28, సెప్టెంబర్ 2022, బుధవారం

ముద్రణా పనులతో ముందుకు వెడుతున్న మేము - 51 *** హైదరాబాదులో శివానందాశ్రమం, ఋషీకేశ్ వారి కార్యక్రమాలతో... బిజీ *** *** శిశుసంక్షేమ భవన్ తో ఏర్పడిన సంబంధాలు ***

ముద్రణా పనులతో ముందుకు వెడుతున్న మేము - 51


 *** హైదరాబాదులో శివానందాశ్రమం, ఋషీకేశ్ వారి కార్యక్రమాలతో... బిజీ ***

 *** శిశుసంక్షేమ భవన్ తో ఏర్పడిన సంబంధాలు  ***



కేరళ ఆనందాశ్రమం వర్కు మేము చేశామని తెలిసి, శివానందాశ్రమం నుంచి ఒకాయన వచ్చి వర్కు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు సికిందరాబాద్ లో తారా గుప్త అని లక్షాధికారుల ఇంట్లో దిగారు. తారా గుప్తా వాళ్ళు శివానందాశ్రమం వాళ్ళవి హైదరాబాద్ లో ఒక వారం పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల ఆహ్వానపత్రికలు, బేనర్లు, బాడ్జిలు, చిన్న చిన్న ఫోల్డర్లు కలర్ లోనూ, వాళ్ళ పుస్తకాలు మూడు చేశాము. నేను ఇంట్లో మేటర్ అంతా చేస్తుంటే, మా వారు ఆఫీసు నుంచి వచ్చి బయట ప్రింటింగ్ వర్క్సు సంగతి చూసుకునేవారు. వాళ్ళ కార్యక్రమాలకి ముందు ఒక పది రోజులు రాత్రి పగలు నిద్ర లేకుండా ఈ పనే సరిపోయింది. ఎవరైనా తెలుగు వర్కుకి వెతుక్కుంటూ మా దగ్గిరికే వచ్చేవారు.


*** ఫోటోలో శివానందాశ్రమం, ఋషీకేశ్) ***

*** మన దారిన మనం చేసుకునే పనికి కూడా సందేహాలా...? ***

మా ఇల్లు పెద్ద గేటు దాటి లోపలికి రావాలి. సెక్యూరిటీ ఉంది కాబట్టి మేము రాత్రి వర్కు చేసినంతసేపూ తలుపు తీసుకునే కూచున్నాము. మేము రాత్రి 12 గంటలకి ప్రింట్స్ తీస్తుంటే ఒక పోలీసు వచ్చి కర్రతో తలుపుమీద టకటక కొట్టి ,"ఇంత రాత్రి ఏం చేస్తున్నారు?" అని అడిగాడు. మాకు ముందు అర్థం కాలేదు. సరే మేము చేసే వర్కుల గురించి చెప్పి అన్నీ చూపించాము. అందులోను అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కు కూడా చేస్తున్నాము. ఇంక అది చూసి అసలు మాట్లాడలేదు. అప్పుడు అతను “బావుందండీ మీ వర్కు. సారీ....” అనేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచీ తలుపులు వేసుకుని పని చేసుకునేవాళ్ళం. ఆ టైములో ఎందుకో పోలీసులు రోడ్ల మీద బాగా తిరిగేవారు.

శివానందాశ్రమం వర్కంతా అయ్యి, కష్టానికి తగిన ఫలితం తీసుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.
******




నాలుగు రోజుల తర్వాత రాఘవ అనే అతను వచ్చి “మేడమ్ యూసఫ్ గూడాలో స్టేట్ హోమ్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మా మేనేజర్ సంధ్యగారు మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు” అన్నాడు.

అడ్రస్ తీసుకుని వెళ్ళాను. స్టేట్ హోం గేటులోకి వెళ్ళగానే కుడివైపున గవర్నమెంట్ ప్రెస్ వుంది. అక్కడ సంధ్య (Progressive Organisation of Women's (POW) గారు కూచుని వున్నారు. నేను వెళ్ళగానే కూచోమని చెప్పి “మా దగ్గిర తెలుగు వర్కు వుంటుంది. చేస్తారా... అయితే మేము ఫోన్ చేసి నప్పుడు మీరు వచ్చి తీసుకోవాలి. మీరే వచ్చి మాకు తెచ్చి ఇవ్వాలి” అన్నారు. అప్పటికప్పుడు ఒక పుస్తకం చెయ్యమని ఇచ్చారు. దానికి కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు. మీరు మేటర్ చెయ్యండి మేము ఫోటోలు ఎక్కడ పెట్టాలో చెప్తాము అన్నారు. మొత్తం పుస్తకం ఫోటోలతో సహా చేసి ఇచ్చాను. వాళ్లు ఏమైనా చెప్తే మారుద్దామని. కానీ వాళ్ళకి అది ఎంత నచ్చిందంటే.... మేము దీనిని డైరెక్టు ప్రింట్ చేసేసుకుంటాము. అని ఏవో చిన్న కరక్షన్స్ చెప్పి ఫైనల్ తీసేసుకున్నారు. అప్పటి నుంచీ సంధ్యగారు మాకు వర్కులు రెగ్యులర్ గా ఇచ్చేవారు. అందులో ఆవిడ ఆడవాళ్ళకి సపోర్టు కాబట్టి చాలా ఓపికగా మాట్లాడి పనులు చేయించుకునేవారు. ప్రెస్ లో ఉన్న వాళ్ళకి చాలా రకాల సాయం చేసేవారు. వాళ్ళు ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్పేవారు.

*** మాతా శిశు సంక్షేమ విహార్ లో లోకం తెలియని పసిపిల్లలు ***

ఆ ప్రెస్ నుంచి కొంచెం లోపలికి వెడితే అక్కడ చాలా ఆఫీసులు ఉన్నాయి. మాతా శిశు సంక్షేమ భవన్ కూడా ఉంది. అప్పుడు ఒక పెద్ద సంచలనం వచ్చింది. అనాధాశ్రమాల పేరిట ఎక్కడెక్కడ నుంచో పిల్లలని తీసుకువచ్చి వాళ్ళని విదేశాలకి ఎగుమతి చేసేవారుట. ఈ సంగతి ఎలాగో బయటపడి ఆ పిల్లలందరినీ తీసుకుని వచ్చి ఈ శిశు సంక్షేమ భవనంలో పెట్టారు. మొత్తం మూడు నాలుగు పెద్ద పెద్ద రూములు పిల్లల ఏడుపులతో దద్దరిల్లిపోతున్నాయి. నాకు ఇదంతా అక్కడ వాళ్ళు చెప్పారు.

మా పిల్లలకి సమ్మర్ హాలీడేస్. మర్నాడు వర్కు ఇవ్వడానికి వెడుతూ వాళ్ళిద్దరినీ కూడా తీసుకునివెళ్లాను. సంధ్య గారితో మాట్లాడడం అయ్యాక వాళ్ళిద్దరికీ ఆ చంటిపిల్లలని చూపిద్దామని తీసుకుని వెళ్ళాను.

వరసగా అందరినీ ఉయ్యాలలో పడుకోపెట్టారు. కొందరు నిద్ర పోతున్నారు. కొందమంది వుయ్యాలకి కట్టిన బొమ్మలు చూస్తూ ఆడుకుంటున్నారు. పిల్లలందరూ బలే ముద్దుగా వున్నారు. అందరూ 6 నెలలకి అటూ ఇటూ వాళ్ళే. ఉయ్యాలల దగ్గిరకి వెడుతూ మా పిల్లలకి చూపిస్తుంటే పాపం ఆ చంటిపిల్లలు నవ్వుతూ నడ్డి లేపుతున్నారు. కొంతమంది పిల్లలు చేతులు అందిస్తున్నారు.

నాకు ఒక్కసారి చాలా బాధగా అనిపించింది. మతాలు, కులాలకి అతీతంగా ఎవరు ఎత్తుకుంటారా అన్నట్లు చూస్తున్నారు. నాలుగు ఉయ్యాలలకి ఇద్దరు ఆయాలని పెట్టారు. దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. ఏ కారణాలుగా వీళ్లు అనాథలయ్యారో అనిపించింది. కొత్త ప్రపంచంలో ముందు ముందు వీళ్ళు ఏం చూడబోతున్నారో.... ఎవరు ఏమవుతారో అని అనిపించింది ఆ క్షణంలో. కానీ నాలుగు రోజులు ఆ చేతులు చాపుతున్న పిల్లలే కళ్ళముందర కనిపించారు.

**** కానీ పిల్లలని అరేబియా వాళ్ళు ఎక్కువ కొనుక్కునేవారని విన్నాను. వాళ్ళు ఒంటెల కాళ్ళకి పిల్లలని కట్టి ఒంటెల పోటీలకి వెళ్ళేవారుట. పిల్లలు ఏడుస్తుంటే ఒంటెలు బాగా పరుగెత్తేవిట. ఎంత దారుణమో అనిపించింది. ఈ అనాథ పిల్లలని చూశాక నేను మా పిల్లలని ఎక్కడ మిస్సయిపోతారో అని కనిపెట్టుకుని వుండేదాన్ని. ****

మా అబ్బాయికి నాలుగు సంవత్సరాలు. వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. “అమ్మా... పాపం ఎత్తుకో... మనం ముగ్గురుని తీసుకుని వెడదాం” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏదో చూస్తారని వస్తే... అనుకుంటే.... “తీసుకో అమ్మా... ఇంట్లో బావుంటుంది ఆడుకుంటాను” అన్నాడు. నేనేమీ మాట్లాడకుండా వాడివంకే ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఇంక ఏడుపు మొదలు పెట్టాడు. అవి బొమ్మలా తీసుకుని వెళ్ళడానికి. “సరేలే... అక్కడొక ఆంటీ వున్నారు కదా... చెప్పి తీసుకుని వెడదాం” అని అన్నాక ఏడుపు మానాడు.

ఇంక వెంటనే మా అమ్మాయి... “అమ్మా నిజంగా తీసుకు వస్తావా... అసలే మేమే చిన్నపిల్లలం. నువ్వు వర్కు చేసుకోవాలి కదా... ఇంకో ముగ్గురుని తీసుకు వస్తే ఎలాగ... వాళ్ళకి పాలు కూడా చాలా కావాలి. ఇల్లు ఇంకా పెద్దది కావాలి. ఏం తీసుకు రావద్దు” అని ఏడు సంవత్సరాలకే కుటుంబం గురించి బాధ్యత తెలిసినట్లు చెప్పడం మొదలు పెట్టింది.

నాకు ఇద్దరినీ చూస్తే నవ్వొచ్చింది. వీణాకి సైగ చేసి, మా వాడితో రేపు మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఎవరికీ ఇవ్వరుట అని బయటికి వచ్చాం. అమ్మో చాలా పేచీ పెట్టేశాడు. వాడు ఇప్పటికీ పిల్లలు కనిపిస్తే ఆడుతూ కూచుంటాడు.

8 కామెంట్‌లు:

  1. మీఅమ్మాయి మాటలు ఎంతో బాగున్నాయి.. ఏడేళ్ళపిల్లకు ఎంత ఆలోచనా ఎంబాధ్యతా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మా అమ్మాయి 7 సంవత్సరాలకి అంత బాధ్యతగా మాట్లాడితే...- వాళ్ళ పాప (వీళ్ళు ఆస్ట్రేలియాలో వుంటారు) అక్టోబర్ కి మూడు పూర్తయి నాలుగు వస్తుంది. అది ఇలాగే మాట్లాడుతుంది. ఒకోసారి ఆరిందాలా అది మాట్లాడే మాటలకి మేము షాకవుతాం. ఇండియా వచ్చిన మూడు వారాల్లో తెలుగు బాగా నేర్చేసుకుంది. ఎక్కడ నుంచి వస్తాయో ఆ మాటలు అనిపిస్తుంది. ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారేమో... అనిపిస్తుంది.

      తొలగించండి
  2. ఒకప్పుడు గూర్ఖా అలా గస్తీ తిరిగేవాడు రాత్రిళ్ళు, గేటు ఊచలకి తన కర్ర తగిలించి చప్పుడు చేసేవాడు. ఈ అపార్ట్-మెంట్ల కాలం వచ్చిన తరువాత ఆ గూర్ఖాలు కూడా మాయమైపోయినట్లున్నారు 😧.

    స్టేట్ హోం బోర్డ్ ఫొటో తీసి దాచుకున్నట్లున్నారే మీరు. మంచి పని చేసారు.. మెట్రో రైల్ స్టేషన్ (మధురానగర్) కోసం అధికభాగం కూల్చేసినట్లున్నారు. ఇదివరకున్నంత ప్రముఖంగా కనబడదు రోడ్డు మీద నుంచి. ఈ మధ్య అటువైపు వెళ్లలేదు లెండి.

    మీ అమ్మాయి ఆనాడు మాట్లాడిన మాటల్లో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధారణంగా ఆడపిల్లలు త్వరగా పరిస్ధితిని అంచనా వెయ్యగలరు (నేను చెప్పేది ఒకప్పటి సంగతి. ఈ తరం వారి గురించి నేనేమీ చెప్పలేను).

    రిప్లయితొలగించండి
  3. అవును సర్ గూర్ఖాలు వుండేవారు. ఇప్పుడు ఎవరైనా వీధికో ఇంటికో పెట్టుకుంటే తప్ప వుండట్లేదు.

    స్టేట్ హోంతో మాకున్న అనుబంధం చాలా గొప్పది.

    అవును సర్. ఆడపిల్లల మనస్తత్వం వేరే వుంటుంది. ధన్యవాదాలుసర్.

    రిప్లయితొలగించండి
  4. నిజం చెప్తున్నాను. మీ అబ్బాయీ అమ్మాయీ మాట్లాడిన మాటలు ఎంత ముచ్చట గొలిపాయీ అంటే వాటి కోసమే ఈటపాను ఇప్పటికే అనేకసార్లు చదివాను!

    రిప్లయితొలగించండి