30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

*** అద్భుతమైన పిల్లల ప్రపంచం ఆ ఇల్లు *** - 52

 

*** అద్భుతమైన పిల్లల ప్రపంచం ఆ ఇల్లు *** - 52

నేను ఎప్పుడూ నా పనిలో మునిగి తేలుతూనే వున్నా...  పిల్లలని పట్టించుకోకపోవడం అనేది ఉండేది కాదు.


మేమున్న ఇల్లు 20 పోర్షన్లతో ఈ చివరి నుంచి ఆ చివర వరకూ అపార్ట్ మెంట్ లాగా వుండేది. అక్కడ అందరూ చాలా కలిసిపోయి వుండేవారు. దాదాపు 20 మంది పిల్లల దాకా వుండేవారు. ఎప్పుడూ ఎవరూ ఎరితోనూ గొడవలు పడలేదు. వాళ్ళవల్ల పెద్దవాళ్లకి కూడ గొడవలు రాలేదు. హోం వర్కులు అయిపోగానే పిల్లలందరూ కలిసి రెండు ఫ్లోర్లున్న ఆ బిల్డింగ్ లో ఎక్కడో అక్కడ ఆడుకుంటూ వుండేవారు. మధ్యమధ్యలో నేను ఇంట్లో వర్కు చేసుకుంటూ  ఉన్నానో లేదో అని ఒకసారి తొంగి చూసేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు.

 

ఇంక పండగలు సెలవులు వస్తే ఆడపిల్లలు ఒకళ్ళమీద పోటీగా ఒకళ్ళు బుట్టబొమ్మల్లా  రెడీ అయి అందరూ కలిసి ఆడుకునేవారు. సందడే సందడి. అరుపులు, పరుగులు, కేకలతో సందడి సందడిగా వుండేది.  అసలు ఆ బిల్డింగ్ ఒక అద్భుతమైన పిల్లల లోకంలా వుండేది. నేను ఎక్కడికైనా వెడితే ఎవరో ఒకళ్ళ ఇంట్లో పిల్లలు చాలా సేఫ్ గా వుండేవారు. వాళ్ళు తినడానికి ఏదో ఒకటి పెట్టేవారు. అది ఒక రక్షణనిచ్చే కోట.  కానీ అస్తమానం అలా వదిలేసేదాన్ని కాదు.  

 

పిల్లలకి  ఎప్పుడైనా హోటల్ కి వెళ్ళాలనిపిస్తే, మేం నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళం. మా వారికి కుదరక పోతే నేనే పిల్లలని తీసుకుని వెళ్ళేదాన్ని. అమీర్ పేటలో స్వాతీ హోటల్ టిఫిన్స్ కి చాలా బావుండేది. ఇంటి దగ్గర ఆటో ఎక్కితే 10 రూపాయలు అయ్యేది. అప్పుడు ఎక్కడపడితే అక్కడ టిఫిన్ సెంటర్లు లేవు. హోటల్ కి వెళ్ళాలంటే అమీర్ పేటే. (ఈ మధ్య సంజీవరెడ్డి నగర్ వెడితే ఎన్నో టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, సబ్ వే లు, ఐస్ క్రీం సెంటర్లు, పానీపూరీ బండీలు ఒకటి కాదు చెప్పలేనన్ని ఉన్నాయి.)


నేను మా అమ్మాయిని, అబ్బాయిని ప్రతి శనివారం రేడియో స్టేషన్ కి తీసుకుని వెళ్ళేదాన్ని. అబ్బాయికి పాల బాటిలు, మంచినీళ్లు బాటిలు, అమ్మాయి తినడానికి చిరుతిండి ఒక బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళేదాన్ని.

 

 పిల్లల ప్రోగ్రాంలో మా అమ్మాయి నేను నేర్పిన పాటలు పాడుతుండేది. అక్కడ రేడియో అక్కయ్యగారికి బాగా అలవాటయిపోయింది. వాళ్ళు చూపించే ప్రేమ చాలా బావుండేది. మా అబ్బాయి చిన్నవాడు కాబట్టి వాడిని పెట్టుకుని బయట కూచునేదాన్ని. ప్రోగ్రాం అయిపోయాక ఇద్దరినీ తీసుకుని పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళి కాసేపు అక్కడ ఆడించి, అక్కడ ఉన్న మ్యూజియం చూపించి తీసుకుని వచ్చేదాన్ని. వాళ్ళకి బయటి ప్రపంచం తెలియాలనుకునేదాన్ని.  ప్రకృతిని ఆస్వాదించడం నేర్పించాను.  కావలసిన తిండి అంతా పట్టికెళ్ళేదాన్ని కాబట్టి ఇంటికి వచ్చే వరకూ ఇబ్బంది ఉండేది కాదు.

 

అక్కడికి *** లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ*** పెట్టకముందు సామాన్యుడుగా ఉన్న రామాచారిగారు  వచ్చేవారు. తను కూడా చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రాములకి వచ్చేవారు కాబట్టి అందరినీ పలకరించి మాట్లాడేవాడు. వాళ్ళ ఆవిడ కూడా బాబుని తీసుకుని వచ్చేది. వాళ్ళు మాకు చాలా మంచి స్నేహితులయ్యారు. నేను వాళ్ళింటికి కూడా వెళ్ళాను. తరవాత అతనూ అతని ప్రోగ్రామ్స్ తో....  నేనూ నా పనులతో బిజీ అయిపోయాము.


మా పిల్లలని రేడియో స్టేషన్ కి తీసుకుని వెడుతుంటే పక్కింటి వాళ్ళ పిల్లలు సౌమ్య, సౌజన్య, కామేశ్వరి, పెద్ద నాని, చిన్న నాని, శ్రావణి, అవినాశ్ కూడా రేడియో స్టేషన్ కి వచ్చేవారు. వాళ్ళు పాడిన పాటలు ఆ టైముకి ఇంటి దగ్గర వాళ్ళు విని ఆనందించేవారు. పిల్లలతో ఉన్న *** నన్ను చూసి అందరూ టీచర్ ని*** అనుకునేవారు.


ఒక శనివారం రేడియోస్టేషన్ నుంచి జవహర్ బాలభవన్ కి తీసుకెళ్ళాను. అక్కడ పిల్లలు ఏమేం నేర్చుకుంటున్నారో చూపిస్తున్నాను. ఇంతలో అక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒకావిడ వచ్చి మీ పిల్లలని *** నవంబర్ 14కి ఖవ్వాలీ (బచ్చే హమ్ బాల్ భవని కి...) *** వుంది దానికి పంపిస్తారా, మీ పిల్లలకి మేము నేర్పిస్తాముఅన్నారు.



నేను పిల్లలు చెయ్యగలరా లేదా అని కూడా ఆలోచించకుండా అవకాశం వచ్చింది కదా అని సరే అన్నాను. అప్పటికి నవంబర్ 14 వారం రోజులు వుంది. అప్పుడు పిల్లలకి దసరా శలవులు వచ్చినట్టున్నాయి. రోజూ ఒక గంట తీసుకురమ్మన్నారు. పైగా ఇంకా పిల్లలు కావాలన్నారు. పిల్లలు మా బిల్డింగ్ లోనే వున్నారు కదా... వాళ్ళకి ఓకే చెప్పేసి ఇంటికి వచ్చేశాను.


నేను పిల్లలందరినీ వాళ్ళ అమ్మలని సమావేశపరిచి విషయం చెప్పాను. నా మాటకి ఎదురు వుండేది కాదు. అందరూ సరే అన్నారు. నేను నా దగ్గిర వర్కు నేర్చుకోవడానికి వచ్చిన రమకి పని అప్పచెప్పి, స్కూలు టీచర్ అయిన సౌమ్యావాళ్ళమ్మ సాయంతో - సౌమ్య, సౌజన్య, కామేశ్వరి, పెద్ద నాని, చిన్న నాని, శ్రావణి, అవినాశ్, వీణ, శ్రీవత్స మొత్తం 10 మంది పిల్లలని తీసుకుని బాలభవన్ కి వెళ్ళాం. పిల్లలందరూ చక్కగా నేర్చుకున్నారు. నవంబరు 14న శిల్పారామంలో ఆ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. బాలభవన్ వాళ్ళే పిల్లలకి, తల్లితండ్రులకి బస్ ఏర్పాటు చేసి తీసుకెళ్ళి, మళ్ళా ఇళ్ళ దగ్గిర దింపారు. పిల్లలందరికీ అదొక మంచి అందమైన జ్ఞాపకం.





పిల్లలందరూ బిర్లామందిర్ లో డ్రాయింగ్ కాంపిటీషన్స్, బాలభవన్ లో పాటల పోటీలు, హైదరాబాదులో ఎక్కడేం జరిగినా వీళ్ళు హాజరయ్యి, ప్రైజులు కొట్టేసేవారు. ఒకసారి సంజీవరెడ్డి నగర్ అసోసియేషన్ వాళ్ళు నవంబర్ 14కి పిల్లలకి ఎన్నోరకాల పోటీలు పెట్టారు. అందరికీ అన్నింట్లోనూ ప్రైజులు వచ్చాయి. మా అబ్బాయి మ్యూజికల్ ఛైర్స్ పోటీకి వెడతానన్నాడు. కానీ అందరిలోకీ వీడే చాలా చిన్నవాడు. అందరి మోకాళ్ళ దగ్గిరకి వచ్చాడు. నాకు ముందు భయం వేసింది కానీ, చిన్నూ నువ్వు ఎవ్వరి వంకా చూడకు కుర్చీ వంకే చూడు నీకే ప్రైజ్ వస్తుంది అని చెప్పాను. అలాగే చేశాడు. ఫస్ట్ వచ్చాడు.  ఇప్పుడు జీవితం కూడా మ్యూజికల్ ఛైర్స్ అని తెలుసుకున్నాడు.


అంతే కాదు ఆ మేడలో వేసవి సెలవుల్లో అల్లరి చెయ్యకుండా మా అమ్మాయి వీణ, సౌమ్య కలిసి అందర్నీ పోగేసి తలొక పేపరు ఇచ్చి డ్రాయింగ్ వెయ్యమని, వాటిని దుప్పట్లకి పిన్నులతో పెట్టి, ఎగ్జిబిషన్ కి పెద్దవాళ్ళందరినీ పిలిచేవారు. పెద్దవాళ్ళకి వాళ్ళు వేసిన బొమ్మల గురించి చెప్పేవారు.  

 

ఇక జనవరి ఫస్ట్ లాంటి పండగలుంటే రాత్రి పూట రకరకాల నాటకాలు, డాన్సులు, పాటలతో పెద్దలనందరినీ అలరించేవాళ్ళు. వీళ్ళకి వీళ్ళే మధ్యలో నా సలహాతో రకరకాల ప్రోగ్రాములు చేసుకునేవాళ్ళు.


టీవీలో simarik అని Tarkan పాప్ సింగర్ మ్యూజిక్ వచ్చేది. అతను పాడుతూ తిరుగుతుండేవాడు. అదంటే పిల్లలందరికీ ఇష్టం. దానికి ఒక టైమేమి వుండేది కాదు. అందరూ ఎవరిళ్ళలో టివీ చూస్తుండేవారు. ఆ మ్యూజిక్ వస్తుంటే ఎవరైనా మిస్సయిపోతారేమోనని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి చెప్పుకుంటూ వుండేవారు. కానీ ఈ లోపున ఆ మ్యూజిక్ సగం అయిపోయేది. వాళ్ళ హడావుడి చూస్తే బలే తమాషాగా వుండేది.

 

శలవులు వస్తే చాలు ఆంటీ ప్లాన్ వెయ్యండి అని నా దగ్గిరకి పరిగెత్తుకొచ్చేవారు. ఒకసారి పబ్లిక్ గార్డెన్స్, మ్యూజియం, గోల్కొండలకి  పెద్ద వాళ్ళందరం  పిల్లలని  3 ఆటోల్లో తీసుకుని వెళ్ళి  బాగా ఆనందంగా గడిపేవాళ్ళం. ఒక్కొక్కచోట ఒక్కొక్క ఆనందం. ఇదంతా ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. ఎంత ఆనందమో చెప్పలేను. కొన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోలేక పోయాం.


ఏమైనా ఇదొక మరచిపోలేని అందమైన జ్ఞాపకం.


వీళ్ళందరూ కలిసి ఒక తమిళ్ సంగీతం టీచర్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఎక్కడైనా ఎవరైనా పాడమంటే అందరూ కలిసి పాటలు పాడేవాళ్ళు. రవీంద్రభారతిలో పెద్ద ప్రోగ్రాం ఇచ్చారు.




కానీ ఈ అందమైన రోజుల్ని పదే పదే తలుచుకుంటూ వుంటారు. ఇంకోసంగతి తెలుసా ఇప్పుడు ఈ ఫొటోల్లో వున్న పిల్లలందరూ పెద్దవాళ్ళయి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి, పెళ్ళిళ్ళయి, పిల్లలతో సంతోషంగా వున్నారు. అయినా కూడా వాళ్ళ చిన్నప్పటి విషయాలు తలుచుకుని ఆనందిస్తూ వుంటారు.  ఎప్పుడైనా కలవాలనుకుంటారు. ఎప్పుడో మరి...


ఈ పిల్లల గురించి రాయాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది.

2 కామెంట్‌లు:

  1. మీ వ్యాపారసంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటూ కూడా పిల్లల కోసం సమయం కేటాయించడం ఎంతైనా అభినందించదగినది 👏.

    దుర్గాష్టమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు సర్. మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి