2, ఆగస్టు 2022, మంగళవారం

ఎదురీతలో నేను - 38 *** పెళ్ళి చూపులు - ఐదుసార్లు ఒకే కుటుంబ సభ్యులు***

ఎదురీతలో నేను - 38 *** పెళ్ళి చూపులు - ఐదుసార్లు ఒకే కుటుంబ సభ్యులు***



మా గురువుగారు సత్యనారాయణగారి ఇంటి నుంచి మేమిద్దరం అక్కావాళ్ళ ఇంటికి వచ్చేశాం. వెంటనే సత్యనారాయణగారు “మా పక్కనే వున్న ఇందిర గారూ వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఇందిర గారు ***నండూరి రామమోహనరావు*** గారి పెద్ద కోడలు. ఆవిడ, వాళ్ళమ్మగారు మీ చెల్లెలు నాగలక్ష్మిని చూశారు. రేపు సాయంత్రం వాళ్ళు మీతో మాట్లాడడానికి మీ ఇంటికి వస్తున్నారు” అని అక్కతో చెప్పారు.

ఇక అక్క, బావగారు ఒకటే హడావిడి పడిపోయారు. బావగారు నాలుగు రకాల స్వీట్లు, రెండు రకాల హాట్లు పట్టుకుని వచ్చారు. అంటే 1987 ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటలకి నండూరి రామమోహనరావుగారి శ్రీమతి రాజేశ్వరి గారు, వాళ్ళ కోడలు ఇందిర, ఇందిరా వాళ్ళమ్మ లీలావతి గారు, సత్యనారాయణగారి శ్రీమతి కృష్ణగారు వచ్చారు. అప్పటి వరకూ రామమోహనరావుగారి పుస్తకాలు కొన్ని చదివాను. రాజేశ్వరి గారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. చక్కటి మనిషి, శాంతస్వభావం, పొందికైన మాట. రాజేశ్వరి గారు - “లీలావతమ్మ గారికి మొహమాటం ఎక్కువ. నేనూ అమ్మాయిని చూసినట్టు వుంటుందని వచ్చాను” అని – నన్ను “ఏం చదివావు? ఏం చేస్తున్నావు?” అని అడిగారు. వంట వచ్చా...? అని మాత్రం అడిగారు. పాటలు పాడమని మాత్రం అడగలేదు.

రాజేశ్వరి గారు - లీలావతిగారి ***(నాకు కాబోయే అత్తగారు)*** గారి పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మద్రాసులో వాళ్ళ మూడో అబ్బాయి దగ్గర వుంటారనీ..., ఇప్పుడు పెళ్ళికావలసిన జానకిరాం హైదరాబాద్ లో ఉన్నాడనీ చెప్పారు. లీలావతి గారికి ***ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం*** చెల్లెలి కొడుకు అవుతారనీ, వీళ్ళూ వాళ్ళూ ఎప్పుడూ కలుస్తూ వుంటారనీ చెప్పారు. అంతే కాకుండా - వీళ్ళ పిల్లలందరూ మంచివాళ్ళు, నెమ్మదస్తులు, మంచికుటుంబం - అని కూడా చెప్పారు. మొత్తానికి ఈరకంగా రెండోసారి పెళ్ళిచూపులు అయ్యాయి.

పెద్దక్క అన్నపూర్ణకి వాళ్ళు బాగా నచ్చేశారు. ఎందుకంటే అంతగొప్ప రచయిత నండూరి రామమోహనరావు గారి కుటుంబంతో బాంధవ్యం ఏర్పడుతోందని సంతోషించింది. అంతేకాకుండా అక్క పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంకికి రామమోహనరావుగారు, వాళ్ళబ్బాయి కృష్ణప్రసాద్ వస్తూండడంతో అక్కకి బాగా పరిచయం. పాటలంటే ఇష్టమైన అక్క లీల గారికి బాలసుబ్రహ్మణ్యం బంధువులు అనేసరికి ఇంకా సంతోషపడింది. ఇంక అబ్బాయిని చూడాలి అనుకుంది.

ఇందిర గారి దగ్గర వాళ్ళ అన్నయ్య జానకిరాం అడ్రస్ తీసుకుని హైదరాబాద్ లో “ఒక ఆదివారం హైదరాబాద్ లో కలుద్దామని” ఉత్తరం రాసింది. ఫోన్లు లేవు కాబట్టి వ్యవహారం అంతా ఉత్తరాల మీదే. నేను హైదరాబాద్ రాగానే ఒకరోజు ఎవరిదో పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సాయంత్రం 6 గంటలకి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళకి వాళ్ళే “మేము జానకిరాం అన్నగార్లం” అని పరిచయం చేసుకున్నారు. పెద్దాయన రాజేశ్వరరావు గారు హైదరాబాద్ వాటర్ వర్క్స్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీరు, రెండో ఆయన హరిప్రసాదరావు గారు రైల్ నిలయంలో సీనియర్ ఆఫీసర్. నాకు వాళ్ళు చెప్పకుండా వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఫోన్లు లేవుగా మరి. కానీ, అందరితో మాట్లాడటం అలవాటు కాబట్టి వాళ్ళు కూడా చేసిన ఇంటర్వ్యూకి సరైన సమాధానాలు ఇచ్చాను. అమ్మకూడా వాళ్ళతో బాగానే మాట్లాడింది. కాఫీ తాగి వాళ్ళు బయల్దేరారు. వాళ్ళ మొహాలు సంతోషంగానే అనిపించాయి. మూడోసారి పెళ్ళిచూపులు అయ్యాయి.

అయితే వెడుతూ వెడుతూ – “మా అమ్మ, తమ్ముడు రఘురాం, మా మరదలు సంధ్యారాణి మద్రాసు నుంచి వచ్చారు. వీళ్ళందరూ అలకాపురిలో మా ఇంట్లోనే ఉన్నారు. మా అమ్మ పెద్దావిడ. ఆవిడ అన్నిచోట్లకి తిరగలేదు” అని మా అమ్మతో చెప్పి, “మీ అమ్మాయి ఆదివారం విజయవాడ నుంచి వస్తుందని చెప్పారుట – మీరు, మీ అమ్మాయి, నాగలక్ష్మి కలిసి మా ఇంటికి రండి. అందరూ మిమ్మల్ని చూసినట్టు వుంటుంది. అందరం అక్కడే మాట్లాడుకుందాం” అన్నారు.
అత్తగారు పెద్దావిడ అంటే అప్పటికి ఆవిడకీ 55 సంవత్సరాలు ఉండచ్చు. ఈ ఆధునిక పద్ధతి మా అమ్మకి మింగుడుపడలేదు, విస్తుపోయింది. పెద్దక్క ఆదివారం వచ్చాక అమ్మ ఇలా అన్నారని చెప్పింది. అక్క ఈ విషయాన్ని వ్యతిరేకించలేదు. *** మా అమ్మమ్మలు, బామ్మలు, తాతగార్లు బ్రహ్మసమాజంలోనూ, హరిజనోద్యమాలలోనూ, స్వాతంత్ర్యోద్యమాల్లోను పాల్గొని, ఆధునిక భావాలు కలవాళ్ళు*** కాబట్టి వాళ్ళ భావాలు వంటబట్టినట్టున్నాయి.

ఆదివారం ముగ్గురం కలిసి ఆటో మాట్లాడుకుని దిల్ సుక్ నగర్ దగ్గరి అలకాపురిలో ఉన్న వాళ్ళింటికి బయల్దేరాం. నల్లకుంట నుంచీ కోఠీ మీదుగా వెళ్ళినప్పుడు ఇప్పటిలాగా అంత ట్రాఫిక్ లేదు.

*** కోఠీలో బడేచౌడీ ప్రాంతం మాత్రమే బట్టలు షాపులు, రకరకాల అలంకరణ వస్తువులు, బ్యాగులు అమ్మే వాళ్ళతో హడావుడిగా వుంది. అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది కూరగాయలు పెట్టుకునేవాళ్ళు. ఉసిరికాయలు, మామిడికాయలు, వాక్కాయలు, ఇంకా కొన్ని స్పెషల్ కూరగాయలు సీజన్ లేకపోయినా అక్కడ మాత్రమే దొరికేవి. కొత్తిమీర, మెంతికూర పెద్ద పెద్ద కట్టలు తక్కువరేటుకి దొరికేవి. అక్కడ ఒక పానీపూరీ బండీ వుండేది. చాలా బావుండేది. అది తినడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏం కొనుక్కోవాల్సినా అక్కడికే ***

మొత్తానికి దిల్ సుక్ నగర్ చేరాం. ఇప్పటి అంత హడావిడి లేదు. అటో బస్ స్టాప్, ఇటో బస్ స్టాప్ ఉన్నాయి. అలకాపురి వైపు టర్న్ అయి అటూ ఇటూ ఏమీలేని ఆ ఖాళీ రోడ్ల మీద లోపలికి వెళ్ళాం. అలకాపురిలో అప్పట్లో వాళ్లిల్లు తప్ప చుట్టుపక్కల అంతా ఖాళీ స్థలాలే. ఆటోని రానూ పోనూ మాట్లాడుకున్నాం. అమ్మ వయసు అప్పటికి 53 సంవత్సరాలే అయినా... అమ్మకి బస్సులు అలవాటు లేదు, దూరం కాబట్టి అమ్మని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. మొత్తానికి వాళ్ళిల్లు చేరాం. చాలా పెద్ద ఇల్లు.
వాళ్ళు మర్యాదలు బాగానే చేశారు. మాకు కొత్తేమీ అనిపించలేదు. కాబోయే అత్తగారు లీలావతిగారు నన్ను విజయవాడలో చూసి నేనెలా వున్నానో వర్ణించి చెప్పారుట. అందరూ అప్పుడు డైరెక్ట్ గా చూశారు. నాకు కాబోయే తోటికోడలు సంధ్యారాణికి కూడా బాలసుబ్రహ్మణ్యం కజిన్ అవుతారని తెలిసింది. ఇన్ని మాట్లాడుకున్నా మొత్తానికి అసలు పెళ్ళికొడుకు రాలేదు. కొంచెం సేపు వెయిట్ చెయ్యమన్నారు. ఆయన రావాలంటే బాల నగర్ నుంచి రావాలి అన్నారు. కాసేపు కూచున్నాం కానీ, రాలేదు. ఇలా నాలుగో పెళ్ళి చూపులు.

వాళ్ళు ఏవో పెళ్ళి విషయాలు, ఖర్చుల గురించి మాట్లాడారు. ముహూర్తం పెట్టిస్తామని చెప్పారు. అబ్బాయిని మళ్ళీ కలుద్దురుగాని, లేకపోతే మీ ఇంటికి రమ్మని చెప్తాం అన్నారు.

2 కామెంట్‌లు:

  1. విద్యాధికుల కుటుంబం, పేరెన్నిక గన్న నండూరి రామ్మోహన్ రావు గారి బంధువుల కుటుంబంతో సంబంధం కుదిరిందన్నమాట. సంతోషం.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్. అది మాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.

    రిప్లయితొలగించండి