15, మే 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 - గోదావరి, సముద్రాల కలయిక అంతర్వేది – ఒక అద్భుతమైన ప్రయాణం

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17  - గోదావరి, సముద్రాల కలయిక అంతర్వేది – ఒక అద్భుతమైన ప్రయాణం



ఆత్రేయపురం నుంచి అంతర్వేదికి బయల్దేరాం. మేము అక్కడికి చేరేసరికి ఇంచుమించు నరసింహస్వామి గుడి మూసేసే టైమయిపోయింది. హడావుడిగా దర్శనం చేసుకున్నాం. బయటికి వచ్చేసరికి ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని టోకెన్లు ఇచ్చారు. చాలా బావుంటుందని కూడా చెప్పారు. సరే అని చూద్దుము కదా అనుకుంటే ఎప్పుడూ ఈపాటికి పెట్టేస్తారు. కానీ ఇంకా గంట లేటవుతుంది అన్నారు.

 

సరే భోజనం కోసం కూచుంటే కష్టమని,  బయట ఒక పూటకూళ్ళ ఇల్లులాంటి హోటల్ కి వెళ్ళాం. అక్కడ భోజనం ఫర్వాలేదు, అంత గొప్పగా లేదు. అక్కడ నుంచి గోదావరి ఒడ్డుకు వెళ్ళాము. అక్కడ ఒక పడవ వాడు అమ్మా ఇక్కడ సముద్రం, నది కలుస్తాయి. ఇంకా లోపలికి వెడితే ఒక దీవిలాగా వుంటుంది. చుట్టూ సముద్రం చాలా బావుంటుంది. తీసుకువెడతాను అన్నాడు. సరే అంటే సరే అనుకున్నాం.

 

మా వారికి నీళ్ళమీద ప్రయాణం భయం. నేను రానుగాక రాను అన్నారు. కానీ అప్పట్లో ఫోన్లు ఇప్పుడున్నంత లేవు. మేము తిరిగి వచ్చేవరకు ఆయన ఒక్కరినీ వదిలి వెళ్ళడానికి భయం వేసింది. మొత్తానికి మాతో వచ్చిన కారు డ్రైవరు, పిల్లలు నచ్చచెపితే మొత్తానికి పడవ ఎక్కారు. ఎర్రటి గోదావరి నీళ్ళు, నల్లటి సముద్రం నీళ్ళు కలుస్తూ ఒకచోట పెద్ద చారలా కనిపిస్తోంది.  విచిత్రంగా అనిపించింది. రెండు నీళ్ళు ఢీ కొంటున్నాయి కానీ, కలవట్లేదు.

 

అక్కడ నుంచి పడవ లోపలికి వెడుతోంది. పడవలో పడవవాడు ఒక పది బీరుబాటిల్స్ పెట్టుకుని తెస్తున్నాడు. ఎవరికి అంటే అక్కడ ఎవరో ఆర్డరు ఇచ్చాడని చెప్పాడు. ఓహో ఇలాంటివి కూడా వుంటాయా అనుకున్నాము. మొత్తానికి ఆ చిన్న దీవికి చేరాం. చుట్టూరా నీళ్ళు మధ్యలో ఇసుకనేల. చాలా బావుంది.  సముద్రం ఎక్కువ లోతు లేదు. మా అబ్బాయి, వాడి ఫ్రెండ్ శ్యాం నీళ్ళలో పడి బాగా ఆడారు.

 

అక్కడక్కడ చిన్న చిన్న బొరియల్లోంచి పీతల్లాంటి చిన్న చిన్న పురుగులు బయటికి లోపలికి తిరుగుతున్నాయి.  ఇంక అక్కడ మాకు ఎటువంటి ఇబ్బందీ అవలేదు. ఇంక చీకటి పడుతోందనగానే పడవవాడు వచ్చేశాడు. పడవలో తిరుగు ప్రయాణం అయ్యాం. నీళ్ళలో ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది.

































4, మే 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 16 - ఆత్రేయపురం పూతరేకులు

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 16  - ఆత్రేయపురం పూతరేకులు.

 

పిల్లలతో విహారయాత్రలో ఆత్రేయపురం చెప్పుకోదగ్గది.





 

మామయ్య కొడుకు శేఖర్ ఆత్రేయపురం, అంతర్వేది ఒకసారి కవర్ చేసుకురండి అన్నాడు.  ఆరోజు ఉదయం 7 గంటలకల్లా బయల్దేరాం.  దారంతా స్వాగతమిస్తున్న పచ్చటి చెట్లు, కాలవలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా పిల్లలు అసలు ఆంధ్రవైపు పల్లెటూళ్లు  చూడలేదేమో వాళ్ళకి ఒకటే సంతోషం.

 

ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఆగాం. అక్కడ పొలాలు గడ్డిమేట్లు చూడగానే వాళ్ళకి ఆనందం చిందులు వేసింది. అసలు వాళ్ళు అంత దగ్గిరనుంచి పొలాలు చూడలేదు. గడ్డిమేటు ఫోటోలలో చూశారేమో కాని నిజంగా చూడడం మొట్టమొదటిసారి.  కాసేపు ఆనందంగా అక్కడ గడిపారు.

 

శేఖర్ మీరు ఆత్రేయపురం వెళ్ళేటప్పుడు దారిలో ఆత్రేయపురం రాజుగారి  టిఫిన్ సెంటర్ వస్తుంది. అక్కడ మీరు తప్పకుండా టిఫిన్ చెయ్యాల్సిందే. ప్రతి టిఫిను రుచి చూడండి. సినిమా వాళ్ళందరూ ఈ టిఫిన్ కోసం ఒక ట్రిప్ వేసుకుని తినేసి వెళ్తారు అని చెప్పాడు. టిఫిన్ సెంటర్ కి వెళ్ళాం. చాలా రష్ గా వుంది.  కానీ వాళ్ళు ఎవరినీ నిరాశపరచకుండా అందరికీ అడిగినవన్నీ అందిస్తున్నారు. అది చాలా ఆశ్చర్యం వేసింది.  ఒక ఐదారు రకాల టిఫిన్ లు రుచి చూశాం.  పెసరట్టు చాలా ఫేమస్. నిజంగానే చాలా బావుంది.

 

అదయిన తర్వాత ఆత్రేయపురంలో తిరుగుతుంటే ప్రతి ఇంట్లోను పూతరేకులు చేస్తున్నారు. మామితాండ్ర బయట పెట్టి అమ్ముతున్నారు.

 

భక్తాంజనేయ పూతరేకులు అని బోర్డున్న ఒక ఇంటి దగ్గర ఆగాం.  ఒక అమ్మాయి మమ్మల్ని కూచోపెట్టి   అప్పటికప్పుడు పూతరేకులు చేసి ఇచ్చింది.  మా అబ్బాయి పూతరేకులు చెయ్యడంలో ఆ అమ్మాయికి సాయం చేశాడు. ఒక రెండువందలు డ్రైఫూట్ పూతరేకులు తీసుకున్నాం.  వాటిని వాళ్ళు చక్కగా అట్టపెట్టెలో పెట్టి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు.

 

ఇల్లు చిన్నదే అయినా చుట్టూరా చెట్లతో చల్లగా వుంది. వెనకవైపు కొంచెం దిగువగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలవ వుంది.  ఆ వాతావరణం చాలా బావుంది.

 

వాళ్ళిచ్చిన పూతరేకులు తీసుకుని  అంతర్వేది బయల్దేరాం.