25, జనవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -6

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -6


పెద్దక్క అన్నపూర్ణ బ్యాంకికి వెళ్ళి వస్తూండేది. అప్పుడప్పుడు ఓవర్ టైమ్ చేసేది. అటువంటప్పుడు అమ్మ ఫ్లాస్క్ లో కాఫీ, ఏదో ఒక టిఫిను అక్కకి ఇచ్చిరమ్మనేది. నడిచే దూరమే కాబట్టి మేము ఇచ్చేసి వచ్చేవాళ్ళం. అప్పటివరకూ చదువులోనే ఉన్న అక్కకి ఉద్యోగంలో సద్దుకోవడం కొత్తగా వుండేది. అమ్మ అక్కకి ఏ పనులూ చెప్పేది కాదు. 

తర్వాతి అక్కలైన రమ, ఉమ ఇద్దరూ డిగ్రీలోకి వచ్చారు. నేను ఇంటర్ లో చేరాల్సి వచ్చింది. కాలేజీ పెంటపాడు అనే చిన్న వూర్లో వుండేది. తాడేపల్లి గూడెం నుంచి పెంటపాడు మూడున్నర కిలోమీటర్లు. అక్కలిద్దరూ కాలేజీ బస్ లో వెడుతుండేవారు. టికెట్ 25 పైసలు.  అప్పుడప్పుడూ వచ్చేటప్పుడు నడిచి వచ్చేసేవారు. వాళ్ళిద్దరూ చదువులో ఎప్పుడూ ముందరే వుండేవారు. 

నేను టెన్త్ క్లాస్ పాసయ్యాను. కాలేజీలో చేరాలని వుంది. నాకు మరీ ఫస్ట్ క్లాస్ మార్కులు రాకపోయినా బాగానే వచ్చాయి. అక్కని ఇబ్బంది పెట్టకూడదని వుంది కానీ, కాలేజీలో చదివితే బాగుంటుంది అనుకున్నాను. అక్క కూడా అభ్యంతరపెట్టలేదు. గవర్నమెంటు కాలేజీ అవడంతో సంవత్సరానికి ఫీజు చాలా తక్కువ వుండేది.  ఇక వెళ్ళడానికి రావడానికి డబ్బులు చూసుకోవాల్సి వచ్చేది.  పేరుకి గవర్నమెంట్ కాలేజీనే కానీ లెక్చరర్స్ అందరూ చాలా బాగా చెప్పేవారు. నేను తీసుకున్న గ్రూపు హెచ్.టి.సి. (హిస్టరీ, తెలుగు, సివిక్స్). 

 
మా ఫ్రెండ్స్
ఎడమ నుంచి మొదలు నేను, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, సరస్వతి

తెలుగు లెక్చరర్స్ రామారావుగారు, ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు  వుండేవారు. ఇద్దరూ తెలుగు చాలా బాగా చెప్పేవారు. రామారావుగారు పాటలి అనే నాన్ డీటెయిల్డ్ చెప్తుంటే కథలో లీనమయిపోయేవాళ్ళం. రామచంద్రమూర్తిగారు పద్యాలు చక్కగా పాడి చెప్పేవారు.  హిస్టరీ, సివిక్స్ లెక్చరర్స్ చెప్పక్కరలేదు. మా క్లాసులో 125 మంది వుండేవారు. అమ్మాయిలు 13 మంది. మిగిలినవాళ్ళందరూ అబ్బాయిలే.  మాకు ఫస్ట్ బెంచీలలో అబ్బాయిలు తప్ప మిగిలిన వాళ్ళు తెలిసేవాళ్ళు కాదు.  ఎవరూ ఏడిపించడాలు అవీ వుండేవి కాదు. 

 మాకాలేజీ వెనకవైపు తోటలో
గొబ్బి పువ్వులు

 మా కాలేజీ బిల్డింగ్స్




కాలేజీ చుట్టుపక్కలంతా పొలాలు, మామిడి తోటలు వుండేవి.  అప్పుడప్పుడు క్లాసు లేనప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. మామిడి చెట్ల మధ్యన ఒక చెరువు వుండేది. ఆ చెరువు లో నీలం రంగు కలువ పువ్వులు వుండేవి. చెరువు గట్టు మీద గొబ్బీ పూల చెట్లు వుండేవి.  ఆ పువ్వులన్నీ కోసుకుని, అక్కడ అరటి చెట్ల నారతో దండలు కట్టుకుని తలలో పెట్టుకునేవాళ్ళం.  అక్కడ పొలాలలో వేరుశనగ పంట తవ్వి పక్కన పెడితే ఆ కాయలు తెచ్చుకుని తినేవాళ్ళం. ఆరోజులు చాలా బావుండేవి.  ఆ చెట్లు, గడ్డిమేట్లు ఎంతో ఆనందాన్నిచ్చేవి. 

కాలేజీకి వెళ్ళే దారంతా పచ్చటి పొలాలతో నిండుగా వుండేది. వరి పొలాలు గాలికి నదీతరంగాలలా కదులుతూ వుండేవి. రిక్షాలో వెడుతుంటే చల్లటి గాలి చెంపలని తాకుతుంటే చాలా హాయిగా అనిపించేది. సాధారణంగా నలుగురమో, ఐదుగురమో కలిసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ వచ్చేటప్పుడు ఒక ఇంటి చుట్టూరా కనకాంబరం తోట వుండేది. వాళ్ళు ఆ పువ్వులు వందల లెక్కన అమ్మేవారు. ఆవన్నీ కోసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఒక చక్కటి వాతావరణం వుండేది. అసలు పొల్యూషన్ అనేదే వుండేది కాదు. అలా నా కాలేజీ జీవితం ఆనందంగా గడిచిపోయింది. నాకు తెలుగులో ఇంటర్ లో కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఆ సంవత్సరం వార్షికోత్సవానికి ప్రైజు తీసుకుందామనుకుంటే ఎందుకో కాన్సిల్ చేశారు. 

అక్కలిద్దరికీ డిగ్రీ అయిపోయింది. నాకు ఇంటర్ అయిపోయింది. నేను డిగ్రీ కాలేజీలో చేరాలి. ఈలోపున తాడేపల్లిగూడెంలోనే డిగ్రీ వుమెన్స్ కాలేజీ పెట్టారు. దానికీ డబ్బులు కావల్సి వచ్చింది. అక్క ముందు ప్రైవేట్ గా చదవమంది కానీ, మళ్ళీ కాలేజీలో చేర్పించింది. మేము క్లాసులో 7గురం అమ్మాయిలం వుండేవాళ్ళం. మాది కాలేజీకి ఫస్ట్ బాచ్. మొత్తం కాలేజీ లో స్టూడెంట్స్ తక్కువే వుండేవారు. ఇంటి నుంచీ 10 నిమిషాల నడక. డబ్బు ఖర్చు వుండేది కాదు. ఇక్కడ స్పెషల్ తెలుగు తీసుకున్నాను. లెక్చరర్స్ అందరూ అప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చినవాళ్ళు. అందరూ చాలా హుషారుగా క్లాసులు చెప్పేవారు. 

అక్కలిద్దరికీ డిగ్రీ అయిపోవడంతో... రెండో అక్క ఒక స్కూల్లో టీచర్ గా చేరింది. ఇంతలోకే హైదరాబాద్ లో వున్న మా మేనత్త కూతురు వాళ్ళు వాళ్ళని ఉద్యోగం వుంది హైదరాబాద్ రండి అన్నారు. ఇద్దరూ హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. అయితే వాళ్ళు మూడో అక్కకి ఉద్యోగం ఇప్పించారు. రెండో అక్క మళ్ళీ వెనక్కి వచ్చి స్కూల్లో చేరిపోయింది. కానీ తను ఏమైనా సరే హైదరాబాద్ లో ఉద్యోగం సంపాయించాలనుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. తనకి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు చేసే కంపెనీలు తెలుగు వాళ్ళవి కాదు కాబట్టి ఇద్దరికీ ఇంగ్లీషు, హిందీ బాగా వచ్చాయి. 

 ఇది పార్వతమ్మ వాళ్ళిల్లు ఎవరో కొనుక్కుని షాపు పెట్టుకున్నారు.


                                                                    అంతా తిరిగి చూశాను.

ఇక తాడేపల్లిగూడెంలో నేను, పెద్దక్క, మిగిలిన చెల్లెళ్ళు వున్నాం. మేము ఉన్న ఇంటి ఓనరు వాళ్ళు విజయనగరం వాళ్ళు. పిల్లలు లేరు. భార్య, భర్త వుండేవారు. ఆయన పేరు కలియుగార్జున్, ఆవిడపేరు పార్వతమ్మ. ప్రేమగా బాగానే వుండేవారు. కానీ, ఆయన మైక్ పెట్టుకుని చేసే భజనలే చాలా ఇబ్బందికరంగా వుండేవి. ఆ చప్పుడు భరించలేకపోయేవాళ్ళం. అప్పుడప్పుడు మా తెలుగు లెక్చరర్ గారు వచ్చి రకరకాల పాటలు నేర్పిస్తుండేవారు. వాటిలో పుట్టపర్తి సాయిబాబా భజన పాటలు కూడా వుండేవి. అవి వాళ్ళకి నచ్చేవి కావు.  వద్దంటే మానేసే వాళ్ళం. కానీ ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. కొంచెం కష్టంగానే అనిపించింది.  జీవితంలో రకరకాల కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. 

దగ్గరలోనే మర్ధువులు కొత్తగా ఇల్లు కట్టారు. కానీ ఇంకా కరెంట్ సప్లయ్ ఇవ్వలేదు. అయినా సరే ఆ ఇంట్లోకి మారిపోయాం. సరిగ్గా నాకు డిగ్రీ పరీక్షలు కరెంటు వుండేది కాదు. పగలు ఎలాగో ఇబ్బంది పడేవాళ్ళం. రాత్రి చిన్న కిరసనాయిలు దీపం పెట్టుకుని డాబా మీద చదువుకునేవాళ్ళం. చదువు మాత్రం బాగానే సాగింది. వేసవి కాలంలో రాత్రిపూట డాబా మీద పడుకునేవాళ్ళం కింద ఇల్లు తాళం పెట్టి. 

ఉగాదికి రెండో అక్క మూడో అక్క హైదరాబాద్ నుంచి వచ్చారు.  అందరం కొత్త బట్టలు కట్టుకుని పండగ బాగా చేసుకున్నాం. రాత్రి అందరం డాబా మీద పడుకున్నాం. కింద చప్పుడు వినిపిస్తే అమ్మ లేచి కిందకి చూసిందిట. దొంగలు కిటికీ తలుపు తెరిచి కిటికీలోంచి మా కొత్తబట్టలన్నీ తీసి మూటకట్టుకుని వెళ్ళిపోయాడుట. గట్టిగా అరిస్తే దొంగలు ఏం చేస్తారోనని వాడు మూటకట్టుకుని వెళ్ళేవరకూ చూస్తూ నుంచుందిట. అలా అపురూపంగా కొనుక్కున కొత్తబట్టలు దొంగలపాలయ్యాయి. 

అయితే దేనికీ ఏడవడం అలవాటు లేదు కాబట్టి అందరం కొంచెం బాధపడి వూరుకున్నాం. 








2 కామెంట్‌లు:

  1. క్రింద నుండి మూడో పేరాలో “మర్ధువులు” అన్నారు. అంటే ఎవరండి? మధ్వులు అని మీ ఉద్దేశమా?

    రిప్లయితొలగించండి
  2. మరి మీరు ఏమంటారో కానీ.... మర్ధువులు ఎక్కువ కృష్ణ భక్తులు వుంటారు. వారికి చాలా ఆచారాలు ఉంటాయి. (మా చిన్నప్పుడు వాళ్ళ గురువులు వచ్చి శంఖ చక్రాలు ఉన్న వేడి వేడి ఇనుప అచ్చులతో పిల్లల గుండెలమీద శంఖ చక్రాలు వేసేవారు). మేము మరి ఇలాగే అనేవాళ్ళం. మీరు అన్నదే కరక్ట్ కావచ్చు. మధ్వులు అయ్యుండచ్చు.

    రిప్లయితొలగించండి