23, జూన్ 2022, గురువారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 25 *** ఆ మంచితనానికి హద్దుని చూడలేదు***

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 25  *** ఆ మంచితనానికి హద్దుని చూడలేదు***


నేను నా ఉద్యోగంలో ఒడుదుడుకులు, విజయాలు చెప్పేముందు నాకు కొత్త విద్య నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన మా ఎమ్.డి. విజయపాల్ రెడ్డిగారి కుటుంబం గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో అందరూ మంచివాళ్ళు వుండడం అప్పుడే నేను కొత్తగా చూశాను. అంతేకాకుండా వీళ్ళ కుటుంబానికి నమ్మిన బంటు రాములు. వాళ్ళ కుటుంబానికే కాదు. నాకు ఏ అవసరం వచ్చినా... ఆఘమేఘాల మీద అందించేవాడు. పెద్ద సెక్యూరిటీ గార్డ్.

మా ఆఫీసు ఉన్న బిల్డింగ్ పక్కనే ఆనుకుని ఉన్న బిల్డింగ్ విజయపాల్ రెడ్డిగారు వాళ్ళది. అందులోంచి ఇందులోకి దారి వుంది. కాబట్టి అటూ ఇటూ తిరగడం వాళ్ళకి అనుకూలంగా వుండేది. వాళ్ళ కుటుంబానికి కూడా ఆఫీసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం వుండేది.

ప్రముఖ అడ్వకేట్ ప్రతాప్ రెడ్డిగారు

విజయపాల్ రెడ్డి గారి తండ్రిగారు ప్రముఖ న్యాయవాది, సాహిత్యవేత్త అయిన కె. ప్రతాప్ రెడ్డిగారి ఏకైక కుమారుడు. ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. అందరినీ ఒక పద్ధతిగా పెంచారు. ఆయన నియమనిష్టలకి ఆయన దగ్గిర పనిచేసే అందరికీ వణుకు పుట్టించేది. ఎంత కఠినంగా వుండేవారో అంత మంచితనం కూడా వుంది. ఇంట్లో కూడా టిఫిన్ కి కానీ, భోజనానికి కానీ అందరూ ఒకే టైముకి రావాలి. ఆ టైము దాటితే వాళ్ళకి టిఫిన్, భోజనం ఆ రోజుకి వుండదు. ఇంక ఆలోచించే ప్రసక్తే లేదు. సాధారణంగా ఆయన ఒక కేసు తీసుకుంటే విజయమే వుండేదని విన్నాను. సిటీలో ఆయనకి చాలా గొప్ప పేరుంది. వీళ్ళు సామాన్యంగా కనిపించే కోటీశ్వరులు.

ప్రతాప్ రెడ్డిగారి (ఫోటో ప్రతాప్ రెడ్డిగారిది) గొప్పతనం ఇలా -

నేను ఆఫీసులో వుండగా ఉన్నట్టుండి ఒక రోజు సిటీలో కర్ఫ్యూ ప్రకటించారు. ఆ టైములో సిటీలో చాలా కఠినంగా వ్యవహరించారు. నేను ఇంటికి వెళ్ళేందుకు బస్ లు లేవు. అక్క పెళ్ళయి బావగారు ఇక్కడ ఉద్యోగం వుండడంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. కర్ఫ్యూ పెడుతున్నారని తెలిసి ఆఫీస్ కి ఫోన్ చేసింది. ప్రతాప్ రెడ్డిగారు ఫోన్ తీశారు.

ఇక తను ఆగకుండా “ఏంటి సర్ మీకు ఆమాత్రం తెలియదా... తను ఇంటికి ఎలా వస్తుంది?” అంటూ పెద్ద ఎత్తున మాట్లాడేసింది. తనని పూర్తిగా మాట్లాడనిచ్చి –

“అమ్మా! ఇక్కడ మీ చెల్లెలికి వచ్చిన ఆపద ఏం లేదు. మేమందరం వున్నాం. రేపు పొద్దున్న మీ చెల్లెలు క్షేమంగా ఇంటికి వస్తుంది” అని చెప్పి, కొడుకుని పిలిచి -

“విజయపాల్! రాములుకి చెప్పి అమ్మాయికి కావలసినవన్నీ జాగర్తగా చూడమని. మన గెస్ట్ రూంలో అన్ని ఏర్పాట్లు చెయ్యండి” అని చెప్పారు. వెంటనే నాకు మంచి భోజనం, పడుకునేందుకు రూము ఏర్పాటు చేశారు. నిజంగా ఆరోజు వాళ్ళు చూపించిన ఆప్యాయత చాలా గొప్పది, మరిచిపోలేనిది. ప్రతాప్ రెడ్డి గారు మర్నాడు పొద్దున్న ఆయనతోబాటు టీ తాగడానికి పిలిచి “రాత్రి నిద్ర బాగా పట్టిందామ్మా! ఏమీ భయపడలేదు కదా?” అని, రాములు నిన్ను కారులో ఇంటి దగ్గర దింపుతాడు అని చెప్పారు. నేను తలాడించి బయటికి వచ్చేశాను.

అయితే నేను కారు దగ్గిరకి వెళ్ళేవరకు నాతో ఎవరు వస్తున్నారో అర్థం కాలేదు. ఆశ్చర్యం వేసింది - విజయపాల్ రెడ్డిగారి అమ్మగారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కజిన్, వాళ్ళ అక్క అందరూ రాములు డ్రైవర్ చేసిన ఫియట్ (అప్పట్లో ఫియట్ కారంటే చాలా గొప్ప) కారులో సంజీవరెడ్డి నగర్ లో అక్కావాళ్ళ ఇంటి దగ్గర దింపారు. అది కూడా ప్రతాప్ రెడ్డి గారు హుకుం జారీచేశారు. ఈ సంఘటన నేను మరిచిపోలేనిది.

నాకు వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసినన్ని రోజులు అడుగడుగునా ఆదుకున్నారు. ఇవన్నీ ముందు ముందు తెలుస్తాయి.

దాదాపు 35 సంవత్సరాల తర్వాత నేను రాములు ఫోన్ నెం. సంపాదించి పలకరించాను. ఎంతో సంతోషించాడు. మా కుటుంబంలో అందరినీ పేరు పేరునా అడిగాడు. ఎవరికి గుర్తుంటుంది మేడమ్. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు. నాకు సంతోషమయింది అన్నాడు.

ప్రతాప్ రెడ్డిగారు వాళ్ళు చిలుకూరు దగ్గిరకి వెళ్ళిపోయారు. విజయపాల్ రెడ్డిగారి అమ్మగారు కిందటి సంవత్సరం చనిపోయారు. వీలైతే ఒకసారి వాళ్ళింటికి తీసుకుని వెడతాను అన్నాడు. కానీ కరోనా కారణంగా కలవలేకపోయాను. త్వరలోనే వారిని కలవాలి.


21, జూన్ 2022, మంగళవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24 *** కంప్యూటర్ రూంలో సంగీత ధ్వనులు ***

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24  *** కంప్యూటర్ రూంలో సంగీత ధ్వనులు ***


యథా ప్రకారం నేను కంప్యూటర్ దగ్గర కూచుని వర్కు చేసుకుంటున్నాను. లక్ష్మీ, రవీంద్రనాథ్ తెగ హడావిడి పడిపోతున్నారు. ఉన్నట్టుండి లైటు ఆర్పేశారు. రెడ్ లైట్ వేశారు. నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. వెనక్కి తిరిగి చూశాను. లక్ష్మి ఏదో నల్లటి బాక్స్ తీసుకుని వచ్చింది. దాన్ని లక్ష్మి కంప్యూటర్ పక్కన వున్న పెద్ద భోషాణం లాంటి (*** నేను పక్కన ఫోటోలో పెట్టాను చూడండి అంత పెద్దది ఉండేది ***) దానికి బయట ఫిట్ చేశారు. తర్వాత రవీంద్రనాథ్ ఆ భోషాణం లాంటి దాని మూత ఓపెన్ చేశాడు. అందులో ఒక వైట్ పేపర్ రోల్ తీసుకువచ్చి లోపల పెట్టాడు. దాని మూసేసి ఇద్దరూ ఇవతలికి వచ్చారు. రవీంద్రనాథ్ లైట్ వేశాడు. లక్ష్మి తన సీటులో కూచుంది. ఇంతలోకే చిన్న చిన్నగా, ఉన్నట్టుండి పెద్దగా అందమైన శబ్దాలు వినిపించడం మొదలు పెట్టింది. నాకు ఏమీ అర్థం కాక వెనక్కి తిరిగి చూశాను.

ఇప్పుడు మాత్రం రవీంద్రనాథ్ నా మొహంలో క్వశ్చన్ మార్కులు చూసి దీన్ని “ప్రింటర్” అంటారు. మనం టైప్ చేసిన మేటర్ ఇందులో ప్రింట్ అవుతుంది - “ఇందాక నేను లోపల ఒక పేపర్ పెట్టాను కదా.... అది బ్రోమైడ్ పేపర్. అది లైటు లేకుండానే లోపల పెట్టాలి. లేకపోతే ఎక్స్ పోజ్ అయిపోతుంది. అవతల పడెయ్యాల్సిందే. తర్వాత లోపల ఇదిగో ఇలాంటి నల్లంటి ఫాంట్ డిస్క్(*** నేను ఫోటోలో పెట్టిన నల్లటిది. నేనే ఫోటోషాప్ లో ఇలావుంటుందని చెప్పడానికి దాన్ని గీశాను***) వుంటుంది” అని నల్లగా, గ్లాస్ తో చేసిన గుండ్రటి దాన్ని చూపించాడు. దానిమీద ABCD లు ఉన్నాయి. అయితే ఆ బాక్స్ లోకి ప్రింట్ అయిన బ్రోమైడ్ పేపర్ వస్తుందని చెప్పాడు.






ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే – ఈ నల్లటి డిస్క్ లు రెండు ఉన్నాయి. ఒకటి తెలుగు అక్షరాలకి రెండోది, ఇంగ్లీషు అక్షరాలకి -

వీటిలో మనకి కావలసిన – Futura, Sovenir, Times New Roman ఇచ్చి *** ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్న గాజు డిస్క్*** జాగ్రత్తగా డార్క్ రూం లో లోపల ఫిట్ చెయ్యాలి. అలాగే తెలుగు ఫాంట్స్ కావాలంటే తెలుగు డిస్క్ పెట్టాలి. వాటిల్లో గీతలు రావడానికి కూడా సెట్ చేశారు. ప్రింటర్ లో లైటు పడుతూ వుంటే ఈ డిస్క్ తిరుగుతూ అక్షరాల్ని బ్రోమైడ్ పేపర్ మీద ప్రింట్ చేస్తుంది. అవి ప్రింట్ అయేటప్పుడు పెద్ద అక్షరాలకి ఒక శబ్దం, చిన్న అక్షరాలకి ఒక శబ్దం *** టిక్ టిక్ టక టక*** వస్తుంది. గీత గియ్యాల్సినప్పుడు చక్కగా *** మ్ మ్ మ్*** అంటూ సంగీతంలా శబ్దం వస్తుంది. ఇలా ప్రింట్ అయిన పేపర్ డైరెక్ట్ నల్లటి బాక్స్ (***నేనే గీశాను. అలావుంటుందని చెప్పడానికి***) లోకి వెళ్ళిపోతుంది.

*** అక్షరాలు కనపడాలంటే ఆదో ఆరాటం – పోరాటం - సస్పెన్స్ ***

నల్లటి బాక్స్ లోకి వెళ్ళిన పేపర్ ని మళ్ళీ ఒక రూం లోకి తీసుకుని వెళ్ళాలి. అక్కడ A B అనే రెండు కెమికల్స్ సమానంగా తీసుకుని ఒక ట్రేలో పొయ్యాలి. ఆ బాక్స్ లోంచి బ్రోమైడ్ పేపర్ తీసుకుని మెల్లిగా ఒకేలాగా ఆ చివర నుంచి ఈ చివర వరకూ తడుపుతూ వుండాలి. అయితే కొన్ని సెకండ్స్ టైమ్ లోనే దాన్ని బయటికి తీసి పంపుకింద నీళ్ళలో కడిగెయ్యాలి. దీన్ని బ్రోమైడ్ డెవలపింగ్ అంటారు. లేకపోతే అక్షరాలు షార్ప్ గా రావు. అలా రాకపోతే ప్రింటింగ్ దెబ్బతింటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డెవలప్ చెయ్యాలి. నీళ్ళలో కడిగిన తర్వాత క్లిప్పులు పెట్టి ఫోటోస్టూడియో లాగా ఆరేవరకూ తాడుకి తగిలించాలి.
ఇదంతా ఇద్దరూ నాకు దగ్గరుండి చెప్పారు. అదొకటి మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఆ పని చెయ్యడానికి అందరూ ఇష్టపడరు. కెమికల్స్ తో పని కదా...

నా వరకూ వస్తే కానీ తెలియదన్నట్లు - మొదట్లో నాకు ఆ డెవలపింగ్ చేసేటప్పడు ఆ కెమికల్స్ బట్టల నిండా పడిపోయేవి. చేతులయితే సబ్బు పెట్టి కడుక్కునేవాళ్ళం. బట్టల మీద పడిన కెమికల్స్ వాసన పోయేది కాదు. నేను అంత పట్టించుకునేదాన్ని కాదు.

కానీ ఒకరోజు ఇలాగే డెవలపింగ్ చేసి సాయంత్రం బస్ ఎక్కి కూచున్నాను. నా పక్కన ఒకావిడ వచ్చి కూచుంది. ఆవిడ కూడా మెహదీపట్నం వెళ్ళాలి. ఉన్నట్టుండి లేచి వెనక సీటులో కూచుంది. మళ్ళీ ఇంకో ఆవిడ కూడా వచ్చి అలాగే పక్క సీటుకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ మాత్రం పక్కన కూచుని, మీ దగ్గర ఏదో కెమికల్స్ వాసన వస్తోంది. మీరు ఎక్కడ పనిచేస్తారు అని అడిగింది. చెప్పాను. నేను చెప్పిన ప్రోసెస్ ఆవిడకి అర్థం కాలేదు. కాకపోతే ఏదో కెమికల్ తో వర్క్ చేశానని అర్థం చేసుకుని ఊరుకుంది.

అప్పుడు నా మైండ్ కి అర్థం అయ్యింది. ఇందాకటి నుంచి అందరూ పక్కనుంచి ఎందుకు లేచిపోతున్నారో... అబ్బా అనుకుని అప్పటి నుంచి డెవలప్ చెయ్యాలంటే వేరే డ్రస్ పెట్టుకునేవాళ్ళం.

ఇక ఒక పుస్తకం తయారు కావాలంటే ఎంత కష్టం వుండేదో....,
ఇవన్నీ చేయించుకోవడానికి ఎవరు వచ్చేవారు?
ఎంతమందితో పరిచయాలు అయ్యాయి?
ఎన్ని పాఠాలు నేర్చుకున్నామన్నది తర్వాత భాగంలో.

19, జూన్ 2022, ఆదివారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24 *** సహనం అవసరమనిపించింది ***

   మలుపులు తిరుగుతున్న నా జీవితం - 24  *** సహనం అవసరమనిపించింది ***


రవీంద్రనాథ్, లక్ష్మి లంచ్ చేసేసి వెళ్లిపోయారు. నాకు వాళ్ళిద్దరినీ చూస్తే నాకు వింతగా అనిపించింది. ఎవరైనా కొత్త వాళ్ళని పలకరిస్తారు. వాళ్ళకి సాయం చేస్తారు. వీళ్ళిద్దరూ ఏంటో ఇలా వున్నారు అనుకున్నాను.

ఇంతలోకే లక్ష్మణరావుగారు వచ్చారు. “తిన్నావా... ఎలావుంది వర్కు, నేర్చుకున్నావా?” అన్నారు. వాళ్ళనుంచి నేనేమీ నేర్చుకోలేకపోతున్నానని చెప్పాను ఆయన “సరేలే... నీకు అర్థమైనంతవరకు చెయ్యి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా... నెలాఖరుకి వెళ్ళిపోతుందిట” అన్నారు. “చూద్దాం.... నేను నేర్చుకోలేపోతానా...” అంటూ... నేను మళ్ళీ కంప్యూటర్ రూం లోకి వెళ్లిపోతుంటే.... ఆయన “అవును ఛాలెంజింగ్ గా తీసుకో” అనేసి వెళ్ళిపోయారు.

ఈసారి నేను ఆ అమ్మాయి ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడ్డం మొదలు పెట్టాను. కొంత అర్థమైంది. ఏదైనా కీ డౌట్ వస్తే అడిగేదాన్ని. చెప్పేది. ఒక రోజు ఎమ్.డి. విజయపాల్ రెడ్డి గారు వచ్చి “నాగలక్ష్మీ! చెయ్యగలుగుతున్నారా? ఎంతవరకు వచ్చింది?” అన్నారు. “నాకు ఇంకా కొన్ని అర్థం కావట్లేదు. నేర్చుకుంటున్నాను” అన్నాను. నాకు ఎందుకు అర్థం కావట్లేదో ఆయనకి బాగా అర్థం అయ్యింది.

మర్నాడు పొద్దున్నే నా చేతికి రెండు మాన్యువల్స్ ఇచ్చి – “ఇవి చదివి నేర్చుకోండి” అన్నారు. ముందర నాకు అర్థం అవుతాయా అని కొంచెం భయం వేసింది. కానీ ఒకో పేజీ తిప్పుతూ మెల్లిగా చదువుతూ కీస్ ప్రెస్ చెయ్యడం మొదలు పెట్టాను. బాగానే తెలుస్తోంది.

రవీంద్రనాథ్ లక్ష్మి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. రవీంద్రనాథ్ – “మాన్యువల్స్ చూసి నేర్చుకోమన్నారా... సార్. అదంత ఈజీ కాదు” అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. నా పనిలో నేనున్నాను. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని నవ్వుకోవడం నేను చూశాను. ‘మనసుంటే మార్గముంటుంద’ని ప్రయత్నిద్దాం రాకపోతే చూద్దాంలే అనుకున్నాను.

*** వర్తమానానికి ఊహకందని ఆ కంప్యూటర్!!! ***

---- తెలుసుకోవాలంటే చదవండి మరి---

అసలు ఈ ఆఫీసులో తెలుగు టైపు వచ్చినవాళ్ళు కావాలన్నారు. కానీ తెలుగు టైపుకి దీనికి ఆసలు సంబంధమే లేదు –

*** నేను, మా చెల్లెలు ప్రభావతి చదువుకునే రోజుల్లో తెలుగు టైపు నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాం. టైపు నేర్పించే మాస్టారు శ్రీనివాసరావుగారు. ఆయన ఇద్దరినీ చెరో కంప్యూటర్ మీద కూచోపెట్టి, ఒక వైట్ పేపర్ టైప్ మెషిన్ కి పెట్టి. కీస్ ఎలా వాడాలో చెప్పారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవి “కరపషవ, కిరిపిషివి” అదే ప్రాక్టీస్ చెయ్యమన్నారు. ఇద్దరం రెండు కీస్ కొట్టడం నవ్వడం. మాకు అదేదో కోడ్ లాంగ్వేజ్ లా వింతగా అనిపించింది. ఆయన మళ్ళీ వచ్చేసరికి ఇద్దరం నాలుగు లైన్లు కూడా కొట్టలేదు. ఆయన మేము నవ్వుతూ వుండడం చూసి, ఇద్దరి నెత్తిమీద చెరొక మొట్టికాయ వేసి – ఇవాళ మీరు ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంటికి పంపించను అన్నారు.*** మొత్తానికి తెలుగు టైపు అలా నేర్చుకున్నాం. ***

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... ఈ కంప్యూటర్ గురించి - ఇప్పుడు ఎసి రూములోనో, ఫాన్ కిందో కూచుని కంప్యూటర్ లో పని చేస్తూ, పక్కన ప్రింటర్ లో ప్రింట్స్ ఇచ్చే వాళ్ళకి ఊహకి కూడా అందని టెక్నాలజీ.




ఇవి స్విట్జర్ ల్యాండ్ వాళ్ళ బాబ్ స్ట్ గ్రాఫిక్స్ కంపెనీ వాళ్ళవి. చూడ్డానికి పెద్ద స్క్రీను. కింద డబ్బాలాగా వుండి, దానికి రెండు పేద్ద సైజు ప్లాపీ పట్టే ఫ్లాపీ డ్రైవ్ లు వుంటాయి. (***నేను ఇక్కడ ఇచ్చిన ఫోటోలోలా కొంచెం వుంటుంది.***) అంటే ఒక దాంట్లోంచి ఒకదాంట్లోకి మేటర్ ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి. స్క్రీన్ పక్కన ***Reset, Boot, Start*** అని మూడు కీస్ వుంటాయి. కంప్యూటర్ స్టార్ చెయ్యాలంటే ఈ మూడు కీస్ ప్రెస్ చెయ్యాల్సి వచ్చేది.

కంప్యూటర్ స్టార్ట్ అయ్యాక దానిమీద మేటర్ రావడానికి టైపింగ్ మొదలు పెట్టాలి కదా... ***df1, df2*** అని రెండు చోట్లు వుండేవి. మనం వాటిని ఓపెన్ చేసి, అక్షరాలు కొట్టడానికి ***f1, f2*** సెలక్ట్ చేసుకోవల్సి వచ్చేది. అంటే అందులో అక్షరాల సైజులు – బోల్డు, లైట్ ఫాంట్ లు వుండేవి. f1 లో even numbers, f2 లో odd numbers వుండేవి.

ఇంగ్లీష్ ఫాంట్స్ – Futura, Sovenir, Times New Roman


తెలుగు ఫాంట్స్ – కృష్ణ, గోదావరి ఉండేవి.

ఈ కంప్యూటర్ కీ బోర్డులో తెలుగు కీస్ ఎలా ఆలోచించారో తెలియదు కానీ, ***ఒక కీ మీద 6 అక్షరాలు*** వుండేవి. అలాంటప్పుడు మామూలు టైపింగ్ లాగా రెండు చేతులతో టైప్ చెయ్యలేం. అసలు ముందర మేటర్ ఎలా టైప్ చెయ్యాలో అర్థం కాలేదు. మీరు నమ్మరు కానీ... కుడి చేతి చూపుడు వేలు మాత్రమే ఉపయోగించి అక్షరాలు టైపు చెయ్యాల్సి వచ్చేది. ఎడం చేత్తో స్పేస్ ఇవ్వడం, పైన చెప్పిన ఎఫ్1, ఎఫ్2 ప్రెస్ చెయ్యడం వుండేది. టైపు చెయ్యడం అసలు రానివాళ్ళకయితే ఫర్వాలేదు. కానీ టైపింగ్ స్పీడుగా చేసే వాళ్ళకి ఇదొక పెద్ద పరీక్షేమరి.

టైపింగ్ ఇలా చూపుడు వేలుతో చేస్తాం కదా అనుకుంటే... స్క్రీన్ మీద అక్షరాలు ఎలా కనిపిస్తాయంటే – *** మామూలుగా ‘అ’ నుంచి ‘ఱ’ వరకు అక్షరాలు మామూలుగానే కొడతాము. కానీ గుణింతాలు, వత్తక్షరాలు*** కొట్టాలంటే - ఉదా –
*** ‘నేను అక్కడ పెట్టాను’ *** అనే వాక్యం వుందనుకోండి.

‘న’ కొట్టి KC అని kerning key కొట్టి ‘ఏత్వం’ కొట్టాలి. అలాకొడితే నేను అని వచ్చేది. ఆ KC hide అయిపోయి నేను ఒక్కటే కనిపిస్తుందా అంటే అబ్బే –

న KC ఏత్వం - న KC ఉకారం - అక KCక వత్తు – డ = నేను అక్కడ
ప KC ఎత్వం - ట KC దీర్ఘం KC, లింక్ కీ ట - న KCఉకారం = పెట్టాను

*** నేను అక్కడ పెట్టాను*** అన్నదానికి ఇంత భాగవతం వుంది. అయితే ఉత్త KC కొడితే సరిపోదు. వత్తులు కానీ, దీర్ఘాలు, ఏత్వాలు లాంటివి కరక్ట్ గా ఆ అక్షరం మీద అది ఎగిరి పడి కూచోవాలంటే జాగర్తగా చూసుకుని దానికి సరిపడిన నెంబర్ ఇవ్వాలి.

పోనీ ఇవన్నీ ఇస్తే మేటర్ వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. స్క్రీన్ మీద ఈ KC లు, లింక్ కీలు అక్షరాల మధ్యలో ఒక కోడ్ లాగా కనిపిస్తుంటాయి. అది ప్రింటౌట్ తీసుకునే వరకు మనం టైపింగ్ సరిగ్గా చేశామా లేదా అనేది తెలియదు.

ఇలాంటి కంప్యూటర్ మీద, ఈ రకం కీబోర్టుతో ఎన్ని పుస్తకాలు చేశామో తెలియదు. మెల్ల మెల్లగా మాకు అవన్నీ అలవాటయిపోయాయి.

ఇది ఇలా వుంటే ప్రింటౌట్ రావడానికి అదొక పెద్ద కథ.

16, జూన్ 2022, గురువారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 23 *** ఆనందంగా కొత్త ఆఫీసుకి ***

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 23   *** ఆనందంగా కొత్త ఆఫీసుకి ***


ఉద్యోగం వచ్చిందని ఇంటికి వచ్చే సంతోషంలో బస్ ఏ దారిలో వెడుతోందో.... దారిలో ఏమేమి ఉన్నాయో... చూసే అవకాశం లేకపోయింది. కాకపోతే సెక్రటేరియట్, లిబర్టీ థియేటర్ బాగా గుర్తున్నాయి.

పొద్దున్న 10 గం.లకి ఆఫీసులో ఉండమన్నారు కదాని పనులన్నీ పూర్తి చేసుకుని బస్ స్టాప్ కి బయల్దేరాను. మా ఇంటి నుంచి రోడ్డు మీదకి వచ్చి స్ట్రెయిట్ ఒక కిలోమీటరు దూరం నడిస్తే మెహదీపట్నం బస్ డిపో వస్తుంది. డిపో నుంచి సిటీలో చాలా చోట్లకి బస్ లు వుండేవి. నాకు హిమాయత్ నగర్ కి ఒకటే బస్ నెం. 6 (ఆర్ టిసి క్రాస్ రోడ్స్ వరకు). నాకు అది కొంత హాయిగా వుంది. డిపోలో ఎక్కితే మళ్ళీ హిమాయత్ నగర్ లో దిగడమే. కాకపోతే నాకు పూర్తిగా కొత్త రూటు. అదేనాకు భవిష్యత్తుకి బాట వేసింది.


డిపోలో కాబట్టి సీటు దొరుకింది. చాలా రిలాక్స్డ్ గా కూచున్నాను. కొత్త ఉద్యోగం, అక్కడ పని గురించి ఆలోచించుకుంటూ కూచున్నాను. నాకిప్పుడు ఆరోడ్లన్నీ కొత్తగా, అందంగా కనిపిస్తున్నాయి. బస్ డిపో నుంచి బయల్దేరింది. పక్కనే వున్న అంబా థియేటర్ దాటుతుంటే డ్రైవర్ కి, కండక్టర్ కి అలవాటయిన వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళకోసం ఆపుకుంటూ వచ్చిన బస్ మెల్లగా చౌరస్తా దాటి బస్ స్టాప్ చేరింది. ఇంక జనాలు బిలబిలలాడుతూ ఎక్కారు. బస్ స్టాప్ వెనకంతా ఖాళీస్థలం వుండేది. జనాలు ఉన్నా రష్ అనిపించలేదు. ఉద్యోగానందంలో రష్ అనేది నా మనసుకి పట్టలేదు.


మెహదీపట్నం నుంచి సరోజినీ హాస్పిటల్ వైపు టర్నింగ్ లో మిలటరీ ఆఫీసు వుంది. నాకు ఆ ఆఫీసు వైపు చూడ్డం అంటే చాలా ఇష్టం. మిలటరీ వాళ్ళు అక్కడ మార్చింగ్, ఇతర పనులు చేస్తూ కనిపిస్తుంటారు. (***మా పిల్లలకి మిలటరీ డ్రెస్ వేయించి ఫోటో తీయించాలని చాలాసార్లు అనుకున్నాను కుదరలేదు***) వాళ్ళని చూస్తూ వున్నాను. దేశానికి రక్షకభటులు కదా అనుకున్నాను. కండక్టర్ ‘సరోజినీ’ అని అరిచాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఏంటా అని చూస్తే సరోజినీ హాస్పిటల్ బస్ స్టాప్. ఓహో... అని నాలో నేనే నవ్వుకుంటూ మళ్ళీ నా ఆలోచనల్లో మునిగిపోయాను.

బస్ మెల్లగా మహావీర్ హాస్పిటల్, లకడీ కా పూల్ ద్వారకా హోటల్ దాటింది. అక్కడ చెప్పుకోదగ్గ బస్ స్టాప్ టెలిఫోన్ భవన్. చాలామంది అక్కడ దిగిపోయారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఆఫీస్ కి వెళ్ళాలంటే ఎన్ని వున్నాయో గుర్తు లేదు. టైము 9.30 అయ్యింది. సరే చూద్దాంలే అనుకున్నాను.


పాత సెక్రటేరియట్ ముందు నుంచి బస్సు వెడుతోంది. అప్పుడు సెక్రటేరియట్ కి వెళ్ళడానికి నీలంరంగు గేటు రోడ్డు మీదకి ఉండేది. ఆఫీసుకి వెళ్ళేవాళ్ళ కోసం డ్రైవర్ కొంచెం ఇవతలగా బస్ ఆపాడు. చాలామంది దిగిపోయారు. దాని ఎదురుగా ఒక పాత బిల్డింగ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వుండేది. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ అప్పుడు లేదు. బ్యాంక్ కి వెళ్ళేవాళ్ళు కూడా సెక్రటేరియట్ దగ్గర దిగి వెళ్ళిపోయేవాళ్ళు.
బస్ కొంచెం ముందుకి బస్ స్టాప్ లో ఆగింది. ***అప్పటికి ఇంకా ఖైరతాబాద్ బ్రిడ్జ్ కానీ నెక్లెస్ రోడ్డు కానీ రాలేదు. బస్ స్టాప్ వెనకంతా ఖాళీగా వుండేది. సెక్రటేరియట్ ముందర రోడ్డు మీద వున్న ఫ్లై ఓవర్ కూడా లేదు.***

కానీ సెక్రటేరియట్ నుంచి బస్ లిబర్టీ బస్ స్టాప్ కి టర్న్ అయేటప్పుడు నేను పక్కనే వున్న చెట్లు, కొద్ది దూరంలో వున్న హుస్సేన్ సాగర్ లో నీళ్ళు చూస్తున్నాను. నాకు ఒక ఆశ్చర్యకర దృశ్యం కళ్ళపడింది.

ఆ టర్నింగ్ లో ఒక బ్లాక్ కలర్ గేటు వుంది. దాని నుంచీ కొంచెం డౌన్ లోకి ఒక దారి వుండి ఒక తెల్లటి బిల్డింగ్ ముందు ఆగింది. ఆ బిల్డింగ్ వెనక హుస్సేన్ సాగర్ నీళ్ళు వున్నాయి. బలేవుంది బిల్డింగ్ చుట్టూనీళ్ళు అనుకున్నాను. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే *** దాదాపు 200 కథలు, 25 నవలలు, నాటక రచయిత, సినిమా రచయిత 'ఎన్.ఆర్. నంది’*** పేరు కనిపించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన పుస్తకాలు అన్నీ చదవలేదు కానీ ***దృష్టి*** పుస్తకం చాలా నచ్చింది. ఆయన్ని ఒకసారి చూస్తే బావుండును అనుకున్నాను. రోజూ ఇటే వెళ్తాను కదా వెళ్దామని అనుకున్నాను.



ఇంతలోనే బస్ లిబర్టీ బస్ స్టాప్ వైపు టర్న్ అయిపోయింది. అక్కడ లిబర్టీ థియేటర్ వుండడం వల్ల ఆ బస్ స్టాప్ కి ‘లిబర్టీ’ అని పేరు వచ్చింది. అందరూ ఎక్కాక బస్ హిమాయత్ నగర్ వెళ్ళే టర్నింగ్ లో లిబర్టీ థియేటర్ దాటి టిటిడి కల్యాణమంటపం మీదుగా బయల్దేరి, హిమాయత్ నగర్ వైపు పరుగులు పెట్టింది. మధ్యలో ఇంక ఏ బస్ స్టాపు లేదు. రోడ్లన్నీ ఖాళీగా వున్నాయి. అటూ ఇటూ చిన్న చిన్న షాపులు. హిమాయత్ నగర్ లో నేను దిగాల్సిన బస్ స్టాప్ ***లిడ్ క్యాప్** (చెప్పుల షాపు). దానికి అక్కడ చాలా పేరు వుండేది. ఇది కాకుండా ఆ బస్ స్టాప్ ని ***ఉర్దూహాల్*** అని కూడా అంటారు. బస్ అక్కడ ఆగగానే గబగబా దిగి ఆఫీసువైపు గబగబా నడక సాగించాను.




***అసూయల మధ్య కొత్తవర్కుకి శ్రీకారం***

ఆఫీసుకి వెళ్ళగానే నన్ను డైరెక్టుగా పైన వున్న ఎ.సి. రూంకి పంపించారు. ఆ రూములో పెద్ద కంప్యూటర్ ఒకటి, చిన్న కంప్యూటర్ ఒకటి వున్నాయి. పెద్దది ఒక పక్కకి తిరిగి వుంది. రెండోది ఇంకో పక్కకి తిరిగి వుంది. నన్ను పెద్ద కంప్యూటర్ దగ్గర కూచున్న లక్ష్మికి పరిచయం చేశారు. ఒకసారి నా వంక చూసి వర్కు చేసుకుంటూ కూచుంది. నవ్వులేదు. ఎందుకు వచ్చిందిరా బాబూ... అన్నట్టు చూసింది. పైగా నేను వాళ్ళకన్నా చిన్నదాన్ని. అందుకేనేమో... నన్ను చిన్న కంప్యూటర్ దగ్గర కూచోపెట్టారు. అంతా అయోమయంగా వుంది. ఏది ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలియదు. నాకు ఆఫ్ చెయ్యడం, ఆన్ చెయ్యడం నేర్పారు. నేను కీ బోర్డు అన్నీ చూస్తూ కూచున్నాను. ఆకుపచ్చటి అక్షరాలు మెరుస్తున్నాయి.

లక్ష్మి, రవీంద్రనాథ్ భార్యాభర్తలు. ఇద్దరూ వర్కు గురించి గుడు గుడుమని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన కొన్ని చిన్న చిన్నవి బుక్ లో నోట్ చేసుకున్నాను. లంచ్ టైమ్ లో ఇద్దరూ బాక్సు పట్టుకుని వెళ్ళిపోయారు. నాకు కూడా ఆకలేస్తోంది. ఎక్కడ తినాలో తెలియదు. బాక్సు తీసుకుని నేను కూడా పక్కనే వున్న రూంకి వెళ్ళాను. వాళ్ళిద్దరూ తింటున్నారు. నేనూ ఒక పక్కన కూచుని నా బాక్స్ ఖాళీ చేశాను.

కనీసం నా వంక చూసి నవ్వు కూడా నవ్వలేదు. సరేలే కొత్త ఆఫీసు కదా... అనుకున్నాను. రూంలోకి వెళ్ళాక మళ్ళీ మామూలే... మౌనం నాట్యం చేసింది.

సాయంత్రం బ్యాగ్ సద్దుకుని లక్ష్మి వెళ్ళిపోయింది. ఎవరో వచ్చి మీరూ వెళ్ళిపొండి అన్నారు. నేనూ ఇంటికి బయల్దేరాను.

మొదటి రోజు ఇలా...



15, జూన్ 2022, బుధవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 22 *** కొత్త ఆఫీసు – కొత్తపని***

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 22   *** కొత్త ఆఫీసు – కొత్తపని***


*** నేను కోరుకున్న జీవితానికి, నా స్వయం కృషికి బాసటగా నిలుస్తుందని అప్పుడు అనుకోలేదు.***




మా బంధువు లక్ష్మణరావుగారు ఇచ్చిన ఆఫీసు అడ్రస్ ప్రకారం - హిమాయత్ నగర్ లో బస్ దిగి రోడ్ నెం. 29లోకి వెళ్ళాను. అక్కడ నుంచి ఒక 20 అడుగుల దూరం నడవగానే ఎడమవైపు రోడ్డులో Hyderabad Security & Offest Printers Ltd. ( APIDC Joint Venture) బోర్డు కనిపించింది. మెల్లగా అద్దాల తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక రూము మాత్రమే వుంది. ఒక అబ్బాయి టైపు చేస్తున్నాడు. ఇంకెవరూ లేరు. అతను లక్ష్మణరావుగారి పేరు చెప్పగానే కూచోమన్నాడు.
ఇంతలో మీకు “ఎవరు కావాలండీ?” అంటూ గెడ్డం వున్న అతను వచ్చి అడిగాడు. “లక్ష్మణరావుగారు రమ్మన్నారు” అని చెప్పాను. “సరే కూచోండి. వస్తారు” అనేసి వెళ్ళిపోయాడు.

ఎంతకీ లక్ష్మణరావుగారు రావట్లేదు. సరే టైపు చేస్తున్న అబ్బాయి టైపు మిషన్ వంక చూస్తూ కూచున్నాను – నాకో పెద్ద డౌట్ వచ్చింది. ఇది మామూలు టైపు మిషన్ లాగే వుంది కదా... మరి ఇందులో ఇంగ్లీషు, తెలుగు కలిపి ఎలా వస్తాయి. మనకి అక్షరాలు టైపు చేస్తుంటే కనిపిస్తాయి అన్నారు. దీనికి అలాంటిదేమీ లేదు అనుకుంటూ ఆలోచించుకుంటూ కూచున్నాను.

ఇంతలోకే ఆ టైపిస్టు అబ్బాయికి ఫోన్ వచ్చింది. మాట్లాడి, నాతో... “మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కి రమ్మంటున్నారు. వెళ్ళండి” అన్నాడు.

ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాను. అక్కడ కుడిచేతి వైపున ఒక డోర్ వుంది. మెల్లగా తోసాను. లోపలి నుంచి ఇంతకు ముందు కిందకి వచ్చిన గెడ్డం అతను “రండి” అన్నాడు. ఆయన పక్కనే ఒక కొంచెం పెద్దాయన వున్నారు.

లోపల అంతా నాకు చాలా అద్భుతంగా అనిపించిది. ఒక చక్కటి ఎ.సి. రూములో రెండు ఆకుపచ్చటి అక్షరాలలాంటివి పరుగెడుతున్న స్క్రీన్ లు కనిపించాయి. అసలు అదేమిటో కూడా నాకు అర్థం కాలేదు. ఆ పక్కన చాలా పెద్ద డబ్బాలాంటిది వుండి. అంతా హైఫైగా వుంది. లోపలంతా చల్లగా వుంది.

అంతా ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఇంతలోనే ఆ పెద్దాయన “అమ్మా...! నా పేరు రామకృష్ణారావు. ఎ.పి. టెక్ట్స్ బుక్ ప్రెస్ లో డైరెక్టర్ ని. నేను జర్మనీలో ఫస్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు చేసి వచ్చిన మొదటి భారతీయుడిని. ఇవి ప్రింటింగ్ కి సంబంధించిన కంప్యూటర్లు. దీనికి తెలుగు టైపు వచ్చిన వాళ్ళు కావాలి. లక్ష్మణరావుగారు మీ గురించి చెప్పారు. మీకు దీనిమీద ట్రైనింగ్ ఇస్తే మీరు మధ్యలో వదిలేసి వెళ్ళి పోతే ఎలా అన్నారు.”
“ప్రస్తుతం నేనెక్కడికీ వెళ్ళను సర్. వచ్చినప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం నాకు కొత్త పని నేర్చుకోవాలని బాగా వుంది అని చెప్పాను. ”
అప్పుడు రామకృష్ణారావుగారు “ఆఁ! మీకు చెప్పడం మర్చిపోయాను” అని, ఆ గెడ్డం అతన్ని చూపిస్తూ “ఈయన పేరు విజయపాల్ రెడ్డి. ఈ ఆఫీసుకి మేనేజింగ్ డైరెక్టర్” అని పరిచయం చేశారు.

నేను షాక్ - అప్పడే చదువు పూర్తిచేసిన స్టూడెంట్ లా వున్నారు. 26 సంవత్సరాలకన్నా ఎక్కువ వయసుండదు.

విజయపాల్ నవ్వి – “మీపేరు చెప్పండి” అన్నారు.

“నాగలక్ష్మి” అన్నాను.

“నాగలక్ష్మీ మీరు రేపటి నుంచీ ఆఫీసులో జాయిన్ అవ్వండి. ఇక్కడ రవీంద్రనాథ్, లక్ష్మి అని వుంటారు. మీకు ఎలా చెయ్యాలో నేర్పిస్తారు” అన్నారు.

నాకు నోట్లోంచి మాటరాలేదు. అసలు సంగతి కొత్త పని, అంత చక్కటి ఎసి రూములో జాబ్. చాలా సంతోషం అనిపించింది. అసలు ఎసి అంటేనే తెలియదు. నీట్ గా ముట్టుకుంటే మాసిపోతుందేమో అనిపించేలా వున్న కంప్యూటర్లు, అందమైన రూము.

ఆనందంగా ఇంటికి వచ్చేశాను. ఇంటి దగ్గర ట్యూషన్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు. గబగబా వాళ్ళకి చెప్పాల్సిన పాఠాలు చెప్పి, ముందర అమ్మకి, అక్కలకి ఉత్తరం రాశాను. సాయంత్రం ట్యూషన్ పిల్లల పెద్దవాళ్ళకి నేను ఆఫీసులో చేరుతున్నాను. వచ్చాక ట్యూషన్ చెప్తాను, కొంచెం లేటుగా పంపించమని చెప్పాను. వాళ్ళందరూ నాకు ఉద్యోగం వచ్చినందుకు సంతోషించారు. నన్ను అభినందించారు.

13, జూన్ 2022, సోమవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 22 *** ఒంటరి పోరాటంలో ఆనందం ***

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 22  *** ఒంటరి పోరాటంలో ఆనందం ***


నాంపల్లి ఆఫీసులో ఉద్యోగం మానేశాక. చేతిలో అవసరాలకి సరిపడిన డబ్బులు ఎంతోకొంత వున్నాయి. అక్క తాడేపల్లిగూడెం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే అడగమంది. నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేస్తూ ఉన్నట్టుండి ప్రపంచానికి దూరమయినప్పుడు - పెద్దక్క తను బ్యాంకులో చేస్తూ కుటుంబ బాధ్యత తీసుకున్నప్పుడు, అందరం అందరికీ సాయంచేసుకోవాలి అనుకున్నాం. ఇక రెండో అక్క స్టేట్ బ్యాంక్, మూడో అక్క ఢిల్లీలో గవర్నమెంట్ ఉద్యోగం. చెల్లెళ్ళకి సాయం చెయ్యడానికి అసలు వెనకడుగు వెయ్యరు.

కానీ చూద్దాంలే అని నా ప్రయత్నం నేను చేద్దాం అనుకున్నాను. అవసరమైతే చూద్దాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచీ ‘డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్’ అంటూ వుండేదాన్ని. అక్కావాళ్ళు నవ్వుతూ వుండేవారు. నాకెందుకో అది నచ్చింది. అందరూ నన్ను చూసి నవ్వేవారు. అది మైండ్ లో వుండిపోయింది.

ముందర అర్జంటుగా ఇంటి వాళ్ళతో మీకు రెంట్ మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తానని చెప్పాను. ఇంటి రెంట్ రు. 60. అప్పటికి అది ఎక్కువే. వాళ్ళు సరే అన్నారు. అస్సలు ఏమీ అనలేదు. “నీ దగ్గిర ఎప్పుడు డబ్బులు వుంటే అప్పుడే ఇయ్యి బిడ్డా” అన్నారు. అమ్మయ్య ఒక సమస్య తీరింది అనుకున్నాను. కానీ నెలకి 20 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇచ్చేశాను.

*** (గుడిమల్కాపూర్ లో మేమున్న ఇల్లు ఒక పెద్ద గేటు, ఆ గేటులోపల కాంపౌండు. మధ్యలో పెద్ద పెద్ద కుంకుడు, చింత, మామిడి, నేరేడు చెట్లు, ఒక పక్కగా రేగు చెట్టు వుండేవి. చుట్టూరా కోటగోడలాంటి ఎత్తైన గోడ. అచ్చు కోటలో ఉన్న రక్షణ వుండేది. దానిని పప్పుకోట అనేవాళ్ళు. ఒకప్పుడు పప్పుల మిల్లు వాళ్ళు పప్పులు ఆరబెట్టుకునేవారుట. లోపలంతా ఏడెనిమిది పోర్షన్లు వున్నాయి. ఇంటివాళ్ళు ఒక పెద్ద పెంకుటింట్లో వుండేవారు.)***

అదే రోజు గేటు బయటికి వెళ్ళి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి మీ పిల్లలకి ట్యూషన్ చెపుతాను అన్నాను. వాళ్ళు వెంటనే పిల్లలని పంపించడం మొదలుపెట్టారు. ఒక పదిమంది పిల్లల దాకా వచ్చేవారు. నాకు మా వూళ్ళో పిల్లలకి చెప్పిన అలవాటు వుంది కాబట్టి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం ప్రారంభించాను. ప్రస్తుతం ఖాళీగా వుండకుండా పని కల్పించుకున్నాను. పిల్లలందరితో మంచి కాలక్షేపం అయ్యేది. వాళ్ళతో కబుర్లు చెపుతూ పాఠాలు చెప్పేదాన్ని. చక్కగా నేర్చుకునేవారు. వాళ్ళకి మార్కులు కూడా బాగానే వచ్చాయి.



ఒకసారి వాళ్ళని తీసుకుని గుడిమల్కాపూర్ లో వున్న జామ్ సింగ్ వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాను. *** (దీనిని నిజాం నవాబు సికిందర్ జా అశ్వదళాధిపతిగా పనిచేసిన జాంసింగ్‌ 1810లో దేవాలయాన్ని నిర్మించాడు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం.)*** పిల్లలు బలే సంతోషపడ్డారు. చాలా పెద్ద గుడి. అక్కడ కాసేపు పంజరం నుంచి బయటికి వచ్చిన పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగారు. వాళ్ళెవరూ ఎప్పుడూ రాలేదుట. పాపం అనిపించింది. ఇలా రెండో నెల గడిచిపోయింది.

మంచి చోట చూసుకుని చేరదాం అని ఆగాను. నేను కనీసం నా ఉద్యోగ విషయాలు అమ్మకి కానీ, అక్కావాళ్ళకి కానీ ఉత్తరం రాయలేదు. వాళ్ళకి రాసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. కాలక్షేపానికి పుస్తకాలు చదువుకునేదాన్ని. పిల్లలతో ఆటలు ఆడేదాన్ని.



*** భవిష్యత్తుకి బాటమొదలైనరోజు ***

మా బంధువులాయన లక్ష్మణరావుగారని మాకు కొంత దగ్గరలో వున్నారు. అక్క, నేను కలిసి ఉన్నప్పుడు సన్నజాజిపూలకోసం రోజూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళింట్లో చాలా మొక్కలు వుండేవి. వాటి మధ్య తిరుగుతూ వుండేదాన్ని. అక్కవెళ్ళాక నేను వెళ్ళలేదు. ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళాను. ఆయన క్షేమసమాచారాలు అన్నీ అయ్యాక –

****
“మరేం మా ఆఫీసులో ఇంగ్లీషు తెలుగు ఒకటే టైపు మిషన్ మీద వస్తాయి. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఇద్దరు వున్నారు కానీ, ఇంకెవరైనా తెలుగు టైపు వచ్చిన వాళ్ళు కావాలని అంటున్నారు. నేనే నీ దగ్గిరకి వద్దామనుకున్నాను. సరే నువ్వు రేపొకసారి హిమాయత్ నగర్ లో ఆఫీసు వుంది. ఆఫీస్ కి రా అని అడ్రస్, ఫోన్ నెం. ఇచ్చారు”. ఆయన నన్ను గుర్తుపెట్టుకుని చెప్పినందుకు సంతోషంగా అనిపించింది. థాంక్స్ చెప్పేసి ఇంటికి వచ్చేశాను.
****

చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో.... నేను వీళ్ళింటికి రావడం కూడా మంచిదయింది అనుకున్నాను. అమ్మ అన్ని పరిస్థితులు తట్టుకుని ధైర్యంగా వుండేది. అదే మార్గంలో నేనూ....

8, జూన్ 2022, బుధవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 21 ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం - జీవితం నేర్పుతున్న పాఠాలు

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 21    ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం - జీవితం నేర్పుతున్న పాఠాలు


మళ్ళీ ఒకసారి వెనక్కి అక్కకి ట్రాన్స్ ఫర్ అవకముందు



అప్పట్లో ట్యాంక్ బండ్

నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి సికిందరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆరోజే ఏలూరు నుంచి మా బాబాయి వచ్చాడు. అక్క నన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేసి, “నీ ఎగ్జామ్ అయ్యేసరికి 3 అవుతుంది - నువ్వు సికింద్రాబాద్ లో నెం.5 ఎక్కితే ట్యాంక్ బండ్ మీద కోడిబొమ్మ షాపు (అప్పట్లో పేద్ద తెల్ల కోడిలాంటి షాపు ఉండేది) దగ్గిర రిక్వెస్ట్ బస్ స్టాప్ వుంటుంది అక్కడ దిగు. నేను, బాబాయికి సిటీ చూపిస్తాను. 4 గంటల లోపు అక్కడ వుంటాం. అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం” అని బాబాయికి సిటీ చూపించడానికి తీసుకెళ్ళింది.

నా ఎగ్జామ్ అయ్యింది. నేను కోడిబొమ్మ షాపు దగ్గిర దిగాను. అక్కడ అక్కావాళ్ళు లేరు. చేతికి వాచ్ వుండేది. టైమ్ సా. 4 అయింది. ఒక అరగంట వెయిట్ చేశాను రాలేదు. సరే కదాని కాసేపు టాంక్ బండ్ అందాలు, వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంకా రావట్లేదు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆ హుస్సేన్ సాగర్ నీళ్ళలో ఎన్ని కెరటాలు, ఎంత పైకి లేస్తున్నాయో లెక్కపెట్టేశాను. అది ఆగదుగా బోరు కొట్టింది. డబుల్ డెక్కర్ బస్సులలో ఎక్కి, దిగే మనుషుల్ని, వాళ్ళ హడావిడిని చూశాను.

టైమ్ సా.6 అయ్యింది. ఇంక కాసేపు తిరుగుదాం అని మళ్ళీ మొదలుపెట్టాను. ఇలా తిరిగేటప్పుడు నలుగురు అబ్బాయిలు ఒక్కోక్కళ్ళుగా నా వెనక తిరగడం మొదలుపెట్టారు. నేను వాళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు అనుకున్నాను. కానీ కాదని తర్వాత అర్థం అయ్యింది. ఇంతలోకే ఒక పెద్దమనిషి అంటే నాకన్నా పెద్దే.... ఆయనతోటి చెప్పి, ముందుకి నడుస్తున్నాను. ఆయన పాటలు పాడుకుంటూ... చెయ్యి తగిలించుకుంటూ నడుస్తున్నాడు. నాకు చిరాకనిపించింది. కాకపోతే ధైర్యం అనేది ఎక్కడో మూలల నుంచి తడుతుంటే... పరిస్థితిని అర్థం చేసుకుని ఇంక నేను అక్కడ నుంచి వెనక్కి చూడకుండా ట్యాంగ్ బండ్ చివర ఉన్న బస్ స్టాప్ కి వెళ్ళాను.

అక్కడ ఇద్దరు చిన్నపిల్లలలతో భార్యా భర్త ఉన్నారు. ఆవిడ నా దగ్గిరకి వచ్చి “ఏమైందమ్మా?” అంది. చెప్పాను. “ఎదురుగా పోలీస్ స్టేషన్ వుంది కంప్లయింట్ ఇయ్యి” అన్నారు ఇద్దరూ. నాకు ముందరే పోలీసులంటే భయం. “ఫర్వాలేదు లెండి వెళ్ళిపోయారుగా” అన్నాను. “నువ్వు సిటీకి కొత్తనుకుంట. ఇంకెప్పుడు టాంక్ బండ్ మీద ఒంటరిగా తిరగగకు. అదీ సాయంత్రమప్పుడు. మామూలు వాళ్ళు తిరిగే చోటు కాదు” అన్నారు.

ఎంతకీ బస్ రావట్లేదు. వాళ్ళు ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయారు. బస్ స్టాప్ లో నేను, ఇంకో ఇద్దరూ వున్నాం. మొత్తానికి 7.30 కి డబుల్ డెక్కర్ బస్ వచ్చింది. బస్ లో కొంచెం జనాలు బాగానే వున్నారు. వెంటనే ఎక్కి కూచున్నాను. హుస్సేన్ సాగర్ లో కెరటాలు ఎగిసి ఎగిసి పడుతూ నా భయాన్ని చూసి నవ్వినట్టనిపించింది.

ఇంటికి వెళ్ళేసరికి రాత్రి గం. 8.15ని. అక్కావాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 9.30 అయ్యింది. “మీరెందుకు రాలేదు?” అన్నాను.

“మేమిద్దరం నౌబత్ పహాడ్ కి, బిర్లామందిర్ కి వెళ్ళాం. పబ్లిక్ గార్డెన్స్ చూడడానికి కిందకి వెళ్ళి వెళ్ళాలని చెప్పాను బాబాయికి – బాబాయి నౌబత్ పహాడ్ మించి కిందకి చూసి ఈ పక్కన్నించి అంతా స్లోప్ గానే వుంది. మనం మెల్లిగా ఇక్కడ నుంచి కిందకి కూచుని దిగుతూ వెళ్దాం” అన్నాడు అని చెప్పింది. పైగా ఎంత సాహసమో.... ఇద్దరూ చెప్పులు కిందకి విసిరేసి. మెల్లిగా కొండమీంచి జారుకుంటూ మొత్తానికి పబ్లిక్ గార్డెన్ కి చేరారుట. దానికే గంట టైం పట్టిందిట. కాళ్ళూ, చేతులూ గీరుకుపోయాయి. పబ్లిక్ గార్డెన్స్ చూసి, ఇంకెక్కడికో వెళ్ళి వచ్చారు. ఇంక నేనేమీ మాట్లాడలేదు.

కానీ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాను.

నాకు మొత్తానికి ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం అయ్యింది. నేను తీసుకున్న నిర్ణయాలు నా జీవితంలో బాగా ఉపయోగ పడ్డాయి.

అవి -
1. పబ్లిక్ ప్లేస్ లలో వెయిటింగ్ పెట్టుకోకూడదు. గుడులు, పుస్తకాల షాపులు, ఇంకేవైనా షాపులు ఓకే.

2. ఎవరైనా కలుద్దామని చెప్తే అనుకున్న టైం కన్నా అరగంట మాత్రమే ఎక్కువ వెయింటింగ్ ఉంటుంది. ఫోన్లు లేవు కాబట్టి ఆరునూరైనా ఇంటికి వెళ్ళిపోవడం.

కొన్నిసార్లు నా పద్ధతి చూసి కొంతమందికి కోపం వచ్చింది. కానీ నా వరుకు నేను టైం పాటించడం మొదలు పెట్టాను. ఇక ఎప్పుడైనా ట్రాఫిక్ వుండి, కుదరని పరిస్థితులు వుంటే ఇప్పుడు ఫోను వుంది కాబట్టి ఇబ్బంది లేదు.

టైం పాటించకపోతే అవతలి వాళ్ళకీ, మనకీ ఇద్దరికీ ఇబ్బందే అన్న విషయం తెలుసుకున్నాను.

తర్వాత మళ్ళీ అసలు కథలోకి వస్తాను.