25, మే 2023, గురువారం

గుర్తుపట్టలేని ప్రదేశాలు – పాత జ్ఞాపకాలు - 86

 గుర్తుపట్టలేని ప్రదేశాలు – పాత జ్ఞాపకాలు - 86

***
22వ తేదీ మా బాబాయి పుట్టినరోజు అయ్యింది. తనకి 82వ రెండవ పుట్టినరోజు. ఆరోజు వర్కింగ్ డే అవడం వల్ల శనివారం 25వ తేదీ క్రిస్మస్ రోజున అందరం కలుద్దాం రమ్మన్నారు.

25వ తేదీ ఉదయం 10 గంటలకి శ్రీనగర్ కాలనీ నుంచీ వనస్థలిపురంకి ఆటో బుక్ చేసుకున్నాం. దాదాపు 21 కిలోమీటర్ల దూరం.


ఆటో ఆబిడ్స్ దగ్గిరకి వచ్చింది. ఒక్కసారి ఆ రోడ్లన్నీ పరికించి చూశాను. ఎంత మారిపోయిందో... గుర్తుపట్టలేనట్టుగా వుంది. ఖాళీగా వుండబట్టి ఆమాత్రం చూశాను. ఇంతలోకే.... దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను.

***
***





ఆబిడ్స్ సిగ్నల్ కి దగ్గరలో నేను, మా చెల్లెలు ప్రభావతి పొట్టలు పట్టుకుని ఊపిరాడకుండా నవ్వడం గుర్తుకు వచ్చింది. నా పెదవుల మీద చిరునవ్వు, నా లోపల నరాలు కదిలిపోయే నవ్వు. ఆ నవ్వుకి ప్రతిస్పందించిన నా శరీరపు కదలిక ఆటో కుదుపుల్లో కలిసిపోయింది.

విజయవాడలో ఉన్న మా పెద్ద బావగారు ఫోన్ చేసి ఆబిడ్స్ లో షాపు వుంటుంది – అక్కడ స్వెట్టర్స్, గ్లౌవ్స్ బావుంటాయి... నాకు ఒకటి కొని వుంచండి నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. అన్నారు. ఆయన ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారు. దానికోసం ఈ హడావుడి. సరే అన్నాం.

మేమిద్దరం ఆబిడ్స్ సిగ్నల్ దగ్గిరకి వస్తూండగా దూరంగా “సైకిల్ సొట్టర్. సంప్పాయించండి” (సైకిల్ స్టోర్స్ సంప్రదించండి) అని అడ్రస్ వుంది. ఆరోజుల్లో అంత ట్రాఫిక్ లేదు. గోడమీద వున్న ఆ ప్రకటన చూసిన ఇద్దరం మొహాలు చూసుకుని ఒకటే నవ్వు. ఆ నవ్వు తరంగా తరంగాలుగా ఉబికి వచ్చింది. ఇద్దరం రోడ్డు మీద నడవలేనంతగా పొట్టలు పట్టుకుని నవ్వుతున్నాం. ఇక ఇది కాదని రోడ్డు పక్కగా నడుస్తూ నవ్వుతూనే వున్నాం. కళ్ళనించీ నీళ్ళు కారుతున్నాయి. అందరూ ఏమైందో అర్థంకాక మావంక చూసుకుంటూ వెడుతున్నారు. అది ఆ వయసులో వుండే ఉత్సాహం, ఉద్రేకం మరి. మొత్తానికి నవ్వు ఆపుకుని ముందుకి నడిచాం.

అక్కడ ఒకతను కనిపిస్తే ‘ఆప్రికాన్ షాపు’ ఎక్కడ అన్నాం. నాకు తెలియదు అన్నాడు. ఇలాగే ముగ్గురినో నలుగురినో అడిగాం... చెప్పలేదు. ఒకతను విని – ఓ వికటాటహాసం చేసి ‘ఆప్రికాన్’ కాదండీ ‘ఎఫ్.డి.ఖాన్’ అని, నాలుగు షాపుల అతల వుందని మళ్ళీ గట్టిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.



ఆ నవ్వు మమ్మల్ని వెక్కిరించినట్లు వుంది. మేము తప్పు చూసి నవ్వాం. తప్పుమాట్లాడామని అతను నవ్వాడు. చెల్లుకి చెల్లు. మేము తప్పు మాట్లాడడానికి కారణం –

***
***
మా బావగారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన చెప్పిన మాట ఉచ్ఛారణ (pronunciation )ని మాత్రం గుర్తుపెట్టుకుని ఓహో ఇదే అయ్యుంటుంది అనుకున్నాం. ఆ మాటని పట్టుకుని షాపు వెతుక్కుంటూ వెళ్ళాం. పైగా అప్పట్లో స్వెట్టర్స్ అవీ రోడ్డు మీద ఎక్కడా అమ్మేవారు కాదు. ఊలు దుస్తులకి ఎఫ్.డి.ఖాన్ షాప్ పేరున్నది.

ఇద్దరం మరోసారి నవ్వుకుంటూ ఆ షాపులో అడుగుపెట్టాం. మేము ఆనందంగా రావడం చూసిన షాపువాళ్ళు... మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించారు. మాకు కావలసినవి తీసుకున్నాం. ఇప్పుడు ఆ షాపు బాగా పెద్దది చేశారు. బ్రాంచిలు కూడా పెట్టినట్టున్నారు.

కారు కొట్టిన హారన్ చప్పుడికి మళ్ళీ ఇప్పటి ఆబిడ్స్ రోడ్డు దాటేశామని అర్థం అయ్యింది. మెల్లిగా బడేచౌడీ, సుల్తాన్ బజార్, మూసారంబాగ్, దిల్ సుక్ నగర్ దాటి వనస్థలిపురం కమాన్ దగ్గిరికి వచ్చింది ఆటో.... చాలా రోజుల తర్వాత వచ్చామేమో.... అదో పెద్ద ఊరులా వుంది. అమ్మో ఎంతమారిపోయింది అనుకున్నాను. ఒక్కసారి మళ్ళీ 30 సంవత్సరాల కిందటి వనస్థలిపురం గుర్తుకు వచ్చింది.

***
***

***బస్ స్టాప్ తప్ప నిర్మానుష్యంగా వుండే దిల్ సుక్ నగర్ నుంచీ వనస్థలిపురానికి ఒక బస్ వుండేది. అదీ మెయిన్ రోడ్డు మీద ఆపేసేవాడు. మా చెల్లెలు ప్రభావతి ఫ్రెండ్ లక్ష్మి ఇల్లు వనస్థలిపురం మెయిన్ రోడ్డు మీద ఉన్న గణేష్ టెంపుల్ దగ్గరలో వుండేది. (ఇప్పుడు ఆ గుడి చాలా పెద్దది చేశారు.) అంతా మట్టిరోడ్లు, మట్టిదిబ్బలు. దూరంగా హూడా కాలనీ... ఎండ కూడా బాగా వున్నట్టుంది. వాళ్ళింటికి వెళ్ళి కుండలో నీళ్ళు తాగి సేదతీరాం... వాళ్ళమ్మగారు మామిడికాయపప్పు, వంకాయ అల్లం, పచ్చిమిరపకాయ వేసిన కూర, వేయించిన గుమ్మడి వడియాలు వేసి వేడి వేడి అన్నం పెట్టారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఇంటికి వచ్చాం. ***


***
***

ఇప్పటికి వనస్థలి పురంలో ఎన్ జి వోస్ కాలనీలో ఉన్న పిన్నీ వాళ్ళింటికి చాలా సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా అడ్రస్ వెతుక్కోవడమే... అలా మారిపోయింది ఆ వనస్థలిపురం. వాళ్ళిల్లు ఇల్లులాగే వుంది కానీ.... చుట్టుపక్కలంతా మారిపోతూనేవుంది.
మొత్తానికి మేము మా చెల్లెళ్ళు, మా అక్కల పిల్లలు, మా కొడుకు, కోడలు అందరం పిన్నీవాళ్ళింటికి చేరాం. డెబ్బయి సంవత్సరాలు పైన వున్న పిన్ని అందరికీ వంట తనే చేసింది. అందరం భోజనం చేసి కబుర్లతో, నవ్వులతో సందడిచేశాం. ఇంతకీ పిన్ని మా అమ్మకి చెల్లెలు, బాబాయి మా నాన్నకి బాబాయి కొడుకు.
నేను బొంబాయిరవ్వ, రాగిపిండి, సగ్గుబియ్యం పిండి వేసి వెజిటబుల్ హాట్ కేకు తయారు చేశాను. పిల్లలందరూ మామూలు కేకు తెప్పించారు. రెండు కేకులు బాబాయి చేత కట్ చేయించాం. చాలా రోజుల తర్వాత అందరం బాగా గడిపాం.



7 కామెంట్‌లు:


  1. సర్లెండి ఆ రోజుల్లో హైదరాబాదులో షాపుల బోర్డుల మీద వ్రాసిన తెలుగు పేర్లు అసలు వ్రాస్తే గీస్తే) మహా రంజుగా ఉండేవి. కలర మరచనట అని ఓ బోర్డు. అంటే ఏమిటో చెప్పండి.

    ఏభై యేళ్ళ క్రితం మా మేనత్త గారి కొడుకు వనస్ధలిపురం అని కొత్తగా కాలనీ వస్తోందిట, చూసొద్దాం రా అని ఓ ఆదివారం నాడు నన్ను కూడా లాగి తీసుకువెళ్ళాడు. కోఠీ నుండి ఒక బస్సు పది గంటల ప్రాంతంలో ఉందంటే దాంట్లో పడి వెళ్ళాం. మీరన్నట్లు అడివి. మేం స్ధలమేం కొనలేదు లెండి (కొన్నా బాగుండేదేమో, ప్చ్ 😒😒?).

    మీరు కూడా చిత్రవిచిత్రమైన వంటకాలు చేస్తారల్లే ఉందే ? బొంబాయి రవ్వా, దాంట్లో రాగిపిండా, పైగా సగ్గుబియ్యం పిండా 😳😳? మరి వెజిటబుల్స్ ఏం వేసారు (“వెజిటబుల్ హాట్ కేక్” అన్నారుగా)??

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలరు మార్చునట అయ్యుంటుందేమో

      అవును సర్ కొనుక్కున్నా బావుండేదేమో... మా పిన్నిగారూ వాళ్ళు కొనుక్కుని కాలనీ అంతా డెవలప్ అయిపోయాక అప్పుడు కట్టుకున్నారు. తను రెసిడెన్సియల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా చేశాడు. రిటైర్ అయ్యాక కట్టుకున్నాడు.

      నాకు వంటలు, మొక్కలు అంటే ఇష్టం సర్. వంటలు చెయ్యడం, అందరికీ చేసి పెట్టడం ఇష్టం సర్. కూరలు - క్యారెట్, బటానీ వేశాను సర్. అందరికీ బాగా నచ్చింది. మా చెల్లెలు పుట్టినరోజుకి ఇడ్లీ పిండితో కూరలు అన్నీ వేసి కేక్ చేశాను.

      తొలగించండి
    2. కలరు మార్చడమా ఇంకేమన్నానా?
      కలర్ మర్చెంట్ (Colour Merchant) అని వారి భావం ట.
      😁😁

      తొలగించండి
    3. అవునా... హ్హహ్హ ఇలాగేవుంటాయి బోర్డులు.

      తొలగించండి
  2. // “ఇడ్లీ పిండితో కూరలు అన్నీ వేసి కేక్ చేశాను.” //

    కేక్ అంటున్నారు, కూరలు వేశానంటున్నారు. ఇంతకీ ఇది తీపి వంటకమా? లేక కమ్మటిదా?

    కూరల ముక్కలు వేసిన ఇడ్లీని ఒకప్పుడు (40 యేళ్ళ క్రితం మాట) హైదరాబాదులో తాజ్ మహల్ హోటల్ వాడు మొదలు పెట్టి “వెజిటబుల్ ఇడ్లీ” అనే నామకరణం చేశాడు. ఓ రూపాయి ఎక్కువే తీసుకునేవాడు 😐.

    రిప్లయితొలగించండి