18, జనవరి 2023, బుధవారం

*** రెక్కలు విప్పుకున్న పక్షులు *** - 67


*** రెక్కలు విప్పుకున్న పక్షులు *** - 67



మా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. నేను చదువులన్నీ ఎస్.ఆర్. నగర్ లోనే అయిపోతాయి. పిజి కాలేజీ కూడా వచ్చేస్తుంది. దూరాలు వెళ్ళక్కరలేదు అనుకున్నాను. అప్పటికే డిగ్రీ కాలేజీ వుండేది. మేము డిగ్రీ చదివాం కాబట్టి అదే దృష్టిలో వుంది.

అమ్మాయికి టెన్త్ క్లాస్ అయ్యింది. కాలేజీలో చేర్పించాలి. నారాయణా కాలేజీ వాళ్లు మీ అమ్మాయి మార్కులకి ఫీజు తగ్గిస్తాము రేపు రండి అని ఫోన్ చేశారు. కాలేజీకి వచ్చి మాట్లాడమన్నారు. మర్నాడు మాట్లాడితే ఆ పని అయిపోతుంది. అందులోనూ మా అమ్మాయికి అనుకున్నపని అనుకున్నట్టు అయిపోవాలి. అస్సలు వెయింటింగ్ ఇష్టం వుండదు.

*** (తను 3వ తరగతిలో ఉన్నప్పుడు పిల్లల పుస్తకాలకి అట్టలు వేసి పంపించమన్నారు. నేను, మా వారు ఇద్దరం కూచుని చాలా జాగ్రత్తగా అట్టలు వేస్తున్నాం. తను కూడా నిద్రపోకుండా కూచుంది. పడుకో అమ్మా... అంటే... కూచుని చూస్తూనే వుంది. కాసేపు పడుకోవడం, మళ్ళీ రావడం చేస్తోంది. సరే కొన్ని వేసి మేము పడుకున్నాం. పొద్దున్న లేచి చూసేసరికి పుస్తకాలన్నింటికీ అట్టలు మేము ఎలా వేశామో అలా వేసుకుంటోంది. స్కూలుకి వెళ్ళేలోపున ఆ పని అయిపోయింది. అప్పటి నుంచీ తమ్ముడి పుస్తకాలకి, తన పుస్తకాలకి తనే అట్టలు వేసుకునేది. మాకు ఆ బాధ్యత వుండేది కాదు. ఎప్పుడూ తమ్ముడి గురించి బాగా ఆలోచిస్తుంది.)

***

వెయిటింగ్ భరించలేకపోవడం నా పోలికే వచ్చినట్టుంది.

కాలేజీకి నేను, మావారు అనుకున్న టైంకి వెళ్ళాం. ముందరే ఇంజనీరింగ్ చదవాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎమ్.పి.సి. తీసుకుంది. కాలేజీ వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. ఫీజు కట్టేసి వచ్చేశాం. మాకూ ఒక పని అయిపోయినట్టుంది. కాకపోతే స్కూలు లాగా ఇక్కడ పాటలు, ప్రోగ్రాములు, ఆటలు ఏమీ లేవు. ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఇంతే... తను కూడా చదువు మీద దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు సంగీతం టీచర్ దగ్గిరకి వెళ్ళివస్తోంది. ఇంటర్ చదువుతుండగా ఎమ్సెట్ కోచింగ్ తనతో మేమూ పరుగులు. అదీ అయిపోయింది. చదువు విషయంలో మేము ఎప్పుడూ పిల్లలని ఒత్తిడి చెయ్యలేదు. వాళ్ళ ఇష్టానికే వదిలేశాము.

ఎస్ ఎస్ ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో EEE (Electrical & Electronics Engineering) తో చేరింది. బస్ లో వెళ్ళాలి. ఫస్ట్ టైం ఒక చిట్టి సెల్ ఫోన్ కొనిచ్చాం. మాకు అప్పటి వరకూ అన్నీ నడిచే దూరంలో ఉన్నాయి. తను వచ్చే వరకూ కొంచెం కంగారుగానే వుండేది. ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తిచేసింది. కొరుకుడు పడని సబ్జక్టులు అయినా ఎప్పుడూ తప్పకుండా మంచి మార్కులతో పాసయ్యింది. ఒకసారి ఎవరితోనో సాఫ్ట్ వేర్ కంపెనీకి వెళ్ళి అబ్బ ఇలాంటి కంపెనీలో చెయ్యాలని నా కల అంది. ఉద్యోగం వచ్చేలోపున ఖాళీగా వుండకుండా మూడు కోర్సులు చేసింది. ఎంతసేపూ చదువు, చదువు అదే తనకి.

తన కల నెరవేరినట్లు కాగ్నిజంట్ లో ప్రారంభంలోనే పాతికవేలతో ఉద్యోగం వచ్చింది. కానీ ట్రైనింగ్ చెన్నై. 6నెలలు. ఇద్దరం చెన్నై వెళ్ళి తను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేవరకు వుండి, మా వారి అన్నయ్యగారింట్లో దింపేసి వచ్చాం. వీళ్ళింటికి ఆఫీసు దూరమవడంతో తను హాస్టల్ లో వుండాల్సి వచ్చింది. ఎప్పుడూ కన్నీళ్ళు రాని నాకు ధారాపాతంగా వచ్చాయి.

***

హైదరాబాదులో మేము మా పనుల్లో బిజీ అయిపోయాం. మద్రాసు నించి రోజూ ఫోన్ చేసేది. హాస్టల్ తిండి పడక జ్వరం వస్తూ వుండేది. మాకు చెప్పినప్పుడు చాలా బాధగా వుండేది. ఫ్రండ్స్ వుండేవాళ్ళు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునేవాళ్ళు. ఎంతైనా మా దిగులు మాకుండేది. మా వాళ్ళు ఉన్నా రెండున్నర గంటల దూరం. తను ఫ్రెండ్స్ తో ఆరు నెలలు గడిపేసింది. అలా తనంతట తను ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చుకుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆరునెలలు అయ్యాక హైదరాబాద్ వచ్చేసింది. ఇక మాకూ ఆనందం. కానీ మా పని మేం మానలేదు. రెండేళ్ళు చేశాక తనకి ఏమైనా సరే పై చదువులకి వెళ్ళాలని అనుకుంది.

***

మా అబ్బాయి అక్కతోబాటే స్కూలు వరకూ కలిసి వెళ్ళినా తను ఇంటర్ కి వచ్చేసరికి సెపరేట్ అయ్యాడు. వాడు ఆడుతూ పాడుతూ చదివేవాడు. వాడి ఆలోచనలు అన్నీ వేరేగా వుండేవి. ఎప్పుడూ ఏదో కొత్త దారిలో వెళ్ళాలనే ఆలోచనే... కానీ అక్కని మాత్రం ఎప్పుడూ ఫాలో అవుతాడు.

ఇంటర్ గౌతమి కాలేజీలో చేరాడు. వాడుకూడా అక్కబాటే. ఎమ్.పి.సి. తీసుకున్నాడు. మంచి మార్కులతోనే పాసయ్యాడు. ఎమ్మెసెట్ లో వాడికి వచ్చిన రాంక్ కి అతి పెద్ద కాలేజీ అయిన సెంట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజి (రామోజీ ఫిల్మ్ సిటీ) దగ్గర సీటు వచ్చింది. ఐటి లో చేరాడు.

ఇంచుమించు రెండుగంట దూరం కాలేజీ బస్ లోనే అయినా మొదట్లో ఇబ్బంది పడ్డాడు. దొరికిన వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో - క్లాసులున్నప్పుడు క్లాసులకి అటెండ్ అవడం లేనప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసి రావడం చేసేవాడు. చూస్తుండగా వాడికీ ఇంజనీరింగ్ అయిపోయింది. దాని తర్వాత మల్టీమీడియా – యానిమేషన్ కోర్సు చేశాడు. అప్పుడే వాడికి రియల్ పేజ్ ఇండియా అనే యానిమేషన్ కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ కొన్ని నెలలు చేశాక అక్కడ పాలిటిక్స్ వాడికి నచ్చక మానేశాడు. ఇంటి నుంచే యానిమేషన్ కి సంబంధించిన వర్క్స్ తీసుకుని చెయ్యడం అలవాటయింది. వాడికి చాలా కళాత్మక దృష్టి వుంది. ఇప్పుడు పెళ్ళి కూడా అయ్యింది. కోడలు చక్కటి పిల్ల అన్నీ అర్థం చేసుకుంటుంది. ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకి దొరుకుతారేమో... వాళ్ళూ బాగా సెటిల్ అయ్యారు.

పిల్లలిద్దరూ ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి గురయినా... వాళ్ళతో చిన్నప్పటి కబుర్లు చెపుతూ... వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి మామూలు మూడ్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నించేవాళ్ళం. ఎప్పుడూ డౌన్ అవనివ్వలేదు. ఎందుకంటే సంసారం అన్నాక రకరకాల సమస్యలు అందరికీ వుంటాయి. ఎప్పుడూ ఆనందంగా వుంచడానికే ప్రయత్నించాను.

7 కామెంట్‌లు:

  1. మీ పిల్లల విశేషాలు బాగున్నాయి. వాళ్ళని సరైన రీతిలో పెంచిన క్రెడిట్ మీ దంపతులుద్దరికీ దక్కుతుంది.

    పైన ఫొటోలో ఉన్న జంట మీ కూతురు, అల్లుడూనా … లేక … కొడుకు, కోడలూనా?

    రిప్లయితొలగించండి
  2. అవునండోయ్, ఆ అమ్మాయి కుడివైపు నిలబడింది కూడానూ.
    సవరణకు థాంక్యూ, శ్యామలరావు గారు.
    సారీ నాగలక్ష్మి గారు, తికమక ప్రశ్న అడిగినందుకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫర్వాలేదు సర్ అంటేనేను రెక్కలొచ్చిన పక్షులు అని రాశాను కదా... పిల్లలనే అర్థం వస్తుందనుకున్నాను. నేనే ఫోటో దగ్గర రాయాల్సింది. సారీ ఎందుకు సర్.

      తొలగించండి
  3. పిల్లలిద్దరూ చాలాచక్కగా.ఉన్నారు. వెంటనే దిష్టితీసేయాలి మీరు.

    రిప్లయితొలగించండి
  4. ఓ నవ్వు కామెంట్ పెడదామంటే ఇందులో రావట్లేదండీ... అలాగేనండీ

    రిప్లయితొలగించండి