3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

గుర్తుండిపోయే సంఘటనలు - 69

గుర్తుండిపోయే సంఘటనలు - 69

***
శనివారం పొద్దున్నే పెద్దక్క, బావగారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరినీ తీసుకుని విజయవాడ నుంచి వచ్చారు. ఇద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఫోన్లు లేవు. ఎక్కడికీ వెళ్ళంకదా అనుకుని వచ్చారు. అప్పుడు మెహదీపట్నంలో ఉన్నాం. మాతోకలిసి సరదాగా ఎక్కడికన్నా వెడదామనుకుని వచ్చారుట.

మేము జాబ్ చేసే విజయపాల్ గారి ఆఫీసులో ఎవరిదో పెళ్ళివుంటే రెడీ అయ్యి అప్పుడే వెళ్ళబోతున్నాం. వాళ్ళని చూడగానే మేము ఆశ్చర్యపోయి, 9 గంటలకి పెళ్ళి, 11 గంటలకల్లా వచ్చేస్తాం అని చెప్పి బయల్దేరాం. దారిలో ఇంకో ఇద్దరిని పిక్ అప్ చేసుకోవాలి కాబట్టి రాములు కారు తీసుకుని వస్తాను అన్నాడు. రాములు రాగానే మేము బయల్దేరి మేరేజ్ హాలుకి వెళ్ళాం. అక్కడ ఒక్క పిట్టకూడా లేదు. పెళ్ళిసందడి అసలే లేదు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. రాములు కనుక్కుని వస్తే... ఇంకో గంటలో హాలుకి వస్తారని చెప్పారు.

9 గంటలకి ముహూర్తం అన్నవాళ్ళు గంటతర్వాత రావడం ఏమిటో అర్థం కాలేదు. మాకేమో అక్కావాళ్ళు వచ్చారు, వదిలిపెట్టి వచ్చామని బాధగా వుంది. ఫోన్లు లేవు. వెళ్ళినవాళ్ళం నలుగురం ఉన్నాం. ఎంతసేపూ ఏం మాట్లాడుకుంటాం. రోజూ ఆఫీసులో చూసుకునే మొహాలే... చాలా బోర్ కొట్టేసింది. స్మార్ట్ ఫోన్ లు లేవు చూసుకుంటూ టైం పాస్ చెయ్యడానికి. టిఫిన్లు లేవు మరి. వాళ్ళకి అలవాటు లేదుట. మేమేమో.... పదకొండుగంటలకి పెళ్ళి, భోజనాలు అన్నీ అయిపోతాయనుకుని ఏమీ తిని వెళ్ళలేదు. గంట అన్నవాళ్ళు 11.30 వచ్చారు. అంతసేపు వెయిట్ చేయించినందుకు మజా తెప్పించి ఇచ్చారు. అన్నీ సద్దుకుని మొత్తానికి పెళ్ళి మొదలు పెట్టారు.
బ్రాహ్మడు చదివే మంత్రాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. అన్నీ తప్పులే. తనకి వచ్చిన ***గురుబ్రహ్మతో మొదలు పెట్టి అష్టోత్తరాలు, పద్యాలు*** అన్నీ చదివేస్తున్నాడు. అది బాగా గమనిస్తే కానీ ఎవరికీ తెలియదు. మధ్య మధ్యలో పెళ్ళితంతు జరిపిస్తున్నాడు. మేమయితే *** ఆహా... ఏమిటీ విపరీతం*** అనుకున్నాం. పెళ్ళిలో తలంబ్రాలు, నాగవల్లి కార్యక్రమం ఇవేవీ లేవు. మొత్తానికి తొందరగానే అవగొట్టారు.
మేము బయల్దేరి వెళ్ళిపోదామంటే వెళ్ళనీయరు. ఎక్కడో మేడ్చల్ లో పెళ్ళి. మాకు దారికూడా పెద్దగా తెలియదు. ఇంక తప్పదన్నట్లు కూచుని వాళ్ళు పెట్టినది తిని, ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది.

***
***
*** గండిపేటలో..... ***
***
***
పాపం అక్కావాళ్ళు పడుకున్నారు. మేము వెళ్ళగానే లేచారు. మాకే జాలేసింది. గండిపేట వెడదామని బయల్దేరాం. మెహదీపట్నం నుంచి డైరెక్ట్ చాలా బస్సులు వున్నాయి. ఇప్పటిలా క్యాబ్ లు, ఆటోలు అంతగా లేవు. అందరం చిన్నవాళ్ళమే కాబట్టి బస్ ఎక్కి వెళ్ళాం. కాసేపు సరదాగా గడపడానికి గండిపేట ఒక పెద్ద పిక్నిక స్పాట్. కాసేపు అక్కడ చెట్లకిందా, చెరువు దగ్గర గడిపి, పిల్లలని పార్కులో ఆడించి ఇంక ఇంటికి బయల్దేరదాం అనుకుంటుంటే బస్సులు ఎంతకీ రావట్లేదు. చీకటి అయిపోతోంది. దారిలో రెండు బస్సులు ఫెయిల్ అయ్యాయిట.



చిన్నపిల్లలు. ఎలాగో అలా... కొంత దూరం ఆటోలో... కొంతదూరం బస్సులో అనుకుంటే అసలు ఆటోలు లేవు, బస్సులు లేవు. రావలసిన రెండు బస్సులు ఫెయిల్ అవడం ఏమిటో తెలియదు. అప్పుడు ఇంకా అంతగా డెవలప్ అవలేదు. తినడానికి కూడా ఏమీలేవు. పిల్లలు ఆకలని గోల... ఏవో చిన్న చిన్న చాక్ లెట్లు వుంటే కొనిపెట్టాం. మాతోబాటు కనీసం మంచినీళ్ళు కూడా పట్టికెళ్ళలేదు. ఎక్కడపడితే అక్కడ ఏదో ఒకటి తినే అలవాటు లేదు.

ఇంతలోనే దూరంగా ఒక అంబాసీడర్ కారు కనిపించింది. దాని దగ్గరకి ఇద్దరు మగవాళ్ళు వెడుతున్నారు. నేను మా బావగారితో “వెళ్ళి వాళ్ళని లిఫ్ట్ అడగండి కొంతదూరం అయినా వెళ్ళిపోవచ్చు” అన్నాను. ఆయనకి చాలా మొహమాటం కొంతదూరం వెళ్ళి “ఏం బావుంటుందీ... వస్తుందిలేమ్మా బస్” అంటూ వెనక్కి వచ్చేశారు. ముందర పిల్లలతో బయట పడాలి. బళ్ళ మీద, కార్లలో వచ్చినవాళ్ళు వెళ్ళిపోతున్నారు.

వాళ్ళు ఇంక బయల్దేరబోతుంటే... ఇంక నేనే ధైర్యం చేసి వాళ్ళదగ్గిరకి పరిగెత్తి, ఆపి వాళ్ళతో “మేము మెహదీపట్నం వరకూ వెళ్ళాలి. చిన్న పిల్లలు ఉన్నారు. మీకు ఇబ్బంది లేకపోతే డ్రాప్ చేస్తారా?” అని అడిగాను. వాళ్ళు “రండి, మేము అటే వెళ్తున్నాం” అన్నారు. మా వెనకే కొంతమంది వచ్చి మేముకూడా వస్తాం అన్నారు కానీ, కారులో చోటు సరిపోదు. మేము ఏమీ చేసే పరిస్థితి కూడాలేదు.

అమ్మయ్య అనుకుని కారులో నలుగురు పెద్దవాళ్ళం, ఇద్దరు పిల్లలు సద్దుకుని కూచున్నాం. మమ్మల్ని మెహదీపట్నం బస్ స్టాప్ లో దింపారు. థాంక్స్ చెప్పి, డ్రాప్ చేసినందుకు డబ్బులు ఇవ్వబోతే – మేము డబ్బులకోసం డ్రాప్ చెయ్యలేదు. ఉంచండి అనేసి వెళ్ళిపోయారు. మొత్తానికి ఆరోజు అలా సుఖంగా ఇంటికి చేరాం.

సమయానికి వాళ్ళని డ్రాప్ చెయ్యమనాలనే ఆలోచన వచ్చింది కాబట్టి సరిపోయింది. మర్నాడు పొద్దున్న *** “గండి పేటకి సమయానికి రాని బస్సులు. రాత్రి పదకొండు గంటల వరకూ పర్యాటకులు పడిన ఇబ్బందులు అంటూ....”*** పేపర్లో న్యూస్ వచ్చింది. బస్సులు ఫెయిల్ అయ్యాయని చెప్పారు కానీ.... అసలు ఏమయిందో అయితే తెలియదు.

***
*** మరోసారి గండిపేట విహారానికి – వర్షంలో ఇరానీ చాయ్, ఉస్మాన్ బిస్కట్లు ***
***
మా అక్కచెల్లెళ్ళం కలిసి ఒకసారి గండిపేట వెళ్ళాం. తినడానికి పులిహోర, స్నాక్స్ తీసుకుని వెళ్ళాం. అంతా తిరిగిన తర్వాత ఇంక అన్నీ సద్దుకుని తినబోతుంటే హోరున పెద్ద వర్షం. ఎక్కడా కూచోడానికి లేదు. తినేవాటి నిండా వర్షం నీళ్ళు పడ్డాయి. అవన్నీ అక్కడే పడేసి బయటి వచ్చి రెడీగా ఉన్న ఒక ఆటో ఎక్కాం. ఆటో అతను “అమ్మా ఈ వర్షంలో కష్టం. ఇక్కడే దిగిపొండి” అని ఒక ఇరానీ హోటల్ దగ్గిర ఆపాడు.
పూర్తిగా తడిసి ముద్దయిపోయాం. హోటల్ వాళ్ళు మాకు కూచోడానికి చోటుచూపించారు. ఎప్పుడూ ఇరానీ హోటల్ కి వెళ్ళలేదు. అదే మొదటిసారి.



ఇరానీ హోటల్లో వేడి వేడి ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కట్లు తీసుకుని, కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకుని, వర్షం తగ్గాక ఇంటికి చేరాం. ఆ విహారం అలా గడిచింది. ఇరానీ టీ మాత్రం చాలా బావుంది. హైదరాబాద్ వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఇరానీ తాగి వెళ్ళేవారు. ఇప్పుడు ఎలా వుందో తెలియదు.
*** ఇరానీ చాయ్ పుట్టుక - ఇరాన్ , టర్కీ - కావలసిన పదార్థాలు - పాలు, చక్కెర, గరం మసాలా, లవంగాలు, ఏలకులు - రాగిపాత్రలో కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఆ రుచి వేరే వుంటుంది. ఇప్పుడు చాలా సిటీల్లో దొరుకుతోంది. ) ***

11 కామెంట్‌లు:

  1. ఆ రోజుల్లో గండిపేటకు విహారయాత్ర అంటే అలానే ఉండేది. స్వంత వాహనం లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.

    ఇరానీ చాయ్ మహత్తరంగా ఉండేది. ఇరానీ హోటల్ కు వెళ్ళి కూర్చుని ఆ చాయ్ తాగి ఎన్నో యేండ్లు గతించి పోయినవి 😔. అవునూ, ఆ చాయ్ లో ఏమేం వేస్తారో (టీవీ వారి పరిభాషలో “ఇన్ గ్రెడియెంట్స్” / “రెసిపి”) మీకెలా తెలుసు? చాలా రహస్యం అనేవాళ్ళే 🤔?

    రిప్లయితొలగించండి
  2. అవును సర్. ఇంక ఇరానీ చాయ్ గురించి నేను ఇక్కడ పెట్టిన పేపర్ కటింగ్ లో వుంది. ఇంతకు ముందు అందరూ చాలా రకాలుగా చెప్పేవారు.

    రిప్లయితొలగించండి
  3. పైన మీరు పెట్టిన పేపర్ క్లిప్పింగ్ లో ఉస్మానియా బిస్కెట్ చరిత్ర గురించి ఉంది గానీ ఇరానీ చాయ్ కోసం కావలసిన ప దా “ర్దా”ల (టీవీ వారి ఉచ్చారణ 🙂) గురించి లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది సర్. నేను నెట్ లో చూశాను. ఆ తర్వాత ఒక టీ షాపు వాళ్ళని అడిగి తెలుసుకున్నాను.

      తొలగించండి
  4. ఇరానీ టీ లో గసగసాలు పొడి మిల్క్ మెయిడ్ కలుపుతారు అని కొందరు చెప్పేవారు.ఏవో ఇతర పదార్థాలు కూడా కలుపుతారు అని మరి కొందరు అనేవారు. ఇటీవలి కాలం లో కొంతమంది ఆహార పదార్థాలు చేసే వీడియోలు కొన్ని చూస్తే కొంచెం భయం వేస్తుంది. ఏవి కలుపుతున్నారో చెప్పలేము.

    రిప్లయితొలగించండి
  5. ఇరానీ చాయ్ లో ఎముకుల పొడి కలుపుతారని ఒక రూమర్ , ఆ రుచి కి ఏది కలిపినా తక్కువే

    రిప్లయితొలగించండి
  6. ఇరానీ చాయ్ లో ఎముకుల పొడి కలుపుతారని వంటి భయంకర వార్తలు కొత్తకాదు. నాచిన్నతనంలో ఆంధ్రప్రభలో మొయిన్ పేజీ మీద టాప్ రైట్ కార్నర్‌లో బాక్స్ కట్టి వింత వార్తలు వేసే వారు. అలాంటి ఒక వార్త ప్రకారం, కలకత్తాలో ఒక హోటల్లో తనిఖీ చేసినప్పుడు అధికారులకు బస్తాలకొద్దీ పాతచెప్పులు కనిపించాయట. ఇవెందుకు ఉన్నాయీ అంటే పాతచెప్పుల ముక్కలు వేసి కాస్తే టీ మంచి రుచిగా వస్తుంది అని హోటల్ వాళ్ళు చెప్పారట!

    రిప్లయితొలగించండి
  7. ఫారిన్ నుంచి వచ్చే కొన్ని చాక్లెట్ల లో కూడా జంతు కొవ్వు కలుపుతారు అని అంటారు. అయితే ఆ చాక్లెట్లు అందరూ రుచిగా ఉన్నాయని తింటూ ఉంటారు.
    చక్కెర తెల్లగా రావడానికి ఎమకల పొడి కలుపుతారు అని కూడా అంటారు. కొన్ని బేకరీలు, హోటళ్లలో వాడే నూనెలలో కూడా కల్తీ ఉంటుంది అని వార్తలు వస్తుంటాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కెర శుద్ధి చెయ్యడానికి ఎముకల పొడి కలుపుతారని చిన్నప్పుడు ఎవరో చెప్పారు. ఇలా చూస్తే చాలా వాటిల్లో చాలా కలుపుతున్నారు. అందుకే బయటవి ఎక్కువ తినకూడదు. మేము బేకరీలకి దూరం. బయట వేసే పుణకులు, మిరపకాయ బజ్జీలు పత్తి నూనెతో వేస్తారుట. నూనె లాగవని. పత్తి నూనె కడుపులో అల్సర్ ని డెవలప్ చేస్తుంది. పాల ప్యాకెట్ లలో పాలు అప్పుడప్పుడు కెమికల్ పాలు వస్తున్నాయి. పెరుగు తోడుపెడితే ఎంతదూరం అయితే అంత దూరం సాగుతుంది.

      గుడుల్లో శివుడికి అభిషేకం చేసిన పంచామృతం తాగి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది జబ్బు పడ్డారు. ఎందుకంటే గుడి దగ్గర అమ్మే పాలు కల్తీవి కాబట్టి. అదీ కాకుండా వాళ్ళు ఎంత శుభ్రం చేసినా మూసి ఉన్న గుడిలోపల చేరిన బాక్టీరియా మంచిది కాదు. మన జీవితంలో చూస్తే ఇలాంటివి ఎన్నో...

      తొలగించండి