11, మార్చి 2023, శనివారం

*** ల్యాండ్ లైన్ ఫోన్ *** - 75

*** ల్యాండ్ లైన్ ఫోన్ *** - 75



*** అప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి అందరికీ ల్యాండ్ లైన్ తో ఏదో ఒక అనుభవం వుండే వుంటుంది. మాకు ఇలా ..... ***

కంప్యూటర్ పెట్టుకున్న కొత్తలో అన్నీ పెద్ద పెద్ద సంస్థల, ప్రభుత్వరంగ సంస్థల పనులు చేసేవాళ్ళం కాబట్టి తప్పనిసరిగా ఫోన్ కావల్సివచ్చేది. టెలిఫోన్ ఆఫీసుకి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వచ్చాం. (1993) అందరికీ ఈ ఫోన్లే కాబట్టి ఒక వారం పడుతుందని చెప్పారు. ఆఫీసు ఎర్రగడ్డలో వుంది. సరే మొత్తానికి ఫోన్ పెట్టడానికి టెలిఫోన్ ఆఫీసు నుంచీ ఒకతను వచ్చాడు. సిమెంట్ కలర్ ఫోన్ పెట్టాడు. కనక్షన్ ఇచ్చాడు. టెస్ట్ చేశాడు. బాగానే పనిచేస్తోంది.

ఇంకా కదలకుండా అక్కడే నిలబడ్డాడు. “ఇంకేముంది ఫోన్ పెట్టేశారు కదా... ఇంకా ఏమైనా పనుందా” అని అడిగాను.

లేదమ్మా... ఇంకేం లేదు. ఫోన్ పెట్టాను కదా... పైసలేమైనా ఇస్తావని అన్నాడు.

నేను వెంటనే “నీకు సొంత ఇల్లుందా” అని అడిగాను. “రెండు ఇళ్ళున్నాయి” అన్నాడు.

నేను “ఓహో అవునా... మాది అద్దె ఇల్లు. నేను ఇవ్వను” అన్నాడు. ఒక్కసారి మొహం షాక్ తిన్నట్టు పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అనుకున్నాను ఎంతోకొంత ఇవ్వవలసిందేమో... అని. కానీ ఎందుకో ఇవ్వబుద్ధికాలేదు. ఎప్పుడైనా సర్వీసింగ్ కి వచ్చినప్పుడు ఏదైనా సతాయిస్తాడేమో పెడతాడేమో అనుకున్నాను. వచ్చాడు కానీ వచ్చిన వెంటనే పని మర్యాదగా పని చూసుకుని వెళ్ళిపోయేవాడు.
ఫోన్ పెట్టుకోవడం చాలా మంచిదయింది. పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరికీ మాకు ఫోన్ వుండడంతో ఏదో ఒక టైములో ఫోన్ చేసి వచ్చి పనిచేయించుకునే వీలు వుండేది.

కానీ బిల్లు కట్టాలంటే ఎర్రగడ్డ టెలిఫోన్ ఆఫీసుకి వెళ్ళాల్సి వచ్చేది. పొద్దున్న పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తారంటే... 8 గంటల నుంచి క్యూ వుండేది. బిల్లు కట్టడానికి వచ్చినవాళ్ళు అక్కడి వాళ్ళతో ఆ కబురు ఈ కబురు చెప్పి, మంచి చేసుకుని వాళ్ళ చోటు చూస్తూవుండమని చెప్పి ఏదో ఒకటి తినేసి వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళకి వేరే క్యూ వుండేది.

పదిగంటలకి మెల్లిగా ఆఫీసుకి ఒక్కొక్కళ్ళు వచ్చి మెల్లిగా టీ తాగి, సీటులోకి వచ్చేసరికి 10.30 అయిపోయేది. ఎన్నో పనులు మానుకుని బయట నుంచున్నవాళ్ళకి చాలా చికాగ్గా వుండేది. బిల్లు టైంకి కట్టకపోతే పెనాల్టీ.

ఆడవాళ్ళ క్యూ తక్కువ వున్నప్పుడు బిల్లులు వాళ్ళకి ఇచ్చి కట్టమనేవారు. కానీ పది గంటలు దాటిందంటే బిల్లు కట్టడానికి ఆడవాళ్ళు ఎక్కుమంది వచ్చేవారు. ఇంచుమించు 100 మంది పైనే బిల్లు కట్టేవాళ్ళు వుండేవారు. మాలాంటి కొత్తవాళ్ళం వెళ్ళినప్పుడు ఇక్కడ కాదు అక్కడ - అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేవారు. చాలా విసుగ్గా వుండేది.

ఇదిలా వుండగా మా పని చాలా బిజీగా నడుస్తున్న టైంలో... ఇల్లుగలవాళ్ళు వచ్చి “రోడ్ వైడెనింగ్ లో ఇల్లు ముందు భాగం పోతుంది. మీరందరూ ఖాళీ చేస్తే అవన్నీ అయ్యాక మళ్ళీ వద్దురుగాని మీకే ఇస్తాం” అన్నారు. అనుకోకుండా మా వెనక రోడ్డులో ఇల్లు ఖాళీ అయ్యింది. వెంటనే అక్కడ మాట్లాడుకుని సామానంతా మార్చుకున్నాం.

ఇంక ఫోన్ కనక్షన్ తీసుకోవాలి. మావారు ఫోన్ నుంచి వైరు తీసేసి, టెలిఫోన్ వాళ్ళు పెట్టిన వైరంతా వూడదీసి చుట్టచుట్టి తీసుకుని వచ్చారు. అమ్మయ్య అన్ని పనులు అయిపోయాయని కొత్త ఇంట్లో కూచుని తీరుబడిగా టీ తాగుతున్నాం.

ఇంతలో పాత ఇంటి ముందున్న ఇల్లుగలవాళ్ళ వర్కుషాపు నుంచి పనిచేసే అతను హడావుడిగా వచ్చాడు. “మేడమ్ మేడమ్ మా ఫోన్ వైరు మీరు తెచ్చేశారు. సారు మిమ్మల్ని రమ్మంటున్నారు” అన్నాడు.

నేనూ, మా వారు వెళ్ళాం.

పాతింటి ఓనరు “ఏంటి సారూ... అర్జంటు ఫోన్ చేద్దామని చూస్తే ఏ సౌండూ రావట్లేదు. ఏందిట్లావస్తందీ అని చూస్తే... వైరు కట్ అయివుంది. మీ వైరుతోబాటు మా వైరు కట్ చేసుకుపోతే ఎట్లా సర్. అయినా మీరు మళ్ళీ కనక్షన్ పెట్టుకుంటే వాళ్ళే వైరు తెచ్చి పెడతారు. బలే చేసినావు సర్” అని మంచి వాడు కాబట్టి నవ్వుకుంటూ“మా కుర్రాడిని పంపిస్తాం. వైరు ఇవ్వండి” అన్నారు.

అసలు ఫోను పెట్టుకోవడమే కొత్త. ఒక నాలుగేళ్ళలో బిల్లులు కట్టడం, ఒకోసారి వాళ్ళు ఎక్కువ వేస్తే వాటిని చెక్ చేసుకుని అడగడం, ఫోన్ రిపేరు వస్తే కంప్లయింట్లు ఇవ్వడం ఇవన్నీ తెలుసుకున్నాం. వైరు తీసికెళ్ళిపోతే మనకి డబ్బు తక్కువ అవుతుందనుకుని చేసిన పని అది. తలుచుకున్నప్పుడల్లా ఆ పని కుర్రాడి మొహం, మా వారు చేసిన పని గుర్తుకు వచ్చి నవ్వొస్తుంది.

ఇంక తర్వాత టాటా వాళ్ళ సెల్ ఫోన్లు రావడం మొదలయ్యాక. అతి చిన్న సెల్ ఫోన్ కొనుక్కున్నాం. అక్కడ నుంచి మొదలైంది సెల్ ఫోన్ల పరంపర.

ఇప్పుడు ఇంట్లో అందరికీ తలోఫోను మరి.

8, మార్చి 2023, బుధవారం

*** ఒకరు పరాజిత *** - *** ఒకరు విజేత *** - 74

*** ఒకరు పరాజిత *** - *** ఒకరు విజేత *** - 74


పొద్దున్న సెల్ కి ఫోను “అమ్మా... నాగలక్ష్మిగారేనా... నా పేరు శోభ. నేను కబీర్ మఠం నుంచి చేస్తున్నాను. మిమ్మల్ని కలవడానికి వద్దామనుకుంటున్నాను. నేను మలక్ పేటలో వుంటాను. మీరు శ్రీనగర్ కాలనీలో వుంటారట కదా.. పదకొండు గంటలకి అమీర్ పేట వస్తాను. అక్కడ నుండి నాకు ఎలా రావాలో చెప్పండి” అని ఫోను పెట్టేశారు.

సరిగ్గా 11 గంటలకి అమీర్ పేట నుంచి శోభగారు ఫోన్ చేశారు. మా వారు గుర్తులు చెప్పారు. రోడ్డు మీదకి వెళ్ళి ఆవిడని తీసుకుని వచ్చారు. సన్నగా, తెల్లటి బట్టలతో వచ్చిన శోభగారిని చూస్తే నాకు వింతగా అనిపించింది. మనిషి చూడ్డానికి బాగానే వున్నారు. కూచోమని మంచినీళ్ళు ఇచ్చాం. మాకోసం ఒక అరడజను అరటిపళ్ళు తీసుకుని వచ్చారు.

“నేను చార్మినార్ దగ్గర శాలిబండలో కబీర్ మఠం వుంది. నేను అక్కడకి వెడుతూ వుంటాను. మలక్ పేటలో మా అబ్బాయి దగ్గర కూడా వుంటూ వుంటాను. కబీర్ జ్ఞానమందిర్ బెంగుళూరు వాళ్ళు హిందీ నుంచి తెలుగుకి అనువదించి కొన్ని పుస్తకాలు వెయ్యాలనుకుంటున్నారు. వారణాసిలో చాలా పెద్ద మఠం వుంది. అందరికీ తెలుగులో ముద్రించి ఆయన గురించి అందరికీ తెలియచెయ్యాలి. నాకు మీ సాయం కావాలి అన్నారు. ”

*** చిన్నప్పుడు 8వ తరగతిలో కబీర్ దోహాలు హిందీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన గురించి ఎక్కువ తెలియదు. అసలు గుర్తులేదు కూడా. శోభగారు కబీర్ దాస్ అని చెపుతూ వుంటే ఆశ్చర్యం వేసింది.***

మంచి ఎండలో వచ్చారు. కాస్త సేదదీరాక, “నాకు ఆకలిగా వుంది. నువ్వు ఏది తింటే అదే పెట్టమ్మా... మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి లేటవుతుంది” అన్నారు. మాకూ భోజనం చేసే టైమే కాబట్టి ఆవిడకి భోజనం పెట్టి, మేమూ భోజనం చేశాము. ఆవిడ పద్ధతిగా కింద కూచుని, ఆకులో వడ్డించమని తిన్నారు.

ఆవిడ గతంలో డిటిపి ఆపరేటర్, ఆబిడ్స్ లో ఒక ఆఫీసులో పనిచేసేవారట. వర్కు విషయంలో చాలా మంచి పేరు వుంది. వర్కు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఒకాయన కబీరు సూక్తుల గురించి, కబీర్ మఠం గురించి చెప్పి, ఆవిడని కబీర్ దాస్ అనుసరణి అయ్యేటట్లు చేశారు. ఇక అప్పటి నుంచి ఆవిడ రంగుల బట్టలు కట్టుకోవడం మానేసి తెల్లబట్టలే కట్టుకోవడం, పెద్దజడని తీసేసుకుని నిరాడంబరంగా వుండడం మొదలు పెట్టారుట. ఆవిడ భర్త ఏదో కారణంగా చనిపోయారు. అప్పటికి ఆవిడ వయసు చాలా తక్కువ. అయినా కూడా పిల్లలని జాగర్తగా పెంచి పెద్ద చేశారు. ఒకబ్బాయి హైదరాబాద్ లో చేస్తాడు. ఇంకో అబ్బాయి ఢిల్లీలోనో ఎక్కడో వుంటాడు.

మొత్తానికి చాలా కష్టపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఆ మఠం వాళ్ళు చేసే కార్యక్రమాలకి వెడుతూ వుంటారు. మాకు ఆవిడ చిన్న పెద్ద కలిపి ఐదు పుస్తకాల దాకా డిటిపి ఇచ్చారు.





ఆ పుస్తకాలు ప్రూఫు చూసుకోవడానికి వాటి గురించి మాట్లాడడానికి వస్తూవుండేవారు. డబ్బులు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. అలా వచ్చినప్పుడు నాతో – “మీరు కొట్టొచ్చే రంగుల బట్టలు కట్టుకోకండి. ఎక్కువ తెల్లబట్టలు కట్టుకోవడానికి చూడండి. బయట వాళ్ళకి ఆకర్షణీయంగా కనిపించకండి. మీ అబ్బాయికి పెళ్ళి చెయ్యకండి. కోడలు వస్తే మిమ్మల్ని పట్టించుకోడు” అని చెప్పడం మొదలు పెట్టారు. నేను ఆ విషయాలు పట్టించుకునేదాన్ని కాదు. అప్పటికే మనుషులు ఒక్కొక్కళ్ళు ఒకోరకంగా వుంటారని అవగాహన అయ్యింది. కాబట్టి ఆవిడతో వాదించలేదు. నవ్వేసి వినేసి వూరుకున్నారు. అక్కడితో ఆ విషయాన్ని పొడిగించలేదు.

త్రిపురారి అని ఈవిడ గురువు బీహారులో వుంటారు. ఒకసారి మా ఇంటికి వచ్చారు. కబీర్ దాస్ మీద పాటలు రాయడం, ఆయన జీవితచరిత్ర ప్రచారం చెయ్యడం వీళ్ళపని. పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తుంటారు. పుస్తకాల ముద్రణకి అయే ఖర్చు ఆయనే భరిస్తారు. ఒకసారి త్రిపురారీ కూడా మా ఇంటికి వచ్చారు. “ముగ్గురం మీ ఇంట్లో భోజనం చేస్తాం” అని భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళకి తెలుగు రాదు.

ఇదంతా బాగానే వుంది ఆవిడ ఎండని, వానని లెక్కచెయ్యకుండా చాలా దూరాలు నడుచుకుంటూ మా ఇంటికి వస్తూండేవారు. తిండి విషయం అస్సలు పట్టించుకోరు. పిల్లలు చెప్తూనే వుంటారుట ఎక్కడ ఏది దొరకినా అంటే పళ్ళో, టిఫినో ఏదో ఒకటి తినమని. కానీ ఆవిడకి అప్పటికే చాలా అనారోగ్యాలు ఉన్నాయి. మా దగ్గిరకి వస్తున్నప్పుడే హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు.

డాక్టరు ఆవిడ ముందు వాడే మందులు చూపించమని, వాటిలో ఒక టాబ్లెట్ వేసుకోకుండా ఆపరేషన్ కి ముందు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన మందులు వాడమన్నారుట. ఇంక మర్నాడు ఆపరేషన్ అనగా ఆవిడకి రాత్రి సీరియస్ అయిపోయింది. చక్కగా చకచకా తిరిగే ఆవిడకి పక్షవాతం వచ్చి ఒక వైపంతా చచ్చుబడిపోయింది. పిల్లలకి భారమయ్యింది.

ఫోను కూడా పట్టుకునే స్థితిలో లేదు. ఒక మనిషిని సహాయానికి పెట్టారు. డాక్టర్లు ముందు ఆవిడకి చెప్పినది టైముకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం, దాని వల్ల రోగనిరోధక శక్తి లేకపోవడం. వద్దన్న మందు వేసుకోవడం ఇంకో కారణం అని చెప్పారుట. ఏది ఏమైనా తనంత తను తిరగగలిగే శక్తిని కోల్పోయింది. ఒక్క పుస్తకం కూడా ముద్రణకి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి చూసి వచ్చాం. చాలా బాధ అనిపించింది. తను అనుకున్న పనులు పూర్తి చెయ్యలేకపోతున్నానని చాల బాధపడ్డారు. కానీ మఠం వాళ్ళు తెలుగు రాకపోయినా వాళ్ళు వచ్చి చేయించుకుంటామని ఫోన్లు చేస్తున్నారు.

ఈవిడ చెప్పిన మాట వినకుండా, ఒక టైము లేకుండా అలా మఠాల చుట్టూ తిరగడం ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చలేదు. ఇలా మూల పడేసరికి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ఒకోసారి మనకి సంబంధం లేకుండా కొన్ని పరిస్థితులు వస్తాయి. కానీ చేతులారా చేసుకున్నదానికి జీవితాంతం బాధపడాలి.

మేము బయటికి వెడితే టైము దాటనివ్వం. ఏదో ఒకటి అందుబాటులో వున్నది తినేస్తాం. సాధారణంగా బ్యాగ్ లో పళ్ళో, బాదం పప్పులో ఏవో ఒకటి వుంటాయి. నీళ్ళు తప్పనిసరి. టైముకి తినడం ముఖ్యం.

***
***
***

*** ఓ విజేత ***

*** 8 పదులలో శరీరం సహకరించకపోయినా శక్తిని కూడదీసుకుని ఎంతో ఉత్సాహంతో....

మరంగంటి కాంచనమాల గారు ***



అనువదించిన "ఖలీల్ జిబ్రాన్" పుస్తకం మా చేతుల మీదుగా ముద్రింపబడింది. ఆవిడకి కావలసినట్లుగా కవర్ పేజి, పుస్తకంలో రావలసిన మేటర్ అన్నీ ఫోన్ లో చెప్పి చేయించుకున్నారు.

ఆవిడ రచించిన మరికొన్ని పుస్తకాలు కూడా తీసుకురావాలని అనుకున్నారు.
1958-60 వరకు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాదులో...
1968-89 వరకు శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, తిరుపతిలో నృత్య అధ్యాపకురాలిగా చేశారు.

"వినాయక తాళము" విశేష అధ్యయనం, పరిశోధన చేసినందుకు గాను *** "కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ" *** నుంచి ప్రత్యేక స్కాలర్ షిప్ పొందారు.

1989లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితాన్ని కీసర వృద్ధాశ్రమంలో గడుపుతున్న వీరు గత సంవత్సరం ప్రపంచానికి దూరమయ్యారు.

వీరి రచనలు
1. శ్రీ రామానుజ సూక్తందాదు (స్తుతి)
2. గోదామురళి అను ఆంధ్ర తిరుప్పావై
3. మాయామహిత రూప రామచంద్ర పద్యకుసుమాలు
4. లీలాశుక యోగీంద్రిల సంస్కృత శ్రీకృష్ణ కర్ణామృత - తెలుగు సేత

వీరి పుస్తకం ‘ఆండాళ్ చరిత్ర’ చేశాం. కానీ అది ముద్రణకి వెళ్ళేలోపునే ఆవిడ ప్రపంచానికి దూరమయ్యారు.

ప్రఖ్యాత న్యాయవాదిగా పేరు గడించి న్యాయ శాస్త్రం మీద ఆంగ్లంలో అనేక పుస్తకాలు రచించిన ఎన్.కె.ఆచార్యగారి బంధువు.

ఆచార్య గారు 1955 నుండి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమీక్షలు విశ్లేషణలు చేసి ప్రజలకు అందించారు. ఆంధ్రజ్యోతిలో న్యాయ అంశాలపై వారంవారం శీర్షిక రాశారు. జి.యస్.భార్గవ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ గా వున్నప్పుడు అనేక వ్యాసాలు రాశారు. ప్రసారిత త్రైమాస పత్రిక వెలువడినప్పుడు ఎన్.ఇన్నయ్య, పి. సత్యనారాయణ సంపాదకులుగా ప్రచురిస్తుండగా ఆచార్యగారు ప్రామాణికమైన రచనలు కొన్ని చేశారు.అబ్బూరి రామకృష్ణారావు, లక్ష్మణశాస్త్రి జోషి, జె.బి.హెచ్. వాడియా వంటి నాయకులు హైదరాబాదు వచ్చినప్పుడు వారి ప్రసంగాలకు ఏర్పాటు చేసి తోడ్పడ్డారు.

28, ఫిబ్రవరి 2023, మంగళవారం

*** రూం టు రీడ్ *** - 73

*** రూం టు రీడ్ *** - 73

*** అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్యలో అక్షరాస్యత
బాలబాలికల సమానత్వాన్ని మెరుగుపరచడానికి ఒక లాభాపేక్షలేని సంస్థ.***


అక్క రమాసుందరి సంజీవరెడ్డి నగర్ స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేది. రూం టు రీడ్ సంస్థలో పనిచేస్తున్న ధరణి అక్కని రోజూ కలుస్తుండేది. ఒకరోజు అక్కతో మాట్లాడుతూ – “పిల్లల కథలు రాసేవాళ్ళు ఎవరైనా వున్నారా... వుంటే చెప్పండి. మేము పిల్లల కథలకి పోటీ నిర్వహిస్తున్నాం. అనగానే అక్క కవితలు, కథలు రాసేది కాబట్టి, మర్నాడు ఒక కథ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చింది. అక్కకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంకెవరైనా కథలు రాసేవాళ్ళుంటే చెప్పమంటే - తను మా చెల్లెలు కూడా పిల్లల కథలు రాస్తుంది. తనకి ఇంట్లో తెలుగు డిటిపి ఉంది. వాళ్ళు రకరకాల పుస్తకాలు చేస్తుంటారు అని చెప్పింది.

ధరణి నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది. నా అడ్రస్, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబరు తీసుకుంది. ఒకరోజు ఫోన్ చేసి ఆఫీసుకి వచ్చి, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారిని కలవమంది. అయితే అప్పటి వరకూ సంజీవరెడ్డి నగర్ లో వుండే ఆఫీసు సరిపోవట్లేదని మాసాబ్ ట్యాంక్ కి మార్చారు. వర్కు గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను. అందరూ చాలా మర్యాదగా మాట్లాడారు. పిల్లల ప్రాథమిక విద్యకి సంబంధించిన పుస్తకాలు చెయ్యాలని చెప్పారు.

డిటిపి చెయ్యడానికి వాళ్ళ పుస్తకాలు నాకు చాలా ఇచ్చారు. ఆపుస్తకాలు చాలా వరకు బాలికల చదువుకి ప్రోత్సాహానికి సంబంధించినవే వుండేవి.

అందులో 24 సంవత్సరాల ధరణి, సునీత పనిచేస్తుండేవారు. వాళ్ళకి వేరే వూళ్ళు వెళ్ళాల్సిన అవసరం వుంటూవుండేది. వాళ్ళిద్దరూ ఈ సంస్థకోసం చాలా కష్టపడేవారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక టైము అంటూ వుండేది కాదు. అప్పుడప్పుడు మా ఇంటికి వర్కు గురించి వచ్చినప్పుడు నేను పెట్టినవి ఏవో ఒకటి తిని, టీ తాగి కాసేపు రిలాక్స్ అయి వెళ్ళేవారు. నేనంటే వాళ్ళకి చాలా అభిమానం.

డబ్బుల విషయం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అయితే వాళ్ళలో ఒకావిడ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేసేది. సునీత మేం చేసిన వర్కుని ప్రూఫ్ రీడింగ్ చేస్తుండేది. అనువాదంలో వాక్యనిర్మాణం సరిగా వుండేది కాదు. ఒకటి రెండుసార్లు చెప్పాను. వాళ్ళు అదే పద్ధతిలో చేస్తున్నారు.

ఇంతలో వాళ్ళ బాస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో కొత్తగా డిటిపి పెట్టుకున్నారని వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టారు. అలా వాళ్ళతో సంబంధాలు తగ్గిపోయాయి. అయినా చాలా విషయాలు తెలుసుకున్నాను.

రూమ్ టు రీడ్ పుస్తకాలు హిందీ నుంచి తెలుగు అనువాదం నాకు తెలిసిన వాళ్ళచేత చేయించి వాటిని నేను పుస్తకాలుగా సెట్ చేసి ఇచ్చేదాన్ని. ఆ అనువాదానికి సంబంధించిన డబ్బులు మాత్రం పూర్తిగా రాలేదు. అది మధ్యలో వాళ్ళు ఇవ్వలేదు.

ఆ అమ్మాయిలిద్దరూ చాలా కష్టపడేవాళ్ళు. ఇంటికి ఒక టైం కి వెళ్ళడం వుండేది కాదు. ఇంక ధరణి వాళ్ళింట్లో పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయి మానేసింది. సునీత లాంటి వాళ్ళు చాలామంది ఆ సంస్థలో బాలికా విద్య ప్రోత్సాహానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని విన్నాను.

మేము చేసిన పుస్తకాలతో లైబ్రరీలు పెట్టి పిల్లలచేత అవి చదివించి, విద్యని ప్రోత్సహిస్తారని చెప్పారు.

***
***

రూమ్ టు రీడ్ బాలికల పాఠశాలలో పిల్లలకి ప్రాథమిక విద్యలో అక్షరాస్యత నైపుణ్యాల్ని, చదివే పిల్లలకి మంచి అలవాట్లని, అంతకు మించి జీవన నైపుణ్యాలతో మాధ్యమిక పాఠశాల విద్య విజయవంతం కావడానికి సంబంధించిన విషయాల్లో మద్దతు ఇస్తుంది. - "ప్రపంచ మార్పు విద్యావంతులైన పిల్లలతో మొదలవుతుంది" – అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది.

జాన్ వుడ్ కాలిఫోర్నియాలో మైక్రోసాఫ్ట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుండేవాడు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక పాఠశాలలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులకి, పిల్లలకి ఉన్న వనరుల లేమిని చూసి అవన్నీ కల్పించడం తన కర్తవ్యంగా భావించి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ముఖ్యంగా వెనకబడి ఉన్న బాలికా విద్యని ప్రోత్సహించాలనుకున్నాడు. ఈ కారణంగా రూమ్ టు రీడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు.

గ్రామీణ సంఘాలతో కలిసి పాఠశాలలని నిర్మించి, లైబ్రరీ (రీడింగ్ రూం) లని ఏర్పాటు చేసి బాలికలు చదువులో ముందుండాలనుకున్నాడు. పుస్తకాలు తప్పనిసరిగా చదివించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సాహవంతులైన యువతులని ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రోత్సహించారు.

నా జీవనయానంలో మరో కొత్త విషయం తెలుసుకున్నాను.

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

*** ఆటోలు - హైదరాబాదు *** -72

  *** ఆటోలు - హైదరాబాదు *** -72



*** ఒక ఆటో వాలా ఇచ్చిన బిరుదు***

మా అత్తగారు మా దగ్గిరకి వచ్చినప్పుడు ఆవిడని తీసుకుని అప్పుడప్పుడు హైదరాబాదులో ఎక్కడికో అక్కడికి తీసుకెడుతుంటాను. అలా ఒకరోజు వెళ్ళాం. ఇద్దరం తిరిగి ఇంటికి వస్తున్నాం. అప్పుడు మేము బల్కంపేటలో ఉండేవాళ్ళం. ఇంకో రెండు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటికి వెళ్ళేందుకు పక్క పక్క రోడ్లు రెండున్నాయి. ఒకటి స్ట్రెయిట్ రోడ్డు. ఇంకొకటి కొంచెం తిరిగి వెళ్ళాలి. ఈ స్ట్రెయిట్ రోడ్డులో నుంచి తీసుకెళ్ళమని చెప్పాను.

పొద్దున్న మేము వెళ్ళేసరికి బాగానే వుంది కానీ... సాయంత్రం వచ్చేసరికి ఆ రోడ్డులో ఏదో తవ్వుతున్నారు. ఇంటికి వెళ్ళే దారిలేదు. నేను ఆటో అతనితో “వెనక్కి తిప్పి పక్క రోడ్డులోంచి తీసుకెళ్లు”అన్నాను. “నేను తీసికెళ్ళను ఇక్కడే దిగిపొండి...” అన్నాడు. కనీసం నడిచి వెళ్ళే దారి కూడా లేదు. నాకు చాలా కోపం వచ్చింది.

“ఎందుకు తీసికెళ్ళవు?” అన్నాను.

“నువ్వు ముందు ఇటే తీసికెళ్ళమన్నావు దిగండి ఇక్కడే” అని గొడవ పెట్టుకున్నాడు. పెద్దావిడ ఉన్నారనికి ఆలోచనలేదు. అస్సలు వినట్లేదు.

ఇంక నాకు చిరాకొచ్చి “మేము ఎప్పటి నుంచో ఇక్కడ వుంటున్నాం. అందరూ తెలిసిన వాళ్ళే... చెప్పానంటే నువ్వు, నీ ఆటో ఇంటికి వెళ్ళరు” అన్నాను.

వెంటనే ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన ఇంకో రోడ్డులోంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. డబ్బులు ఇస్తుంటే....

“గూండారాణి! గూండాలని బాగానే మెయింటెయిన్ చేస్తున్నావు” అంటూ వెళ్ళిపోయాడు. వాడన్నమాటలకి నేను షాకయ్యి చూస్తూవుంటే.... మా అత్తగారు ఇంటిముందున్న అరుగు మీద కూచుని పొట్ట పట్టుకుని నవ్వుతున్నారు. ఆవిడని చూసి నాకూ నవ్వాగలేదు.

తర్వాత ఆవిడ “నువ్వు వాడిని భయపెట్టడానికి చెప్పావనుకున్నాను. నిజంగానే నీకు ఇక్కడ అందరూ తెలుసా....” అన్నారు. “అవునండీ... ఎప్పటి నుంచో వుంటున్నాం కదా... ఇక్కడ అందరూ ఏ సాయానికైనా పరుగెత్తుకుని వస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..” అని ఆవిడని తీసుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను.

***
***

మరోసారి సంజీవరెడ్డి నగర్ నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆర్ బి ఐ క్వార్టర్స్ పక్కన నా శిష్యురాలు లక్ష్మి ఏదో ఫంక్షన్ కి పిలిస్తే వెళ్ళాల్సి వచ్చింది. ఆటో అతనికి ఆర్ బి ఐ క్వార్టర్స్ గుర్తు చెప్పాను. అక్కడి వరకూ వెళ్ళాక ఆటో ఆపేసి ఇదే క్వార్టర్స్ దిగిపొమ్మన్నాడు.

నేను “కొంచెం ముందుకి తీసుకెళ్ళు నేను దగ్గర అని చెప్పాను. క్వార్టర్స్ అని చెప్పలేదు” అన్నాను. అతను చెప్తుంటే వినట్లేదు. లక్ష్మి ఒక టైము చెప్పింది. ఆ టైములోపల వెళ్ళాలి. దగ్గరలోనే వున్నాం కదా... అనుకుంటే ఇదో నస అనుకుంటూ.... మళ్ళీ అడిగాను. ససేమిరా ఒప్పుకోవట్లేదు. నడవడానికి ఇబ్బంది లేదు కానీ... అపార్ట్ మెంట్ లోపలకి వెళ్ళాలి.

నేను అతనితో “శ్రీనగర్ కాలనీ ఏరియా కార్పొరేటర్ విజయలక్ష్మిగారు మాకు బాగా తెలుసు. నేను ఆవిడకి ఫోన్ చేస్తాను” అన్నాను. (మేము ఆవిడకి లెటర్లు చేసి పెడుతూ వుంటాం. నేను చాలాసార్లు వాళ్ళింటికి కూడా వెళ్ళాను.) నేను ఆవిడ పేరు చెప్పగానే.... “అమ్మా.... ఆ మేడమ్ తాలూకా అని ముందరే చెప్పచ్చుగా.... ఆ అమ్మ చాలా మంచిది” అని నేను తీసుకెళ్ళాల్సిన చోట దింపాడు.

నేను డబ్బులు ఇస్తూ.... “కరక్ట్ గా అడ్రస్ చెప్పలేక ఒకోసారి పక్కనున్న ఏదైనా పేరున్న ఆఫీసో.. స్కూలో ఏదో చెప్తాం. అలాంటప్పుడు మేం చెప్పిన చోటికి తీసుకెళ్ళాలి. ఇలా నస పెట్టకూడదు. ఇంకో ఐదురూపాయలు అడగాలి. నాకు కాదు ఇంకెవరికైనా ఇలాగే కావచ్చు” అన్నాను.

డబ్బులు తీసుకుని ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

ఇప్పుడయితే ఆటోనో క్యాబో బుక్ చేసుకుంటే సరిపోతుంది. అవీ కొన్నిసార్లు ఇబ్బంది అవుతున్నాయి.

15, ఫిబ్రవరి 2023, బుధవారం

***కుటుంబ మిత్రులైన ప్రముఖ జర్నలిస్టులు *** 71

 ***కుటుంబ మిత్రులైన ప్రముఖ జర్నలిస్టులు *** -71


2016లో పాత్రికేయులు కొండా లక్ష్మణ రావుగారు ఫోన్ చేసి "అమ్మా నాగలక్ష్మిగారు నా పేరు లక్ష్మణరావు. జర్నలిస్టు కాలనీలో ఉంటాం. ఇన్నయ్యగారు మేము చిరకాల మిత్రులం. మీరు ఇన్నయ్యగారి పుస్తకాలు ప్రింట్ చేయిస్తుంటారు కదా... సీనియర్ పాత్రికేయులు జి.ఎస్. వరదాచారిగారి పుస్తకం చెయ్యాలి. మీఅడ్రస్ చెప్పమ్మా..." అన్నారు.


లక్ష్మణరావుగారు “వరదాచారిగారు 1962 ఆంధ్రభూమిలో (యువపాత్రికేయులు) న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం మీద అప్పటి చైనా దండయాత్ర వలన ఆనాటి సామాన్యుని పరిస్థితిని గురించి రాసిన ఐదు వ్యాసాల్ని 13, 14, 15, 16, 17 తేదీల్లో రాసిన వ్యాసాల్ని చిన్న పుస్తకంగా వేద్దామనుకుంటున్నామని చెప్పారు. అది 2016 ఆగస్టులో వరదాచారిగారి గారి పాత్రికేయ జీవనయాన పరిస్థితిని పురస్కరించుకుని పుస్తకాన్ని ఆవిష్కరిస్తామ”ని చెప్పారు.

*** వరదాచారిగారు ‘‘ఆంధ్రభూమి’’లో 1961 నుండి 1982 దాకా, న్యూస్‌ ఎడిటర్‌గా పని చేశారు. అనంతరం ‘‘ఈనాడు’’ పత్రికలో, 1988 వరకు, సహాయ సంపాదకులుగా ఉన్నారు. 1988 నుండి 2010 దాకా, 22 సంవత్సరాల సుదీర్ఘకాలం పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంలో, తొలుత జర్నలిజం డిపార్టుమెంటు శాఖాధిపతిగా, అనంతరం, విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.*** వరదాచారిగారి గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవనయానం చదవాల్సిందే.

వరదాచారిగారి భారత పై చైనా దండయాత్ర, జ్ఞాపకాల వరద (సిడిలో మేటర్ విని టైప్ చేసి పెట్టాం. ఎమెస్కో వాళ్ళు ప్రింట్ చేశారు), అవిశ్రాంత భాషా సేవకుడు తిరుమల రామచంద్ర పుస్తకం టైప్ చేసి ఇచ్చాం.




ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ రచయిత ఉడయవర్లు గారు ఇచ్చిన *** దాశరథి స్మృతి, రావిచెట్టు రంగారావుగారి జీవితచరిత్ర *** పుస్తకాలు మేము చేసి ఇచ్చాము.

*** ఇలా త్రిమూర్తులులాంటి వీరు ముగ్గురూ తరచు ఏదో ఒక పని చేయించుకోవడానికి మా ఇంటికి వస్తుండేవారు. 2016 మార్చిలో జరిగిన మా అమ్మాయి నిశ్చితార్థానికి పిలవగానే ముగ్గురూ వచ్చి కార్యక్రమానికి వచ్చిన సాహితీ ప్రముఖులందరినీ కలిశారు. అమ్మా మీ అమ్మాయి నిశ్చితార్థంలా లేదు. సాహితీసమావేశంలా వుంది. మాకు చాలా ఆనందంగా గడిచిందని చెప్పారు. ***


****
****

అలా కొనసాగిన పరిచయంతో....

2019 జులై 20వ తేదీన ప్రముఖ పాత్రికేయులు *** గోవిందుని రామశాస్త్రి గారి శతజయంతి*** సాహిత్య అకాడమి, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్తంగా నిర్వహించారు. వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి, గోరాశాస్త్రి గారి గురించి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గోరాశాస్త్రిగారి “వినాయకుడి వీణ”పేరుతో వచ్చిన సంపాదకీయాల్ని పుస్తకంగా ముద్రించి వెంకయ్యనాయుడుగారి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు.

ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విభాగాలుగా జరిగింది. ప్రముఖపాత్రికేయులు వరదాచారిగారు, ఉడయవర్లుగారు, లక్ష్మణరావుగారు వయసులో చాలా పెద్దవాళ్ళయినా కార్యక్రమం నిర్వహణ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.

పేరుగాంచిన పాత్రికేయులతో సమావేశమందిరం కళకళలాడింది. దాసు కేశవరావుగారు, కె.బి.లక్ష్మి గారు, కల్లూరి భాస్కరం గారు, నాగసూరి వేణుగోపాల్ గారు, నందిరాజు రాధాకృష్ణగారు, పి.యస్. గోపాలకృష్ణ గారు, గోవిందరాజు చక్రధర్ గారు, శ్రీనివాస్ వాసుదేవ గారు సమర్పించిన పత్రాల ద్వారా గోరాశాస్త్రిగారి జీవిత విశేషాలు ఎన్నో తెలుసుకోగలిగాం.

సాహిత్య అకాడమి, తెలుగు సలహామండలి సంచాలకులు శివారెడ్డిగారు, భండారు శ్రీనివాసరావుగారు సమావేశ విభాగాలకు అధ్యక్షత వహించారు. రావెల సోమయ్య గారు, వంశీ రామరాజుగారు, తెన్నేటి సుధాదేవిగారు, భగీరథ గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు విచ్చేసిన ఈ సమావేశం చాలా విజయవంతంగా ముగిసింది.




ఈ సమావేశంలో ఉడతా భక్తిగా నేను కొన్ని పనులలో సహకరించాను. జ్యోతి ప్రజ్వలన సమయంలో వెంకయ్య నాయుడుగారు వంటి ప్రముఖులతో బాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. వరదాచారిగారి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాను.

ఈ సమావేశంలో గోరాశాస్త్రి గారి జీవిత విశేషాల గురించి ప్రముఖ రచయితలు సమర్పించిన పత్రాలని “ప్రముఖ సంపాదకుడు రచయిత” మొదటి భాగం ముద్రణకి తయారవుతోంది. ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారి జీవిత చరిత్ర కూడా ముద్రణకి సంరంభమవుతోంది. కరోనాతో, నేను ఆస్ట్రేలియా వెళ్ళడంతో ఆగిపోయిన పుస్తకాలు మళ్ళీ మాచేతుల మీదుగానే ముద్రణకి తయారవుతున్నాయి.

ఇంక మీరు ఇప్పుడప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళరు కాబట్టి ఇంక మాకు దిగులు లేదు. మిగిలిన పుస్తకాలు కూడా రెడీ చేసుకుంటున్నాం అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ కంప్యూటర్ లో కొంతమంది పనులు చేశాను.

ఇవన్నీ పుస్తకాలుగా వచ్చేశాయి. ఈ రెండు సంవత్సరాలలో చాలా పుస్తకాలే చేశాం.

****
****

వీళ్ళందరినీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందరూ చాలా చలాకీగా తిరుగుతూ వుంటారు. వరదాచారిగారు వయసు వల్ల బయటికి ఎక్కువ రాలేకపోతున్నారు.

**** ఉడయవర్లుగారు ప్రూఫు రీడింగ్ చేస్తున్నారు. కింగ్ కోటీలో ఉన్న అతి పురాతన (1901 స్థాపన) శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయాన్ని అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షిస్తుంటారు. ***

వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. వరదాచారిగారు, అధ్యక్షులు ఉడయవర్లుగారు, సెక్రటరీ లక్ష్మణరావుగారు గారు మా ఇంటికి వచ్చారు. దీనికి ఉపాధ్యక్షులు గుడిపూడి శ్రీహరిగారు, జాయింట్ సెక్రటరీ బండారు శ్రీనివాసరావుగారు అని చెప్పారు. లక్ష్మణరావుగారు ఈ సంఘ చరిత్రని చాలా చక్కగా చెప్పారు. వీరికి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయోధిక పాత్రికేయులకి చేసిన ఉపకారాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరిగారు ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

ఈమధ్యే ప్రముఖ పాత్రికేయులైన వరదాచారిగారు, గుడిపూడి శ్రీహరిగారు కాలం చేశారు. ఇదొక బాధాకరమైన విషయం.

మహామహుల ఎందరి పనులో చేయగలుగుతున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.