11, ఏప్రిల్ 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 13 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 13 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు




తాతగారు,  అమ్మమ్మ (సింహంలాంటి వ్యక్తి). ఇంటిని ఒక తాటిమీద నడిపించింది


ఎడమవైపు మూడో అక్కని ఎత్తుకున్న నాన్నగారు, పక్కన అమ్మ - తాతగారు, అమ్మమ్మ - పెద్ద పిన్ని, బాబాయి
ఎడమవైపున చిన్నపాప రెండో అక్క, పక్కన చిన్న పిన్ని - మధ్యలో పెద్ద మామయ్య, అత్త - అత్తపక్కన చిన్న మామయ్య మా పెద్దక్క (అక్కని చిన్న మామయ్యకి ఇద్దామనుకున్నాకున్నారు కానీ అవలేదు)


మా తాతగారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకి వెళ్ళారు. అమ్మమ్మ ఎస్.ఎస్.ఎల్.సి. చదివింది. అప్పట్లో ఆ వూళ్ళో ఇంగ్లీషు పేపర్ చదివేది అమ్మమ్మ మాత్రమే. పెనుగొండ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసింది.

జవ్వాది లక్ష్మయ్య నాయుడుగారని పెనుగొండలో జమీందారు వుండేవారు. వాళ్ళిల్లు చాలా పెద్దది. అమ్మమ్మతో చాలాసార్లు వాళ్ళింటికి వెళ్ళాను. రకరకాల పువ్వుల మొక్కలతో అందంగా వుండేది.  పెద్ద పెద్దవాళ్ళందరూ కుటుంబ స్నేహితులుగా వుండేవారు. తాతగారు, అమ్మమ్మ అంటే ఆ వూళ్ళో మంచి గౌరవం వుండేది. 

ఇంట్లో అమ్మమ్మ మాటకి ఎదురు లేదు. సింహరాశిలో పుట్టింది. సింహంలాగే వుండేది. చాలా అందమైనది మా అమ్మమ్మ.  ఆవిడ వున్నన్నాళ్ళూ పాడీపంటా, ఇంటినిండా పాలేళ్ళు, పనిమనుషులు ఇల్లంతా కళకళలాడుతూ వుండేది. 

పుస్తకాలు బాగా చదివేది. అక్కల స్కూలు యానివర్సరీలు జరిగితే పెనుగొండ నుంచి తాడేపల్లి గూడెం చూడ్డానికి వచ్చేది. అక్కలతో కలిసి సరదాగా పేకాట ఆడేది. జోక్స్ వేసేది. బాగా చదువుతారని వాళ్లంటే చాలా  ఇష్టంగా వుండేది. 

అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒకసారి పెనుగొండ తీసుకెళ్ళింది. అప్పుడు మామయ్యా వాళ్ళు పక్క వూరికి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళారు.  అమ్మమ్మ, తాతగారే వుండేవారు.

తాతగారు నన్ను సినిమాహాలుకి తీసుకెళ్ళి అక్కడ నెయ్యి వేసిన కారప్పొడితో ఇడ్లీ తినిపించారు. ఇంటికి వచ్చాక నా చిన్న పొట్టలో అమ్మమ్మ పెట్టిన అన్నం సరిపోలేదు. ఎందుకు తినట్లేదు అని అడిగింది. ఇడ్లీ తిన్నానని చెప్పాను. ఇక తాతగారిని బాగా విసుక్కుంది - అన్నం తినే టైముకి ఇడ్లీ తినిపిస్తారా అని. 

నాకు ఒకసారి బెల్లం ముక్క, పల్లీలు ఇచ్చింది తినమని. తీపి అస్సలు తినేవాళ్ళం కాదు. పల్లీలు తినేసి బెల్లం ముక్క గడ్డిలో పడేశాను. మర్నాడు అమ్మమ్మ చూస్తుందేమో అని మళ్ళీ గడ్డిలో దానికోసం వెతికాను. అదెక్కడపోయిందో కనిపించలేదు.  


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి