింప ష

షట్పదియుంబొల్చు, దరంబె కన్నెగొనియాడన్ గేయవాక్ర్పౌఢిమన్||

 

ఈ పద్యం చూస్తే - మంజువాణి గిరికను గురించి బాహ్యసౌందర్యమే కాదు మనోల్లాన్ని కలిగించే సంగీతంలో కూడా దిట్ట అని వసురాజుకి ఇలా చెప్తుంది-

 

***పదమెత్తంగలహంస లీల ***

 

కాలు (పదము) పెట్టిందంటే రాయంచ నడక

పాటని అందుకుందంటే హంసధ్వని రాగమే –

 

పెదవి తెరిచిందంటే అనురాగరంజితమే

పెదవి విప్పిందంటే రాగమాలికలే...

 

*** వీక్షింప షట్పదియుంబొల్చు***

 

కళ్ళు తెరిస్తే నల్లని తుమ్మెదల్లా వుంటాయట.

 

సంగీతపరంగా చూస్తే - చూచెనా షట్పదులు (తుమ్మెదపదాలు పలుకుతాయట, మరో అర్థం చూస్తే కన్నులు తెరిచిందంటే ప్రణయాహ్వానమే)

 

వసంత కాలం వచ్చి భట్టుమూర్తి రాగమాలికతో సంగీత కచ్చేరీ ప్రారంభించినట్టుటుంది ఈ కావ్యం. సకల జంత్ర గాత్ర వాయిద్యాల బృందగాన మాధుర్యాన్ని మనోజ్ఞంగా వర్ణించాడు.

 

ఉద్ధతరిపు విద్ధతపన

పద్ధతి కరి భవన దవని పటదంబుధి సం

వద్ధరణ సముద్ధరణ స

మిద్ధరణ – రజోవ్రజోద్యధిభ మద సృతికిన్

 

తద్ధి తకిట, తద్ధితఝణు

తద్ధిరుతకు, తకిట దికిట తకతోంకిట, తాం

కు తఝుణు, కకుంతఝణు, కు

కూంత దిరు, తతోంత కూంత తకుత దిగిణతోం

 

ఇందులో మృదంగ వాద్య ధ్వని ఎంతో మనోహరంగా ఆదితాళ లయ ప్రధానంగా వ్యక్తం చేశాడో తెలుస్తుంది.

 

***

***

 

సత్యవాణి గారు చెప్పిన వెంకట శివయ్య గారు - తాడేపల్లి గూడెంలో వసుచరిత్ర గురించి గొప్పగా మాట్లాడిన వెంకట శివయ్యగారు ఒకటే అయితే ఆ గొప్ప సాహిత్యవేత్తని మళ్ళీ చూడగలుగుతానని అనుకున్నాను.

 

ఆవిడ ఇచ్చిన ఫోన్ నెంబర్ తో అడ్రస్ కనుక్కుని వాళ్ళింటికి వెళ్ళాం. ఆయన చాలా మర్యాదగా కూచోమన్నారు. నేను ఆయనతో తాడేపల్లిగూడెం విషయం ప్రస్తావించాను. అవును నేనే ఆ వెంకట శివయ్యని అని చెప్పారు.

 

42 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనని చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. సాహిత్యవిషయాలు చాలా చర్చించారు. అప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు గుర్తుపెట్టుకుని చెప్పినందుకు చాలా సంతోషించారు.

 

“మీ గురించి సత్యవాణిగారు చాలా బాగా చెప్పారు” అని ఆయనకి కావలసిన పనేమిటో... వివరించారు.

ఒకే అర్థం వచ్చే హిందీ, తెలుగు పదాలు పక్క పక్కనే రావాలి. సరే చేస్తామని చెప్పాను. పది పేజీలు శాంపిల్ కి చేసి ఇమ్మన్నారు. అది రన్నింగ్ మేటర్ కాదు. ఒక హిందీ పదం, ఒక తెలుగు పదం చెయ్యాలి టైం పడుతుంది. ఆయన అడిగినట్లు చేసి మెయిల్ చేశాము.

 

ఆయనకి అది నచ్చింది కానీ... మేము చేసే పనిని ఆయన తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. తర్వాత రెండుసార్లు ఫోన్ చేశారు కానీ... మేము ఏదో చెప్పి తప్పించుకున్నాం.

 

నాకు మళ్ళీ ఆయనకి సంబంధించిన పని చెయ్యాలనిపించలేదు. దీనికి కారణాలు చాలా వున్నాయి. ఆయన 80 సంవత్సరాల లోపు ఎన్నో గొప్ప పుస్తకాలు రాసారు.

42 సంవత్సరాల కిందటి గొప్ప వ్యక్తిత్వం ఆయనలో చూడలేకపోయానేమో... తెలియదు.

 

ఆయన శ్రీమతి గారు ఆడపిల్ల ఇంటికి వచ్చిందని చక్కటి చిరునవ్వుతో జాకెట్టు గుడ్డ, తాంబూలం ఇచ్చి పంపించారు.

 

తర్వాత నేను ఈ వెంకట శివయ్యని మర్చిపోయాను. తాడేపల్లిగూడెం వచ్చిన ఆ గొప్ప వ్యక్తిని మాత్రమే నేను గుర్తుంచుకున్నాను.

 

మా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మా తెలుగు లెక్చరర్  నన్ను నీకు ఏ కావ్యం అంటే... ఇష్టం అని అడిగారు. వసుచరిత్ర అని చెప్పాను.

ఇది నేను ప్రణయకావ్యంగా చెప్పలేదు.

అందులో ఉన్న సాహిత్య, సంగీతపరమైన అర్థం గురించి చెప్పాను.

ఎందుకు ఇష్టం అని అడగలేదు. నవ్వారు.

ఎందుకో ఆ నవ్వు నాకు నాకు నచ్చలేదు.

తరవాత మిగిలిన లెక్చరర్స్ తో చెప్పి నవ్వారు.

తెలుగు లెక్చరర్ అలా అనడం నాకు నచ్చలేదు.

 

అయినా భట్టుమూర్తి తర్వాత ఇటువంటి కావ్యం మరొకటి రాలేదు.

దాని వెనక ఆయన కృషి ఎంత గొప్పదో.... మన ఊహకి అందనిది.