7, ఏప్రిల్ 2021, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 12 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 12    మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు







మట్టి పొయ్యి వెనకాల పేద్ద బావి. ఆ బావికి ఒకవైపు బాత్రూము వుండేవి.  ఆ బావిలో నాకు తెలిసినంత వరకూ ఎప్పుడూ నీళ్ళు తగ్గినట్లు కనిపించలేదు. దాని దగ్గర ఎప్పుడూ లైఫ్ బాయ్ సబ్బు వుండేది. అప్పట్లో లైఫ్ బాయ్ సబ్బే వాడేవారు.

ఇంక ఇంటి వెనకవైపుకి వస్తే ఒక పక్క నాలుగు గేదెలు, ఒక ఆవు, చిన్న దూడ వుండేవి. గడ్డి వాసన, పేడ వాసన బలే తమాషా వుండేది. ఈ గేదెలని నీళ్ళుపోసే కాంతమ్మ కొడుకు నాగేశ్వరరావు పొలానికి తీసుకెళ్ళి మేపుకుని తీసుకువచ్చేవాడు. వచ్చేటప్పుడు వాటికోసం గడ్డి, పిల్లిపెసర కాయల మొక్కలు తెచ్చేవాడు.  వాటికోసం పిడకలతో దాలి వేసి కుండలో ఉలవలు ఉడకపెట్టేవారు. గేదెల్ని మేపుకుని వచ్చేసరికి అవి బాగా వుడికి వుండేవి. మేము ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ఉలవలు తినేవాళ్ళం.

ఆ గేదెలని దాటి వెనక వైనకవైపుకి వెడితే పెద్ద పెద్ద ములగ చెట్లు వుండేవి. ఎప్పుడూ కాయలు కాస్తుండేవి.  ఆ ములక్కాడలు వేసి అమ్మమ్మ తియ్యటి చారు పెట్టేది. అప్పట్లో దంపుడు బియ్యం వుండేవి. ఆ అన్నంలోకి ఆ చారు చాలా బావుండేది.  ములగ చెట్ల నుంచి జిగురు కారుతుండేది. ఆ జిగురు తీసి మేము ఆటలాడేవాళ్ళం. వర్షాకాలం వస్తే చాలు నల్లటి జలగలు ఎక్కడ చూసినా పాకుతుండేవి. వాటిని చూస్తే ఒళ్ళు జలదరించేది.

వరసగా పది మల్లెపువ్వుల చెట్లు వుండేవి. పువ్వులు బాగా పూసేవి. రేక నందివర్ధనం పువ్వులు, మందార పువ్వులు దేవుడి పూజకి అమ్మమ్మ వాడేది. వెనకాల పెద్ద లక్ష్మణ ఫలం చెట్టు వుండేది.  ఆ పళ్ళరుచి సీతాఫలం లాగానే వుండేవి కానీ కొంచెం పులుపు వుంటుంది కానీ బావుంటుంది.  పెద్ద పెద్ద కాయలు కోలగా వుంటాయి.

పెద్ద పెద్ద జామచెట్లు వుండేవి. ఎప్పుడూ కాయలు కాస్తుండేవి. గోడ దగ్గిరకి ఒక జామ చెట్టు వుండేది. దాని కాయలు చిన్నగా కోలగా వుండి చాలా తియ్యగా వుండేవి. పెద్ద నేరేడు చెట్టు వుండేది. సీజన్ లో కాయలు బాగా రాలుతుండేవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి