12, సెప్టెంబర్ 2022, సోమవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 47 కొత్తసంసారం - మూడోవ్యక్తి ప్రవేశం

 కొత్త జీవితం ప్రారంభమైంది - 47  కొత్తసంసారం - మూడోవ్యక్తి ప్రవేశం

ఎన్నో కొత్త కొత్త మార్పులు. రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. బ్యాంక్ కి శనివారం శలవు కాబట్టి అక్క విజయవాడ నుంచి శనివారం పొద్దుటికి హైదరాబాద్ వస్తున్నాను. మీ ఇంటికి అందరినీ రమ్మను అనేది. ఇలా అక్కచెల్లెళ్ళు అందరం మా ఇంట్లో ఎక్కువసార్లు కలుసుకుంటూ వుండేవాళ్ళం. పంచభక్ష్య పరమాన్నాలు చేసుకోక పోయినా అప్పటికప్పుడు అందరికీ నచ్చినది చేసుకోవడం, తినడం. కబుర్లు, నవ్వులతో కాలం గడిపెయ్యడంలో ఎంత ఆనందమో... మర్నాడు ఇందిరా పార్కుకో, పబ్లిక్ గార్డెన్ కో వెళ్ళేవాళ్ళం. రెండో అక్క నేను దగ్గరలో వుండేవాళ్ళం కాబట్టి నాకేదైనా అవసరం వస్తే చూస్తుండేది. కానీ తనూ బ్యాంక్ ఉద్యోగస్తురాలు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు.


*** చిట్టి పాపతో ఇల్లంతా సందడి ***





అప్పటి వరకూ అక్కల పిల్లలు 6 మంది వుండేవారు. వాళ్ళకి తోడు మా ఇంట్లో ఓ చిట్టి పాపాయి వచ్చింది. దాని నవ్వులు, ఆటలు చూస్తుంటే ముందు పడిన కష్టమంతా మర్చిపోయేవాళ్ళం.

*****ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేక, మా వారికి తెల్లాగట్ల నాలుగు గంటలకి లేచి వంట చేసి ఇచ్చి, బస్ స్టాప్ కి అంత దూరం నడవలేక కళ్ళు తిరుగుతున్నాయని మధ్య దారిలో కూచుండి పోవడం, తీసుకెళ్ళిన టిఫిన్ బాక్సు వాసన నచ్చక పక్కన పెట్టేయడం, ఇంటికి వచ్చి సోలిపోయి మళ్ళీ ఎప్పుడో తినడం లాంటి కష్టాలన్నీ పాపని చూడగానే మాయమైపోయాయి.

కానీ ఆఫీసులో నా ఇబ్బంది చూసిన ఇందిరగారు నాకోసం ప్రేమతో తెచ్చిపెట్టినవి తిని తృప్తి పడేదాన్ని. ఆవిడని ఎప్పటికీ మర్చిపోలేను. మావారికి ESI ఉండేది కాబట్టి హాస్పిటల్ కే వెళ్ళాం. డాక్టర్స్ చాలా చక్కగా, ఓపికగా వుండేవారు. అంతేకాకుండా మా అమ్మాయి పుట్టేముందు నన్ను చూసిన సీనియర్ మోస్ట్ డాక్టర్ చక్కటి నవ్వు, తెల్లటి బట్టలు వేసుకుని ముద్దనందివర్ధనంలా వుండేది. డాక్టర్లు రాసిచ్చిన నిద్రమాత్రలు వేసుకునేదాన్ని కాదు. హై బీపీతో వారం రోజుల ముందు హాస్పిటల్ లో చేరిన నేను ఆవిడ ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూసేదాన్ని. నా దగ్గరికి వచ్చిన డాక్టర్ తో “డాక్టర్ నన్ను మీరే చూడండి” అని అడిగాను.

సాధారణంగా అలా అడగ్గానే చూస్తారో చూడరో కానీ, పాప పుట్టేవరకూ ఆవిడ పర్యవేక్షణలోనే వున్నాను నాకు ఎమర్జెన్సీ అయి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చి రాత్రి 12 గంటలకి వచ్చిన ఆ డాక్టర్ మళ్ళీ అదే నవ్వు, అదే అందం. “ఇవాళ ఎక్కువ కేసులు లేవని ఇంటికి వెళ్ళిపోయాను. వేరే డాక్టర్ కి చెబ్దామనుకుని నువ్వు నేనే కావాలని అడిగావు కదా... అందుకే వచ్చాను” అని ఏమాత్రం చిరాకు లేకుండా చెప్తున్న ఆవిడని చూస్తే ఆశ్చర్యం వేసింది.

ఒక డాక్టర్ కి పేషెంట్ మీద ఇంత ప్రేమ వుంటుందా అనిపించింది. అసలు అలాంటి డాక్టర్లని చూస్తే మనకి వున్న రోగాలు కూడా పోతాయి. ఆ మొహం ఇప్పటికీ గుర్తుండిపోయింది. అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా చాలా మర్యాదగా వుండేవారు. కేవలం 80 రూపాయల ఖర్చుతో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాం. *****

సరిగ్గా మా పాప పుట్టేముందు ఒక నెల ముందు మా అత్తగారు వచ్చారు. నేను ఆవిడచేత ఏమీ చేయించుకోలేదు. ఆవిడకే నేను చేసి పెట్టాను. నాతో చేయించుకోవడానికి ఇబ్బంది పడ్డారు కానీ, నేను చేసిపెట్టినందుకు సంతోషించారు. నేను ఆఫీసుకి లీవు పెట్టేశాను.

పాపకి ***వీణాధరి*** అని పేరు పెట్టాం. ఆవిడ ఉన్నన్ని రోజులూ పాపని బాగా చూసుకున్నారు. అయితే కొన్నాళ్ళు వుంటారు కదా అని అనుకున్నాను. ఇంతలోకే ఆవిడ అర్జంటుగా మద్రాసు వెళ్ళిపోవలసి వచ్చింది. పాపకి నాలుగో నెల వచ్చింది. తరవాత సంగతి ఏమిటో నాకు, మా వారికి అర్థం కాలేదు.

**** కేర్ సెంటర్ లో అందిన (సొంతం కాని) తాత, అమ్మమ్మల ప్రేమ ****

ఎక్కడికో వెళ్ళి వస్తూ మెయిన్ రోడ్డుకి దగ్గర ఒక రోడ్డులో వెంకటేశ్వర కేర్ సెంటర్ అని బోర్డు చూసి నాకు చెప్పారు. వెంటనే నేను వెళ్ళి పాప పేరు వీణాధరి అని, నాలుగో నెల అని చెప్పాను. వాళ్ళు రేపు తీసుకురమ్మని చెప్పారు. మర్నాడు అత్తగారిని, పాపని తీసుకుని వెళ్ళాను. కేర్ సెంటర్ చూసే ఆవిడ పేరు సీత, ఆయన పేరు కోటేశ్వరరావు. సీతగారు వచ్చి పాపని ఎత్తుకున్నారు. ఇంక బార్ మని రాగాలు అందుకుంది. వాళ్ళు అలాగే ఏడుస్తుంది లెండి మీరు వెళ్ళిపోండి అన్నారు. మనసు బాధతో ఉసూరుమని నిట్టూర్చింది. కానీ అత్తగారు ఉన్న వారం రోజులూ అలవాటు చెయ్యక తప్పదు.

బాగా ఏడుస్తుండేది. మూడు రోజులకి సీతగారిని పది లంకణాలు చేసిన ఆవిడలాగా చేసింది. పాపం ఆవిడని చూసినా, వీణాని చూసినా జాలేసేది. కానీ, క్రమంగా వాళ్ళకి బాగా అలవాటు పడిపోయింది. పిలవగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. వాళ్ళు కూడా సొంత తాతగారు, అమ్మమ్మ లాగా చాలా ప్రేమగా చూసేవారు. వీణా వాళ్ళ కేర్ సెంటర్ లో మొదటి పాప. వాళ్ళకి ఇంకా ప్రాణం. ఇక నాకు ధైర్యం వచ్చింది. *** ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పాపతో వచ్చినపుడు వాళ్ళని కలిసి ఫోటో తీసుకుంది. *** కేర్ సెంటర్ లో తనని ఎంత బాగా చూసుకున్నారో... మళ్ళీ వివరిస్తాను.

అత్తగారు మద్రాసు వెళ్ళాలని లేకపోయినా వెళ్ళిపోయారు. కేర్ సెంటర్ మెయిన్ రోడ్డుకి దగ్గర కాబట్టి దారిలో పాపని దింపేసి నేనూ ఆఫీసుకి వెళ్ళిపోతుండేదాన్ని. మా ఆఫీసులో కంప్యూటర్స్ సరిగా పనిచెయ్యట్లేదు. వాటిని రిపేర్ చెయ్యాలంటే స్విట్జర్ లాండ్ నుంచి పార్ట్ రావాలి. ఎపిఐడిసి జాయింట్ వెంచర్ కాబట్టి ఇవన్నీ టైమ్ పడతాయి. విజయపాల్ గారు కొన్నాళ్ళు మీరు ఇంట్లోనే పాపని చూసుకుంటూ వుండండి కొత్త కంప్యూటర్లు తెప్పిద్దామనుకుంటున్నాము. మేము చెప్పాక వద్దురుగాని అని చెప్పారు. నాకు వచ్చేముందు శాలరీ కాకుండా కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కానీ తర్వాత మొత్తం ఆఫీసు మేడ్చల్ కి మార్చేశారు. అంత దూరం చిన్నపాపతో కష్టం అనిపించింది.

కానీ ఇంతలోనే బరకత్ పూరాలో ఇంటర్ నేషనల్ ప్రింటర్స్ వాళ్ళు వాళ్ళకి ఆపరేటర్స్ కావాలని, ఒకమ్మాయికి, అబ్బాయికి ట్రైనింగ్ ఇమ్మన్నారు. అమ్మాయి పేరు వసంత, అబ్బాయి పేరు శ్రీనివాస్. వసంత నోట్లో నాలిక లేని అమాయకురాలు. పెళ్ళయిన నెలరోజులకే వాళ్ళాయన హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి ఆ అమ్మాయిని బయట పడెయ్యడానికి ఈ వర్కు నేర్చుకోమన్నారు.

ఘట్ కేసర్ నుంచి వచ్చేది. ఊరు భాష మాట్లాడుతూ వుండేది. ఆఫీసు, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. అలాంటిది నెల రోజుల్లో భాషంతా మారిపోయింది. కంప్యూటర్ మీద పర్ ఫెక్ట్ అయిపోయింది. ఆతర్వాత ఆ అమ్మాయికి ఒక చోట జాబ్ వచ్చింది. అక్కడే కంప్యూటర్ సెక్షన్ మేనేజర్ అయ్యింది. కొన్నాళ్ళకి అక్కడ కూడా మానేసి, సొంతంగా కంప్యూటర్ పెట్టుకుని చాలా బాగా సంపాదించుకుంది. పెళ్ళి చేసుకుంది. ఒక బాబు. నన్ను మాత్రం నాకు గురువు నువ్వే అనేది కనిపించినప్పుడల్లా. కానీ బలే తొందరగా సెటిల్ అయిపోయింది.

నేను కూడా కొత్తగా వచ్చిన యాపిల్ కంప్యూటర్లమీద ట్రైనింగ్ అయ్యాను. అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే వెళ్ళి వర్కు చేసి పెట్టి వచ్చేదాన్ని.

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 46 మళ్ళీ ఆఫీసు పనులు - ప్రారంభమైన యాపిల్ కంప్యూటర్ల యుగం

కొత్త జీవితం ప్రారంభమైంది - 46  మళ్ళీ ఆఫీసు పనులు - ప్రారంభమైన యాపిల్  కంప్యూటర్ల యుగం


 మా ఆఫీసులో వర్కు ఎప్పుడూ ఆగకుండా నడుస్తూనే వుంది. అప్పుడప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ రీడింగ్ కూడా చేసి పెట్టమని అడుగుతారు. మామూలు రొటీన్ లో పడ్డాం. ఆగని కాలం. విషాదాన్ని నింపిన 1987 వెళ్ళిపోయి 88 వచ్చేసింది.


*** ఏదైనా మనమంచికే (అమ్మ చెప్పింది కదా...) ***

*** కొత్త టెక్నాలజీని ఆహ్వానించిన తెలుగు అకాడమీ ***




నేను అప్పుడే ఆఫీసుకి వచ్చి నా రూములోకి వెళ్ళబోతున్నాను, తెలుగు అకాడమీ నుంచి ఒక ఆఫీసరు దామరాజు హరి వాసు గారు వచ్చారు. ఆయన వస్తూనే మా రూము దగ్గిరకి వచ్చి బయట కూచున్నారు. నేను కంప్యూటర్ ఆన్ చేసి వచ్చి -

“ఏం కావాలి సర్?” అన్నాను.

“అమ్మా.... తెలుగు అకాడమీలో కొత్తగా యాపిల్ కంప్యూటర్లు తీసుకువచ్చాం. దానికి ఎక్సపీరియన్స్, తెలుగు బాగా వచ్చిన ఆపరేటర్లు కావాలి. నువ్వు చాలా రోజుల నుంచీ చేస్తున్నావు కదా... మా ఆఫీసులో ఉషాపన్నాల గారి గోండు భాష పుస్తకం చేశారు కదా... ఆవిడ కూడా నీకు కంప్యూటర్స్ గురించి చెప్పమన్నారు. రేపు ఒకసారి మా ఆఫీసుకి రా... ఇంకెవరైనా వుంటే కూడా చెప్పు” అన్నారు. అసలు అవేంటో చూడాలని ఆత్రం.

(*** గోండు భాష అదిలాబాద్ బస్తర్ జిల్లాలో గిరిజనులు మాట్లాడే భాష గోండు. ఉషాపన్నాల గారు ఆ భాషలో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధించి పుస్తకం రాశారు. చేసినప్పుడు చాలా తమాషాగా అనిపించేది. ఎడ్కి = జ్వరము, పిర్ = వాన, మర్మి = పెండ్లి, పాడి = ఇంటి పేరు, నాడి = రేపు, నర్ క = రాత్రి, సక్ రే = ప్రొద్దున, , రోన్ = ఇల్లు, సమ్దిర్ = అందరు, కరుమ్ = దగ్గర, యేర్ = నీరు, గాటో = అన్నం, కై కాల్ = కాలు చేతులు, మంత = ఉంది, సిల్లె = లేదు, బత పొరోల్? = ఏమి పేరు?, గాటో తిత్తికీ ?= అన్నం తిన్నవా? ఉద = కూర్చో ........ ఇలా వుండేవి. సరదాగా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ***)

మర్నాడు విజయపాల్ గారికి చెప్పాను. ఒక గంట సేపే కాబట్టి ఆయన ఏమీ అనలేదు. తెలుగు అకాడమీకి వెళ్ళాను. మూడు మాకిన్ తోష్ క్లాసిక్ కంప్యూటర్లు వున్నాయి. అతి చిన్న కంప్యూటర్లు ముద్దుగా వున్నాయి.

***ఫోటోలో చూపించినట్లు ***

*** చిన్న కంప్యూటర్లు వాటి ఫ్లాపీలు కూడా చిన్న చిన్నవిగా పట్టుకునేందుకు వీలుగా వున్నాయి. ***

ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకతను వచ్చాడు. చెప్తున్నాడు. కొంచెం అర్థం అయ్యీ అవకుండా వుంది. మొత్తానికి తెలుగుకోగలిగాను.

హార్డ్ డిస్క్ కెపాసిటీ 250 ఎంబి. అదే మూడు సిస్టమ్స్ కి షేర్ చేస్తారు. అంటే ఒకో దానికి 80 ఎంబి అన్నమాట. విచిత్రంగా అనిపించింది. ఎప్పటికప్పుడు ఫ్లాపీల్లో మేటర్ కాపీ చేసేసుకోవాలి. లేకపోతే సిస్టమ్ స్లో అవుతుంది. ఒక సిస్టమ్ నుంచి తెలుగు ప్రింట్ ఇవ్వాలంటే మెయిన్ సిస్టమ్ నుంచి తెలుగుకి సంబంధించిన ప్రోగ్రాం ప్రింటర్ కి అందచెయ్యాలి. అప్పుడే ప్రింట్ వస్తుంది. తెలుగు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశం.

రెండు రోజులు అయ్యాక మా చెల్లెలు ప్రభావతికి కూడా రమ్మని చెప్పాను. తను చేస్తున్న కందనాతి చెన్నారెడ్డి గారి ఆఫీసులో లీవు పెట్టి వచ్చింది. మొత్తానికి వారం రోజుల్లో నేర్పించారు. ఇంకెన్నాళ్ళు రావాలో తెలియదు. కంప్యూటర్ గురించి పూర్తిగా నేర్చుకున్నాక నన్ను, మా చెల్లెలు ప్రభావతిని పిలిచి “మీ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు కదా... ఒకళ్ళనే తీసుకుంటాం. ఎవరుంటారో ఆలోచించుకోండి” అన్నారు.

నాకు వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు కదా... నేను ఒక పది నిమిషాలు ఆలోచించి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆ టైములో ఆ జాబ్ వస్తే నాకు ముందు ముందు బావుంటుందని కానీ, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నానని కానీ ఆలోచన రాలేదు. నేను ఆలోచించినది ఒక్కటే – నాకు పెళ్ళయిపోయింది. నేను జీవితంలో సెటిల్ అయ్యాను.

ఇంకా చెల్లెలు ప్రభావతికి ఎటువంటి సెటిల్ మెంటు లేదు. ఆ ఉద్యోగం వస్తే... తను తర్వాత ఉన్న ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ సెటిల్ అయ్యేవరకు సపోర్టు గా వుంటుందనిపించింది. గీతా ఇంకా ఇంటరు చదువుతోంది. అంతే బయటికి వచ్చేశాను. ఇంటికి వచ్చి మా వారికి చెప్పాను. నా నిర్ణయం ఎలా వున్నా – ఆయన కూడా నా నిర్ణయానికి ఎటువంటి అడ్డూ చెప్పలేదు. ఆయన నాకు సహకరించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఏమాత్రం నాకు అడ్డు చెప్పినా పరిస్థితులు ఎలా వుండేవో. అంతా మంచికే జరిగింది అనిపించింది.

ప్రభావతి తర్వాత ఆ జాబ్ పర్మనెంట్ అవడంలో ఏవో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా... ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. నేను ఎప్పటికీ అక్కడ చేరలేదని బాధపడలేదు. నేనూ అక్కడే వుండి వుంటే... ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు అయ్యేవి కాదు, వాళ్ళ పుస్తకాలు చెయ్యగలిగేదాన్ని కాదు. వాళ్ళ నుంచి నేర్చుకున్న వాటితో మా పిల్లలిద్దరికీ ఎన్నో జీవిత పాఠాలు నేర్పాను. వాళ్ళు బుజ్జి బుజ్జి అడుగులు వేస్తున్నప్పటి నుంచీ నేను ఎక్కడి వెళ్ళినా నాతోనే వున్నారు. ఇదంతా మళ్ళీ ఒక కథే. ఏదైతేనేం వాళ్ళు జీవితంలో రాటుదేలేలా చెయ్యగలిగాను.

***

*** ప్రపంచంలో యాపిల్ పర్సనల్ కంప్యూటర్స్ విప్లవం - 1986 ***

యాపిల్ కంపెనీ అప్పటి వరకూ అతిచిన్న కంపెనీగా వున్న యాపిల్ కంపెనీ ఐబియమ్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద డిజిటల్ కంపెనీలతో పోటీ పడాలనుకుంది. ప్రపంచంలో పర్సనల్ కంప్యూటర్స్ తో డిజిటల్ విప్లవ సమాచారాన్ని అందించడానికి నాంది పలికింది. కంప్యూటర్లని రోజువారీ జీవితంలో భాగం చేసింది. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వాజ్నియాక్ ఇద్దరూ సహ వ్యవస్థాపకులు యాపిల్ కంప్యూటర్స్ తో విప్లవాన్ని తీసుకువచ్చారు. ఇండియాకి వచ్చేసరికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది.

*** ఆంధ్రప్రదేశ్ లో యాపిల్ కంప్యూటర్ల సంచలనం***

హైదరాబాదులో ఉన్న మందలపు రాఘవరావు గారు ఈ కంప్యూటర్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని అంతా యాపిల్ కంప్యూటర్స్ తో పెద్ద సంచలనం తీసుకు వచ్చారు. మా ఇంకో చెల్లెలు గాయత్రి నా దగ్గిర కంప్యూటర్ నేర్చుకున్న అనుభవంతో ఆయన ఆఫీసులో చేరి మార్కెటింగ్ మేనేజర్ గా వుండి కంప్యూటర్ సేల్స్ పెరగడంలో చాలా సహకరించింది.

5, సెప్టెంబర్ 2022, సోమవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 45 అద్దె ఇంట్లో అగచాట్లు

కొత్త జీవితం ప్రారంభమైంది - 45  అద్దె ఇంట్లో అగచాట్లు



మొత్తానికి సంజీవరెడ్డి నగర్ నుంచి హిమాయత్ నగర్ కి వెళ్ళి రావడం అలవాటయ్యింది. మున్సిపల్ వాటర్ మేమున్న టైములో రావు కాబట్టి ఇల్లుగలవాళ్ళకి కీ ఇచ్చి వెళ్ళేవాళ్ళం. ఆ పని మాత్రం బాగా చేసి పెట్టేవారు కానీ....

కొత్త జీవితంలో కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు. ప్రతి దాన్నీ మనం సీరియస్ గా తీసుకోకపోతే ఆనందమే. అవి మన ఓపికకి పరీక్ష పెడతాయి కూడా.

మా పెళ్ళికి ముందే వారు ఆయనకి టైంపాస్ అవడానికి పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టివి కొనుక్కున్నారు. అది ఉంది కాబట్టి అందులో వచ్చేవి చూస్తూవుండేవాళ్ళం. అది కూడా పొద్దున్నే డ్యూటీ అయితే సాయంత్రం ఇద్దరం కలిసి టీవీ చూసేవాళ్ళం. కొత్త ముచ్చట కదా...

శుక్రవారం వచ్చింది. మెల్లగా మా ఇల్లుగల వాళ్ళ అమ్మాయి శిరీష, అబ్బాయి కృష్ణ వచ్చి “ఆంటీ చిత్రలహరిలో పాటలు వస్తాయంట కదా చూస్తాం” అన్నారు. సరే రమ్మన్నాం. వాళ్ళ వెనకాలే వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న కూడా వచ్చారు. వాళ్ళకీ చోటిచ్చాం. చిత్రలహరి అవగానే వెళ్ళారు. *** అప్పట్లో చిత్రలహరి కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. ఓ నాలుగు పాటలు వేసి ఐదో పాట టైమయిపోయి సగంలో ఆపేసేవారు. చాలా నిరాశగా వుండేది. ఒక్కసారి టెక్నాలజీ లో సునామీ వచ్చింది. ఎప్పుడు ఏది వినాలన్నా, చూడాలన్నా సెకండ్ల లో... ***

మర్నాడు శనివారం టివిలో తెలుగు సినిమా వస్తుంది. మా ఇద్దరికీ వేడి వేడి పకోడీ వేసాను. తినుకుంటూ టివి ఆన్ చేశాం. తెలుగు సినిమా మొదలయ్యింది. “ఆంటీ సినిమా మొదలయ్యిందా... మేమూ చూస్తాం” అన్నారు. మా నుంచి సమాధానం ఇంకా రాకుండానే... “అమ్మా...! సినిమా మొదలయిపోయింది. రండి రండి”, అంటూ అరుపులు. వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. పకోడీలు వాళ్ళకీ తలో రెండూ పెట్టాం. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం ఇదే తంతు.

ఇదయిపోయిందా... water immersion rod తో మేం రోజూ నీళ్ళు కాచుకునేవాళ్ళం. ఒకరోజు చూశారు. “ఆంటీ మాకు స్కూలుకి టైం అయిపోతోంది rod ఇవ్వండి” అంటూ వచ్చాడు కృష్ణ. ఇచ్చేవరకూ కదలలేదు. రోజూ ఇదే తంతు. మేమసలు దాంతో నీళ్లు కాచుకోవడం మర్చిపోయాం.

కృష్ణ ఒకరోజు పొద్దున్నే ఒంటి కాలుకి ఉన్న షూతో వచ్చి, “అంకుల్ మీ దగ్గిర బ్లాక్ షూపాలిష్ వుందికదా... మా ఇంట్లో అయిపోయింది. ఇవ్వండి. స్కూలుకి టైం అయిపోతోంది” అని తీసుకున్నాడు. అంతే అది తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ మేము అడిగేవరకూ ఇవ్వలేదు. మా మిక్సీలో రోజూ పచ్చడి చేసుకునేవారు. మా ఇంట్లో అగ్గిపుల్లలతో వాళ్ళింట్లో స్టౌవ్ వెలిగేది.

ఇవన్నీ ఇలా వుంటే... ఒకరోజు ఇంటికి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళాను. కొంచెం టీ తాగుదామని స్టౌవ్ దగ్గిరకి వెళ్లాను. ***సింకులో అంతా గంజి, ఆ గంజి మధ్యలో కుంగిపోయిన కుక్కర్ గిన్నె.*** మాకు పెళ్ళికి వచ్చిన కొత్త ప్రిస్టీజ్ కుక్కరు, కొత్త గ్యాస్ స్టౌవ్ పరిస్థితి అలా చూసేసరికి నాకు ఒక పక్కన బాధ, ఇంకో పక్కన కోపం. నేను కుక్కర్ ఇంకా వాడను కూడా వాడలేదు.

వాళ్ళింటికి వెళ్ళి “అదేంటండీ కుక్కర్ గిన్నె అలా వంకర పోయింది” అని అడిగితే... “నవ్వుతూ... గిన్నెని డైరెక్ట్ స్టౌ మీద పెట్టాం. అలా అయిపోయింది” అని కూల్ గా చెప్పారు. ఇంకేమాట్లాడాలి...? అసలు ఆశ్చర్యం – ఎంత డైరెక్టుగా పెడితేమాత్రం గిన్నె అన్ని వంకరలు ఎలా తిరిగిపోతుంది....!!! అర్థం కాక తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే... నవ్వులు వినిపించాయి. హు... ఏం మనుషులు వీళ్ళు, ఎన్నాళ్ళో ఇలా... అనుకున్నాను.

సంక్రాంతి దగ్గిరపడుతోంది. కృష్ణ హడావుడిగా వచ్చి “అంకుల్ నేను పైన పతంగులు ఎగరేసుకుంటున్నాను. మీ చెప్పులు ఇవ్వండి” అని అంటూనే... అక్కడ ఉన్న ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. సంక్రాంతి వెళ్ళిపోయి వారం అయినా చెప్పులు మాకు ఇవ్వలేదు. అసలు మా కంటికి కనిపించలేదు.

నేను బట్టలు ఆరెయ్యడానికి మేడ మీదకి వెడితే అక్కడ ***ఒక మూల చెప్పులు ఎండకి ఎండి, వానకి తడిసి నీలుక్కుపోయి, రంగుపోయి దీనంగా కనిపించాయి. *** వాటిని ఓ కవరులో పెట్టి ఇంట్లో ఒక మూల పడేశాను. రెండు రోజుల తర్వాత కృష్ణ వచ్చి – “అంకుల్ పైన మీ చెప్పులు ఉండాలి తీశారా?” అన్నాడు. అంటే... వాడు మధ్య మధ్యలో వాడుతున్నాడు. ఇంకొకళ్ళ వస్తువు అని స్పృహ లేదు.

పోనీ డబ్బు లేని వాళ్ళా అంటే... ఇల్లుగలాయనకి ఏదో ఫ్యాక్టరీ వుంది. మరెందుకు ఇలా చేశారో తెలియదు.

మా వారికి ఆఫీసు వాళ్ళు ఇల్లు ఇస్తారు కానీ, నాకు దూరం. సరే చూద్దాంలే ఎన్నాళ్ళో ఇలా అనుకున్నాం. మా అమ్మ నాకు 12 పెద్ద పెద్ద స్పూనులు ఇచ్చింది. ఇల్లంతా వెతికాను. ఒక్క స్పూను కూడా కనిపించలేదు. కానీ ఇద్దరం ఎక్కువ ఇంట్లో వుండేవాళ్లం కాదు కాబట్టి, అక్కకి దగ్గర కావడం ఇంకో ఇల్లు గురించి ఆలోచించలేకపోయాం.

*** సరదాగా కూరగాయల మార్కెట్లకి ***


నాకు మార్కెట్ లో తిరిగేస్తూ అన్నీ చూసుకుంటూ కూరలు కొనడం అంటే సరదా.... ఇంటినిండా కనిపిస్తూ వుండాలి. ఇప్పటిలాగా వారం వారం ఇళ్ళదగ్గిర కూరగాయల మార్కెట్లు, మోడల్ రైతు బజార్లు లేకపోవడంతో ఎక్కడ కూరలు ఎక్కువగా వుంటాయంటే అక్కడికి వెళ్ళాలనిపించేది.

ఇల్లుగల వాళ్ళమ్మాయి శిరీష కొంచెం రిజర్వుడు గానే వుండేది. తనకి, నాకు బస్ పాస్ వుండేది. ఒకసారి సికిందరాబాద్ మోండా మార్కెట్ కి, ఒకసారి చార్మినార్ దగ్గిర మీరాలంమండీకి, ఇంకోసారి ఇంకోచోటికి వెళ్లి రెండు సంచుల నిండా కూరలు కొనుక్కుని వచ్చేవాళ్ళం. వాటికి మాత్రం తనే డబ్బులు ఇచ్చుకునేది.

మీరాలంమండీకి మాత్రం ఒక్కసారే వెళ్లాం. కూరగాయలు మోండా మార్కెట్ కంటే చాలా చీప్. ఎక్కువ మోసం కూడా లేదనిపించింది. మాకు భాష సమస్య వల్ల మళ్ళీ వెళ్ళలేదు. మెహదీపట్నం కారవాన్ సబ్జీమండీ తెల్లారగట్ల వెళ్లాలి. 6 గంటలు అయితే కూరలు ఉండవు. నల్లకుంట కూరల మార్కెట్ వుండేది కానీ నాకు తెలిసి రేట్లు ఎక్కువ వుండేవి. తప్పనిసరి అయితే కొనుక్కునేవాళ్ళం.

ఆ అమ్మాయి అప్పుడు 9th చదువుతోంది. సాధారణంగా ఆ వయసు పిల్లలు అలా కూరలు కొనడం నేను చూడలేదు. అన్నీ కొన్నాక నేను బరకత్ పూరాలో మా చెల్లెలు వాళ్ళుంటారు వాళ్ళకి కొన్ని కూరలు ఇచ్చేసి వెడదాం అనేదాన్ని. ఆవంకతో చెల్లెళ్ళని కలవచ్చని, వాళ్ళకి సాయం చేసినట్టు వుంటుందని నా స్వార్థం. ఏమీ మాట్లాడకుండా నాతో వచ్చేది. ఇంచుమించు పదిహేను రోజులకి ఒకసారి కూరలకి వెళ్ళేవాళ్ళం. కొన్నప్పుడల్లా చెల్లెళ్ళకి ఇచ్చి వచ్చేదాన్ని. ఒకోసారి వాళ్ళు ఇంట్లో వుండేవారు కాదు. వాళ్ళ ఇల్లుగలవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇమ్మనేదాన్ని.

చంద్రబాబునాయుడు గారి ధర్మమా అని ఎక్కడంటే అక్క మోడల్ రైతు బజార్లు రావడం ఇంకా ఆనందంగా అనిపిస్తోంది. నాకు రోడ్ల మీద మార్కెట్ లో కంటే రైతుబజార్ కి వెళ్ళడం చాలా ఇష్టం.

1, సెప్టెంబర్ 2022, గురువారం

నా జీవనయానంలో అమ్మ జ్ఞాపకాల నుంచి మెల్లగా మామూలు జీవితానికి - 44

 నా జీవనయానంలో అమ్మ జ్ఞాపకాల నుంచి మెల్లగా మామూలు జీవితానికి - 44

 

అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి. చెల్లెళ్ళు ముగ్గురూ అమ్మ ఉన్న ఇంట్లోనే వుంటామన్నారు. అందరూ ధైర్యస్థులే కాబట్టి పెద్దక్క దానికి ఏమీ అభ్యంతరపెట్టలేదు.

 

 నేను, రెండో అక్క సంజీవరెడ్డి నగర్ లో దగ్గర దగ్గర ఇళ్ళలోనే వుంటున్నాం.




మెట్రోకి రూపుదిద్దుకుంటున్నప్పుడు


ఇక మెట్రోవచ్చాక రూపురేఖలు మారిపోయాయి



సంజీవరెడ్డిన నగర్ జంక్షన్


మేమున్న చోటు నుంచి నేను సంజీవరెడ్డి నగర్ బస్ స్టాప్ కి దగ్గిదగ్గిర ఒక కిలోమీటరు దూరం వుంటుంది. సంజీవరెడ్డి నగర్ బస్ స్టాప్ కి వెళ్ళేలోపున అటూ ఇటూ అన్నీ ఇళ్ళే. ఆదారిలో ఒకే ఒక శ్రీనివాస జనరల్ స్టోర్స్ అని పెద్ద కిరాణాషాపు. అప్పట్లో అదొక్కటే పెద్ద షాపు.  వాళ్ళ దగ్గిర గౌలి గూడా బస్ స్టాండ్ లో బస్ ఎక్కడానికి టిక్కెట్ల రిజర్వేషన్ ఉండేది. 

కాలనీ మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా సందుల్లోంచి రావాలంటే నిర్మానుష్యమైన రోడ్లు. ఎటువంటి అపాయం లేదు కానీ, ఒక్కళ్ళూ వెళ్లాలంటే భయంగా వుండేది.

 

సంజీవరెడ్డిన నగర్ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి చివరిగా వెళ్ళిపోతే ఒక వైపు బల్కంపేట, మరోవైపు అమీర్ పేట వెళతాము. 


అమీర్ పేట టర్నింగ్ లో ***గుడ్ లక్ కేఫ్*** అని ఒక ఇరానీ హోటల్ వుంది. ఇక్కడ టీ చాలా బావుంటుందని ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇప్పటికీ తాగుతుంటారు. ఆ హోటల్ పక్కన పోలీస్ స్టేషన్ (ఇదికూడా స్థలం మారింది). దాని ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ (ఇప్పుడు అది పడగొట్టి చాలా పెద్దదిగా, అందంగా కట్టారు) దాని ముందు తెలుగులో రాతిస్తంభం మీద తెలుగులో సిమెంటు అక్షరాలు వుంటాయి. ఆ స్తంభం చాలా దూరం నుంచి కనిపిస్తూ ఇది ***సంజీవరెడ్డి నగర్*** అని చెప్పేది.

 

*** ఇప్పుడు ఆ బోర్డు కనిపించదు. హోటల్ న్యూ గుడ్ లక్ అని మార్చాడు. బస్ స్టాప్ కి వెళ్ళే రోడ్డు ఒక్ బ్యాంక్ స్ట్రీట్ అయిపోయింది. అక్కడ లేని బ్యాంక్ లేదు. అందరూ ఇళ్ళు నారాయణా, చైతన్యా కాలేజీలకి, ఆఫీసులకి, స్కూళ్ళకి అమ్మేసి కూకట్ పల్లి వైపు వెళ్ళిపోయారు. చాలా హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, పిజ్జా హౌస్ లు ఒకటేమిటి చాలా వచ్చేశాయి. ***

బస్ ఎక్కడానికి మెయిన్ రోడ్డుమీద నుంచీ కొంచెం దూరం నడవాలి. మరీ అంత రద్దీ కూడా వుండేది కాదు. మెట్రో స్టేషన్ లేని సంజీవరెడ్డి నగర్ ప్రశాంతంగా వుండేది.

 

*** అప్పటికీ ఇప్పటికీ ఎంతతేడానో ఫోటోల్లో చూస్తే తెలుస్తుంది.***

 

*** కొత్త జీవితం ***

 

190 నెంబర్ బస్ సనత్ నగర్ నుంచి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ వరకు వుండేది. అది వయా హిమాయత్ నగర్ కాబట్టి నాకు అంత ఇబ్బంది అవలేదు. హిమాయత్ నగర్ లో బస్ దిగి ఆఫీసుకి వెళ్ళడానికి 5 నిమిషాలు. మొత్తానికి ఆ రూటుకి అలవాటుపడ్డాను. అయితే ఒకరోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ వల్ల సాయంత్రం 7 అయిపోయింది.


పొద్దున్నే షిఫ్ట్ అయిపోయి ఇంట్లో వుంటారు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలని హడావుడిపడుతూ వెళ్ళేసరికి తాళం వేసి వుంది. ఇల్లుగలవాళ్ళని అడిగి తీసుకుని లోపలికి వెళ్ళి వంట మొదలుపెట్టి చేస్తున్నాను. కడుపులో ఆకలికి పేగులు అరుస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చారు.


తలుపు తీసిన నా మొహంలో క్వశ్చన్ మార్కు చూసి

నువ్వు ఎంతకీ రాకపోయేసరికి చాలా కంగారేసింది. మీ ఆఫీసుకి వెళ్ళాను. వెళ్ళిపోయావని చెప్పారు. మీ చెల్లెళ్ళ దగ్గిరకి వెళ్ళాను. రాలేదని చెప్పారుఎంత కంగారేసిందో తెలుసా...! అన్నారు. కొత్త మురిపాలు ఇలాగే వుంటాయేమో...? . 

 

నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఇప్పటివరకూ మా అంతట మేము ఉన్నాం. కొత్తగా ఒక మనిషి నా గురించి ఆరాట పడుతున్నాడు అంటే నాకు ఒకపక్క ఆశ్చర్యం, ఇంకోపక్క ట్రాఫిక్ వల్ల లేటయి వస్తే ఇంత కంగారా... ! ! అనుకున్నాను. ఒక తోడు దొరికేసరికి ఎదురు చూపులు ఇంతగా వుంటాయా అనిపించింది. పెళ్ళవగానే వచ్చిన కొత్త అనుబంధానికి మెల్లిమెల్లిగా అలవాటుపడుతున్నాను.

అప్పటి వరకూ అమ్మ, చెల్లెళ్ళు మా కుటుంబం, బాధ్యతలలో ఇంకొకళ్ళ గురించి ఆలోచించే టైమే వుండేది కాదు. మెల్లి మెల్లిగా నా టైములకి అలవాటు పడ్డారు. మధ్యాహ్నం షిప్ట్ అప్పుడు వచ్చేసరికి రాత్రి 12 గంటలయ్యేది. ఇద్దరం అన్ని విషయాల్లోనూ అలవాటు పడ్డం మొదలయ్యింది. 

 

మా ఆఫీసులో కంప్యూటర్ మీద చేసే దాన్ని నేను ఒక్కదాన్నే అయిపోయాను. చెల్లెలు ప్రభావతికి కందనాతి చెన్నారెడ్డిగారు పెట్టిన పల్లకి ఆఫీసులో కొత్తగా వచ్చిన మోనోటైప్ కంప్యూటర్స్ కి ఆపరేటర్స్ కావాలి అంటే వెళ్ళిపోయింది. ఆ కంప్యూటర్స్ లో మా మొదటి కంప్యూటర్స్ లో లాగా కమాండ్స్ అవీ కనిపించకుండా తెలుగు తెలుగు లాగే కనిపిస్తుంది. మా కంప్యూటర్స్ తర్వాత వచ్చినవి అవి. కొత్తగా వచ్చిన సరళకి ట్రైనింగ్ ఇస్తున్నాను.

 

బైబిల్ హౌస్ వాళ్ళ వర్కు వచ్చింది. పీటర్, జేమ్స్ అని ఇద్దరు ఆ వర్కు చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా ఓపికగా కబుర్లు చెబుతూ వర్క్ చేయించుకున్నారు. పీటర్ ఆయన అమెరికా వెళ్ళినప్పటి కబుర్లన్నీ చెబుతుండేవారు. అమెరికా వెళ్ళడం అంటే అప్పుడు చాలా గొప్పగానే వుండేది. ఈసారి నేను నీకు అమెరికా వెళ్ళినప్పుడు వాచ్ తెచ్చి పెడతాను అన్నారు. నేను వినేసి ఊరుకున్నాను. కానీ మొత్తం బైబిలు అంతా చదివినట్లయ్యింది. ఈ వర్కులు చెయ్యడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మేము చేస్తున్న పుస్తకాలలో సారమంతా నా మైండ్ లో నిక్షిప్తమైంది.  మతగ్రంథాలలో చెప్పేదంతా ఒకటే అనిపించింది.