26, ఏప్రిల్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 15 మారేడుమిల్లి (తూ.గో.జిల్లా) - ఆనందకరమైన మారేడుమిల్లి ప్రయాణం

 

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 15  మారేడుమిల్లి  (తూ.గో.జిల్లా)

ఆనందకరమైన మారేడుమిల్లి ప్రయాణం

మట్టి పొయ్యి మీద వండిన రుచికరమైన శాఖాహార భోజనం – మరచిపోలేని అనుభూతి

 



రంపచోడవరం నుంచి మధ్యాహ్నం 12 గంటలకి మారేడుమిల్లి వెళ్ళాం. వెళ్ళేదారంతా చాలా అందంగా వుంది. మనం తలపైకెత్తి చూసిన కనిపించని చెట్లతలలు. అటూ ఇటూ ఎత్తైన చెట్లమధ్య దారి వుంది. దట్టమైన అడవులు. ఒక అద్భుతమైన ప్రయాణం.

మాకు అక్కడికి వెళ్ళేముందే అందరూ చెప్పారు – మీకు అక్కడ వెజిటేరియన్ భోజనం ఏమీ దొరకదు.  మీరు మళ్ళీ బయటికి వచ్చి ఎక్కడైనా తినాల్సిందే అన్నారు. మాకు ఎప్పుడూ తిండి గురించి ఆరాటం లేదు. తిండి కోసం ఆగితే అన్నీ చూడలేమని భయం.  ఎక్కడికి వెళ్ళినా స్నాక్స్ లాంటివి వేసుకుని వెళ్ళిపోతాం.  దానివల్ల బాగా తిరగగలుగుతాం.

ఇంతకీ అక్కడ ఏం దొరుకుతుందంటే వెదుబొంగులలో కాల్చిన చికెన్ ఫామస్ ట. మేము వెడుతుంటే దారంతా అవే షాపులు. సరేలే దొరకకపోతే ఏదో ఒకటి చూద్దాం అనుకున్నాం.

కొంతదూరం అలా వెళ్ళాక కారు ఆపి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. అక్కడంతా కాఫీ మొక్కలు చాలా కనిపించాయి. వాటిని చూడడం అదే మొదలు.

అలా లోపలికి వెడుతుంటే ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కిలకిలలు, జలపాతం చప్పుడు వినిపించింది.  అక్కడ ఎలా వుందంటే రెండు తాడిచెట్ల లోతుకి మెట్లు వున్నాయి. అవీ మట్టి మెట్లు. అంతకు ముందు వెళ్ళినవాళ్ళు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి వస్తున్నారు. నన్ను చూసి ఆంటీ మేమే ఎక్కలేకపోయాం మీరు ఇక్కడే వుండండి వాళ్ళు వెళ్ళివస్తారు అన్నారు.

నాకు హెర్నియా మేజర్ ఆపరేషన్ అయి 7 నెలలు అయ్యింది.  ముందు దిగుదామా వద్దా అని ఆలోచించాను. కానీ నన్ను నేను సవాల్ చేసుకున్నాను. అందరూ వున్నారు కదా అంతమందితో నేను అనుకున్నాను.  ఇంతకీ వాళ్ళు ఎందుకు ఎక్కలేకపోయారు అంటే వాళ్ళు తెచ్చుకున్న పులిహోర వగైరాలు  కింద జలపాతం దగ్గర బావుంటుందని అక్కడ తినేసి ఎక్కారు. అదీ సంగతి.

అక్కడ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు  మీరు నాలుగు గంటలలోపున పైకి వచ్చెయ్యండి అని చెప్పారు.  అక్కడ పక్కలకి ఆధారంగా వున్న పెద్ద లతల్ని పట్టుకుని మెల్లిగా దిగడం మొదలు పెట్టాను. మట్టిమెట్లు అంటే అంత సరిగా వుండవు కదా. అయినా సరే సాహసం చేసి దిగేశాను. పైన ఎక్కడి నుంచో పడుతున్న జలపాతం కింద ఒక పెద్ద నదిలా పారుతోంది. చాలా అద్భుతంగా వుంది.  పిల్లలు చాలాసేపు ఆ నీళల్లో ఆడారు.  ఆ చెట్ల కింద పెద్ద పెద్ద కన్నాలు కనిపించాయి. బహుశ కొండచిలువలు వుంటాయేమోఅనిపించింది. అంత కింద వున్నప్పుడు వస్తే అమ్మో ఎటూ పారిపోయే స్థితి లేదు అనుకున్నాము. తర్వాత మెల్లిగా మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వచ్చేశాము.

పైన  ఇంకో జలపాతం వుంది. దాని పక్కన ఉన్న కొండలు గుట్టలు ఎక్కారు పిల్లలు.  వీణా జలపాతం నుంచి వచ్చే నీళ్ళు పక్కన పారుతుంటే అక్కడ రాళ్ళమీద కూచుందామని వెళ్ళింది. కానీ రాళ్ళు పాకుడుగా వుండి నీళ్ళ ప్రవాహానికి కొంచెం ముందుకి కొట్టుకుని వెళ్ళింది. అక్కడక్కడ రాళ్ళ గుట్టలు వుండడంతో ప్రమాదం తప్పింది.

పైన ఆకుపచ్చటి చెట్లు గాలికి వూగుతుంటే వచ్చే చల్లటి గాలి, జలపాతం నీళ్ళనుంచి ఎగిసి ఎగిసి పడే నీటి తుంపరలు, జలపాతం గలగలలు – కాసేపు ఆ ప్రకృతిలో మమేకం అయ్యి, ఆనందంతో తిరుగు ప్రయాణానికి అయ్యాం.

అయితే మేము ఆ అడవుల్లోంచి బయటికి రాగానే ఒకతను వచ్చి “అమ్మా భోజనం చేస్తారా.... పూర్తి వెజిటేరియన్” అని చెప్పాడు. అసలు భోజనమే దొరకదనుకుంటే పూర్తి వెజిటేరియన్ అని చెప్పేసరికి చాలా ఆనందంగా అనిపించింది. మేము తిరిగినంతసేపూ ఆకలి, దాహం తెలియలేదు. అతనితోబాటు వెళ్ళాం.

ఒక చక్కటి పెంకుటిల్లు, లోపల హోటల్ లాగా టేబుల్స్ ఏర్పాటు చేసి వున్నాయి. వాళ్ళది భీమవరంట. వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు, దాంట్లోకి ఇంట్లో కాచిన  నెయ్యి, టమేటా చారు, గడ్డ పెరుగు, బీరకాయ రోటి పచ్చడి, వేడి వేడి అన్నం. తింటుంటే చాలా హాయిగా అనిపించింది. నేను అంతా తిన్నాక ఇది కట్టెల పొయ్యిమీద వండారా... అన్నాను. ఆవిడ నవ్వి అవునండీ అని ఇంటి వెనక వైపుకి తీసుకెళ్ళింది. అక్కడ పెద్ద మట్టిపొయ్యి, దానిమీద సన్నటి సెగమీద ఒక గుండిగలాంటి గిన్నెలో అన్నం. పక్కనే చిన్న చిన్న పొయ్యిలు కనిపించాయి. మా పిల్లలు మట్టి పొయ్యిలు చూడ్డం అదే మొదలేమో.... చాలా ఆశ్చర్యంగా చూశారు.

మొత్తానికి అక్కడ ఆప్యాయతతో కూడిన భోజనం చేసి తిరిగి రాజమండ్రి వచ్చేశాం.





















































 























 

 

22, ఏప్రిల్ 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 14 రంపచోడవరం (తూ.గో.జిల్లా)

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 14  రంపచోడవరం  (తూ.గో.జిల్లా) 

మేము పిల్లలతో చేసిన విహార యాత్రలలో రంప చోడవరం,  మారేడుమిల్లి అద్భుతమైన ప్రయాణాలు.



మా తాతగారి వూరు, మా అమ్మ పుట్టిల్లు అయిన తర్వాత ...

మేము 18.1.2013న ఉదయం ఆరుగంటలకి రాజమండ్రిలో ఉన్న మా మామయ్య కొడుకు ఇంటి నుంచి కారులో రంపచోడవరం  బయల్దేరాం.  

ఎక్కడ చూసినా పచ్చదనమే. కళ్ళకి చాలా ఆహ్లాదంగా వుంది. చల్లటి గాలి. కొంత దూరం వెళ్ళాక ఒక పాక హోటల్ లో వేడి వేడి ఇడ్లీ తిన్నాం. ఆ చల్లటి గాలి, వేడి వేడి ఇడ్లీ చాలా బాగా అనిపించింది. ప్రయాణంలో నూనెవి తింటే కష్టమని ఇడ్లీకి ప్రిఫరెన్స్ ఇచ్చాం.

మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. సన్న సన్నటి దారులు బారులు తీరిన చెట్లతో చక్కగా వున్నాయి. అలా కొంత దూరం వెళ్ళాక  అక్కడ చిన్నపాటి జలపాతాలు చాలా ఉన్నాయి. ముందరే మా అబ్బాయికి నీళ్ళంటే పిచ్చి. ఇక పిల్లలిద్దరూ చాలాసేపు నీళ్ళలో ఆడారు.

చెట్ల మీదకి పాకిన లతల మొదళ్ళు చాలా బలంగా ఉయ్యాలలా ఉన్నాయి. చుట్టూరా పెద్ద పెద్ద చెట్లతో దట్టమైన అడవుల్లా వున్నాయి. అక్కడ చాలా సేపు గడిపాము.  అక్కడ పిల్లలు బాగా గడిపారు.





























11, ఏప్రిల్ 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 13 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 13 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు




తాతగారు,  అమ్మమ్మ (సింహంలాంటి వ్యక్తి). ఇంటిని ఒక తాటిమీద నడిపించింది


ఎడమవైపు మూడో అక్కని ఎత్తుకున్న నాన్నగారు, పక్కన అమ్మ - తాతగారు, అమ్మమ్మ - పెద్ద పిన్ని, బాబాయి
ఎడమవైపున చిన్నపాప రెండో అక్క, పక్కన చిన్న పిన్ని - మధ్యలో పెద్ద మామయ్య, అత్త - అత్తపక్కన చిన్న మామయ్య మా పెద్దక్క (అక్కని చిన్న మామయ్యకి ఇద్దామనుకున్నాకున్నారు కానీ అవలేదు)


మా తాతగారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకి వెళ్ళారు. అమ్మమ్మ ఎస్.ఎస్.ఎల్.సి. చదివింది. అప్పట్లో ఆ వూళ్ళో ఇంగ్లీషు పేపర్ చదివేది అమ్మమ్మ మాత్రమే. పెనుగొండ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసింది.

జవ్వాది లక్ష్మయ్య నాయుడుగారని పెనుగొండలో జమీందారు వుండేవారు. వాళ్ళిల్లు చాలా పెద్దది. అమ్మమ్మతో చాలాసార్లు వాళ్ళింటికి వెళ్ళాను. రకరకాల పువ్వుల మొక్కలతో అందంగా వుండేది.  పెద్ద పెద్దవాళ్ళందరూ కుటుంబ స్నేహితులుగా వుండేవారు. తాతగారు, అమ్మమ్మ అంటే ఆ వూళ్ళో మంచి గౌరవం వుండేది. 

ఇంట్లో అమ్మమ్మ మాటకి ఎదురు లేదు. సింహరాశిలో పుట్టింది. సింహంలాగే వుండేది. చాలా అందమైనది మా అమ్మమ్మ.  ఆవిడ వున్నన్నాళ్ళూ పాడీపంటా, ఇంటినిండా పాలేళ్ళు, పనిమనుషులు ఇల్లంతా కళకళలాడుతూ వుండేది. 

పుస్తకాలు బాగా చదివేది. అక్కల స్కూలు యానివర్సరీలు జరిగితే పెనుగొండ నుంచి తాడేపల్లి గూడెం చూడ్డానికి వచ్చేది. అక్కలతో కలిసి సరదాగా పేకాట ఆడేది. జోక్స్ వేసేది. బాగా చదువుతారని వాళ్లంటే చాలా  ఇష్టంగా వుండేది. 

అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒకసారి పెనుగొండ తీసుకెళ్ళింది. అప్పుడు మామయ్యా వాళ్ళు పక్క వూరికి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళారు.  అమ్మమ్మ, తాతగారే వుండేవారు.

తాతగారు నన్ను సినిమాహాలుకి తీసుకెళ్ళి అక్కడ నెయ్యి వేసిన కారప్పొడితో ఇడ్లీ తినిపించారు. ఇంటికి వచ్చాక నా చిన్న పొట్టలో అమ్మమ్మ పెట్టిన అన్నం సరిపోలేదు. ఎందుకు తినట్లేదు అని అడిగింది. ఇడ్లీ తిన్నానని చెప్పాను. ఇక తాతగారిని బాగా విసుక్కుంది - అన్నం తినే టైముకి ఇడ్లీ తినిపిస్తారా అని. 

నాకు ఒకసారి బెల్లం ముక్క, పల్లీలు ఇచ్చింది తినమని. తీపి అస్సలు తినేవాళ్ళం కాదు. పల్లీలు తినేసి బెల్లం ముక్క గడ్డిలో పడేశాను. మర్నాడు అమ్మమ్మ చూస్తుందేమో అని మళ్ళీ గడ్డిలో దానికోసం వెతికాను. అదెక్కడపోయిందో కనిపించలేదు.  


 

7, ఏప్రిల్ 2021, బుధవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 12 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 12    మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు







మట్టి పొయ్యి వెనకాల పేద్ద బావి. ఆ బావికి ఒకవైపు బాత్రూము వుండేవి.  ఆ బావిలో నాకు తెలిసినంత వరకూ ఎప్పుడూ నీళ్ళు తగ్గినట్లు కనిపించలేదు. దాని దగ్గర ఎప్పుడూ లైఫ్ బాయ్ సబ్బు వుండేది. అప్పట్లో లైఫ్ బాయ్ సబ్బే వాడేవారు.

ఇంక ఇంటి వెనకవైపుకి వస్తే ఒక పక్క నాలుగు గేదెలు, ఒక ఆవు, చిన్న దూడ వుండేవి. గడ్డి వాసన, పేడ వాసన బలే తమాషా వుండేది. ఈ గేదెలని నీళ్ళుపోసే కాంతమ్మ కొడుకు నాగేశ్వరరావు పొలానికి తీసుకెళ్ళి మేపుకుని తీసుకువచ్చేవాడు. వచ్చేటప్పుడు వాటికోసం గడ్డి, పిల్లిపెసర కాయల మొక్కలు తెచ్చేవాడు.  వాటికోసం పిడకలతో దాలి వేసి కుండలో ఉలవలు ఉడకపెట్టేవారు. గేదెల్ని మేపుకుని వచ్చేసరికి అవి బాగా వుడికి వుండేవి. మేము ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ఉలవలు తినేవాళ్ళం.

ఆ గేదెలని దాటి వెనక వైనకవైపుకి వెడితే పెద్ద పెద్ద ములగ చెట్లు వుండేవి. ఎప్పుడూ కాయలు కాస్తుండేవి.  ఆ ములక్కాడలు వేసి అమ్మమ్మ తియ్యటి చారు పెట్టేది. అప్పట్లో దంపుడు బియ్యం వుండేవి. ఆ అన్నంలోకి ఆ చారు చాలా బావుండేది.  ములగ చెట్ల నుంచి జిగురు కారుతుండేది. ఆ జిగురు తీసి మేము ఆటలాడేవాళ్ళం. వర్షాకాలం వస్తే చాలు నల్లటి జలగలు ఎక్కడ చూసినా పాకుతుండేవి. వాటిని చూస్తే ఒళ్ళు జలదరించేది.

వరసగా పది మల్లెపువ్వుల చెట్లు వుండేవి. పువ్వులు బాగా పూసేవి. రేక నందివర్ధనం పువ్వులు, మందార పువ్వులు దేవుడి పూజకి అమ్మమ్మ వాడేది. వెనకాల పెద్ద లక్ష్మణ ఫలం చెట్టు వుండేది.  ఆ పళ్ళరుచి సీతాఫలం లాగానే వుండేవి కానీ కొంచెం పులుపు వుంటుంది కానీ బావుంటుంది.  పెద్ద పెద్ద కాయలు కోలగా వుంటాయి.

పెద్ద పెద్ద జామచెట్లు వుండేవి. ఎప్పుడూ కాయలు కాస్తుండేవి. గోడ దగ్గిరకి ఒక జామ చెట్టు వుండేది. దాని కాయలు చిన్నగా కోలగా వుండి చాలా తియ్యగా వుండేవి. పెద్ద నేరేడు చెట్టు వుండేది. సీజన్ లో కాయలు బాగా రాలుతుండేవి.

5, ఏప్రిల్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 11 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు




 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 11    మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

ఇంతవరకు మా తాతగారి ఊరు గురించి చెప్పాను. కానీ ఆ ఇల్లు ఎలా వుండేదో ఇప్పుడు చూడండి.

ఇంటి ముందు ఎత్తైన గోడ, వీధి గుమ్మం వుండేవి. ఆ గోడ మీద గిన్నె మాలతీ పువ్వుల తీగ సుగంధాలు వెదజల్లుతూ వుండేది.  తరవాత తరవాత అది ఏమైందో తెలియదు. మేము పెద్దయ్యేసరికి కనిపించలేదు.

లోపలికి వెడితే ఇంటి గుమ్మం మెట్లకి అటూ ఇటూ ఏనుగుల బొమ్మలు వుండేవి. ఆ తరవాత అరుగు, అక్కడి నుంచి లోపలికి వెళ్ళే గుమ్మం. అరుగుకి కుడివైపున ఒక గుమ్మం వుండి ఒక గది వుండేది.

ముందుగా ఒక హాలు వుండేది. ఆ హాలులో అటూ ఇటూ అమ్మమ్మ తాతయ్య మడత మంచాలు వేసుకుని కిటికీలో టేబుల్ ఫేన్ పెట్టుకుని పడుకునేవారు. హాలుకి ఎడమవైపున ఒక పడక గది వుండేది.  

తర్వాత ఒక గదిలో ఎడమవైపు దేవుడి మందిరం పక్కనే కొద్ది దూరంలో మజ్జిగ చిలకడానికి పెద్ద కుండ, కవ్వం.  కాంతమ్మ అని ఒక పని అమ్మాయి వుండేది. రోజూ వచ్చి ఇంట్లో మజ్జిగ చేసేది. కాలవ నించి మంచినీళ్ళు తీసుకొచ్చి పోసేది. ఈ దేవుడి మందిరం అంతా రకరకాల పువ్వులతో కళకళలాడుతూ వుండేది. “అమ్మమ్మ గొంతెత్తి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, కౌసల్యా సుప్రజారామా...” అంటూ సుప్రభాతం అన్నీ చదువుతుండేది. ఆ గొంతు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ వుంటుంది.  ఈ రూములోనే ఒక చెక్కతో చేసిన ర్యాక్ మీద కరెంటు స్టౌ వుండేది. దాని మీద కాఫీ కలుపుతూ వుండేవారు.

ఈ గదికి ఎడమవైపున వంట గది వుండేది. అక్కడ మట్టి పొయ్యి వుండేది. ఆ పొయ్యిమీద వంట చేసేవారు.  రోజూ కాంతమ్మ మధ్యాహ్నం వచ్చి ఆ పొయ్యి శుభ్రం చేసి పేడతో అలికి వెళ్ళేది.

దేముడి గదికి ఎడమవైపున ఒక గది వుండేది. ఆ గదిలో మంచినీళ్ళ బిందెలు పెట్టేవారు.  అక్కడి నుంచి కిందకి దిగితే ఒక వరండా.... మెట్లకి కొంచెం ఎదురుగా ఒక మట్టి పొయ్యి. ఆ మట్టి పొయ్యి మీద సాయంత్రం అప్పుడు వంట చేసేవారు.