19, నవంబర్ 2022, శనివారం

*** టెక్నికల్ గురువు సి. భాస్కరరావుగారు - యూనీకోడ్ ఫాంట్ కొత్తగా నేర్చుకోవడం, ఇన్నయ్యగారి కుటుంబంతో పెరిగిన సన్నిహితత్వంతో ఉపరాష్ట్రపతి భవన్ కి *** 60

 *** టెక్నికల్ గురువు సి. భాస్కరరావుగారు - యూనీకోడ్ ఫాంట్ కొత్తగా నేర్చుకోవడం - ఇన్నయ్యగారి కుటుంబంతో పెరిగిన సన్నిహితత్వంతో ఉపరాష్ట్రపతి భవన్ కి *** 60

***
ఎస్ ఆర్ నగర్ నుంచి కూకట్ పల్లి వెళ్ళే బస్ స్టాప్ వెనకవైపున అపార్ట్ మెంట్ లో ఉన్న సి. భాస్కర రావుగారు నేను ఇన్నయ్యగారింటి వెళ్తుండడం తెలుసుకుని, నాతో - “నరిసెట్టి ఇన్నయ్యగారి ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చి వెళ్ళండి” అన్నారు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆయన నాతో – “మీరు కొన్ని వెబ్ సైట్లకి, న్యూస్ పేపర్లకి ఇన్నయ్యగారి మేటర్ ఇవ్వాలంటే (ఇప్పుడు ఫేస్ బుక్, బ్లాగ్ లలో, ఫోన్ లలో వస్తున్న తెలుగు) మీరు యూనికోడ్ ఫాంట్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. తెలుగు అనుఫాంట్స్ పనికిరావు. మా ఇంటికి వచ్చి మీరు రెండు రోజులు ప్రాక్టీస్ చెయ్యండి” అన్నారు. ఆయన చెప్పినట్టు కీ బోర్డు ప్రాక్టీస్ చేశాను కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది.

***
*** ఒకే కీబోర్డు మీద అను, యూనీకోడ్ తెలుగు టైపింగ్ ***

*** తెలుగు టైపింగ్ లో మరో అడుగు ముందుకి – కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త గురువు అన్వేషణ ***
***

ఇన్నయ్యగారు నాకు చెప్పే లెటర్లు కానీ, ఏదైనా న్యూస్ పేపర్ కి ఇవ్వాల్సిన మేటర్ కానీ యూనీకోడ్ (అంటే ఇప్పుడు చేస్తున్న తెలుగు ఫాంట్) లోనే వుండేది. నేను తెలుగు ఆపిల్ కీబోర్డు మీద చేసేదాన్ని. ఈ కీబోర్డుతో యూనీకోడ్ ఫాంట్ రాదు. ఏంచేస్తే నేను అనుఫాంట్స్, యూనికోడ్ కూడా చెయ్యగలనని ఆలోచించాను.

నాకు ముందు ఇన్నయ్యగారి ఇంటికి ఒకబ్బాయి వచ్చి వర్కు చేస్తుండేవాడు. అతనికి ఫోన్ చేసి అడిగాను. అతను మీరు DOE Phonetic keyboard లో practice చేస్తే కానీ మీరు అనుయూనీకోడ్ చెయ్యలేరు. మీరు పేజి మేకర్ లో తెలుగు చేసేటప్పుడు ఆపిల్ కీబోర్డు మానేసి డిఒఇ ఫొనెటిక్ కీబోర్డు ప్రాక్టీస్ చెయ్యండి అన్నాడు. *** అను స్క్రిప్ట్ మేనేజర్ లో - మోడ్యులర్, రోమా, యాపిల్, డిఒఇ ఫొనెటిక్*** - ఈ నాలుగు కీబోర్డులు వుంటాయి.

నేను ఇన్నయ్యగారి దగ్గర పనిచెయ్యాలంటే అనుఫాంట్స్ లోనూ, యూనీకోడ్ ఫాంట్ లోనూ రెండింట్లో వర్కు చెయ్యాలి. ఇంక తప్పనిసరి అనుకున్నాను. ఇన్నయ్యగారిని నాకు ఒక నాలుగు రోజులు టైం ఇమ్మని అడిగాను. యాపిల్ కీబోర్డులో shift లో ఉన్న కొన్ని అక్షరాలు DOE Phonetic keyboard లో unshift లో వుంటాయి. అందుకని వేళ్ళు కొంచెం మొరాయించాయి.

ఇంక అదేపనిగా రెండురోజులు మేటర్ ప్రాక్టీస్ చెయ్యడం మొదలు పెట్టాను. మొత్తానికి మూడోరోజుకి DOE Phonetic keyboard నా చెప్పుచేతల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను అనుఫాంట్స్ లోనూ, యూనీకోడ్ ఫాంట్ లోనూ యూనీకోడ్ ఫాంట్స్ లోనూ రెండింట్లోనూ వర్కు చెయ్యగలుగుతున్నాను. కీబోర్డు మీద విజయపతాకం ఎగరేశాను. ఇంక ఇన్నయ్యగారు ఎలా చెప్పినా నేను చెయ్యగలుగుతున్నాను. ఇదొక కొత్త అడుగు.

***
*** Gmail లో అకౌంట్ – Google documents లో పరిశోధన
***

నేను భాస్కరరావు గారి దగ్గిరకి వెళ్ళినప్పుడు మీకు gmail ఉందా అని అడిగారు. అప్పటి వరకూ జిమెయిల్ అంటే నాకు తెలియదు. యాహూ వుంది. ఇది లేదని చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. *** 1998 సెప్టెంబర్ 4 న గూగుల్ ప్రారంభమయితే, 2004 ఏప్రిల్ 1న gmail*** ని ప్రారంభించారు. నాకు gmail కొత్తేమరి. అంతే నేను వెంటనే gmail లో ఎకౌంట్ create చేశాను.
***
*** skype లో వీడియో కాల్ - గూగుల్ డాక్యుమెంట్ లో టైపింగ్ - టెక్నాలజీలో మరో ముందడుగు వేశాం ***

*** కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి అవతలి వ్యక్తి మనం చేస్తున్న మేటర్ చూడగలిగే టెక్నాలజీ***
***

ఇన్నయ్యగారూ వాళ్ళు ఇండియా వదిలే టైముకి నేను యూనీకోడ్ ఫాంట్ లో పర్ఫెక్ట్ అయిపోయాను. ఇన్నయ్యగారు వాళ్ళు 2010లో పూర్తిగా అమెరికా వెళ్లిపోయారు. నాకు ఆయన అక్కడ నుంచీ మేటర్ డిక్టేట్ చేస్తుండేవారు. ఇద్దరం skype లోకి వచ్చేవాళ్ళం.

లేకపోతే gmail వీడియో ఛాట్ లోకి వచ్చేవాళ్ళం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి కనిపిస్తాయి. నా ఎదురుగా కూచుని చెప్తున్నట్లే వుండేది. నేను గూగుల్ డాక్యుమెంట్స్ లో టైప్ చేసేదాన్ని. ఎందుకంటే అందులో టైప్ చేస్తే auto save అవుతుంది. మనకి మేటర్ పోతుందని భయం వుండదు. నేను ఆయనకి గూగుల్ డాక్యుమెంట్స్ లో share చేసేదాన్ని.

ఒకరోజు నేను ఇన్నయ్యగారు చెప్పిన మేటర్ నేను సరిగ్గా వచ్చిందో లేదో చూస్తున్నాను. నేను షేర్ చేసిన మేటర్ ని ఆయన చూస్తున్నట్టు నాకు కనిపించింది. ఓహ్.... అనుకుంటూ... నేను ఆయనకి ఫోన్ చేసి సర్ మీరు నాకు చెప్పబోయే మేటర్ హెడ్డింగ్ పెట్టాక నేను మీకు ఫైల్ share చేస్తాను. అప్పుడు నేను చేసేది మీకు కనిపిస్తుంది. తప్పులు వుంటే అక్కడే చెప్పచ్చు అని చెప్పాను.

ఆశ్చర్యపోవడం ఆయన వంతయ్యింది. వర్కు మొదలు పెట్టాక నేను షేర్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి – నేను టైప్ ఆయన చూడ్డం మొదలు పెట్టారు. అప్పటికప్పుడు కరక్షన్స్, మార్పులు అయిపోయేవి. ఇన్నయ్యగారు చాలా సంతోషించారు. ఇద్దరం అలా కొన్ని పుస్తకాలు, లెక్కలేనన్ని వ్యాసాలు చేశాం.

***

ఇన్నయ్యగారి పుస్తకాలన్నీ మా ఇంట్లోనే వున్నాయి. ఆయన పుస్తకాలు ఈ మధ్య ప్రజాశక్తి వాళ్ళు ఆయన పుస్తకాలు అమ్మిన డబ్బు 5000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా కావాలంటే మమ్మల్ని అడుగుతుంటారు. వాటిని మేము పంపిస్తాము. అన్ని పుస్తకాలు అన్ని కాపీలు లేవు. ఈమధ్య ఒక 25 సంవత్సరాల అబ్బాయి రాజమండ్రి నుంచి ఏ పుస్తకాలు కావాలంటే అవి ఇమ్మని అడిగాడు. పంపించే ప్రయత్నంలో ఉన్నాం. డబ్బులు గూగుల్ పే చేస్తానని చెప్పాడు.

***

వాళ్ళ కుటుంబం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్నయ్యగారు, కోమల గారూ ఎంత ప్రేమగా వుంటారో... వాళ్ళమ్మాయి నవీన ఇంకా... ఓపికగా వుంటారు. తన మొహం మీద చిరునవ్వు, ఓపికగా ఆచితూచి మాట్లాడే మాటలు చూస్తే ఎవరికైనా గౌరవం కలుగుతుంది.

వాళ్ళ అబ్బాయి రాజు నరిసెట్టి కూడా నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఎటువంటి గర్వం లేకుండా మాట్లాడటం నాకు సంతోషంగా అనిపించింది.




రాజు నరిసెట్టితో నేను

ప్రముఖులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో నేను

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి శ్రీమతి ఉషాగారితో


ఉపరాష్ట్రపతి భవన్ లో మురళీధర్, రాజు నరిసెట్టి, వెంకటరత్నం, ఇన్నయ్యగార్లతో నేను

పర్వతారోహకురాలు నీలిమ పూదోట

ఇన్నయ్యగారి కుమార్తె నవీన ప్రముఖ చిల్డ్రన్స్ సైక్రియాటిస్ట్, అమెరికా

ఉపరాష్ట్రపతి భవన్ బయట

రాజు నరిసెట్టికి అవార్డుని అందిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు


రాజుకి ***ఎన్.ఆర్. చందూర్ అవార్డు*** ఇచ్చినప్పుడు నేను ***ఉపరాష్ట్రపతి భవన్*** కి వెళ్ళే అవకాశం వచ్చింది.

నరిసెట్టి రాజు అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలైన - మింట్,మేనేజింగ్ డైరెక్టర్ - వాషింగ్టన్ పోస్ట్, మేనేజింగ్ ఎడిటర్ - వాల్ స్ట్రీట్ జర్నల్, వైస్ ప్రెసిడెంట్ - న్యూస్ కార్పొరేషన్, న్యూయార్క్ సంస్థలలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ తెలుగుతేజం అమెరికాకు చెందిన ప్రముఖ గిజిమోడో మీడియా గ్రూప్ సంస్థ సి.ఇ.ఓ. పీఠాన్ని అలంకరించారు. తెలుగుజాతి గర్వించదగిన ప్రముఖ జర్నలిస్టు రాజు నరిసెట్టికి ఉపరాష్ట్రపతి ఐన వెంకయ్యనాయుడు గారు ఈ ఏడాదికి గాను ఎన్.ఆర్. చందూర్ జగతి పురస్కారాన్ని ఢిల్లీలోని వారి కార్యాలయంలో అందించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు ఈ పురస్కారాన్ని అందిస్తుంది.


ఈ కార్యక్రమానికి నేను హాజరవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
అక్కడ మాకు - ఇన్నయ్యగారి స్నేహితులు వెంకటరత్నంగారు, చంద్రశేఖర్, నేను, హిమాలయపర్వాతాల్ని అధిరోహించిన పూదోట నీలిమ- ఢిల్లీ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్రావుగారు, వారి సతీమణి మాకు వారి ఇంటికి ఆహ్వానించి చక్కటి ఆతిథ్యాన్ని అందించారు.

సాయంత్రం 5.30 గంటలకి ఉపరాష్ట్రపతి కార్యాలయంలో కన్నుల పండువుగా జరిగిన పురస్కార కార్యక్రమానికి హాజరయ్యాం. వెంకయ్యనాయుడుగారి సతీమణి ఉషా గారు ఒక సామాన్య వ్యక్తిగా మాతో కలిసిపోవడం ఆనందించదగ్గ విషయం. తదనంతరం జరిగిన తేనీటి విందుకు ఆవిడ అందర్నీ ఆహ్వానించి ప్రతి వ్యక్తినీ పలకరిస్తూ అతిథి మర్యాదలు పాటించడం చెప్పుకోదగ్గవిషయం.


రాత్రి 9.00 గంటలకు ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ రచయిత, మాజీ ఎం.పి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారు అతిథులని ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారికి కావలసిన పదార్థాలు ఆయనే అందించడం గర్వించదగ్గ విషయం. నేను ఆయన రచించిన 'ఆవేదనాభరితం - అబలా జీవితం' అనే పుస్తకాన్ని డిటిపి చేసి ఇచ్చాను. అది ఆయన గుర్తు చేసుకున్నారు.


పూదోట నీలిమ చిన్నవయసులోనే మొదటగా హిమాలయ పర్వతాల్ని అధిరోహించింది. ప్రపంచంలో పర్వత శ్రేణులన్నింటిని అవలీలగా అధిరోహిస్తున్న నీలిమ తెలుగుజాతి గర్వించదగ్గ అమ్మాయి.


ఈ కార్యక్రమంలో ఇన్నయ్యగారు, వారి కుమార్తె నవీన, అవార్డు గ్రహీత రాజు నరిసెట్టి చాలా చక్కగా మమ్మల్ని ఆదరించడం ఆనందాన్ని కలిగించింది. మొత్తానికి ఢిల్లీ 21వ తేదీ ఉదయం విమానంలో వెళ్ళి 22వ తేదీ ఉదయం విమానంలో హైదరాబాదుకు విజయవంతంగా చేరుకున్నాం.


ఇన్నయ్యగారి ద్వారా హేతువాదులు కాని వాళ్ళు కూడా ఎంతోమంది మహామహులు పరిచయం అయ్యారు. నాకు వాళ్ళని కలిసే అవకాశం కలిగింది.


వాళ్ళు అనుకోకుండా అమెరికా వెళ్ళినప్పుడు ఇండియాలో వాళ్ళకి సంబంధించిన పనులు చేసిపెట్టాను. కోమల గారు, ఇన్నయ్య గారు నాకు పుస్తకాలు చేసినందుకు ఇచ్చిన డబ్బులు కన్నా వాళ్ళు చేసిన సాయం చాలా ఎక్కువ. మా, మా పిల్లల అభివృద్ధిని చూసిన వాళ్ళలో ఇన్నయ్యగారి కుటుంబం ఒకటి.

వాళ్ళు కూడా ఎన్నో ఒడుదుడుకులని తట్టుకుని సెటిల్ అయివాళ్ళే. వాళ్ళ అమ్మాయి నవీన ఛిల్డ్రన్స్ సైక్రియాట్రిస్ట్ గా, అబ్బాయి ఒక గొప్ప జర్నలిస్టుగా అమెరికాలో బాగా సెటిల్ అవడానికి వాళ్ళ కృషిని మనం అంచనా వెయ్యలేం. ఇన్నయ్యగారి కుటుంబంతో నాకున్న అనుబంధం, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి రాయాలంటే చాలానే వుంది.

2 కామెంట్‌లు:

  1. పెద్దవాళ్ల అభిమానాన్ని చూరగొన్నారు. వెరీ గుడ్.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు సర్. వాళ్ళందరి అభిమానంతో నేను ఎంతో ముందుకి వెళ్ళగలిగాను.

    రిప్లయితొలగించండి